గడువు ముగిసింది... ప్రణాళిక కాలేదు! | Yesterday the expiration of the full-Chief KCR | Sakshi
Sakshi News home page

గడువు ముగిసింది... ప్రణాళిక కాలేదు!

Published Thu, Jan 22 2015 1:01 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM

గడువు ముగిసింది... ప్రణాళిక కాలేదు! - Sakshi

గడువు ముగిసింది... ప్రణాళిక కాలేదు!

సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు నిన్నటితో పూర్తి   ఇంకా సిద్ధంకాని నగర అభివృద్ధి ప్రణాళిక అధ్వానంగా రోడ్లు, భవనాల శాఖ తీరు   మురికివాడల అభివృద్ధిపైనా ఇదే వైనం కలెక్టర్ వాకాటి కరుణ.. వేగం పెంచాల్సిందే..!
 
‘వరంగల్ అభివృద్ధిపై నాకు స్పష్టమైన విజన్  ఉంది. ఎనిమిది రోజుల్లో మళ్లీ జిల్లాకు వస్తా. నేను వచ్చేలోపు నగర సమగ్ర అభివృద్ధి నివేదికలు సిద్ధం చేయాలి..’ వరంగల్ పర్యటన ముగింపు సందర్భంగా జనవరి 11న విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవీ. అదే రోజు మురికివాడల్లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పది రోజుల్లో మళ్లీ వస్తానని అన్నారు.
 
గడువు ముగిసినా..
 
ఎనిమిది, పది రోజుల విషయం ఎలా ఉన్నా.. సీఎం కేసీఆర్ చెప్పిన గడువు ముగిసింది. జిల్లా అభివృద్ధికి, ముఖ్యంగా నగర అభివృద్ధి ప్రణాళికలు పూర్తికాలేదు. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిన అంశాల విషయంలో ఇప్పటికీ ఆయా శాఖ అధికారుల  నుంచి స్పందన లేదు. ప్రణాళికల రూపకల్పన ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్.. వరంగల్ పర్యటనలో ఇచ్చినా ఆదేశాలు, ప్రణాళిక రూపకల్పనలో తాజా పరిస్థితిపై కథనం..

సీఎం కేసీఆర్ చెప్పిన అంశం : తెలంగాలో హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో పెద్ద నగరం. భవిష్యత్‌లో వరంగల్ జనాభా 20 లక్షలకు చేరుకుంటుంది. దీనికి తగినట్లుగా నగరంలో పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, మార్కెట్ సౌకర్యాలు కల్పించాలి. వీటి నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించాలని అధికార యంత్రాంగానికి ఆదే శాలు జారీ చేశా. మళ్లీ పర్యటనకు వచ్చేలోపు ప్రజాపతినిధులు, అధికారులు నగర అభివృద్ధి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి.

ప్రస్తుత పరిస్థితి : ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో  అధికారులు గుర్తించారు. స్పష్టంగా విస్తీర్ణం ఎంత ఉందనే తుది లెక్కలు తేలలేదు. అంచనాల ప్రకారం రూ. 2వేల కోట్ల విలువైన భూములు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని ఎలా వినియోగించాలనే ప్రణాళిక సిద్ధం కాలేదు.

సీఎం కేసీఆర్ చెప్పిన అంశం : సూరత్, భీవండిలలోని టెక్స్‌టైల్ పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో అధిక మంది జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఇటీవల ఎంపీ, ఎమ్మెల్యే బృందం పర్యటించినప్పుడు వారు వరంగల్‌లో పరిశ్రమ నెలకొల్పితే తిరిగి జిల్లాకు వస్తామన్నారు. దీనికి తోడు దేశంలో ప్రముఖ ప్రాంతాలను కలిపే విధంగా వరంగల్‌లో రైల్వే జంక్షన్ ఉంది. సహజ వనరులు, స్కిల్డ్ కార్మికులను ఉపయోగించుకుని సూరత్, తిర్పూర్, సోలాపూర్‌లలో ఉన్న అన్ని సౌకర్యాలు, ఉత్పత్తులు ఒకే దగ్గర లభించేలా వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కును నెలకొల్పుతాం. దీనికి అనుగుణంగా యార్న్‌డిపోలు, టౌన్‌షిప్‌లు నిర్మిస్తాం. వీటితోపాటు కొన్ని ఐటీ పరిశ్రమలు వరంగల్‌కు రప్పిస్తాం.

ప్రస్తుత పరిస్థితి : టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు కోసం ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ఇతర అధికారుల బృందం ఇప్పటికే సూరత్‌కు వెళ్లి వచ్చింది. బుధవారం నుంచి తమిళనాడులోని తిర్పూరులో పర్యటిస్తోంది. ఈ నెలాఖరులోపు సోలాపూర్‌కు వెళ్లనుంది. టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు కోసం కచ్చితంగా అవసరమయ్యే భూమి విస్తీర్ణం ఎంత? పార్క్ ఎర్పాటు ఎలా ఉండాలే అంశాలు పూర్తి అధ్యయనం తర్వాత స్పష్టం కానుంది. టెక్స్‌టైల్ పార్క్ కోసం ఒకేచోట 1000 ఎకరాలు తగ్గకుండా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ దిశగా అధికారులు సమాచారం సేకరించడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

సీఎం కేసీఆర్ చెప్పిన అంశం : వరంగల్ నగరం ఒకప్పుడు సిటీ ఆఫ్ చైర్. కాకతీయులు పాలించిన కాలంలో ఈ నగరం సకల సౌకర్యాలు, కళాకారులతో వర్థిల్లింది. అదే స్థాయిలో వరంగల్‌ను అభివృద్ధి చేయాలి. వరంగల్‌లో ఉన్న ప్రధాన రహదారిని విస్తరించాలి. మొత్తం 20 కిలోమీటర్ల దారిలో 15 కిలోమీటర్ల వరకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. లేని చోట్ల ప్రజలను ఒప్పించి తక్కువ నష్టంతో 150 అడుగులకు విస్తరణ చేయాలి. ప్రధాన రహదారి ఒక్కటే బాగుంది. మిగిలిన దారులు అంత గొప్పగా లేవు. సర్క్యుట్ గెస్ట్‌హౌస్ రోడ్డు, రెవెన్యూ కాలనీ రోడ్లు, హంటర్ రోడ్డు, వడ్డేపల్లి-పెద్దమ్మగడ్డ రోడ్లను 150 అడుగులకు విస్తరించాలి. ప్రతీ దారిలో సైకిల్ బే, బస్‌బే, ఫుట్‌పాత్‌లు ఉంటాయి. స్టాఫ్ ఫ్రీ, సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు వచ్చేలా ఫ్లై ఓవర్లు నిర్మించాలనే ప్రణాళికలో ఉన్నాం. దీనికి అధికారులు చర్యలు తీసుకోవాలి.

ప్రస్తుత పరిస్థితి : కడిపికొండ-ఉర్సుగుట్ట, హంటర్‌రోడ్-నాయుడు పెట్రోల్‌పంపు, కాజీపేట-పెద్దమ్మగడ్డ, రాంపూర్-ములుగురోడ్డు, ములుగురోడ్డు-ధర్మారం, హసన్‌పర్తి-పెట్రోల్‌పంప్ రోడ్ల సర్వే పూర్తయ్యింది. ఈ రోడ్లను 150 ఫీట్లు, 100 ఫీట్ల వెడల్పుతో అభివృద్ధి చేసేందుకు వేర్వేరుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భూసేకరణ, ఎంత మేరకు నిధులు అవసరమువుతాయనేది ఇంకా తేల్చలేదు.
 సీఎం కేసీఆర్ చెప్పిన అంశం : మురికివాడల లేని నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతాం. అందులో భాగంగా రూ.400 కోట్లతో జీ ప్లస్ వన్‌తో 3,954 ఇళ్లు నిర్మిస్తున్నాం. వీటికి ముందుగా రూ.100 కోట్లు విడుదల చేస్తాం. నాలుగైదు నెలల్లో జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లు నిర్మించి ఇస్తాం. దీనికై ఫ్రీ కాస్ట్ టెక్నాలజీని పరిశీలిస్తున్నాం.

ప్రస్తుత పరిస్థితి : అధికారుల తీరుతో ఈ అంశంపై ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. మొదట్లో పేదల నుంచి ఉన్నంత వ్యతిరేకత ఇప్పడు కనిపించడం లేదు. వన్ ప్లస్ వన్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రెండు రకాల ప్లాన్‌లు సిద్ధం చేశారు. రెండు రోజల్లో ఒక నమూనాను ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల సంఖ్య కచ్చితంగా ఎంత ఉంటుందనే విషయం తేల్చేందుకు ఏర్పాటు చేసిన తొమ్మిది బృందాలు గురువారం నుంచి పని మొదలుపెడుతున్నాయి.

ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి చేపట్టిన తర్వాత నాలుగు సార్లు వరంగల్‌లో పర్యటించారు. అప్పటి కలెక్టర్ జి.కిషన్, జేసీ పౌసుమిబసు, వరంగల్ కార్పొరేషన్ కమిషనరు సువర్ణపండా దాస్‌ల పనితీరుపై అసంతృప్తితో వీరిని మార్చారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ కరుణ, జాయింట్ కలెక్టర్ పాటిల్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌లు ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు. ప్రణాళిక రూపకల్పనతో సంబంధం ఉన్న శాఖల జిల్లా అధికారుల నుంచి మాత్రం వీరికి ఎలాంటి సహకారం అందడం లేదు. ఈ శాఖల అధికారులు, సిబ్బంది గతంలో ఉన్న నిర్లక్ష్య వైఖరినే ఇంకా కొనసాగిస్తున్నారు. వీరి తీరు మార్చితేగానీ ప్రణాళిక తయారీ పరిస్థితి ముగిసే అవకాశం కనిపించడంలేదు. ఉన్నతాధికారులు ఏం చేస్తారో చూడాలి మరి !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement