- తెలుగు రాష్ట్రాల మధ్య ముగిసిన నీటి పంచాయితీ
- గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంల చర్చలు ఫలప్రదం
- రెండు రాష్ట్రాల్లో పంటలు కాపాడుకోవాలని నిర్ణయం
- సాగర్ నీటిని అవసరాలను బట్టి వాడుకోవడానికి అంగీకారం
- సీఎంల సూచనలతో ఇరు రాష్ట్రాల మంత్రుల సంయుక్త ప్రకటన
- డి కాలువ నుంచి నీటి విడుదల 7 వేల క్యూసెక్కులకు పెంపు
- జలవిద్యుత్ కేంద్రం నుంచి 2 వేల క్యూసెక్కులు, గేట్ల నుంచి మరో 5 వేల క్యూసెక్కులు ఏపీకి..
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ నీటి పంచాయితీ ముగిసింది. సాగర్ కుడికాలువకు కనీసం మూడు రోజుల పాటు 7 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలన్న ఆంధ్రప్రదేశ్ వినతికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించటంతో వివాదం సామరస్యంగా పరిష్కారమైంది. కుడికాల్వకు నీటి విడుదల విషయంలో నాగార్జున సాగర్ వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావు శనివారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
సాగర్ బాధ్యత కమిటీకి..
రెండు రాష్ట్రాల్లో సాగర్ ఆయకట్టు కింద ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడుకోవడానికి డ్యామ్‌లో ఉన్న నీటిని వాడుకోవాలని చంద్రబాబు, కేసీఆర్ నిర్ణయించారు. వాటాలను పక్కనబెట్టాలని, హక్కుల గురించి కాకుండా ఇరు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే భావనకు వచ్చారు. సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను ఇరు రాష్ట్రాల అధికారులతో కూడిన కమిటీకి అప్పగించాలన్న గవర్నర్ సూచనపైనా వారు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ ఇదే తరహా జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ జీవో అమలు కాలేదు. ఇక పులిచింతల ప్రాజెక్టులో 40 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు కాస్త వెసులుబాటు లభించి ఖరీఫ్ సాగు ఆలస్యం కాకుండా చూడవచ్చని భేటీలో చంద్రబాబు పేర్కొన్నారు. పులిచింతల పునరావాస కార్యక్రమాలను నల్లగొండ జిల్లాలో వేగవంతం చేయాలని ఆయన కోరగా... కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు నల్లగొండ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.
గంటపాటు భేటీ..
తొలుత ఇద్దరు సీఎంలతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు దేవినేని ఉమా, హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, సీఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు ఆదిత్యనాథ్‌దాస్, ఎస్‌కే జోషి, ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావు తదితరులు రాజ్‌భవన్‌కు వచ్చారు. అంతకుముందే మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు గవర్నర్‌ను విడిగా కలసి సాగర్ వివాదానికి సంబంధించిన లెక్కలను, సమస్య పరిష్కారానికి రూపొందించిన మార్గాలను వివరించారు. ఆ తర్వాత గవర్నర్ సమక్షంలో కేసీఆర్, చంద్రబాబు దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. కొద్దిసేపటి తరువాత ఇరు రాష్ట్రాల మంత్రులు దేవినేని ఉమా, హరీశ్‌రావును సమావేశం జరుగుతున్న గదిలోకి పిలిచి... తాము తీసుకున్న నిర్ణయాలను సీఎంలు వివరించారు. ఇరు రాష్ట్రాల్లో పంటలను కాపాడుకునేందుకు సాగర్ నీటిని అవసరమైన మేరకు వాడుకునేలా అంగీకారం కుదిరిందని, వివాదం ముగిసిందని సంయుక్త ప్రకటన చేయాలని సూచించారు. ఈ మేరకు మంత్రులు విలేకరులతో మాట్లాడారు.
సమన్వయంతో వ్యవహరిస్తాం: దేవినేని ఉమా
‘‘ఏ ఆయకట్టుకు ఎంత నీరు అవసరమనే విషయాన్ని పరిశీలించి, నీటి విడుదలపై ఈఎన్‌సీలు నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలు సమన్వయంతో, సంయమనంతో వ్యవహరిస్తాయి. ఇద్దరు మంత్రులం, అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుకుని, రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. పంటలకు అవసరమైన మేరకు నీటి విడుదలపై వెంటనే నిర్ణయం తీసుకుంటాం.’’
పంటలు ఎండిపోవద్దనే..: హరీశ్‌రావు
‘‘ఇరు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సాగర్‌లో ఉన్న నీటిని అవసరాల మేరకు వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కుడి, ఎడమ కాలువలు, డెల్టా, ఏఎమ్మార్పీ కింద ఇప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడుకోవడానికి.. అందుబాటులో నీటిని జాగ్రత్తగా వాడుకోవాలనేదే మా లక్ష్యం. డ్యామ్‌పైకి రాజకీయ పార్టీల కార్యకర్తలు వెళ్లకుండా ఇరువైపులా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. కేవలం ఇంజనీర్లు మాత్రమే డ్యామ్ మీదకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది’’
కుడికాలువకు 7 వేల క్యూసెక్కులు..
నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మంత్రులు దేవినేని ఉమా, హరీశ్‌రావు సంయుక్త ప్రకటన చేసిన కొద్దిసేపటి తర్వాత ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు ప్రాథమికంగా చర్చలు జరిపారు. కుడికాలువకు కనీసం మూడు రోజుల పాటు 7 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలన్న ఏపీ ఈఎన్‌సీ సూచనకు అనుగుణంగా తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి నీటి విడుదలను ప్రారంభించి రాత్రికి ఐదు క్యూసెక్కులకు పెంచారు. జల విద్యుత్ కేంద్రం నుంచి ఇప్పటికే విడుదలవుతున్న రెండు వేల క్యూసెక్కులతో కలిపి ఏపీ రైతులకు మొత్తంగా ఏడు వేల క్యూసెక్కుల నీరు లభ్యం కానుంది. అయితే మూడు రోజుల తర్వాత మార్చి 15వ తేదీ వరకు రోజూ 5,500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయనున్నారు. కాగా.. శుక్రవారం సాగర్ వద్ద జరిగిన ఘటనల నేపథ్యంలో... ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని ఇరు రాష్ట్రాలు డ్యామ్‌కు ఇరువైపులా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించాయి. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఆర్డీవోలు, ఐజీ సంజీవ్, ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో 316 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని మోహరించారు. తెలంగాణ వైపు కూడా దాదాపు 600 మంది పోలీసులు మోహరించారు. అయితే చర్చలు ఫలించి కాలువలకు నీరు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.