- తుపాను బాధితులకు బియ్యంతో పాటు 9 సరకులు పంపిణీ చేస్తామని సీఎం హామీ
- అంత స్థాయిలో జిల్లాలో స్టాకు లేక అధికారుల మల్లగుల్లాలు
విశాఖ రూరల్ : హుదూద్ తుపాను బాధితులకు బియ్యంతో పాటు 9 రకాల నిత్యావసర సరకులు ఉచితంగా అందిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చి న హామీ నేరవేరడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ప్రకటించిన వస్తువుల్లో ఏ ఒక్కటీ జిల్లాలో పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. దీంతో వాటిని ఇతర జిల్లాల నుంచి సేకరించాలని నిర్ణయించారు.
తుపాను కారణంగా ఎంత మంది తెల్లరేషన్‌కార్డుదారులకు నష్టం జరి గిందో అంచనాలు సిద్ధం చేశారు. ఆ స్థాయిలో ని త్యావసరాల సేకరణ నివేదిక తయారు చేయగా.. తాజాగా సీఎం ఆ వస్తువులను కేవలం కార్డుదారులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. దీంతో ఎంత మేర నిత్యావసరాలను సేకరించాలో తెలియక అధికారులు కిందామీదా పడుతున్నారు.
సగం స్థాయిలో కూడా సరకులు లేవు
తుపానుకు నష్టపోయిన ప్రతి కార్డుదారునికి 25 కిలోల బియ్యం, కిలో పంచదార, 2 కిలోల కంది పప్పు, అరకిలో కారం, అరకిలో ఉప్పు, పామాయిల్ లీటర్, కిరోసిన్ 5 లీటర్లు, బంగాళదుంపలు 3 కిలోలు, ఉల్లి 2 కిలోలు ఉచితంగా ఇస్తామని సీ ఎం హామీ ఇచ్చారు. దీని ప్రకారం పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తే తెల్ల కార్డుదారుల కు సగం స్థాయిలో సరకులు లేవని గుర్తించారు.
ఇతర ప్రాంతాల నుంచి సేకరణ
ప్రస్తుతం జిల్లాలో ఉన్న మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో బియ్యం 6857.292 మెట్రిక్ టన్ను లు, పంచదార 152.750 మెట్రిక్ టన్నులు, కా రం 5 మెట్రిక్ టన్నులు, ఉప్పు 25 వేలు మెట్రిక్ టన్నులు, కిరోసిన్ 76 కిలోలీటర్లు మాత్రమే ఉన్నాయి. పామాయిల్, కృదిపప్పు లేవు. ఆయి ల్ గత ఏడు నెలలుగా తెల్లరేషన్‌కార్డులకు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. కానీ తుపాను బాధితులకు వీటిని ఇతర ప్రాంతాల నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎంఎల్‌ఎస్ పాయింట్లలో బియ్యం సరిపడా లేనప్పటికీ ఎఫ్‌సీఐ నుంచి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎఫ్‌సీఐలో బియ్యం అవసరాలకు సరిపడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన వస్తువులను మాత్రం ఇతర ప్రాంతాల నుంచి సేకరించాల్సి ఉంది. కార్డుదారులకే కాకుండా అపార్టుమెంట్లలో ఉన్న వారికి కూడా ఈ వస్తువులను ఉచితంగా ఇస్తామని సీఎం ప్రకటించారు. మొత్తం 9 లక్షల మందికి అందజేస్తామని చెప్పడంతో అంత స్థాయిలో సేకరణ సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతటి స్థాయిలో అధికారులు సైతం ఇంకా ప్రణాళికలు కూడా రూపొందించలేదు.