రేషన్‌కోత..పేదలకు వెత
♦ నిత్యావసరాల్లో పంచదార, కిరోసిన్‌కు మంగళం
♦ చౌక దుకాణాల్లో సరఫరా నిలిపివేత
♦ దశల వారీగా ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం
♦ సామాన్యులకు తప్పని తిప్పలు
మార్కెట్లో ధరల మోత..
ప్రభుత్వం రాయితీపై అందజేసే కిరోసిన్, చక్కెరలను నిలిపివేయడంతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. బహిరంగ మార్కెట్లో కిలో చక్కెర రూ.40 అమ్ముతుండగా, చౌక దుకాణాల్లో రూ. 13.50కే అందజే సేవారు. ఇంట్లో దీపం, కట్టెల పొయ్యి వెలిగించడానికి కిరోసిన్ ను వినియోగిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో నీలి కిరోసిన్ దొరకదు. మామూలు కిరోసిన్ లీటరు ధన రూ. 40 పలుకుతోంది. వీటిని కొనుగోలు చేయాలంటే పేద ప్రజలపై ఆర్థిక భారం పడక తప్పదు.
పర్చూరు:
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులపై అతి పెద్ద కోత విధించేందుకు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. తెల్లరేషన్ కార్డుదారులకు అందిస్తున్న రెండు నిత్యావసర వస్తువులు ఇక నుంచి పేదలకు దూరమయ్యాయి. గతంలో చౌక దుకాణాల్లో కందిపప్పు, నూనె, గోధుమపిండి, పసుపు, ఉప్పు, గోధుమలు కూడా అందిస్తుండగా కాలక్రమేణా వాటికి స్వస్తి పలికారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మరో రెండు నిత్యావసర వస్తువులను ఈ జాబితాలో చేర్చింది. ప్రస్తుత జూన్ నెల కోటాలో చక్కెర, కిరోసిన్ పంపిణీ చేయడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయం చౌక దుకాణాల సరుకులపైనే ఆధారపడుతున్న పేదలపై తీవ్రప్రభావం చూపనుంది.
నిర్వీర్యమవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ...
దారిద్రరేఖకు దిగువన ఉన్నవారికి రాయితీపై నిత్యావసర సరుకులు అందించాలన్నది చౌక దుకాణాల ఉద్దేశం. ఈ లక్ష్యం రోజు రోజుకు నీరుగారిపోతుండడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ప్రారంభంలో అందజేసిన సరుకుల్లో కోత విధిస్తోంది. చౌక దుకాణాల్లో అందించే గోధుమ పిండి, నూనెకు ఇప్పటికే మంగళం పాడిన ప్రభుత్వం జూన్ నెల నుంచి చక్కెర, కిరోసిన్‌లను కూడా నిలిపివేసింది. కిరోసిన్, చక్కెరపై తాము అందజేసే రాయితీ నిలిపివేస్తున్నామని, వాటి పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజా పంపిణీలో మారుతున్న నిర్ణయాలపై ప్రజల్లో ఆసంతృప్తి రెట్టింపవుతోంది.
చౌక దుకాణాల దుస్థితి..
జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో 8,68,088 రేషన్‌కార్డులకు గాను 2151 చౌక దుకాణాలు ఉన్నాయి.