విదేశాల్లో ఉన్న తెలుగు వారే భాష,సంప్రదాయాలను కాపాడుతున్నారు
ప్రపంచ తెలుగు సమాఖ్య మహసభల్లో సీఎం చంద్రబాబు
హైదరాబాద్: 2047నాటికి తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలవాలని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహసభల్లో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సావనీర్ , తెలుగు ఏంజిల్స్ పేరుతో స్టార్టప్ లోగోను ఆయన ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన తెలుగువారికి బిజినెస్ అవార్డులను అందించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రపంచంలోని తెలుగువారంతా భాగస్వాములు కావాలని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారికంటే విదేశాల్లో ఉన్న తెలుగు వారే భాష, సంప్రదాయాలను కాపాడుతున్నారని చెప్పారు. అమెరికాలో ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నది తెలుగువారేనని చెప్పారు. ఏ దేశం వెళ్లినా ఆ దేశంలో ఆమోదం రావాలంటే అక్కడి ప్రజలకు సేవలందించాలన్నారు.
అయినా మాతృదేశాన్ని, జన్మభూమిని, కర్మభూమిని మరిచిపోవద్దని అన్నారు. పారిశ్రామికవేత్తగా సంపాదించిన డబ్బును మరింతమందికి ఉపాధి కల్పించేందుకు ఉపయోగించాలని అన్నారు. ప్రపంచంలోనే తెలుగువారికి గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించారన్నారు. తెలుగుభాషకు వన్నె తెచ్చిన గిడుగు రామ్మూర్తిని స్మరించుకోవాలన్నారు.
పీవీ నరహింహరావు, వెంకయ్యనాయుడు , కోకా సుబ్బారావు, జస్టిస్ రమణ, నీలం సంజీవరెడ్డి, బాలయోగి వంటి తెలుగువారు ఉన్నత పదవుల్లో రాణించారన్నారు. కరణం మల్లీశ్వరీ, పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వీవీఎస్ లక్ష్మణ్, పీవి సింధు, పెండ్యాల హరికృష్ణ, వెంకటపతిరాజు వంటి ఎందరో తెలగువారు క్రీడల్లో సత్తాను చాటారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment