సాక్షి, అమరావతి: విదేశాలకు ఎగుమతి అవుతున్న బియ్యంలో 40 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే తరలిపోతోందని, రీ సైక్లింగ్ చేసి పంపుతున్నారని, గిట్టుబాటు ధరల్లో కోతలు విధిస్తూ అన్నదాతల పొట్టగొడుతున్నారంటూ ఈనాడు దినపత్రిక కల్పిత కథనాలను ప్రచురించటంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే బియ్యం కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అవుతుంటే అదంతా ఏపీలో అక్రమంగా సేకరించిందంటూ బురద చల్లటం ఏమిటని నిలదీశారు. ఒక్క తెలంగాణ నుంచే పది లక్షల టన్నుల వరకు ఈ పోర్టు ద్వారా ఎగుమతి అవుతోందన్నారు. ఇతర రాష్ట్రాల బియ్యాన్ని కూడా ఏపీ ఖాతాలో కలిపేసి తప్పుడు కథనాలు ప్రచురించొద్దని సూచించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబీఎన్, టీవీ 5 నిత్యం దుష్ప్రచారాన్ని సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే గురువారం ఈనాడు దినపత్రికలో ‘చౌకగా మోసం’ శీర్షికతో తప్పుడు కథనాన్ని రామోజీరావు అచ్చేశారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
కనీస పరిజ్ఞానం లేకపోతే ఎలా రామోజీ?
ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచే విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ ఏడాదీ అదే రీతిలో రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బియ్యాన్ని కూడా కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేశారు. ఈమాత్రం కనీస పరి/ê్ఞనం కూడా లేకపోతే ఎలా రామోజీ? బియ్యం ఎగుమతిలో కాకినాడ పోర్టు ఈనాడు పుట్టక ముందు నుంచే అగ్రస్థానంలో ఉంది. చంద్రబాబును సీఎం పీఠంపై కూర్చోబెట్టి రాష్ట్రాన్ని లూటీ చేయాలనే తాపత్రయంతో తప్పుడు వార్తలు ప్రచురిస్తే ప్రజలు నమ్మరు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడమనేది జరగని పని.
ఏ రకంగా సాధ్యం?
30 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేయాలంటే కనీసం 50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావాలి. ప్రభుత్వం కొన్నదెంత? మిల్లర్లు కొనుగోలు చేసింది ఎంత? రైతులు వారి కుటుంబ అవసరాలు, విత్తనాలు తదితరాల కోసం నిల్వ చేసుకోగా మిగిలేది ఎంత? రాష్ట్రంలో పండించలేనంత మొత్తాన్ని ఎగుమతి చేశారని రాయడం, రీ సైక్లింగ్ చేసి తరలిస్తున్నారనడం ఏ రకంగా సాధ్యం? అయినా 30 లక్షల టన్నుల్లో 80 – 90 శాతం వరకు ఇతర రాష్ట్రాల బియ్యమే ఉంటుంది.
దేశంలో తొలిసారిగా రైస్ ఏజింగ్ టెస్ట్
ఎన్ని రోజుల క్రితం బియ్యం అనే విషయాన్ని నిర్థారించేందుకు, రీ సైక్లింగ్‌కు అవకాశం లేకుండా దేశంలో తొలిసారిగా రైస్ ఏజింగ్ టెస్ట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిద్వారా ఎప్పుడు మిల్లింగ్ చేశారో గుర్తించవచ్చు. కస్టమ్ మిల్లింగ్ రైస్ పథకం కింద మిల్లర్లు ఇచ్చే బియ్యానికి రంగు పరీక్ష (కలర్ టెస్ట్) నిర్వహించటాన్ని కేంద్రం కూడా తప్పనిసరి చేసింది.
కళ్లాల వద్దే సేకరణ.. 21 రోజుల్లోనే డబ్బులు
టీడీపీ హయాంలో రైతులకు స్లిప్‌లు ఇచ్చి ధాన్యాన్ని మిల్లుల వద్దకు తీసుకెళ్లమనేవారు. ధాన్యం నాణ్యంగా లేదనే సాకుతో తక్కువ ధరకే కొనుగోలు చేసి రైతన్నలను దోచుకునేవారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేశారు. ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేసి 21 రోజుల్లోగా రైతులకు చెల్లింపులు చేస్తున్నాం. ఇప్పటికే రూ.3,946 కోట్లను చెల్లించాం. మరో రూ.1,600 కోట్లను రోజుకు రూ.వంద కోట్ల చొప్పున 16 రోజుల్లోగా రైతులకు చెల్లిస్తాం.
వైఎస్సార్ కుటుంబాన్ని దూషించొచ్చా?
చంద్రబాబు ఇష్టానుసారంగా వైఎస్సార్ కుటుంబ సభ్యులను దూషించవచ్చా? అదే మేం ఆయన కుటుంబ సభ్యులను ఏమీ అనక ముందే చంద్రబాబు శోకాలు పెడుతూ నటిస్తారు. సాధారణ బదిలీల్లో భాగంగానే డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ప్రభుత్వం మార్చింది.
ఓ వంతెన కూడా కట్టలేకపోయారు..
ఏ సీజన్‌లో పంట నష్టపోతే ఆ సీజన్‌లోనే పరిహారం అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ ఒక్కరే. పేదలకు నాణ్యమైన బియ్యం (సార్టెక్స్) అందించడానికి అదనంగా రూ.700 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. రైతులు, పేదల కోసం అహర్నిశలు శ్రమిస్తోన్న సీఎం వైఎస్ జగన్‌పై బురదజల్లుతూ నీచమైన రాతలు రాస్తారా? చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులకు వయసొచ్చింది గానీ బుద్ధి రాలేదు. 50 ఏళ్‌లైనా నిండని సీఎం జగన్‌పై అక్కసుతో తప్పుడు రాతలు రాస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు విజయవాడలో కనీసం ఓ వంతెన కూడా కట్టలేకపోయారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. కేంద్రం సహకారంతో రెండో ఫ్లైఓవర్‌ను కూడా శరవేగంగా పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment