సాక్షి, అమరావతి : తెలంగాణ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్‌తో పోలికే లేదని కేసీఆర్ అనడం బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో శుక్రవారం ఇక్కడ జరుగుతున్న రెండోరోజు కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం.. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉందని, అందుకు కారణం ప్రజలు కాదని, రాష్ట్ర విభజనతో వచ్చిన కష్టమని అన్నారు. తలసరి ఆదాయం ఇంకా 35వేలు పెరిగితే పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయికి రాగలమని అన్నారు. కేంద్రం సాయం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకూ ఏపీని కేంద్రం ఆదుకోవాల్సిందేనని ఆయన అన్నారు. ఈ విషయంలో అవసరం అయితే సుప్రీంకోర్టుకు వెళతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాడు యూపీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్లే ఏపీకి ఈ దుస్థితి నెలకొందని అన్నారు. ఇక రాజధాని కాబట్టే ఏపీ ప్రజలు.. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారన్నారు. తెలంగాణను ఆంధ్రా పాలకులు ధ్వంసం చేశారనడం సరికాదన్నారు. 1995కు ముందు, తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.
కాగా ‘ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్–2018’కార్యక్రమంలో నిన్న (గురువారం) తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాతో కలపకముందు కూడా ధనిక రాష్ట్రమేనని, ఏపీతో తెలంగాణను పోల్చవద్దని అన్నారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని, ఏపీకంటే చాలా విషయాల్లో ఎంతో ముందుందని, అసలు పోలికే లేదని ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment