అంతటా అంధకారం | Across the Darkness | Sakshi
Sakshi News home page

అంతటా అంధకారం

Published Thu, Oct 16 2014 1:33 AM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM

Across the Darkness

హుదూద్ తుపాను విలయ తాండవానికి మండలంలోని అన్ని గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. దీంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. కొళాయినీరు రాక, విద్యుత్ ఉపకరణాలు పనిచేయక పగలంతా అవస్థలు పడుతున్నారు. కటిక చీకట్లో, దోమల బెడదతో ఇంటిల్లిపాదీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మరోపక్క తుపాను దెబ్బకు పరిశ్రమల్లో ఉత్పత్తులు నిలిచిపోయాయి.
 
అచ్యుతాపురం : మండలంలో వందల  సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. హైటెన్షన్ లైన్‌లో 10 భారీ విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అన్ని లైన్లలో స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు  కూలిపోవడంతో విద్యుత్ సరఫరా పునరుద్దరించడానికి సమయం పడుతుందని అనకాపల్లి డీఈ జి.రాజ్‌కుమార్ తె లిపారు. అత్యవసరంగా మండల కేంద్రానికి విద్యుత్ సరఫరా అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అచ్యుతాపురం నుంచి గాజువాక ప్రధాన రహదారికి రాకపోకలు పునరుద్దరించగలిగారు.

అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్లే రహదారిలో చోడపల్లి వద్ద భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. బుధవారం నాటికి ఈ రహదారిలో అడ్డంకులు తొలగించగలమని ఎస్‌ఐ సన్యాశినాయుడు తెలిపారు. తిమ్మరాజుపేట జంక్షన్ నుంచి ఖాజీపాలెం, కొండకర్ల జంక్షన్ నుంచి ఎం.జగన్నాధపురం గ్రామాలకు ఇప్పటికీ రాకపోకలు జరగలేదు. ఈ రహదారిలో చెట్లను తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో 20 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి.
 
పరిశ్రమలు కుదేలు

స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్‌ఈజెడ్) పరిశ్రమలకు తుపాను తీవ్రనష్టాన్ని మిగిల్చింది. సెజ్‌లో ఉత్పత్తులను చేపడుతున్న 17 పరిశ్రమలు, నిర్మాణంలో ఉన్న 12 పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అభిజిత్ పరిశ్రమ నుంచి ఎగిరిన రేకులు మడుతూరు వరకూ పడ్డాయి. డబ్ల్యూఎస్ పరిశ్రమలో బ్రాండెక్స్ పరిశ్రమలో బ్రాండెక్స్ అపెరల్ సిటీ 1, 2, 3, పయినీర్, సీడ్స్, క్వాంటమ్, పరిశ్రమలలో యంత్రాలు పాడైపోయాయి.

అచ్యుతాపురం పరిసరాల్లో ఏర్పాటు చేసిన పలు పరిశ్రమల సీలింగ్ ఊడిపడడంతో యజమానులు తీవ్రంగా నష్టపోయారు. పరిశ్రమలకు సామగ్రిని అందించే పలు వాహనాలు మార్గమధ్యలో దెబ్బతిన్నాయి. పలు కంటైనర్లు బోల్తాపడ్డాయి. పరిశ్రమలపై ఆధారపడి 15 వేల మంది కార్మికులు ఉన్నారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించి మరమ్మతులు చేపట్టడానికి  సమయం పట్టే అవకాశం ఉంది. తమ ఉపాధిపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
 
చిప్పాడ ధ్వంసం

చిప్పాడ పరిస్థితి దయనీయంగా తయారయింది. ఏడేళ్ల క్రితమే చిప్పాడ గ్రామాన్ని తరలిస్తామని అధికారులు చెప్పారు. పునరావాసం కల్పించడంలో జాప్యం జరిగింది. దీంతో నిర్వాసితులు ఇప్పటివరకూ ఇళ్లు నిర్మించుకోలేదు. వెదురువాడ వద్ద స్థలాలు మంజూరు చేస్తామని ఇటీవల అధికారులు ప్రకటించారు. ఇంతలో తుపాను గ్రామాన్ని అతలాకుతలం చేసింది. గ్రామంలో పూరిగుడిసెలన్నీ నేలమట్టమయ్యాయి. గ్రామస్తులంతా నిరాశ్రయులయ్యారు. ప్రత్యామ్నాయ ప్రదేశాలు లేక చాలామంది కూలిన ఇళ్లలోనే తలదాచుకున్నారు. వెదురువాడ వద్ద స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని నిర్వాసితులు అధికారులను కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement