ఆరు నెలలైనా ఇళ్లు పూర్తి చేయరా?
అధికారులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం
జగదేవ్‌పూర్: డబుల్ బెడ్‌రూం ఇళ్లు ప్రారంభించి ఆరు నెలలైనా ఇంకా పూర్తి చేయకపోవడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఫాంహౌస్‌లో తన దత్తత గ్రామాలైన మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేటలో అభివృద్ధి పనులపై సుమారు మూడు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. పనుల వేగం మందగించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు నెలలైనా ఇళ్లు పూర్తి చేయరా? అని ప్రశ్నించారు. అలాగే, డ్రిప్పు ఏర్పాటు పనులు, కూడవెల్లి వాగు ఆధునికీకరణ, కుంటల అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఇప్పటికైనా అధికారులు తమ పనితీరును మార్చుకొని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
కాగా, నాలుగు రోజులుగా ఫాంహౌస్‌లో గడిపిన సీఎం 3:15 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు. సమీక్షలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి ప్రవీణ్‌రావు, కలెక్టర్ రోనాల్డ్‌రాస్, జేసీ వెంకట్రాంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఇరిగేషన్ స్పెషల్ అధికారి మల్లయ్య, ఈఈ అనంద్, డీఈ శ్రీనివాస్‌రావు, వీడీసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.