రాజమండ్రి బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్: హుదూద్ తుపాను విలయం సృష్టించిన ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పర్యటన నిమిత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం రాజమండ్రి బయల్దేరారు. అక్కడ నుంచి ఆయన తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వెళతారు. తుపాను వల్ల ప్రజా జీవనం పూర్తిగా అతలాకుతలమైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, పాక్షికంగా నష్టపోయిన తూర్పు గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన సాగుతుంది.
రోడ్డు మార్గంలో కారులో వెళ్లే అవకాశం లేకుంటే మోటారు సైకిల్ లేదా సైకిల్‌పై వైఎస్ జగన్ బాధిత ప్రాంతాలకు వెళతారు. తుపాను వల్ల దెబ్బ తిన్న ప్రాంతాలను సందర్శించి స్వయంగా అక్కడి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వారిని పరామర్శించనున్నారు. ఓ వైపు ప్రజలను పరామర్శిస్తూ మరోవైపు సహాయక చర్యలు ముమ్మరం చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రానున్నారు.
ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా జగన్ సహాయక చర్యలు పూర్తయ్యేవరకు ఆ నాలుగు జిల్లాల్లోనే ఉండి ప్రజలకు బాసటగా నిలుస్తారు. కాగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని మోడీ కూడా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసేందుకు వైఎస్ జగన్ అనుమతి కోరనున్నారు.