
బాధితులకు అండగా ఉంటాం:వైఎస్ జగన్
విశాఖ: హుదూద్ తుపాను విలయం సృష్టించిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం రాజమండ్రి బయల్దేరి వెళ్లిన ఆయన అక్కడ నుంచి విశాఖ జిల్లాకు చేరుకున్నారు. ప్రస్తుతం విశాఖ పరిసర ప్రాంతాల్లో జగన్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నక్కపల్లి మండలంలోని కాగిత గ్రామంలో ధ్వంసమైన జీడి, మామిడి తోటలను పరిశీలించిన అనంతరం బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాన్ ప్రభావంతో నష్టపోయిన వారికి తమ పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని జగన్ తెలిపారు. బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందే వరకూ వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందన్నారు.
తుపాను వల్ల ప్రజా జీవనం పూర్తిగా అతలాకుతలమైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, పాక్షికంగా నష్టపోయిన తూర్పు గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన సాగుతుంది.బాధ్యత గల ప్రతిపక్ష నేతగా జగన్ సహాయక చర్యలు పూర్తయ్యేవరకు ఆ నాలుగు జిల్లాల్లోనే ఉండి ప్రజలకు బాసటగా నిలుస్తారు.