అమ్మహస్తం సరుకులను చూసి కార్డుదారులు ‘అమ్మో’హస్తం అంటూ హడలిపోతున్నారు. కేవలం 185 రూపాయలకే 9 రకాల నిత్యావసర సరుకులు ఇంటిల్లిపాదికి అందించి వారి ఆకలి తీరుస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరును కార్డుదారులు ఎండగడుతున్నారు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్:
అమ్మహస్తం సరుకులను చూసి కార్డుదారులు ‘అమ్మో’హస్తం అంటూ హడలిపోతున్నారు. కేవలం 185 రూపాయలకే 9 రకాల నిత్యావసర సరుకులు ఇంటిల్లిపాదికి అందించి వారి ఆకలి తీరుస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరును కార్డుదారులు ఎండగడుతున్నారు. ఆర్భాటంగా ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ అందులోని వస్తువుల నాణ్యత డొల్లగా ఉండటంతో కార్డుదారులు వాటిని అయిష్టంగానే తీసుకుంటున్నారు. అందులో కూడా కేవలం మూడు వస్తువులను మాత్రమే వినియోగించుకుంటూ మిగతా ఆరు వస్తువులను పక్కన పడేస్తున్నారు. కొంతమంది ప్రత్యామ్నాయంగా వాటిని వినియోగిస్తుండగా, ఎక్కువ మంది చెత్తబుట్టల్లో వేస్తున్నారు. ఉగాది రోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తే దసరా నాటికి దాని సత్తా ఏమిటో తేలిపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత వచ్చిన పాలకులు ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా ప్రారంభించలేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. దాంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అమ్మహస్తం పేరుతో ప్రజలకు చేరువ కావాలని నిర్ణయించుకున్నారు.
ఎంత హడావిడిగా ఈ పథకాన్ని ప్రారంభించారో అంతే తొందరగా ప్రజలు కూడా దీనిని తిప్పికొట్టారు. జిల్లాలోని చౌకధరల దుకాణాల ద్వారా 8 లక్షల 31 వేల మంది కార్డుదారులకు ప్రతినెలా అమ్మహస్తం పథకం కింద 9 రకాల నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. కేజీ కందిపప్పు రూ 50, లీటర్ పామాయిల్ * 40, కేజీ గోధుమపిండి * 16.50, కేజీ గోధుమలు * 7, అరకేజీ పంచదార * 6.75, కేజీ ఉప్పు * 5, పావుకేజీ కారంపొడి * 20, అరకేజీ చింతపండు * 30, వందగ్రాములు పసుపు * 10 చొప్పున విక్రయిస్తున్నారు. 9 రకాల వస్తువులు *185కు అందిస్తున్నారు. ఇప్పటికే కేజీ రూపాయి బియ్యం చౌకధరల దుకాణాల ద్వారా అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి నాలుగు కేజీల చొప్పున బియ్యం విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బియ్యంతోపాటు 9 రకాల నిత్యావసర వస్తువులు అందిస్తుండటంతో ఆ కుటుంబంలో ఆకలి ఉండదన్న ఆలోచనతో ప్రభుత్వం అమ్మహస్తం ప్రవేశపెట్టినప్పటికీ పేదలు మాత్రం ఆకలో రామచంద్రా అంటూ అలమటిస్తూనే ఉన్నారు. ఒకవైపు నిత్యావసర సరుకులు ఉన్నప్పటికీ వాటిని ఆహారంగా తీసుకునే పరిస్థితులు లేకపోవడంతో మార్కెట్‌లో లభించే సరుకులను కొని కడుపు నింపుకుంటున్నారు.
ప్యాకింగ్‌పై ఉన్న శ్రద్ధ
నాణ్యతపై ఏదీ...
అమ్మహస్తం పథకానికి సంబంధించిన ప్యాకింగ్‌పై ఉన్న శ్రద్ధ వస్తువుల నాణ్యతలో చూపడం లేదు. ఏ ప్యాక్‌ను చూసినా ప్రభుత్వ ప్రచారం తప్పితే అందులో నాణ్యత లేదన్నది తేలిపోతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పథకం ప్రచారానికే కోట్లాది రూపాయలు వెచ్చించారు. ప్రజల ఆకలి తీర్చే ఆహారాన్ని మాత్రం పట్టించుకోవడం మానేశారు. అమ్మహస్తంలో డొల్లతనం బయటపడుతున్నా దానిని నియంత్రించే చర్యలు చేపట్టడం లేదు. కేజీ కందిపప్పు * 50కు ఇస్తున్నప్పటికీ అందులో పప్పుకు పోటీగా రాళ్లు కనిపిస్తుంటాయి. చింతపండులో మెత్తని పదార్థం కంటే పిక్కలే ఎక్కువగా దర్శనమిస్తాయి. కారంపొడి ప్యాకెట్‌లో రంగు తప్పితే రుచి మాటే ఉండదు. పంచదారలో తీపి కంటే వగరే ఎక్కువగా ఉంటుంది. పసుపు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది. 9 రకాల సరుకుల్లో ఒక్కదానిలో కూడా నాణ్యత లేకపోవడం పథకం ఏ విధంగా అమలవుతుందో అనేదానికి అద్దం పడుతోంది.
అమ్మహస్తం కష్టంగా ఉంది పావులూరి ఉమ, గృహిణి, కేశవరాజుకుంట, ఒంగోలు అమ్మహస్తం పథకంలోని నిత్యావసర సరుకులు కష్టంగా ఉపయోగించుకుంటున్నాం. * 185కే 9 రకాల నిత్యావసర సరుకులు వస్తాయని ప్రకటించడంతో ఎంతో ఆశగా చౌకధరల దుకాణాలకు వెళ్లి తెచ్చుకున్నాం. ఆ తరువాత వాటిలో నాణ్యతను చూస్తే కళ్లు తిరిగినంత పనైంది.
ప్రతిసారీ ఇబ్బందే వీధిపల్లి లీలావతి, గృహిణి, గద్దలగుంట, ఒంగోలుఅమ్మహస్తం పథకాన్ని ప్రారంభించిన నాటినుంచి సరుకులు తెచ్చుకుంటున్నాం. ప్రతిసారీ ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ప్రతినెలా సరుకులు తీసుకుంటున్నప్పటికీ ఏ ఒక్క నెలలోనూ సరుకు నాణ్యంగా ఉండటం లేదు.