- వైపరీత్యాల నిధి పెంచాలని ప్రభుత్వానికి జీవీఎంసీ లేఖ
- రూ. 40 కోట్లు కావాలని అభ్యర్థన
విశాఖపట్నం సిటీ : హుద్‌హుద్ తుపాను విశాఖలో పచ్చదనంతో పాటు జీవీఎంసీ ఖజానానూ ఊడ్చేసింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎంత మేర నిధులు కావాలో జీవీఎంసీకి తెలిసేలా చేసింది. దీంతో అధికారులు మేల్కోన్నారు. విపత్తుల సమయంలో ప్రభుత్వమిచ్చే రూ.10 కోట్ల సాయం ఏ మాత్రం సరిపోదని తెలుసుకున్నారు. విపత్తులకు ముందస్తుగా పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు భారీగా నిధులు కావాలని గుర్తించారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వానికి లేఖ రాశారు.
తుపాను పునరావాస నిధిని రూ.40 కోట్లకు పెంచాలని కోరారు. నగరంలో అధిక శాతం జనం కొండలు, సముద్ర తీర ప్రాంతాల్లో నివాసముంటున్నారని, విపత్తులు సంభవిస్తే నష్టం భారీగానే ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. హుద్‌హుద్ తుపాను వల్ల జీవీఎంసీ నిధులన్నీ ఖర్చయిపోయాయని వివరించారు. భవిష్యత్తు అవసరాలతో పాటు జీవీఎంసీ పరిధి అనకాపల్లి నుంచి భీమిలి వరకు పెరగడంతో నిధిని రూ.10 కోట్ల నుంచి రూ.40 కోట్లకు పెంచాల్సిందిగా కోరారు.
22 నుంచీ ఆడిట్
జీవీఎంసీలో ఈ నెల 22వ తేదీ నుంచి ఆడిట్ యథావిధిగా కొనసాగుతుంది. 2009-10 నుంచి 2013-14 వార్షిక ఆడిట్‌ను ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయ అధికారులు ఆడిట్ చేస్తున్నారు. తుపాను కారణంగా అక్టోబర్ నెల నుంచి ఆడిట్‌ను ఆపేశారు. తిరిగి మళ్లీ ఈ ఆడిట్‌ను ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.