Development Plan
-
బహదూర్‌పురా ఫ్లై ఓవర్ ప్రారంభం.. జూపార్కు టూరిస్టులకు ఇక సాఫీ ప్రయాణం
సాక్షి, సిటీబ్యూరో: నగరం కోర్‌సిటీ వైపు నుంచి శంషాబాద్ విమానాశ్రయం, మహబూబ్‌నగర్ జిల్లా వైపు (పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా కాకుండా) రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ చిక్కుల నుంచి ఉపశమనం కలిగించేలా పాతబస్తీలో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ను మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారకరామారావు.. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి మంగళవారం ప్రారంభించారు. బహదూర్‌పురా జంక్షన్ వద్ద నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌తో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారికి, జూపార్కు సందర్శించే టూరిస్టులకు సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీన్ని నిర్మించారు. ఫ్లై ఓవర్‌తోపాటు మీరాలం ట్యాంక్ వద్ద మ్యూజికల్ ఫౌంటెన్, ముర్గీచౌక్, మీరాలంమండి, సర్దార్ మహల్ ఆధునికీకరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీటితోపాటు కార్వాన్ నియోజకవర్గంలో మూడు ప్రాంతాల్లో రూ.297 కోట్ల విలువైన సివరేజి పనులకు, కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల అంచనా వ్యయం దాదాపు రూ. 500 కోట్లు. బహదూర్‌పురా ఫ్లై ఓవర్ నిర్మాణ వ్యయం: రూ. 69 కోట్లు పొడవు: 690 మీటర్లు వెడల్పు: 24 మీటర్లు క్యారేజ్‌వే: రెండు వైపులా(ఒక్కోవైపు 3లేన్లు) ► ప్రాజెక్టులో భాగంగా జరిపిన భూసేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ తదితరాలు కలిపితే మొత్తం వ్యయం రూ.108 కోట్లు. ► ట్రాఫిక్ చిక్కులు తప్పడంతోపాటు ప్రయాణ సమయం, వాహన.. ధ్వని కాలుష్యం, ఇంధనం, వాహన నిర్వహణ వ్యయం వంటివి తగ్గుతాయి. ► ఫ్లై ఓవర్ కింద పచ్చదనం ప్రజలకు ఆహ్లాదం కలిగించనుంది. ► క్రాష్‌బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్ తదితర పనులకు ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగించినట్లు, పాతబస్తీలో ఈ టెక్నాలజీ వాడటం దీనితోనే ప్రారంభించినట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ దత్తుపంత్ తెలిపారు. పాతబస్తీలో పనులు.. కొన్ని ప్రాంతాల్లోనే అభివృద్ధి పనులు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పాత బస్తీలోనూ పలు పనులు చేపట్టారు. పాతబస్తీ వైపు ప్రయాణించే వారికి ఇప్పటికే ఏపీజీ అబ్దుల్‌కలాం ఫ్లై ఓవర్, బైరామల్‌గూడ ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రావడం తెలిసిందే. కొత్తగా చేపట్టినవి.. ముర్గీచౌక్ (మహబూబ్‌చౌక్) ఆధునికీకరణ వ్యయం : రూ. 36 కోట్లు. మాంసం మార్కెట్‌గా పేరుగాంచిన ముర్గీచౌక్ కాంప్లెక్స్‌ను సంప్రదాయ డిజైన్‌ను మార్చకుండా అదనపు అంతస్తుతో ఆధునికీకరించనున్నారు. ప్లాజా ఎంట్రెన్స్ వరకు లైటింగ్, బెంచీలు, పచ్చదనం వంటివాటితో నవీకరించనున్నారు. ప్రదేశం చరిత్రను కాపాడుతూనే నగరీకరణకు అనుగుణంగా మార్చనున్నారు. మీరాలం మండి.. వ్యయం: రూ.21.90 కోట్లు అతి పెద్ద, పురాతన మీరాలం మండిని విక్రేతలకు తగిన ప్లాట్‌ఫారాలు, షెడ్లు, అంతర్గత రోడ్లు, నడక దారులు వంటి వాటితోపాటు ప్రస్తుత అవసరాలకనుగుణంగా ఆధునికీకరించనున్నారు. ఈ మార్కెట్లో 43 హోల్సేల్దుకాణాలతోపాటు దాదాపు 300 మంది విక్రేతలు ఇక్కడ వ్యాపారం సాగిస్తున్నారు. సర్దార్‌మహల్.. వ్యయం : రూ. 30 కోట్లు వారసత్వ భవనమైన సర్దార్‌మహల్‌ను 1900 సంవత్సరంలో నిర్మించారు. శిథిలావస్థకు చేరడంతో పునరుద్ధరణ, ఆధునికీకరణలతో పాటు సాంస్కృతిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. మీరాలంట్యాంక్ మ్యూజికల్ ఫౌంటెన్.. వ్యయం: రూ. 2.55 కోట్లు జూపార్కు సందర్శకులకు మరో ఆకర్షణగా దగ్గర్లోనే ఉన్న మీరాలంట్యాంక్ వద్ద వినియోగంలోకి రానున్న మల్టీ మీడియా మ్యూజికల్ ఫౌంటెన్ ప్రత్యేక రంగుల లైటింగ్, మ్యూజిక్లతో పర్యాటకులను ఆకట్టుకోనుంది. ప్రతిరోజు సాయంత్రం 15 నిమిషాల వ్యవధితో రెండు షోలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఎస్సార్డీపీతో.. జీహెచ్ఎంసీలో ఫ్లైఓవర్లు వంటి పనులకు ప్రత్యేకంగా ఎస్సార్డీపీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఎస్సార్డీపీ మొదటిదశలో చేపట్టిన 47 నుల్లో దాదాపు 30 పూర్తయినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. వాటిలో 13 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్‌లున్నాయి. మ్యూజికల్ ఫౌంటెన్.. డ్యాన్సింగ్ అదిరెన్ నగరవాసులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందజేసే అద్భుతమైన మల్టీమీడియా మ్యూజికల్ ఫౌంటెన్ మంగళవారం ప్రారంభమైంది.పాతబస్తీ వాసులతో పాటు జూపార్కు సందర్శనకు వచ్చే పర్యాటకులకు దీంతో ఎంతగానో ఆహ్లాదం కలగనుంది. ఈ ఫౌంటెన్ ఒక వినూత్నమైన అనుభవాన్ని అందజేయనుంది. రంగు రంగుల హరివిల్లులతో మ్యూజికల్ ఫౌంటెన్ ఒకేసారి సంగీతాన్ని, డ్యాన్సింగ్ ఎఫెక్ట్‌ను కూడా ప్రదర్శిస్తుంది. ఈ మొత్తం వ్యవస్థ ఆధునిక సాంకేతికత, సంగీతాలను మేళవించుకొని పని చేసేవిధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. -
‘ఏపీలో అమరావతి కూడా అంతర్భాగమే’
సాక్షి, అమరావతి: అన్ని ప్రాంతాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతం రాష్ట్రంలో అంతర్భాగమని అన్నారు. అమరావతి మెట్రోపాటిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ(ఏఎంఆర్డీఏ)పై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమీక్షించారని తెలిపారు. అమరావతిలో పెండింగ్ పనులుపై దృష్టి పెట్టాలని, తక్షణం పనులు ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అభివృద్ది చేయాలని గతంలో నిర్ణయించామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేస్తామని, వాటి వినియోగానికి తమ దగ్గర సమగ్రమైన ప్రణాళిక ఉందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతులకు తిరిగి ప్లాట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందటం చంద్రబాబుకి ఇష్టంలేదని, ఓటమి చెందినప్పటి నుంచి ఆయన బాధ్యత విస్మరించారని మండిపడ్డారు. బాబు బాధ్యతను కూడా తాము తీసుకున్నామని తెలిపారు. (ఏఎంఆర్‌డీఏపై సీఎం జగన్ సమీక్ష) సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించాకే విశాఖపట్నంలో శంఖుస్థాపన చేయాలని భావించామని బొత్స పేర్కొన్నారు. టీడీపీ లాంటి కొన్ని దుష్టశక్తులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు కోర్టు ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. శంఖుస్థాపన కార్యక్రమం ఎట్టిపరిస్థితుల్లో ఆగదని స్పష్టం చేశారు. శంకుస్థాపనకు ప్రధానమంత్రిని, దేశంలోని పెద్దలను అందరినీ పిలుస్తామని తెలిపారు. శుభకార్యాలు అందరికీ చెప్పి చేయడం హిందూ సాంప్రదాయమని గుర్తుచేశారు. అమరావతి నిర్మాణంలో ఉన్న భవనాలు అన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. వాటిని ఏం చేయాలి, ఎందుకు వినియోగించాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంమని రైతులకు, రియల్టర్లు గమనించాలని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి తమ బాధ్యత అని, ప్రభుత్వం అమరావతికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తుందని తెలిపారు. లేనిపోని అనుమానాలు పెట్టికోవద్దని, ప్రతిపక్షం మాటలు ఏమాత్రం నమ్మ వద్దని తెలిపారు. -
‘అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం’
-
‘భావనపాడు’కు మహర్దశ!
• రూ. 2 వేల కోట్లతో అభివృద్ధి ప్రణాళిక • ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్,జార్ఖండ్ ప్రాంతాలకు భారీ కార్గోకు అనుకూలం • సొంతంగా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వంతో సంప్రదింపులు • భావనపాడు తీరంలో పర్యటించిన విశాఖ పోర్టు బృందం • పనులు దక్కించుకోవడానికి విశాఖ పోర్టుట్రస్టు యత్నం ! టెక్కలి : రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాలతో కూడిన అవశేషాంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర ప్రాంతం కీలకంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో వాణిజ్య వ్యాపారాలకు రోడ్డు, విమాన, జల మార్గాలకు అనుకూలంగా ఉన్న విశాఖపట్టణం పోర్టు ప్రస్తుతం కీలకంగా మారింది. ఇదే పరిస్థితిలో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీగా పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రా- ఒడిశా ప్రాంతాలతో పాటు చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల వ్యాపారాలకు అనుకూలంగా ఉన్న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు తీర ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. గత ప్రభుత్వాలు ఇక్కడ పోర్టు నిర్మాణానికి ప్రయత్నించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం 13 జిల్లాలతో కూడిన రాష్ట్రంలో భావనపాడు తీరం కీలకమైంది. ఇక్కడ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. దీంతో వీటి నిర్మాణ ప్రాజెక్టును దక్కించుకోవడానికి విశాఖ పోర్టు ట్రస్టు గురి పెట్టింది. ఇందులో భాగంగా పోర్టుకు చెందిన బృందం సభ్యులు జిల్లా అధికారులతో కలిసి గురువారం భావనపాడు తీరంలో పర్యటించారు. పోర్టు నిర్మాణానికి అనుకూలమైన సుమారు రెండు వేల ఎకరాల కోసం అన్వేషణ చేపట్టారు. ఇందులో భాగంగా పోర్టుకు అవసరమైన స్థలం సర్వేకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవుతోంది. భవిష్యత్ కార్గో దృష్టితో.. తూర్పు తీరంలో ఉత్తరాంధ్రకు ఆనుకుని ప్రస్తుతం విశాఖ పోర్టు మాత్రమే జలమార్గంలో వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంది. ఆ తరువాత శ్రీకాకుళం జిల్లా నుంచి ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లకు జల మార్గంలో తక్కువ దూరం కలిగిన పోర్టు మరోకటి లేదు. దీంతో భవిష్యత్‌లో పవర్ప్లాంట్లు, ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు భావనపాడు పోర్టు కీలకం కానుంది. ఇప్పటికే జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల్లో భారీగా విద్యుత్ ప్లాంట్లు, ముడి ఖనిజం, ఉక్కు కంపెనీలకు సంబంధించి పరిశ్రమలు ఏర్పాటయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే భావనపాడు సమీపంలోని కాకరాపల్లి ప్రాంతంలో ఈస్ట్‌కోస్ట్ ఎనర్జీ పవర్‌ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. వీటితో పాటు సమీపంలోని టెక్కలి ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాత గాంచిన గ్రానైట్ పరిశ్రమలు మెండుగా ఉన్నాయి. దీంతో భావనపాడు ప్రాంతంలో భారీగా కార్గో(భారీ లగేజీ రవాణా షిప్)లకు ఈ ప్రాంతం అనుకూలం. ఈ ప్రాజెక్టు నిర్మాణం అనుమతులు దక్కించుకోవడం లాభదాయకంగా ఉంటుందని విశాఖ పోర్టు భావిస్తోంది. కారిడార్ తోడైతే మరిన్ని పరిశ్రమలు రాష్ట్ర పునర్విభజన ఒప్పందంలో భాగంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తే, విశాఖ నుంచి చెన్నై వరకు కారిడార్ వెలిసే అవకాశాలున్నాయి. దీంతో తూర్పు తీర ప్రాంతంలోని భావనపాడు పోర్టులో ఊహించని విధంగా కార్గో ఏర్పడే అవకాశం ఉంటుందని విశాఖ పోర్టు ట్రస్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో సుమారు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఓడ రేవును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. దీనికోసం పోర్టు ట్రస్టు అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగితే భావనపాడు తీరంలో విశాఖ పోర్టు ట్రస్టు ఆధ్వర్యంలో పోర్టు నిర్మాణం చేపట్టడం ఖాయం. భావనపాడుకు మహర్దశ పట్టడం ఖాయమని ఈ ప్రాంతీయులు భావిస్తున్నారు. 1982లో పోర్టు నిర్మాణానికి శ్రీకారం భావనపాడు తీరంలో పోర్టు నిర్మాణానికి 1982లో శ్రీకారం జరిగింది. దీని నిర్మాణానికి అప్పటి గవర్నర్ కుముద్‌బెన్ జోషి సుమారు రూ. 200 కోట్లు నిధులు కేటాయించారు. వీటి నిర్మాణ బాధ్యతలను చేపట్టేందుకు నెదర్లాండ్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఆసక్తి చూపింది. అయితే సాంకేతికంగా కాస్త వెనుకబడిన రోజులు కావడం, పోర్టు నిర్మాణంలో అవాంతరాలు చోటు చేసుకోవడంతో పనులు నిలిపివేశారు. అప్పటి నుంచి సుమారు మూడు దశాబ్దాలుగా భావనపాడు పోర్టు కలగా మిగిలిపోయింది. -
గడువు ముగిసింది... ప్రణాళిక కాలేదు!
సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు నిన్నటితో పూర్తి ఇంకా సిద్ధంకాని నగర అభివృద్ధి ప్రణాళిక అధ్వానంగా రోడ్లు, భవనాల శాఖ తీరు మురికివాడల అభివృద్ధిపైనా ఇదే వైనం కలెక్టర్ వాకాటి కరుణ.. వేగం పెంచాల్సిందే..! ‘వరంగల్ అభివృద్ధిపై నాకు స్పష్టమైన విజన్ ఉంది. ఎనిమిది రోజుల్లో మళ్లీ జిల్లాకు వస్తా. నేను వచ్చేలోపు నగర సమగ్ర అభివృద్ధి నివేదికలు సిద్ధం చేయాలి..’ వరంగల్ పర్యటన ముగింపు సందర్భంగా జనవరి 11న విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవీ. అదే రోజు మురికివాడల్లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పది రోజుల్లో మళ్లీ వస్తానని అన్నారు. గడువు ముగిసినా.. ఎనిమిది, పది రోజుల విషయం ఎలా ఉన్నా.. సీఎం కేసీఆర్ చెప్పిన గడువు ముగిసింది. జిల్లా అభివృద్ధికి, ముఖ్యంగా నగర అభివృద్ధి ప్రణాళికలు పూర్తికాలేదు. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిన అంశాల విషయంలో ఇప్పటికీ ఆయా శాఖ అధికారుల నుంచి స్పందన లేదు. ప్రణాళికల రూపకల్పన ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్.. వరంగల్ పర్యటనలో ఇచ్చినా ఆదేశాలు, ప్రణాళిక రూపకల్పనలో తాజా పరిస్థితిపై కథనం.. సీఎం కేసీఆర్ చెప్పిన అంశం : తెలంగాలో హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో పెద్ద నగరం. భవిష్యత్‌లో వరంగల్ జనాభా 20 లక్షలకు చేరుకుంటుంది. దీనికి తగినట్లుగా నగరంలో పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, మార్కెట్ సౌకర్యాలు కల్పించాలి. వీటి నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించాలని అధికార యంత్రాంగానికి ఆదే శాలు జారీ చేశా. మళ్లీ పర్యటనకు వచ్చేలోపు ప్రజాపతినిధులు, అధికారులు నగర అభివృద్ధి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. ప్రస్తుత పరిస్థితి : ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులు గుర్తించారు. స్పష్టంగా విస్తీర్ణం ఎంత ఉందనే తుది లెక్కలు తేలలేదు. అంచనాల ప్రకారం రూ. 2వేల కోట్ల విలువైన భూములు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని ఎలా వినియోగించాలనే ప్రణాళిక సిద్ధం కాలేదు. సీఎం కేసీఆర్ చెప్పిన అంశం : సూరత్, భీవండిలలోని టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో అధిక మంది జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఇటీవల ఎంపీ, ఎమ్మెల్యే బృందం పర్యటించినప్పుడు వారు వరంగల్‌లో పరిశ్రమ నెలకొల్పితే తిరిగి జిల్లాకు వస్తామన్నారు. దీనికి తోడు దేశంలో ప్రముఖ ప్రాంతాలను కలిపే విధంగా వరంగల్‌లో రైల్వే జంక్షన్ ఉంది. సహజ వనరులు, స్కిల్డ్ కార్మికులను ఉపయోగించుకుని సూరత్, తిర్పూర్, సోలాపూర్లలో ఉన్న అన్ని సౌకర్యాలు, ఉత్పత్తులు ఒకే దగ్గర లభించేలా వరంగల్‌లో టెక్స్టైల్ పార్కును నెలకొల్పుతాం. దీనికి అనుగుణంగా యార్న్డిపోలు, టౌన్‌షిప్‌లు నిర్మిస్తాం. వీటితోపాటు కొన్ని ఐటీ పరిశ్రమలు వరంగల్‌కు రప్పిస్తాం. ప్రస్తుత పరిస్థితి : టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ఇతర అధికారుల బృందం ఇప్పటికే సూరత్‌కు వెళ్లి వచ్చింది. బుధవారం నుంచి తమిళనాడులోని తిర్పూరులో పర్యటిస్తోంది. ఈ నెలాఖరులోపు సోలాపూర్‌కు వెళ్లనుంది. టెక్స్టైల్ పార్కు ఏర్పాటు కోసం కచ్చితంగా అవసరమయ్యే భూమి విస్తీర్ణం ఎంత? పార్క్ ఎర్పాటు ఎలా ఉండాలే అంశాలు పూర్తి అధ్యయనం తర్వాత స్పష్టం కానుంది. టెక్స్టైల్ పార్క్ కోసం ఒకేచోట 1000 ఎకరాలు తగ్గకుండా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ దిశగా అధికారులు సమాచారం సేకరించడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన అంశం : వరంగల్ నగరం ఒకప్పుడు సిటీ ఆఫ్ చైర్. కాకతీయులు పాలించిన కాలంలో ఈ నగరం సకల సౌకర్యాలు, కళాకారులతో వర్థిల్లింది. అదే స్థాయిలో వరంగల్‌ను అభివృద్ధి చేయాలి. వరంగల్‌లో ఉన్న ప్రధాన రహదారిని విస్తరించాలి. మొత్తం 20 కిలోమీటర్ల దారిలో 15 కిలోమీటర్ల వరకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. లేని చోట్ల ప్రజలను ఒప్పించి తక్కువ నష్టంతో 150 అడుగులకు విస్తరణ చేయాలి. ప్రధాన రహదారి ఒక్కటే బాగుంది. మిగిలిన దారులు అంత గొప్పగా లేవు. సర్క్యుట్ గెస్ట్‌హౌస్ రోడ్డు, రెవెన్యూ కాలనీ రోడ్లు, హంటర్ రోడ్డు, వడ్డేపల్లి-పెద్దమ్మగడ్డ రోడ్లను 150 అడుగులకు విస్తరించాలి. ప్రతీ దారిలో సైకిల్ బే, బస్బే, ఫుట్‌పాత్‌లు ఉంటాయి. స్టాఫ్ ఫ్రీ, సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు వచ్చేలా ఫ్లై ఓవర్లు నిర్మించాలనే ప్రణాళికలో ఉన్నాం. దీనికి అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితి : కడిపికొండ-ఉర్సుగుట్ట, హంటర్‌రోడ్-నాయుడు పెట్రోల్‌పంపు, కాజీపేట-పెద్దమ్మగడ్డ, రాంపూర్-ములుగురోడ్డు, ములుగురోడ్డు-ధర్మారం, హసన్‌పర్తి-పెట్రోల్‌పంప్ రోడ్ల సర్వే పూర్తయ్యింది. ఈ రోడ్లను 150 ఫీట్లు, 100 ఫీట్ల వెడల్పుతో అభివృద్ధి చేసేందుకు వేర్వేరుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భూసేకరణ, ఎంత మేరకు నిధులు అవసరమువుతాయనేది ఇంకా తేల్చలేదు. సీఎం కేసీఆర్ చెప్పిన అంశం : మురికివాడల లేని నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతాం. అందులో భాగంగా రూ.400 కోట్లతో జీ ప్లస్ వన్‌తో 3,954 ఇళ్లు నిర్మిస్తున్నాం. వీటికి ముందుగా రూ.100 కోట్లు విడుదల చేస్తాం. నాలుగైదు నెలల్లో జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లు నిర్మించి ఇస్తాం. దీనికై ఫ్రీ కాస్ట్ టెక్నాలజీని పరిశీలిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి : అధికారుల తీరుతో ఈ అంశంపై ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. మొదట్లో పేదల నుంచి ఉన్నంత వ్యతిరేకత ఇప్పడు కనిపించడం లేదు. వన్ ప్లస్ వన్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రెండు రకాల ప్లాన్లు సిద్ధం చేశారు. రెండు రోజల్లో ఒక నమూనాను ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల సంఖ్య కచ్చితంగా ఎంత ఉంటుందనే విషయం తేల్చేందుకు ఏర్పాటు చేసిన తొమ్మిది బృందాలు గురువారం నుంచి పని మొదలుపెడుతున్నాయి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి చేపట్టిన తర్వాత నాలుగు సార్లు వరంగల్‌లో పర్యటించారు. అప్పటి కలెక్టర్ జి.కిషన్, జేసీ పౌసుమిబసు, వరంగల్ కార్పొరేషన్ కమిషనరు సువర్ణపండా దాస్‌ల పనితీరుపై అసంతృప్తితో వీరిని మార్చారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ కరుణ, జాయింట్ కలెక్టర్ పాటిల్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌లు ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు. ప్రణాళిక రూపకల్పనతో సంబంధం ఉన్న శాఖల జిల్లా అధికారుల నుంచి మాత్రం వీరికి ఎలాంటి సహకారం అందడం లేదు. ఈ శాఖల అధికారులు, సిబ్బంది గతంలో ఉన్న నిర్లక్ష్య వైఖరినే ఇంకా కొనసాగిస్తున్నారు. వీరి తీరు మార్చితేగానీ ప్రణాళిక తయారీ పరిస్థితి ముగిసే అవకాశం కనిపించడంలేదు. ఉన్నతాధికారులు ఏం చేస్తారో చూడాలి మరి !