• రూ. 2 వేల కోట్లతో అభివృద్ధి ప్రణాళిక
• ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్,జార్ఖండ్ ప్రాంతాలకు భారీ కార్గోకు అనుకూలం
• సొంతంగా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వంతో సంప్రదింపులు
• భావనపాడు తీరంలో పర్యటించిన విశాఖ పోర్టు బృందం
• పనులు దక్కించుకోవడానికి విశాఖ పోర్టుట్రస్టు యత్నం !
టెక్కలి : రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాలతో కూడిన అవశేషాంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర ప్రాంతం కీలకంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో వాణిజ్య వ్యాపారాలకు రోడ్డు, విమాన, జల మార్గాలకు అనుకూలంగా ఉన్న విశాఖపట్టణం పోర్టు ప్రస్తుతం కీలకంగా మారింది. ఇదే పరిస్థితిలో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీగా పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రా- ఒడిశా ప్రాంతాలతో పాటు చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల వ్యాపారాలకు అనుకూలంగా ఉన్న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు తీర ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది.
గత ప్రభుత్వాలు ఇక్కడ పోర్టు నిర్మాణానికి ప్రయత్నించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం 13 జిల్లాలతో కూడిన రాష్ట్రంలో భావనపాడు తీరం కీలకమైంది. ఇక్కడ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. దీంతో వీటి నిర్మాణ ప్రాజెక్టును దక్కించుకోవడానికి విశాఖ పోర్టు ట్రస్టు గురి పెట్టింది. ఇందులో భాగంగా పోర్టుకు చెందిన బృందం సభ్యులు జిల్లా అధికారులతో కలిసి గురువారం భావనపాడు తీరంలో పర్యటించారు. పోర్టు నిర్మాణానికి అనుకూలమైన సుమారు రెండు వేల ఎకరాల కోసం అన్వేషణ చేపట్టారు. ఇందులో భాగంగా పోర్టుకు అవసరమైన స్థలం సర్వేకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవుతోంది.
భవిష్యత్ కార్గో దృష్టితో..
తూర్పు తీరంలో ఉత్తరాంధ్రకు ఆనుకుని ప్రస్తుతం విశాఖ పోర్టు మాత్రమే జలమార్గంలో వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంది. ఆ తరువాత శ్రీకాకుళం జిల్లా నుంచి ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లకు జల మార్గంలో తక్కువ దూరం కలిగిన పోర్టు మరోకటి లేదు. దీంతో భవిష్యత్‌లో పవర్‌ప్లాంట్లు, ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు భావనపాడు పోర్టు కీలకం కానుంది.
ఇప్పటికే జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల్లో భారీగా విద్యుత్ ప్లాంట్లు, ముడి ఖనిజం, ఉక్కు కంపెనీలకు సంబంధించి పరిశ్రమలు ఏర్పాటయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే భావనపాడు సమీపంలోని కాకరాపల్లి ప్రాంతంలో ఈస్ట్‌కోస్ట్ ఎనర్జీ పవర్‌ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. వీటితో పాటు సమీపంలోని టెక్కలి ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాత గాంచిన గ్రానైట్ పరిశ్రమలు మెండుగా ఉన్నాయి. దీంతో భావనపాడు ప్రాంతంలో భారీగా కార్గో(భారీ లగేజీ రవాణా షిప్)లకు ఈ ప్రాంతం అనుకూలం. ఈ ప్రాజెక్టు నిర్మాణం అనుమతులు దక్కించుకోవడం లాభదాయకంగా ఉంటుందని విశాఖ పోర్టు భావిస్తోంది.
కారిడార్ తోడైతే మరిన్ని పరిశ్రమలు
రాష్ట్ర పునర్విభజన ఒప్పందంలో భాగంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తే, విశాఖ నుంచి చెన్నై వరకు కారిడార్ వెలిసే అవకాశాలున్నాయి. దీంతో తూర్పు తీర ప్రాంతంలోని భావనపాడు పోర్టులో ఊహించని విధంగా కార్గో ఏర్పడే అవకాశం ఉంటుందని విశాఖ పోర్టు ట్రస్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో సుమారు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఓడ రేవును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది.
దీనికోసం పోర్టు ట్రస్టు అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగితే భావనపాడు తీరంలో విశాఖ పోర్టు ట్రస్టు ఆధ్వర్యంలో పోర్టు నిర్మాణం చేపట్టడం ఖాయం. భావనపాడుకు మహర్దశ పట్టడం ఖాయమని ఈ ప్రాంతీయులు భావిస్తున్నారు.
1982లో పోర్టు నిర్మాణానికి శ్రీకారం
భావనపాడు తీరంలో పోర్టు నిర్మాణానికి 1982లో శ్రీకారం జరిగింది. దీని నిర్మాణానికి అప్పటి గవర్నర్ కుముద్‌బెన్ జోషి సుమారు రూ. 200 కోట్లు నిధులు కేటాయించారు. వీటి నిర్మాణ బాధ్యతలను చేపట్టేందుకు నెదర్లాండ్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఆసక్తి చూపింది. అయితే సాంకేతికంగా కాస్త వెనుకబడిన రోజులు కావడం, పోర్టు నిర్మాణంలో అవాంతరాలు చోటు చేసుకోవడంతో పనులు నిలిపివేశారు. అప్పటి నుంచి సుమారు మూడు దశాబ్దాలుగా భావనపాడు పోర్టు కలగా మిగిలిపోయింది.
‘భావనపాడు’కు మహర్దశ!
Published Fri, Feb 20 2015 1:34 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
Advertisement
Advertisement