పుట్టలు తవ్వి.. పాలు పోసి
- హుదూద్ దెబ్బకు పుట్టలు మాయం
- మట్టిదిబ్బలకు కలుగులు తీసి పూజలు
- తొలిసారి భక్తులకు వింత అనుభవం
సాక్షి, విశాఖపట్నం : హుదూద్ తుపాను ప్రభావం నాగుల చవితిపై కూడా పడింది. తుపానుకు జిల్లాలో వేలాది చెట్లు నేలకొరిగాయి. వాటి కింద పుట్టలు చితికిపోయాయి. ఉన్న కొద్దిపాటి పుట్టలు వృక్ష వ్యర్థాలతో కప్పబడిపోయాయి. పుట్టలు కానరాక జనం అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ పుట్టలు తవ్వి చవితి చేసుకున్నారు.
ఈ ఏడాది బాణాసంచాపై నిషేధం ఉండడంతో పండగ సందడి కానరాలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదనే మాట ప్రతి ఒక్కరి నోటా వినిపించింది. వచ్చే ఏడాది ఈ సమయానికి జిల్లా తిరిగి పచ్చదనాన్ని సంతరించు కుని నాగేంద్రునికి సహజ సిద్ధ ఆవాసాలు ఏర్పడాలని ఆకాంక్షించారు. హుదూద్ వంటి విపత్తుల నుంచి కాపాడమని నాగేంద్రుడిని వేడుకున్నారు.
కార్తీకమాసం తొలి సోమవారం నాడే నాగులచవితి రావడంతో శివాలయాలల్లో భక్తులు పోటెత్తారు. కొన్ని శివాలయాల్లో పుట్టలు ఏర్పాటు చేయడంతో ఎక్కువమంది అక్కడే పూజలు చేశారు. సహజసిద్ధంగా ఏర్పడే పుట్టలో పాలుపోయడం పవిత్రంగా భావించే వారు తప్పనిసరై కృత్రిమ పుట్టలతో సర్దుకున్నారు.