చీకటి పల్లెలు
- ఇంకా అంధకారంలో4314 గ్రామాలు
- విశాఖలో పగటివేళ విద్యుత్ సరఫరా కట్
- హుదూద్ కు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ
సాక్షి, విశాఖపట్నం : హుదూద్ తుపాను దెబ్బకు విద్యు త్ వ్యవస్థ కుప్పకూలింది. వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపడ్డాయి. లక్షలాది సర్వీసులకు సరఫరా నిలిచిపోయింది. సుమారు రూ.750 కోట్ల నష్టం వాటిల్లింది. అయితేనేం రెండు మూడు రోజుల్లోనే విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాం. ప్రజలకు విద్యుత్ వెలుగులు ఇచ్చాం. ప్రస్తుతం విద్యుత్ సరఫరాను దాదాపుగా అన్ని సర్వీసులకు పునరుద్ధరించేశాం.
ఇవి ప్రభుత్వం చెబుతున్న గొప్పలు. కానీ అదే ప్రభుత్వాధికారుల వద్ద ఉన్న లెక్కలు ఈ మాటలు అవాస్తవాలని చెబుతున్నాయి. ఆ లెక్కల ప్రకారం ఇప్పటికీ జిల్లాలో 4 లక్షల 96 వేల 966 సర్వీసులకు విద్యుత్ సరఫరా అందడం లేదు. నగరంలో పగటిపూట విద్యుత్ ఉండడం లేదు. ఒక్క గ్రామంలోనూ పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరించలేదు. కానీ అన్ని సర్వీసులకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పూర్తయినట్లేనని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు.
ఈ నెల 12వ తేదీన జిల్లాపై విరుచుకుపడిన హుదూద్ తుపాను వల్ల తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) పరిధిలోని 11,28,840 సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇతర జిల్లాలు, డిస్కంల నుంచి నిపుణులైన సిబ్బందిని పంపిస్తే తప్ప పునరుద్ధరణ చర్యలు అసాధ్యమని సంస్థ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. దీంతో చుట్టు పక్కల జిల్లాల నుంచి హుటాహుటిన వేలాది మంది విద్యుత్ శాఖ అధికారులను, సిబ్బంది జిల్లాకు వచ్చారని వెంటనే విద్యుత్ వ్యవస్థను పూర్వస్థితికి తీసుకువచ్చేస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. కానీ వారంతా 18 రోజులు కష్టపడితే 6,31,874 సర్వీసులకు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేలా చేయగలిగారు.
తుపాను బారిన పడి అంధకారంలో మగ్గుతున్న 4314 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ చర్యలను అధికారులు పూర్తిగా విస్మరించారు. తుపాను వల్ల 132/33 కేవీ లైన్లు 16 దెబ్బతింటే వాటిలో 14 పునరుద్ధరించారు. 33/11కేవీ లైన్లు 144 దెబ్బతినగా 118 బాగుచేశారు. 33కేవీ ఫీడర్లు 92 పాడైతే 62 సరిచేశారు. 11కేవీ ఫీడర్లు 604 తెగిపోతే వాటిలో 399 అతికించారు. 8320 ఎల్‌టీ లైన్లలో ఒక్క లైను కూడా గాడిన పడలేదు. విద్యుత్ స్తంభాల పరిస్థితి కూడా అంతే. 33కేవీ విద్యుత్ స్తంభాలు 1564 విరిగిపోయాయి. వాటి స్థానంలో ఇప్పటి వరకూ 352 మాత్రమే కొత్తవి నిలబెట్టారు.
216 స్తంభాలు దెబ్బతిన్నాయి. వాటిలో 30 స్తంభాలే సరిచేశారు. 11కేవీ స్తంభా లు 10270 విరిగిపోతే 4120 కొత్త స్తంభాలు వేశారు. ఈ కేటగిరీలో 896 దెబ్బతింటే కేవలం 35 పనికొచ్చేలా చేశారు. ఎల్‌టీ స్తంభాలు 6250 విరిగిపోతే 2350 మార్చారు. 1100 వంగిపోతే 115 సరి చేశారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ (డీటీఆర్) నిర్మాణాలు 9736 కూలిపోతే వాటి స్థానంలో ఒక్క కొత్త నిర్మాణం కూడా జరగలేదు. ట్రాన్స్‌ఫార్మర్లు(డీటీఆర్స్) 14065 దెబ్బతింటే 7120 మాత్రమే మార్చారు.