సమస్యల పరిష్కారానికి ప్రతీ సోమవారం ఏర్పాటు చేస్తున్న ప్రజావాణికి వస్తున్న బాధితులకు నిరాశే మిగులుతోంది. కేవలం అర్జీల స్వీకరణకే పరిమితం అవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోడు పట్టించుకోకపోవడంతో బాధితులు మళ్లీమళ్లీ వస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సమస్య పరిష్కారం కాక మండలాల నుంచి కలెక్టరేట్‌లో ప్రజావాణికి వచ్చే బాధితులు తిరిగి తిరిగి వేసారుతున్న దుస్థితి.
సాక్షి,కరీంనగర్‌సిటీ : కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో అధికారులు కంప్యూటర్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా.. తర్వాత సంబంధిత శాఖకు బదిలీ చేసి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో వేలల్లో వచ్చే దరఖాస్తులు జిల్లాల విభజన అనంతరం వందల్లో వస్తున్నాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 152 దరఖాస్తులు సమర్పించారు. ప్రధానంగా భూ సంబంధిత, పింఛన్లు, డబుల్ బెడ్‌రూంలు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ఆహారభద్రత కార్డులు, ఉపాధి కల్పన వంటి సమస్యలపై వచ్చిన బాధితులే మళ్లీ మళ్లీ వస్తున్న దృశ్యాలు కనిపించాయి. పెండింగ్ సమస్యలన్నీ అధికారులు పరిష్కరించినట్లే పేర్కొంటున్నారు. సమస్యల పరిష్కార దశను చూపించే లెక్కల్లోనూ క్షేత్రస్థాయికి భిన్నంగా భారీ వ్యత్యాసముంటోంది. సమస్యలు పరిష్కారానికి నోచుకోక బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి జిల్లా కేంద్రంలోని ప్రజావాణికి వస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోందంటూ బాధిత ప్రజలు వాపోతున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా తెలిపిన సమస్యలకూ పరిష్కారం దొరకడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు.
ఏం జరుగుతోంది..?
ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. కలెక్టర్, జేసీ సహా ఉన్నతాధికారులు పాల్గొంటుంటారు. మొదట ప్రత్యేక కౌంటర్లలో ప్రజావాణి దరఖాస్తులను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని శాఖల వారీగా ఉన్నతాధికారులకు చేరవేస్తారు. దరఖాస్తు నమోదైనట్లు కౌంటర్‌లో బాధితుడికి ఓ ప్రతి ఇస్తారు. అయితే.. 15 రోజుల్లోగా సమస్య పరిష్కారానికి నోచుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాలున్నా అవి అమలుకావడం లేదు. వినతులు స్వీకరించిన ఆయా శాఖల అ«ధికారులు ప్రజావాణి ద్వారా అందిన అర్జీలు, పరిష్కారం, పురోగతి తదితర వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. సరైన స్పందన లేకపోవడంతో వెబ్‌సైట్ నిర్వహణ మొక్కుబడిగా సాగుతోంది.
చాలా శాఖలు ప్రజావాణి ద్వారా సంబంధిత సమస్యలు పరిష్కారం కాబడినవి అంటూ స్పందిస్తూ బాధితులకు లేఖలు చేరుతుండడంతో అవాక్కయ్యే సంఘటనలూ కనిపిస్తున్నాయి. ప్రధానంగా భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. వాటిపైనే ఫిర్యాదులు, వినతుల సమర్పిస్తున్నా దాటవేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో దళితులు అధిక సంఖ్యలో భూమి కోసం కలెక్టరేట్‌కు తరలివచ్చి అర్జీలు పెట్టుకున్నా వాటికి మోక్షం లేకుండా పోతోంది. డబుల్‌బెడ్‌రూం మంజూరు చేస్తామని ప్రకటించగానే మధ్య, దిగువ, పేద ప్రజలు అధిక సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నా వాటిని కనీసం చూసే పరిస్థితి లేదు. ప్రతినెలా ప్రభుత్వాసుపత్రిలో సదరం క్యాంపులు నిర్వహణలోనూ వైఫల్యమవుతుండడం.. ఆసరా పింఛన్లు అందకపోవడం.. ఆసరా దరఖాస్తులు పెట్టుకున్నా 6 నెలల వరకు మోక్షం లేకపోవడంతో నిత్యకృత్యంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కార మార్గాన్ని సైతం అధికారులు అన్వేషించడం లేదన్న ఆరోపణలున్నాయి.
హాజరుపై అశ్రద్ధ..
ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులను కలుసుకోవడానికి ప్రజావాణి ఓ వేదిక. ప్రతీ సోమవారం కలెక్టర్, జేసీతో పాటు ప్రజావాణిలో జిల్లా అ«ధికారులు పాల్గొనాల్సి ఉంటుంది. గతానికి భిన్నంగా జిల్లా అధికారులు తమ ఆఫీసులోని కిందిస్థాయి సిబ్బందిని ప్రజావాణికి పంపి చేతులు దులుపుకుంటున్నారు. కలెక్టర్, జేసీలు ఏదేని అధికారిక కార్యక్రమానికి వెళ్తే జిల్లా అధికారులు ఉండడం లేదు. సమస్యలు పరిష్కారమవుతాయని గంపెడాశతో వస్తున్న బాధితులు నిరాశ చెందుతున్నారు.
అర్హతలున్నా పింఛనేదీ..?
బావి ప్రమాదంలో నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటనలో నా రెండు చేతులు విరిగిపోవడమే కాకుండా ఎడమ కాలు విరిగిపోయింది. శరీరంపై కూడా బలమైన గాయాలయ్యాయి. కూలీ పనులు కూడా చేసుకుని జీవించడానికి కష్టంగా ఉంది. నాలుగేళ్లుగా పింఛన్ కోసం తిరుగుతున్నా. అధికారులకు అర్జీలు పెట్టుకుంటున్నా కనికరించడం లేదు. అన్ని అర్హతలున్నా పింఛన్ ఇస్తలేరు. తిప్పుకుంటున్నరు.. ఇదెక్కడి న్యాయం. పింఛన్ ఇప్పించి ఆసరాగా నిలవాలని వేడుకుంటున్నా.
– ఇట్టవేన సమ్మయ్య, రెడ్డిపల్లి, వీణవంక
సర్కారును మోసం చేస్తున్నా పట్టింపులేదా..?
గ్రామంలో ఓ రైతుకు చెందిన ఎకరం నడి చెరువులో ఉంది. ఆ రైతు ఎక్‌ఫసల్ పట్టాగల భూమి అందులో ఉండగా మిషన్ కాకతీయలో భాగంగా 2 మీటర్ల మేర ఎత్తుకు లేపుతూ కాంట్రాక్టరు సదరు రైతుతో కుమ్మక్కయ్యాడు. చెరువులో మట్టిని తీసి అదే చెరువులో గల రైతు భూమిలో పోస్తున్నాడు. దీంతో చెరువులో ఆగే నీరు ఆగకుండా పోయింది. చెరువు కింద రైతులకు నీటి సామర్థ్యం పెరిగి లాభం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తే కాంట్రాక్టర్ అన్యాయం చేస్తున్నారు. కొలతలకు ఉంచిన దిమ్మల పైన మట్టి పోస్తూ పైకిలేపి ఎత్తును చూపిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. గత నెల రోజుల క్రితమే దరఖాస్తు పెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. – చెంజర్ల గ్రామస్తులు, మానకొండూర్
Comments
Please login to add a commentAdd a comment