
వసతి గృహాలకు హుదూద్ నష్టం రూ.2.12 కోట్లు
తుపానుకు దెబ్బతిన్న సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు అధికారులు అంచనాలు రూపొందించారు. బీసీ సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన 107 వసతి గృహాలు దెబ్బతిన్నాయని అధికారుల విచారణలో తేలింది.
- కూలిన ప్రహరీలు, దెబ్బతిన్న హాస్టళ్లు
- నష్టం అంచనాలు రూపొందించిన అధికారులు
- నిధులు మంజూరుకు ప్రభుత్వానికి నివేదిక
విశాఖపట్నం : తుపానుకు దెబ్బతిన్న సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు అధికారులు అంచనాలు రూపొందించారు. బీసీ సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన 107 వసతి గృహాలు దెబ్బతిన్నాయని అధికారుల విచారణలో తేలింది. వీటి మరమ్మతులకు రూ.2.12 కోట్లు అవసరమని అంచనాలు వేశారు. బీసీ సంక్షేమశాఖకు చెందిన 40 సొంత భవనాలలోని ప్రీమెట్రిక్ వసతి గృహాలు దెబ్బతిన్నాయి. వసతి గృహాల ఆవరణలోని చెట్లు నేల కూలాయి.
పలుచోట్ల ప్రహరీలు కూలిపోయాయి. కిటికీలు, తలుపులు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పైకప్పులు ఈదురు గాలులకు ఎగిరిపోయాయి. ఒక్కో హాస్టల్‌కు రూ.40 వేల నుంచి రూ.8 లక్షల వరకు నిధులు అవసరమని ఇంజినీర్లు అంచనాలు రూపొందించారు. నగరంలోని ఇసుకతోట, పెందుర్తి, జిల్లాలోని యలమంచిలి, పాయకరావుపేట, కె.కోటపాడు, కోరువాడ, భీమిలి, రెడ్డిపల్లి, పద్మనాభం, గొడిచెర్ల, నక్కపల్లి, వేములపూడి, నర్సీపట్నంలలోని వసతి గృహాలు బాగా దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు రూ.1.32 కోట్లు అంచనా కాగా, తక్షణం రూ.1.12 కోట్లు అవసర మని అధికారులు నివేదికలు పంపారు. ఎంవీపీ కాలనీలోని బీసీ సంక్షేమశాఖ కార్యాలయానికి రూ.75 వేల నష్టం వాటిల్లింది.
సాంఘిక సంక్షేమ శాఖలో...
తుపానుకు జిల్లాలోని 67 ఎస్సీ వసతి గృహాలు దెబ్బతిన్నాయి. నగరంలోని కృష్ణానగర్, భీమిలి, మధురవాడ, చినగదిలి, ఆనందపురం, గాజువాక, పెదగంట్యాడ, చోడవరం, మాడుగుల, పరవాడ, గోపాలపట్నం, పెందుర్తి, కె.కోటపాడు, సబ్బవరం, యలమంచిలి, నర్సీపట్నం, గొలుగొండ, ఎస్.రాయవరం వసతి గృహాలకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వివరాలు సేకరించారు.
మిగిలిన చోట్ల స్వల్పంగా నష్టం జరిగింది. అన్ని చోట్ల ప్రహరీలు కూలిపోయాయి. వీటి మరమ్మతుల కోసం కనీసం రూ.80 లక్షలు అవసరమని అంచనాలు వేశారు. తక్షణం రూ.32 లక్షలు కావాలని నివేదికలు సిద్ధం చేశారు.
ప్రభుత్వానికి నివేదించాం
తుపానుకు దెబ్బతిన్న వసతి గృహాలలో ప్రస్తుతానికి విద్యార్థులకు భోజన, వసతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. వసతి గృహాల మరమ్మతులకు నిధుల కోసం ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం.
- అన్నపూర్ణమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి, విశాఖపట్నం