సత్తెనపల్లిరూరల్, న్యూస్‌లైన్: కొత్త ఏడాది, సంక్రాంతి పండగ నెలలో కూడా పేదలకు ‘రేషన్’ అందడం లేదు. సరుకుల్లేవ్ సర్దుకోండని అధికారులు చెపుతుండడంతో సంక్రాంతి పండగను ఎలా నెట్టుకురావాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. అధికారుల ఉదాశీన వైఖరితో సరుకులు లేక గ్రామాల్లోని రేషన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. కేవలం బియ్యం, కిరోసిన్ మాత్రమే సరఫరా చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గత ఏడాది అట్టహాసంగా ఆరంభించిన అమ్మహస్తం పథకం ద్వారా అందించే సరుకుల్లో కేవలం పామాయిల్ మాత్రమే పంపిణీ చేసి సరిపెడుతున్నారు.
ఈ పథకం ద్వారా అందించే తొమ్మిది రకాల సరుకుల్లో రెండు నెలలుగా కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. పామాయిల్ కూడా గత నెలలో సగం దుకాణాలకు మాత్రమే సరఫరా కాగా, మిగిలిన దుకాణాలకు ఈ నెలలో సరఫరా చేస్తామని అధికారులు చెపుతున్నారు. మిగిలిన సరుకుల్లో నాణ్యత లేకపోవటంతో తీసుకొనేందుకు కార్డుదారులు ముందుకు రావటం లేదు. దీంతో దుకాణదారులు అదే రీతిలో సిద్ధమవుతున్నాయి.
డీలర్లకు భారంగా మారిన పంపిణీ....
ప్రజా పంపిణీ వ్యవస్థ సరుకులు అరకొరగానే సరఫరా కావటంతో పంపిణీ చేయడం డీలర్లకు భారంగానే మారింది. సత్తెనపల్లి రూరల్ మండలంలో మొత్తం 71 నిత్యావసర చౌక దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 34,186 కుటుంబాలు రాయితీపై నిత్యావసర సరుకులను పొందుతున్నాయి. ప్రతి నెలా 16,17 తేదీల్లోపు డీలర్లు సరుకులకు సంబంధించి బ్యాంకు డి.డి లు చెల్లించాలి. అనంతరం నెల ఆరంభంలో సరుకులను సరఫరా చేస్తారు.
డిసెంబర్ నెలకు సంబంధించిన సరుకుల కోసం నవంబర్‌లో డి.డి లు చెల్లించారు. గోదాములకు పూర్తి స్థాయిలో సరుకులు రాకపోవటంతో సగం మంది డీలర్లకు మాత్రమే సరుకులు సరఫరా చేశారు. మిగిలిన వారికి నేటికీ సరుకులు రాలేదు. ఇక జనవరి నెలకు సంబంధించిన సరుకులకు గత నెలలోనే డి.డి లు చెల్లించారు. నెల ప్రారంభమై పది రోజులు దాటుతున్నా నేటికీ దుకాణాలకు సరుకులు చేరలేదు.
పేద, మధ్య తరగతి
కుటుంబాలపైనే భారం.. రేషన్ దుకాణాల్లో సరుకులు లేకపోవడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు బహిరంగ మార్కెట్‌కు వెళ్లక తప్పేలాలేదు. సంక్రాంతి పండగ నాడు కొద్దిగానైనా పిండి వంటలు చేసుకొందామనుకునే సగటు కుటుంబాలపై భారం పడుతోంది. మార్కెట్‌లో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకటంతో పండగ జరుపుకోవటం ఇబ్బందికరంగానే మారింది.
రేషన్ దుకాణాలకు నిత్యవసర వస్తువుల సరఫరా లేకపోయినా అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం బియ్యం, కిరోసిన్‌తోనే సరిపెట్టుకోవాలంటూ చెప్పటంపై డీలర్లూ పెదవివిరుస్తున్నారు. డి.డి లు కట్టించటంలో ఉన్న హడావుడి సరుకులు అందించటంలో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పథకాల పేరుతో తమను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతోందని డీలర్లు వాపోతున్నారు.
సరుకుల్లేవ్.. సర్దుకోండి
Published Sat, Jan 11 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement
Advertisement