బియ్యంతో సరి
Published Thu, May 11 2017 1:13 AM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM
జంగారెడ్డిగూడెం : భవిష్యత్‌లో రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులేవీ సబ్సిడీ ధరకు పంపిణీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ అధికారంలోకి రాకముందు రేషన్ కార్డులపై 9 రకాల సరుకుల్ని పంపిణీ చేసేవారు. చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రేషన్ కార్డులపై ఇచ్చే సరుకులు ఒకదాని వెంట ఒకటిగా తొలగిస్తూ వస్తున్నారు. సబ్సిడీపై ఇచ్చే పంచదార, కిరోసిన్ పేదలకు అందని ద్రాక్షగానే మారాయి. ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకమంటూ ఆర్భాటంగా ప్రారంభించిన రేషన్ పంపిణీ విధానంలో మొదట్లో బియ్యం, పంచదార,
కిరోసిన్‌తోపాటు పామాయిల్, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, గోధుమ పిండి, కారం, చింతపండు, ఉప్పు వంటి నిత్యావసర సరుకుల్ని తక్కువ ధరకు సరఫరా చేసేవారు. ఆ తరువాత ప్రభుత్వం దశలవారీగా అన్ని సరుకుల పంపిణీపై కోత విధిస్తూ వస్తోంది. చివరకు బియ్యం పంపిణీకి మాత్రమే పరిమితం అవుతోంది. ఈ నెలలో పంచదార, కిరోసిన్ రేషన్ షాపులకు అవసరమైన స్థాయిలో సరఫరా కాలేదు. ప్రస్తుత నెలలో విడుదల చేసిన పంచదార, కిరోసిన్, గత నెలలో మిగిలిన పంచదార, కిరోసిన్ కలిపి ప్రస్తుతానికి పంపిణీ చేస్తున్నారు. పంచదార మొత్తం కోటాలో 30 శాతం, కిరోసిన్ 45 శాతం మాత్రమే జిల్లాలోని రేషన్ డిపోలకు కేటాయించారు. కిరోసిన్ ఇంకా విడుదల కాలేదు.
సబ్సిడీ ఉపసంహరించిన కేంద్రం
పంచదార, కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీని తొలగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి పంపిణీకి మంగళం పాడి సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. నెలనెలా కిరోసిన్ కేటాయింపులు తగ్గిస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకపై దానిని పూర్తిగా నిలిపివేసేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. కిరోసిన్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్నామంటూ ప్రజలను మాయ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని, అందువల్ల కిరోసిన్ వినియోగం ఉండదని చెబుతోంది. ఇందుకు పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరిని ఎన్నుకుంది. జిల్లాకు 90 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయగా, అవి సరిపోవని మరో 80 వేల కనెక్షన్లు కావాలని జిల్లా కలెక్టర్ నివేదించడంతో 1.70 లక్షలకనెక్షన్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ గ్యాస్ కనెక్షన్లు వినియోగదారులకు ఇంకా అందలేదు. ఈలోగానే కిరోసిన్ పంపిణీ నిలిపివేయడంతో పేదల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ పంపిణీ నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెల నుంచి పంచదార పంపిణీ పూర్తిగా నిలిచిపోనుంది. దీంతో ఆ సరుకుల్ని బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి లబ్ధిదారులకు ఏర్పడుతోంది. ఇదిలావుంటే.. బియ్యం వద్దనుకునే వారికి నేరుగా వారి ఖాతాలో నగదు జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా బియ్యం పంపిణీని కూడా దశల వారీగా నిలిపివేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
డీలర్ల గతేంటి!
రేషన్ డీలర్లను బిజినెస్ బ్యాంక్ కరస్పాండెంట్లుగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం గతంలో జీఓ జారీ చేసింది. రేషన్ షాపులను మినీ షాపింగ్‌మాల్స్‌గా మారుస్తామని ప్రకటించింది. ఇవి అమ ల్లోకి రాలేదు. రేషన్ షాపులను మినీ షాపింగ్ మాల్స్‌గా మారిస్తే అన్నిరకాల నిత్యావసర సరుకుల్ని వాటిద్వారా పంపిణీ చేయవచ్చు. రేషన్ డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమిస్తే సామాజిక పెన్షన్లు, కరెంటు బిల్లుల వసూలు, ఉపాధి హామీ కూలీల వేతనాలను పంపిణీ చేయవచ్చు. తద్వారా వారికి ఎంతోకొంత ఆదాయం సమకూరి ఉండేది. నగదు బదిలీ పథకం అమలు చేయడం వల్ల డీలర్లు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. జిల్లాలో 11,96,418 లబ్దిదారులకు పంచదార, కిరోసిన్ అందకుండా పోతుంటే, 2,163 రేషన్ షాపుల ద్వారా సేవలు అందిస్తున్న డీలర్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది.
ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర
ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోంది. ఇటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. పేదలకు అన్ని నిత్యావసర సరుకుల్ని రేషన్ డిపోల ద్వారా సబ్సిడీపై పంపిణీ చేయాలి. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోకపోతే ప్రజల్ని ప్రత్యక్ష ఆందోళనకు సమాయాత్తం చేస్తాం.
– బూరుగుపల్లి సూరిబాబు, అధ్యక్షులు, గుడిసెవాసుల సంఘం, జంగారెడ్డిగూడెం
ప్రభుత్వానికి పతనం తప్పదు
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఉపసంహరించుకోకపోతే పతనం తప్పదు. ఇప్పటికే ఇచ్చిన హామీలు సరిగా అమలు చేయని ప్రభుత్వం.. పేదవారికి చేరువగా ఉన్న చౌక డిపోలను నిర్వీర్యం చేస్తే తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. ప్రజాకంటక నిర్ణయాలు మానుకుని, ప్రజలకు చేరువయ్యే పాలన అందించే దిశగా ప్రభుత్వం కృషిచేయాలి.
– బి.సాయికిరణ్, చిరుద్యోగి, జంగారెడ్డిగూడెం
Advertisement
Advertisement