కర్నూలు, న్యూస్‌లైన్: తెల్లరేషన్ కార్డుదారులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గత ఏడాది ఉగాది పర్వదినం నుంచి ప్రారంభించిన అమ్మహస్తం పథకం జిల్లాలో మసకబారింది. రూ.185కే తొమ్మిది రకాల సరుకులను ప్యాకెట్ రూపంలో అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా ఆచరణలో విఫలమయ్యారు. జిల్లాలో సరుకుల కొరత ఏర్పడటంతో అధికారులు తల పట్టుకున్నారు. తూకాల్లో మోసాలను అరికట్టే లక్ష్యంతో అమ్మహస్తంలో ఇచ్చే సరుకులన్నీ ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేసేందుకు నిర్ణయించినా అమలులో చిత్తశుద్ధి లోపించింది.
కారం, పసుపు, చింతపండులో నాణ్యత కొరవడటంతో వెనక్కు పంపుతూ జాయింట్ కలెక్టర్ కన్నబాబు మూడు రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదిక పంపారు. బియ్యం, కిరోసిన్ మినహా మిగిలిన సరుకులకు డీడీలు కట్టవద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లకు చెప్పడంతో అమ్మహస్తం పథకం పట్ల డీలర్లు కూడా ఆసక్తి చూపని పరిస్థితి. డీడీలు కట్టాల్సిన మొత్తం పెరిగిపోవడం, నాణ్యత లేని సరుకులు సరఫరా చేస్తుండటంతో డీలర్లు డీడీలు తీసేందుకు వెనుకంజ వేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో నాణ్యత కలిగిన చింతపండు అర కిలో రూ.28లకే లభిస్తుండటంతో చౌకడిపోల్లో రూ.30లకు సరఫరా చేస్తుండటం.. నాసిరకం కావడంతో కార్డుదారులు తిరస్కరిస్తున్నారు.
అదేవిధంగా పసుపు 100 గ్రాములు చౌక డిపోలో రూ.10లకు విక్రయిస్తుండగా బహిరంగ మార్కెట్‌లో రూ.8లకే లభిస్తోంది. 250 గ్రాముల కారం చౌకడిపోలో రూ.20లకు సరఫరా చేస్తుండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.18లకే లభిస్తుండటంతో కార్డుదారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. అలాగే కందిపప్పు, గోధుమ పిండి కూడా నాసిరకంగా ఉంటున్నాయి. నెలల తరబడి గోధుమ పిండి నిల్వ ఉండటంతో ప్యాకెట్లలో పురుగులు పట్టి ముగ్గిపోయిన వాసన వస్తోంది.
సంక్రాంతికి సర్కార్ షాక్
సంక్రాంతి పండగకు రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది. నాసిరకం సరుకుల పంపిణీతో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం తాజాగా పామాయిల్ సరఫరా చేయలేక చేతులెత్తేసింది. దీంతో పండగవేళ సామాన్యులకు పిండి వంటలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. పెరిగిన ధరలతో నిత్యావసర సరుకులు కొనలేక పేద, మధ్యతరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రేషన్ సరుకులలో కోత పెడుతుండటంపై కార్డుదారులు మండిపడుతున్నారు. రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే అన్ని సరుకులకు సంబంధించి ప్రతి నెల 15 నుంచి 20వ తేదీ లోపు డీడీలు చెల్లించాలి. జనవరి కోటాకు సంబంధించి పామాయిల్‌తో పాటు కారం, పసుపు, చింతపండు తదితర నిత్యావసర సరుకులకు డీడీలు తీయవద్దంటూ అధికారులే ఆదేశించారు.
గత నెలలోనూ కోతే...
జిల్లాలో ప్రభుత్వం ప్రతి నెల 2,411 రేషన్ దుకాణాల ద్వారా 11.50 లక్షల పామాయిల్ ప్యాకెట్లను పేదలకు అందజేస్తోంది. గత నెలలో పూర్తి కోటా ప్రకారం పామాయిల్ సరఫరా చేయలేదు. 20 శాతం కోత విధించి సరఫరా చేయడంతో కర్నూలు నగరంలోనే దాదాపు 40 దుకాణాలకు పామాయిల్ చేరలేదు. రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న 9 వస్తువులలో 5 రకాలు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయి. అలాగే గోధుమలు కూడా పుచ్చుపట్టడంతో కొనుగోలు చేయడానికి కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు. సరుకుల నాణ్యతలో డొల్ల, సరఫరాలో జాప్యం జరుగుతుండటంతో ‘అమ్మహస్తం’ నీరుగారుతోంది.
పామాయిల్ లేనట్టే!
Published Mon, Jan 6 2014 1:44 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement