సాక్షి, అమరావతి: రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను గురువారం న్యాయ, ధర్మబద్ధంగానే స్వా«దీనం చేసుకున్నామని.. ఇది దండయాత్ర ఎలా అవుతుందో ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాలని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన నాటి సీఎం చంద్రబాబు నాగార్జునసాగర్‌ను తెలంగాణకు తాకట్టు పెట్టారని.. తద్వారా కోల్పోయిన రాష్ట్ర హక్కులను సీఎం వైఎస్ జగన్ సాధించారని ఆయన తెలిపారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా జలాలకు మించి ఒక్క నీటి బొట్టునూ అదనంగా వాడుకోబోమని తేల్చిచెప్పారు. ‘మా వాటా నీటిని వాడుకోవడానికి స్వేచ్ఛ సాధించాం. దీనిని తెలుగు ప్రజలంతా సమరి్థస్తారని.. స్వాగతిస్తారని భావిస్తున్నాం. తెలంగాణ ప్రజలు కూడా పంతాలకు, పట్టుదలకు వెళ్లొద్దు’.. అంటూ అంబటి విజ్ఞప్తి చేశారు. సున్నితమైన అంశంపై ఎల్లో మీడియా అవాస్తవాలు పోగేసి అచ్చేస్తున్న తప్పుడు కథనాలను నమ్మవద్దని రెండు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..
హక్కును కాపాడుకుంటే దండయాత్ర అంటారా..?
మరోవైపు.. కృష్ణా బోర్డు పరిధిని 2021, జూలై 15న కేంద్రం నిర్దేశించాక.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌ల నిర్వహణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని.. తెలంగాణ సర్కారే ఒప్పుకోలేదని గురువారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే చెప్పారు. చంద్రబాబు చేసిన తప్పును మేం సరిదిద్దితే.. సాగర్ మీదకు దండయాత్ర చేస్తున్నామని ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలు రాస్తారా? ఇదేనా మీ జర్నలిజం? మేం తెలంగాణ భూభాగంలోకి వెళ్తే అది తప్పవుతుందిగానీ మన భూభాగంలోకి మనం వెళ్తే అది తప్పెలా అవుతుంది?
తెలంగాణలో మాకు ఎలాంటి లక్ష్యాలు లేవు..
రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడే విషయంలో వైఎస్సార్‌సీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. తెలంగాణలో మాకు ఎలాంటి లక్ష్యాలు, ప్రయోజనాల్లేవు. ఒక పార్టీని గెలిపించాల్సిన అవసరంగానీ ఓడించాల్సిన అవసరం కూడా లేదు. పొరుగు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో మేం సత్సంబంధాలు కొనసాగిస్తాం.
దిగజారి మాట్లాడుతున్న పురందేశ్వరి..
సాగర్ స్పిల్ వేపైకి మన పోలీసులను పంపడం దారుణమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దిగజారి మాట్లాడుతున్నారు. ఆమె బీజేపీ అధ్యక్షురాలా? లేక టీడీపీ అధ్యక్షురాలా?
ఏపీలో టీడీపీకి సమాధే
తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకు సంబంధించిన కుల సంఘాలు, ఆ పార్టీ శ్రేణుల ప్రవర్తనవల్ల వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రజలు ఆ పార్టీని కూకటివేళ్లతో పెకళించి, సమాధి కట్టబోతున్నారు. ఇక స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును జైలుకు పంపితే.. ఒక్క పవన్ మాత్రమే వెళ్లి టీడీపీతో కలిసి పోటీచేస్తానని ప్రకటించారు. పవన్‌కళ్యాణ్ ఇంత త్యాగం చేసి తెలంగాణలో ఆయన ఎనిమిది సీట్లల్లో పోటీచేస్తే.. చంద్రబాబు సామాజికవర్గం వారు పవన్‌ను గెలిపిస్తామని ఎందుకు అనలేదు? చంద్రబాబు కోసం పనిచేస్తున్న పవన్ పిచ్చోడు అయితే అవ్వొచ్చేమోగానీ.. ఆయన సామాజికవర్గం వాళ్లు మాత్రం పిచ్చోళ్లు కాదు.
బాబు అసమర్థతవల్లే హక్కులు కోల్పోయాం..
► కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది.
► బోర్డు పరిధిని నోటిఫై చేసే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నిర్వహణ బాధ్యతను ఏపీకి, సాగర్ నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించింది. కానీ, శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తన భూభాగంలో ఉందన్న సాకుతో తెలంగాణ దానిని అ«దీనంలోకి తీసుకుని తన వాటాకు మించి అధికంగా జలాలను వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తోంది.
► అలాగే.. నాగార్జునసాగర్‌ను కూడా తెలంగాణ సర్కార్ 2014లోనే పూర్తిగా అ«దీనంలోకి తీసుకుంది.
► కానీ, అప్పటి సీఎం బాబు ఇదంతా చూస్తూ మిన్నుకుండిపోయారు. తద్వారా సాగర్‌పై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టినట్లయింది. 2015 ఫిబ్రవరి 13న చంద్రబాబు హయాంలో సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేయటానికి మన అధికారులను పంపితే.. తెలంగాణ అధికారులు అభ్యంతరం పెట్టారు. దాంతో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య పెద్ద గొడవ జరిగింది. చివరికి చంద్రబాబు గవర్నర్ దగ్గర మొరపెట్టుకుని.. తెలంగాణ సర్కార్ దయాదాక్షిణ్యాలతో నీరు విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మన నీటిని మనం విడుదల చేసుకోవాలంటే తెలంగాణ సర్కార్ అనుమతి అవసరమా?
Comments
Please login to add a commentAdd a comment