పప్పన్నం కరువే..!
మరో మూడు రోజుల్లో వినాయక చవితి పండుగ వస్తోంది. పేదలకు పరమాన్నం లేకపోయినా కనీసం పప్పన్నం తినే భాగ్యం కూడా లేకుండా పోతోంది. చౌక దుకాణాల్లో ఇప్పటికీ చాలా చోట్ల కందిపప్పు.. పామోలిన్ సరఫరా కాలేదు. కేవలం మూడు వస్తువులతోనే సరిపెడుతున్నారు. ఇలాగైతే పండుగ ఎలా జరుపుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, కడప : చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలకంతా మేలు జరుగుతుందని ఊదరగొట్టిన టీడీపీ నేతల మాటలు నీటి మూటలయ్యాయి. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు మాటలు ఉత్తుత్తివే అని తేలిపోయాయి. కనీసం ప్రజలకు నిత్యావసర సరుకులు కూడా సక్రమంగా పంపిణీ చేయలేకుపోతున్నారంటే ‘దేశం’ పాలన ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. జిల్లాకు సంబంధించి సరుకుల పంపిణీలో ప్రతిసారి కోత పడుతూనే ఉంది. తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పామోలిన్‌కు మంగళం పాడింది.
20 నెలలుగా పంపిణీకి నోచుకోని పామోలిన్ :
అంతకుముందు రాష్ట్రపతి పాలన, ఎన్నికలు కలుపుకుని 5 నెలలు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కలుపుకొని దాదాపు 20 నెలలుగా పామోలిన్ పంపిణీకి నోచుకోలేదు.
చౌక వస్తువుల్లోనూ కోత :
జిల్లాలో 1735 రేషన్‌షాపులు ఉండగా దాదాపు ఏడు లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. అందులో 25 లక్షలకు పైగా కుటుంబ సభ్యులు నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 19 గోడౌన్లకు బియ్యం, చక్కెర, గోధుమ పిండి మాత్రమే పంపి రేషన్ షాపులన్నింటికీ అందించారు.
కందిపప్పు కొరత...
జిల్లాలో చాలా రేషన్ షాపులకు నిత్యావసర సరుకుల్లో కీలకమైన కందిపప్పు చేరలేదు. జిల్లాకు 7 లక్షల కేజీలకు పైగా కందిపప్పు రావాల్సి ఉండగా...కేవలం 3లక్షల కేజీలు మాత్రమే వచ్చినట్లు పౌర సరపరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికీ పామోలిన్ అందకపోగా, మిగతా సరుకులు కూడా అంతంత మాత్రంగానే అందుతున్నాయి.