prajavani program
-
తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభం
-
అమ్మ.. భారం కాదు బాధ్యత
సాక్షి, నిజామాబాద్: కనిపెంచిన తల్లి ఎప్పటికీ భారం కాదు. వృద్ధాప్యంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం తనయుల బాధ్యత. తన తల్లికి వృద్ధాప్య పింఛన్ అందడం లేదని ఓ కొడుకు ఆమెను భూజాలపై ఎత్తుకొని కలెక్టరేట్‌కు వచ్చాడు. కానీ సోమవారం ప్రజావాణికి లేనందున అధికారులు ఫిర్యాదులు స్వీకరించకపోవడంతో వారు నిరాశతో ఇలా వెనుతిరిగారు. కోటగిరి మండలానికి చెందిన శాంతబాయి అనే వృద్ధురాలికి గత 14 సంవత్సరాలుగా పెన్షన్ రావడం లేదు. దీంతో ఆమె కొడుకు ఎన్నో సార్లు అధికారులను కలిసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రజావాణిలో తన గోడును వెళ్లబోసుకుందామని వచ్చాడు. కానీ ప్రజావాణి రద్దుతో నిరాశ చెందారు. చదవండి: శభాష్ ఎస్సై నాగరాజు.. ఆకలి తీర్చి.. ఆరాతీసి -
అయ్యా కాల్మొక్త.. కనికరిచండి
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : అయ్యా.. నీ కాల్మొక్త.. నా భూమిని ఖబ్జా చేసిండ్రు.. అడిగితే కొడుతుండ్రు.. 30 ఏళ్ల కిందట ఎకరాకు రూ.16 వేల చొప్పున 5 ఎకరాలు భూమి కొన్నా.. నా భూమి పక్కనే ఉన్న తిమ్మారెడ్డి అనే దొర ఈ మధ్య పొలంలో ఖడీలు పాతిండు. ఇదేంటంటే కొట్టిండు.. ఊరి పెద్దమనుషులు కూడా ఆయనకే మద్దతు చెప్తున్నరు.. జర నాకు నాయం చెప్పండి.. అంటూ మహబూబ్‌నగర్ మండలం బొక్కలోనిపల్లికి చెందిన చిన్నబాలప్ప అధికారులకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులను అధికారులకు అందజేసి వేడుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు, సర్వే ల్యాండ్ ఏడీ శ్యాంసుదర్‌రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిడి ఉదయ్‌కుమార్ వినతులు స్వీకరించారు. ఎక్కువగా భూ కబ్జాలు, రైతుబంధు చెక్కు, పాస్‌బుక్కులు, హాస్టళ్లలో పిల్లలకు సీట్లు ఇప్పించాలని, పెన్షన్లు, ట్రైసైకిళ్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 66 దరఖాస్తులు అందించగా హెల్ప్‌డెస్క్ ద్వారా ఉచితంగా సేవలందించారు. ఉన్నతాధికారులు వచ్చిన వినతులను శాఖల వారీగా విభజించి పరిష్కరించాలని ఆయా శాఖల మండల అధికా రులను ఆదేశించారు. పాస్‌బుక్కులు, చెక్కులు రాలె భూప్రక్షాళన సర్వే చేసి ఆర్వోఆర్ 1బి ఇచ్చారు. రైతుబంధు పథకంలో అందరికిలాగే మాకు కూడా పాస్‌పుస్తకాలు, చెక్కులు వస్తాయని అనుకున్నాం. కానీ ఇంతవరకు రాలేదు. ఎందుకని అడిగితే సరిగ్గా సమాధానం చెప్తలేరు. సర్వే నెం.67లో మొత్తం 14.10 ఎకరాల భూమికి సంబంధించి రైతుబంధు పథకం పట్టాదారు పాస్‌పుస్తకాలు, చెక్కులు ఇప్పించాలని కోరుతూ మహబూబ్‌నగర్ మండలం వెంకటాపూర్ గ్రామ పరిధిలోని అవతలిగడ్డతాండకు చెందిన కె.చంద్రు నాయక్ తన కుటుంబ సభ్యులతో వచ్చి గోడును చెప్పుకున్నాడు. -
పేపర్‌కే.. పరిమితం..!!
సమస్యల పరిష్కారానికి ప్రతీ సోమవారం ఏర్పాటు చేస్తున్న ప్రజావాణికి వస్తున్న బాధితులకు నిరాశే మిగులుతోంది. కేవలం అర్జీల స్వీకరణకే పరిమితం అవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోడు పట్టించుకోకపోవడంతో బాధితులు మళ్లీమళ్లీ వస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సమస్య పరిష్కారం కాక మండలాల నుంచి కలెక్టరేట్లో ప్రజావాణికి వచ్చే బాధితులు తిరిగి తిరిగి వేసారుతున్న దుస్థితి. సాక్షి,కరీంనగర్‌సిటీ : కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో అధికారులు కంప్యూటర్లో దరఖాస్తులు నమోదు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా.. తర్వాత సంబంధిత శాఖకు బదిలీ చేసి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో వేలల్లో వచ్చే దరఖాస్తులు జిల్లాల విభజన అనంతరం వందల్లో వస్తున్నాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 152 దరఖాస్తులు సమర్పించారు. ప్రధానంగా భూ సంబంధిత, పింఛన్లు, డబుల్ బెడ్రూంలు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ఆహారభద్రత కార్డులు, ఉపాధి కల్పన వంటి సమస్యలపై వచ్చిన బాధితులే మళ్లీ మళ్లీ వస్తున్న దృశ్యాలు కనిపించాయి. పెండింగ్ సమస్యలన్నీ అధికారులు పరిష్కరించినట్లే పేర్కొంటున్నారు. సమస్యల పరిష్కార దశను చూపించే లెక్కల్లోనూ క్షేత్రస్థాయికి భిన్నంగా భారీ వ్యత్యాసముంటోంది. సమస్యలు పరిష్కారానికి నోచుకోక బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి జిల్లా కేంద్రంలోని ప్రజావాణికి వస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోందంటూ బాధిత ప్రజలు వాపోతున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా తెలిపిన సమస్యలకూ పరిష్కారం దొరకడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. ఏం జరుగుతోంది..? ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. కలెక్టర్, జేసీ సహా ఉన్నతాధికారులు పాల్గొంటుంటారు. మొదట ప్రత్యేక కౌంటర్లలో ప్రజావాణి దరఖాస్తులను వెబ్సైట్లో నమోదు చేసుకుని శాఖల వారీగా ఉన్నతాధికారులకు చేరవేస్తారు. దరఖాస్తు నమోదైనట్లు కౌంటర్లో బాధితుడికి ఓ ప్రతి ఇస్తారు. అయితే.. 15 రోజుల్లోగా సమస్య పరిష్కారానికి నోచుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాలున్నా అవి అమలుకావడం లేదు. వినతులు స్వీకరించిన ఆయా శాఖల అ«ధికారులు ప్రజావాణి ద్వారా అందిన అర్జీలు, పరిష్కారం, పురోగతి తదితర వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సరైన స్పందన లేకపోవడంతో వెబ్సైట్ నిర్వహణ మొక్కుబడిగా సాగుతోంది. చాలా శాఖలు ప్రజావాణి ద్వారా సంబంధిత సమస్యలు పరిష్కారం కాబడినవి అంటూ స్పందిస్తూ బాధితులకు లేఖలు చేరుతుండడంతో అవాక్కయ్యే సంఘటనలూ కనిపిస్తున్నాయి. ప్రధానంగా భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. వాటిపైనే ఫిర్యాదులు, వినతుల సమర్పిస్తున్నా దాటవేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో దళితులు అధిక సంఖ్యలో భూమి కోసం కలెక్టరేట్‌కు తరలివచ్చి అర్జీలు పెట్టుకున్నా వాటికి మోక్షం లేకుండా పోతోంది. డబుల్బెడ్రూం మంజూరు చేస్తామని ప్రకటించగానే మధ్య, దిగువ, పేద ప్రజలు అధిక సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నా వాటిని కనీసం చూసే పరిస్థితి లేదు. ప్రతినెలా ప్రభుత్వాసుపత్రిలో సదరం క్యాంపులు నిర్వహణలోనూ వైఫల్యమవుతుండడం.. ఆసరా పింఛన్లు అందకపోవడం.. ఆసరా దరఖాస్తులు పెట్టుకున్నా 6 నెలల వరకు మోక్షం లేకపోవడంతో నిత్యకృత్యంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కార మార్గాన్ని సైతం అధికారులు అన్వేషించడం లేదన్న ఆరోపణలున్నాయి. హాజరుపై అశ్రద్ధ.. ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులను కలుసుకోవడానికి ప్రజావాణి ఓ వేదిక. ప్రతీ సోమవారం కలెక్టర్, జేసీతో పాటు ప్రజావాణిలో జిల్లా అ«ధికారులు పాల్గొనాల్సి ఉంటుంది. గతానికి భిన్నంగా జిల్లా అధికారులు తమ ఆఫీసులోని కిందిస్థాయి సిబ్బందిని ప్రజావాణికి పంపి చేతులు దులుపుకుంటున్నారు. కలెక్టర్, జేసీలు ఏదేని అధికారిక కార్యక్రమానికి వెళ్తే జిల్లా అధికారులు ఉండడం లేదు. సమస్యలు పరిష్కారమవుతాయని గంపెడాశతో వస్తున్న బాధితులు నిరాశ చెందుతున్నారు. అర్హతలున్నా పింఛనేదీ..? బావి ప్రమాదంలో నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటనలో నా రెండు చేతులు విరిగిపోవడమే కాకుండా ఎడమ కాలు విరిగిపోయింది. శరీరంపై కూడా బలమైన గాయాలయ్యాయి. కూలీ పనులు కూడా చేసుకుని జీవించడానికి కష్టంగా ఉంది. నాలుగేళ్లుగా పింఛన్ కోసం తిరుగుతున్నా. అధికారులకు అర్జీలు పెట్టుకుంటున్నా కనికరించడం లేదు. అన్ని అర్హతలున్నా పింఛన్ ఇస్తలేరు. తిప్పుకుంటున్నరు.. ఇదెక్కడి న్యాయం. పింఛన్ ఇప్పించి ఆసరాగా నిలవాలని వేడుకుంటున్నా. – ఇట్టవేన సమ్మయ్య, రెడ్డిపల్లి, వీణవంక సర్కారును మోసం చేస్తున్నా పట్టింపులేదా..? గ్రామంలో ఓ రైతుకు చెందిన ఎకరం నడి చెరువులో ఉంది. ఆ రైతు ఎక్ఫసల్ పట్టాగల భూమి అందులో ఉండగా మిషన్ కాకతీయలో భాగంగా 2 మీటర్ల మేర ఎత్తుకు లేపుతూ కాంట్రాక్టరు సదరు రైతుతో కుమ్మక్కయ్యాడు. చెరువులో మట్టిని తీసి అదే చెరువులో గల రైతు భూమిలో పోస్తున్నాడు. దీంతో చెరువులో ఆగే నీరు ఆగకుండా పోయింది. చెరువు కింద రైతులకు నీటి సామర్థ్యం పెరిగి లాభం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తే కాంట్రాక్టర్ అన్యాయం చేస్తున్నారు. కొలతలకు ఉంచిన దిమ్మల పైన మట్టి పోస్తూ పైకిలేపి ఎత్తును చూపిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. గత నెల రోజుల క్రితమే దరఖాస్తు పెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. – చెంజర్ల గ్రామస్తులు, మానకొండూర్ -
విన్నపాలు... ఆవేదనలు...
పాతగుంటూరు : ఏడాదిగా సమస్యను పరిష్కరించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. సమస్య పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమానికి ఎన్నిసార్లు వచ్చినా సంబంధిత అధికారులు మాత్రం చొరవ చూపడంలేదు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందని బాధితులు అధికారులకు విన్నవించుకున్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపై జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి, వారి బాధలను విన్నవించుకున్నారు. స్పందించిన జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే ప్రజావాణిలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలంటూ సంబంధితఅధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్తిపాడు సావిత్రీబాయి కాలనీలో 12 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పరిశపోగు శ్రీనివాసరావు వినతిపత్రం ఇచ్చారు. గుంటూరు ఆనందపేట 9వ లైనులో ఇళ్ల మధ్యలో సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానికులు ఆదంబీ, ఆషాబేగం, సదరంబీ కోరారు. గుంటూరు శివార్లలో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రిపబ్లికన్ పార్టీ నాయకుడు ఆనందకుమార్ వినతిపత్రం సమర్పించారు. కొల్లిపరలో దేవాదాయ శాఖ గ్రామకంఠంలో ఉన్న 21.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు భూమిని ట్రస్టు పేరుతో సభ్యులు, దేవాదాయ అధికారులు కలిసి అమ్ముకుంటున్నారని ఆ గ్రామానికి చెందిన కొల్లి శివరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త వాటర్ ట్యాంక్ డ్రైవర్‌గా పనిచేస్తూ, 2005లో మృతిచెందాడని, తనకు ఉద్యోగం ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని గుంటూరుకు చెందిన తాటి లక్ష్మీకుమారి ఫిర్యాదుచేశారు. టీడీపీకి ఓట్లు వేయలేదని తమ పింఛన్లు అక్రమంగా తొలగించారని, తమకు పింఛన్లు ఇప్పించాలని దాచేపల్లి మండలం తంగెడకు చెందిన హనుమాయమ్మ, లాలూబీ విన్నవించారు. జిల్లాలో అర్హులైన వికలాంగుల కుటుంబాలకు నివేశన స్థలాలు వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రామయ్య కోరారు. -
మీరైనా న్యాయం చేయండి..
పాతగుంటూరు: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు అదనపు జేసీ వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీడీ సురేష్‌బాబును కలిసి తమ ఫిర్యాదులు అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, జేసీ లేకపోవడంతో కొందరు తమ ఫిర్యాదులు అంజేయకుండానే వెనుదిరిగారు. ప్రజావాణిలో కొందరు బాధితుల సమస్యలు ఇవి.. ప్రభుత్వం తమకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోకుండా కొందరు వ్యక్తులు అడ్డుపడుతున్నారని తాడికొండ మండలం గరికపాడుకు చెందిన సీహెచ్ లక్ష్మి, నాగమణి, ముత్తమ్మ ఫిర్యాదు చేశారు. బెదిరించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎనిమిదేళ్ల కిందట కాలనీ ఏర్పడినా తమకు మంచినీటి వసతి లేదని గుంటూరు రూరల్ మండలం రామరాజు కాలనీకి చెందిన తిరుపతమ్మ, పరమేశ్వరమ్మ, మహిమూన్ అర్జీ అందజేశారు. కాలనీలో 1,200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని తెలిపారు. గత ఏడాది చివరిలో తనపై నలుగురు దాడి చేశారని, దాడి చేసినవారికి పోలీసులు దన్నుగా నిలుస్తున్నారని మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన ఎ.వరప్రసాదరావు ఫిర్యాదు అందజేశారు. కేసు వెనక్కు తీసుకోవాలని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడుకు చెందిన కోమటినేని సాంబశివరావు కోరారు. 2012 సంవత్సరంలో ఐదెకరాలకు సంబంధించిన పాస్‌బుక్ పెట్టి బ్యాంకులో రూ.2.50లక్షల రుణం తీసుకున్నట్లు తెలిపారు. 95సెంట్లకు రూ.60,193 రుణం మాత్రమే తీసుకున్నట్లుగా నమోదైందని పేర్కొన్నారు. దీనిపై అధికారులను అడిగితే తమకేం సంబంధం లేదంటున్నారని చెప్పారు. చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ భూములు ఇచ్చినా హక్కు పత్రాలు ఇవ్వలేదని భైరవపాడు సుగాలీ కాలనీకి చెందిన రమావత్ మంగ్లానాయక్, ఆర్.సాంబానాయక్ తెలిపారు. 20 ఏళ్లుగా అటవీ భూములు సాగు చేసుకుంటున్నామన్నారు. 2006వ సంవత్సరంలో కొంతమందికి అటవీ హక్కు పత్రాలు ఇచ్చారని తెలిపారు. మిగిలిన వారికి హక్కు పత్రాలు నేటికీ మంజూరు చేయలేదని, అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించడం లేదని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. తనతో సహా చిన్నకోడలు రూతమ్మను ఇంటి నుంచి బయటకు గెంటి వేసిందని తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన బోరుగడ్డ ఆరోగ్యం ఫిర్యాదు చేసింది. తన పెద్ద కుమారుడు అబ్రహాం, చిన్న కుమారుడు షడ్రక్ మరణించారని, ఇదే అదనుగా పెద్ద కోడలు మరియమ్మ తమను ఇంటి నుంచి బయటకు గెంటేసిందని తెలిపారు. ఆస్తికోసం ఇలా చేస్తున్నట్లు వివరించారు. -
గ్రీవెన్స్.. నో రెస్పాన్స్...!
మచిలీపట్నం : ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమం ప్రహసనంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణికి వచ్చే అర్జీదారుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ప్రజావాణికి వచ్చిన అర్జీలను ఆయా శాఖలకు పంపుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజావాణికి కలెక్టర్ హాజరైతేనే జిల్లాస్థాయి అధికారులు వస్తున్నారు. లేకుంటే కిందిస్థాయి అధికారులను పంపుతున్నారు. దీర్ఘకాల సమస్యలు వెనక్కే... దీర్ఘకాల సమస్యలపై ప్రజావాణిలో అర్జీ ఇచ్చేందుకు వచ్చేవారిని ముందుగానే గుర్తించి లోపలకు రాకుండా వెనక్కి పంపే సంస్కృతి ఇక్కడ కొనసాగుతోంది. అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 12వ తేదీల మధ్య ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిని జన్మభూమి, హుద్‌హుద్ తుపాను తదితర కారణాలను చూపి వాయిదా వేశారు. కిందిస్థాయికి బదిలీ... గత ఆరునెలల్లో ప్రజావాణికి 5,385 అర్జీలు రాగా వాటిలో 2,228 పరిష్కరించినట్లు చూపారు. ఇక్కడే అసలు మతలబు దాగి ఉంది. కిందిస్థాయి అధికారులు సరిగా స్పందించడంలేదని అర్జీదారులు వచ్చి ఇక్కడ దరఖాస్తులు ఇస్తున్నారు. అయితే జిల్లా స్థాయి అధికారులు ఈ సమస్యలను కిందిస్థాయి అధికారులకు బదిలీ చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన మండలస్థాయి అధికారులు ఈ సమస్యను పరిష్కరించినట్లు ప్రజావాణి ఆన్లైన్లో చూపుతున్నారు. మళ్లీ ఇదే సమస్యపై అర్జీ ఇస్తే తిరిగి అదేసమాధానం ఆన్లైన్లో ఉంచడం గమనార్హం. ఇది చక్రంలా తిరుగుతూనే ఉంది. సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయి. 5,385 దరఖాస్తులో పరిష్కరించినవిపోను 30 అర్జీలకు మధ్యంతర సమాచారం ఇచ్చామని, 64 తిరస్కరించామని 2,979 పరిశీలనలో ఉన్నాయని చూపారు. -
సమగ్ర సమాచారం ముఖ్యం
ప్రజావాణిలో ఏజేసీ చెన్నకేశవరావు చిలకలపూడి(మచిలీపట్నం) : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్.చెన్న కేశవరావు సూచించారు. కలెక్టరేట్లోని సమా వేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎ.ప్రభావతి, బందరు ఆర్డీవో సాయిబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఏజేసీ మాట్లాడుతూ అధికారులంతా ప్రజావాణిలో వచ్చిన అర్జీల సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే స్పందించాలని కోరారు. మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ కేవివి. సత్యనారాయణ, డీఎస్వో పిబి.సంధ్యారాణి, బీసీ సంక్షేమాధికారి లక్ష్మీదుర్గ, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ మారుతీదివాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. అర్జీలు ఇవే : బంటుమిల్లి మండలం రామవరపుమోడి గ్రామంలో రేషన్‌షాపును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. గూడూరు మండలం మల్లవోలు గ్రామంలోని ప్రభుత్వం ఉన్నత పాఠశాల ప్రహరీగోడ సమీపంలో ఏర్పాటు చేసిన మద్యంషాపును తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కూనపరెడ్డి పాండు రంగారావు వినతి పత్రమిచ్చారు. ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామంలో ఉన్న ఇసుక క్వారీని ప్రభుత్వం పునరుద్ధరించాలని గ్రామ సర్పంచి డొక్కు లక్ష్మి అర్జీ ఇచ్చారు. బందరు మండలం మంగినపూడి పరిసర ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు సంచరిస్తే జరి మానాలు విధిస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని మురళీకృష్ణ గొర్రెల, మేకల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు జి.వాకాలయ్య వినతిపత్రం అందించారు. మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్ దుర్వినియోగం అవ్వకుండా... సబ్‌ప్లాన్ అమలు చేయాలని కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అన్వర్‌హుస్సేన్, దాదాసాహెబ్, షేక్ రబ్బాని అర్జీ ఇచ్చారు. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లోని విద్యార్థులకు జొన్న బిస్కట్లు, జొన్నతో తయారు చేసిన ఇడ్లీ, జొన్నతో తయారు చేసిన అన్నం ప్రభుత్వ ఖర్చులతో అందించాలని ప్రముఖ న్యాయవాది కంచర్లపల్లి శివప్రసాద్ వినతి పత్రమిచ్చారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా జిల్లాలో పని చేస్తున్న పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లకు నియామక పత్రాలు ఇచ్చి, బకాయిలు చెల్లించాలని ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ఎన్.దేవేంద్రరావు అర్జీ ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి రైతుల కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు జారీ చేసిన జీవో నెంబరు 421ను జిల్లాలోని ఆర్డీవోలు, సబ్కలెక్టర్లు అమలు చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ వినతి పత్రం సమర్పించారు. -
కేసీఆర్ తీరుపై దళిత సంఘాల ఆందోళన
ప్రగతినగర్ : ధర్నాలు, ముట్టడి, ఆందోళనలు, నిరసనలతో సోమవారం కలెక్టరేట్ ప్రాం గణం అట్టుడికిపోయింది. ఉదయం నుం చే పోలీసులు కలెక్టరేట్ చుట్టూ ఉన్న గేట్ల ను మూసివేసి గట్టి భద్రత ఏర్పాటు చేశా రు. కలెక్టర్ రొనాల్డ్‌రాస్ మాత్రం యథావిధిగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని శాఖలలో ఫిర్యాదులు పేరుకుపోతున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. దళితులకు మూడెకరాలు అందించాలి ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమిని అందించాలని వ్యవసాయ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు దుబాస్ రా ములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని అమలు చేయకుండా ఇప్పుడు జిమ్మిక్కులు చేస్తూ దళితులకు ద్రో హం చేస్తున్నారని ఆరోపించారు. బొజ్జా భూమాగౌడ్, సీపీఐ నాయకులు సుధాకర్, ఓమయ్య, బిసాయిలు, విఠల్‌గౌడ్, రమేశ్, గంగారాం పాల్గొన్నారు. సర్వీసును క్రమబద్ధీకరించాలి జీఓ 22 ప్రకారం అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగుల స ర్వీసులను క్రమద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ అర్బన్ హెల్త్ సెంటర్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రమేష్, గోవర్ధన్ మాట్లాడుతూ 2014 జనవరి తరువాత ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ సాక్షరభారత్ కాంట్రాక్ట ఉద్యోగులు ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించండి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రా న్ని ఇచ్చారు. ఏఐటీయూసీ నాయకులు సుధాకర్, ఓమయ్య మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, వారికి ఈఎస్ ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి బోధన్‌లోని నిజాం షుగర్స్ దక్కన్ లిమిటెడ్‌ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యలో ధర్నా చేశా రు. ఫార్వర్డ బ్లా క్ జిల్లా కన్వీనర్ రాజాగౌడ్ మాట్లాడుతూ ఆసియా ఖండంలో అతి పెద్దదైన షుగర్ ఫ్యాక్టరీ ఎన్నో వేల మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉఫాది కల్పించిందిన్నారు. అక్కడ అలా చెప్పి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, అందుకు అవసరమైన ఐదు లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాం క్‌ను ఏర్పాటు చేస్తానని సింగపూర్ పర్యటనలో అక్కడి పారిశ్రామిక వేత్తలకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ దళితులకు మాత్రం మూడెకరాల భూమి పంపిణీ విషయాన్ని మరిచిపోయాని న్యూడెమోక్రసీ నాయకులు విమర్శించారు. కలెక్టర్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు ఆకుల పాపయ్య, నీలం సాయిబాబా, సీహెచ్ సాయాగౌడ్, ఎన్ నర్సయ్య, కృష్ణగౌడ్, పీడీఎస్‌యూ నాయకులురాలు సరిత, సౌందర్య, రవి, అరుణ్, రాజేశ్వర్, నరేష్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓడ్ కులాన్ని గుర్తించాలి ఓడ్ కులస్తులకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ ఓడ్ కుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎ దుట ధర్నా చేశారు. తెలంగాణలో పదివేల కు టుంబాలకు పైగా జీవిస్తున్నారని సంఘం నాయకు లు పేర్కొన్నారు. జిల్లాలో సుమారు మూడు వందలకుపైగా కుటుంబాలు మొరం, మట్టి, ఇసుక ప నులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఓడ్ కులస్థులను ఎస్సీలలో చేర్చాలని డిమాండ్ చేశారు. సుధాబార్పై చర్యలు తీసుకోండి నిబంధనలను తుంగలో తొక్కి నగరం నడిబొడ్డున ప్రజలు నివసించే ప్రాంతంలో నిర్వహిస్తున్న సుధాబార్ను మూసివేయించాలని వినాయక్నగర్వాసులు కలెక్టర్‌ను కోరారు. బార్‌కు సుమారు వంద అడుగుల దూరంలో పాఠశాల ఉందని, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి.. మిర్చి కాంపౌండ్ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని స్థానికులు కలెక్టర్‌ను కోరారు. ప్రభుత్వ స్థలంలో ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారన్నారు. -
సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి
చిత్తూరు (సెంట్రల్) : ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలోని సమావేశమందిరం లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజావాణి పోర్టల్ యూజర్ నేమ్, పాస్‌వర్ట్‌లను అన్ని శాఖలకు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సమావేశంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో చర్చించారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన ఇసుక పాలసీని అనుసరించి జిల్లాలో ఎంతమేర ఇసుక నిల్వలున్నాయి? నిర్మాణంలో ఉన్న భవనాలెన్ని ? వాటికి ఎంత ఇసుక అవసరం ? అనే అంశాలపై చర్చించారు. ఇసుక తవ్వకం ద్వారా భూగర్భజలాలకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయూ ? అని గనులు, నీటిపారుదల, భూగర్భజలశాఖ, డీఆర్డీఏ, డ్వామా సమన్వయంతో పరిశీలించి కొనుగోలుదారులతో ఎంఓయూలను రూపొందించాలన్నారు. అర్హమైన మహి ళా సంఘాలను గుర్తించి వాటి ద్వారా ఇసుక అమ్మకాలను ప్రారంభించే పనిని అక్టోబర్ 1 నుంచి చేపట్టాలన్నారు. జిల్లాలో మీ-సేవ, తహశీల్దార్ కార్యాలయం, ఎన్‌ఐసీల ద్వారా రేషన్‌కార్డుల నిమిత్తం వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి, ఆ సంస్థ జిల్లా మేనేజర్ ను ఆదేశించారు. రేషన్‌కార్డుల్లో మార్పు లు, చేర్పులు, సవరణ, సౌకర్యాల కార్యక్రమాలపై, ఎన్టీఆర్ ఆరోగ్య సేవలపై జిల్లాలోని కేబుల్ టీవీల్లో ప్రచారం చేపట్టాలన్నారు. ఆధార్ సీడింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పెన్షన్లు, ఇంటి మంజూరు, రేషన్‌కార్డు జారీకి అర్హులను గుర్తించాలన్నారు. ఈ నెల 19న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జిల్లాపర్యటనకు వస్తున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శస్త్రచికిత్సలు, ఇతర చికిత్సలు ఎక్కడ బాగా జరుగుతాయో గుర్తించి అక్కడ డాక్టర్ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ నెల 27న కేంద్ర వికలాంగుల మంత్రి జిల్లాకు వస్తున్నారని, తిరుపతి ఇందిర మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వికలాంగులకు అవసరమైన పరికరాలను పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వికలాంగుల శాఖ ఏడీ, జిల్లా విద్యాశాఖాధికారి, ఎస్ఎస్ఏ పీఓ, డీఆర్డీఏ, డ్వామా, మెప్మా పీడీలు సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ సుజల స్రవంతిని ఎక్కడెక్కడ ప్రారంభించనున్నారో నివేదికలు సమర్పించాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారానికి వెబ్సైట్
ప్రజావాణిలో జేసీ జె.మురళి చిలకలపూడి (మచిలీపట్నం) : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారం కోసం నూతన వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళి తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీతోపాటు డీఆర్వో ఎ.ప్రభావతి, జెడ్పీ సీఈవో టి.సుదర్శనం, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్‌లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ prajavani.ap.gov.inవెబ్సైట్లో ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సంబంధించి వివరాలను పొందుపరచాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారం విషయంలో శాఖల వారీగా అధికారుల పని తీరును గమనిస్తూ ఉంటారని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు సమస్యల పరిష్కారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి.మధుసూదనరావు, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, డీఎస్వో పీబీ సంధ్యారాణి, డీసీవో రమేష్‌బాబు, డీఆర్డీఏ ఏపీడీ జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అర్జీలు ఇవే.. అధికారులు లంచం తీసుకుని కైకలూరు కిరాణా మర్చంట్స్ వీధిలో ఉన్న తమ భూమిని వేరొకరికి చల్లపల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారని, ఈ ఘటనపై విచారించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, తన భూమిని అప్పగించాలని ఎండీ షీమాబేగం వినతిపత్రం ఇచ్చారు. మదర్ థెరిస్సా వికలాంగుల సేవా సంక్షేమ సంఘంలోని 250 మంది సభ్యులకు ఇళ్లస్థలాలు కేటాయించాలని, పింఛను పెంచాలని ఆ సంఘ కార్యదర్శి ఎన్.అరుణ తదితరులు అర్జీ అందజేశారు. గుడివాడ లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా 2000వ సంవత్సరం నుంచి 220 మంది కార్మికులు కాంట్రాక్టు ప్రాతిపదికన ఎఫ్‌సీఐ గోడౌన్లో పనిచేస్తున్నారని, వారిలో 150 మందికి మాత్రమే డీపీఎస్ ఆర్డర్లు ఇచ్చారని, మిగిలిన 70 మందికి ఇవ్వకపోవటంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, వెంటనే వారికి కూడా డీపీఎస్ ఆర్డర్లు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ మారుమూడి విక్టర్‌ప్రసాద్ వినతిపత్రం అందజేశారు. రైతుల రుణమాఫీ ఫిర్యాదులపై రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో రైతు రుణమాఫీలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లీడ్ బ్యాంక్ మేనేజరు కన్వీనరుగా కమిటీని నియమించి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. -
టీమ్ వర్క్ చేద్దాం
రాబోయే రోజులు కీలకం అధికారులు తమ శాఖపై పట్టు సాధించాలి ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన తప్పనిసరి ప్రజావాణిలో అధికారులతో కలెక్టర్ కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : రాబోయే రోజులు కీలకంగా మారతాయని, జిల్లా అభివృద్ధి కోసం అధికారులందరూ టీమ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు చెప్పారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ జె.మురళి, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, డీఆర్డీఏ పీడీ రజనీకాంతారావు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాబోయే ఐదు వారాల్లో ఎక్కువ అర్జీలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆయా శాఖల జిల్లా అధికారులు వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గత ఏడాది జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం, తుపానులు, వరదలు, వరుస ఎన్నికలతో ప్రజల సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారని చెప్పారు. గతేడాది, రాబోయే ఏడాది ఒకటిగా ఉండబోవని, అధికారులు తేలికగా తీసుకోవద్దని స్పష్టం చేశారు. రాబోయే రోజులు చాలా కీలకంగా ఉంటాయని ఆయన అధికారులకు గుర్తుచేశారు. అన్ని వివరాలూ తెలిసుండాలి... ప్రతి జిల్లా స్థాయి అధికారికీ తన శాఖకు సం బంధించి అన్ని వివరాలూ క్షుణ్ణంగా తెలిసి ఉండాలని కలెక్టర్ చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలు నియోజకవర్గ, మండల స్థాయిగా విడగొట్టి వాటిపై నివేదిక తయారు చేయాలన్నారు. ఏ సమస్యపై సంబంధిత అధికారిని అడిగినా సిబ్బందిని అడిగి చెబుతానన్న సమాధానం రాకూడదన్నారు. ఈ సమాధానమే పలుమార్లు జిల్లా అధికారులు చెబితే ఆ శాఖపై సంబంధిత అధికారికి పట్టు లేదనే భావన కలుగుతుందని తెలిపారు. జిల్లా అధికారులందరూ ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు అధికారుల పనితనాన్ని కూడా బేరీజు వేసుకుంటున్నారని, కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి సంక్షేమ శాఖాధికారులకు నిధులు విడుదలయ్యాయో లేదో కలెక్టర్ ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన హామీలకు ఇప్పటి వరకు ఉన్న నిధులు సరిపోతాయా, ఇంకా ఎంత నిధులు అవసరమవుతాయన్న సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమశాఖ డీడీ చినబాబు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, రాజీవ్ విద్యామిషన్ పీవో బి.పద్మావతి, డీసీవో రమేష్‌బాబు, స్థానిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు, మత్స్యశాఖ డీడీ టి.కల్యాణం, డీఈవో దేవానందరెడ్డి, బందరు ఆర్డీవో పి.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. హాజరైంది 19 మందే... ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది. మొత్తం 56 శాఖల జిల్లా అధికారులు హాజరుకావాల్సి ఉండగా, 19 మందే వచ్చారు. మిగిలిన శాఖలకు సంబంధించి జిల్లా అధికారుల స్థానంలో కొంతమంది కిందిస్థాయి సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం, అటవీ శాఖ, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, డ్రెయినేజీ, ఆర్డబ్ల్యూఎస్, జిల్లా రిజిస్ట్రార్, డీసీహెచ్ఎస్, విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం తదితర అధికారులు గైర్హాజరయ్యారు. ప్రజావాణికి వచ్చిన అర్జీల వివరాలివీ... సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 119 మంది ప్రజలు తమ అర్జీలను ప్రజావాణిలో కలెక్టర్‌కు సమర్పించారు. వాటిలో కొన్ని... మొవ్వ మండలం నిడుమోలులో ఎన్‌హెచ్-9 పనుల్లో భాగంగా రోడ్డుకిరువైపులా 200 అడుగుల మేర విస్తరిస్తున్నారని దీనివల్ల ఎక్కువమంది స్థలాలు, గృహాలు కోల్పోవాల్సి వస్తోందని ఆ గ్రామానికి చెందిన బాధితులు కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. విస్తరణ పరిధి తగ్గించాలని, లేదంటే తాము జీవనోపాధి కోల్పోతామని పేర్కొన్నారు. మండవల్లి మండలం పసలపూడి పరిధిలోని కొమ్మాలమూడికి చెందిన సంగా ఆరోగ్యం గ్రామంలో అనుమతులు లేకుండా సుమారు 85 ఎకరాల్లో అక్రమంగా చేపల చెరువులు తవ్వుతున్నారని, వాటిని నిలుపుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో కాటూరు రోడ్డులోని శ్మశానవాటిక పక్కనున్న చెరువును రజకులు దోబీఖానాగా వాడుకునేందుకు 2012-15 వరకు లీజు ఉత్తర్వులు ఇచ్చారు. లీజు మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవటం వల్ల ఆ చెరువును ఉయ్యూరు రోటరీ సంస్థ వారు శ్మశాన అభివృద్ధి నిమిత్తం గ్రామస్తుల సహకారంతో చెరువులోని మట్టిని తరలించేందుకు పంచాయతీ అంగీకరించింది. ఆ చెరువు లీజును తిరిగి తమకే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అర్జీ అందజేశారు. మండవల్లి మండలం భైరవపట్నానికి చెందిన జోసఫ్.. తన తండ్రి గతంలో మిలటరీలో పనిచేసినప్పుడు ప్రభుత్వం సర్వే నంబరు 271/1లో 55 సెంట్ల భూమిని మంజూరు చేసిందని, తన తల్లిదండ్రుల మరణానంతరం ఈ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడని తెలిపారు. ఈ భూమిని తనకు ఇప్పించాలని అర్జీ ఇచ్చారు. గుడివాడలో వెటర్నరీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిందని, ఆ భవన నిర్మాణానికి ఇంతవరకు స్థలం కేటాయించలేదని యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు వేమారెడ్డి రంగారావు తెలిపారు. వెంటనే స్థలం కేటాయించి భవన నిర్మాణానికి సహకరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ అందజేశారు. అవనిగడ్డలో ఆర్ఎస్ నంబరు 502/2లో 28 సెంట్ల మెరక భూమి 1982 నుంచి తన స్వాధీనంలో ఉందని, దానికి సర్వే చేసి, హద్దులతో కూడిన తన భూమిని అప్పగించాలని కోరుతూ సర్వే అధికారులకు దరఖాస్తు చేశానని, సంబంధిత రుసుము కూడా చెల్లించి ఉన్నా తాత్సారం జరుగుతోందని సింహాద్రి సాయిమహేంద్రబాబు అనే వ్యక్తి అర్జీ అందజేశారు. వెంటనే తన భూమికి సర్వే నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న దృష్ట్యా తక్షణమే జిల్లాలో వ్యవసాయ పనుల నిమిత్తం 6 లక్షల 37 వేల 500 ఎకరాలకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. తనకు పక్షవాతం సోకడం వల్ల ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నానని, ఆ ఉద్యోగాన్ని తన కుమారుడికి ఇప్పించాలని పెడన మండలం కొప్పల్లి వీఆర్ఏ పొంగులేటి జయరాజు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. -
ఇక ప్రజా‘వాణి’ విందాం
- అధికారులకు కలెక్టర్ ఆదేశాలు - నేటి నుంచి వారం వారం విజ్ఞప్తుల స్వీకరణ - రెండు నెలల అనంతరం తిరిగి ప్రారంభం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎన్నికల నేపథ్యంలో రెండు నెలల పాటు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రతి సోమవారం నిర్వహించనున్నారు. దీంతోపాటు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని కూడా యథాతథంగా కొనసాగించనున్నట్లు జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య ప్రకటించారు. జిల్లాలో మున్సిపల్, జెడ్పీటీసీ,సార్వత్రిక ఎన్నికలు వరుసగా రావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రతి వారం కలెక్టరేట్‌తో పాటు ఆయా డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు రెండు నెలలుగా వాయిదా వేస్తూ వస్తున్నారు. దీంతో ప్రతి వారం అర్జిదారుల రాకతో నిండిపోయే కలెక్టరేట్.. ఎన్నికల సమీక్షలతో అధికారులతో నిండిపోయింది. మూడు ఎన్నికలు ఏకకాలంలో రావడంతో జిల్లాలో దాదాపు అన్ని శాఖల అధికారులు విధుల్లో పాల్గొన్నారు. ప్రజావాణి సిబ్బందికి సైతం ఎన్నికల విధులు అప్పగించారు. పేరుకుపోయిన సమస్యలు ప్రజావాణి ఉన్న రోజుల్లో ప్రజలు చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే అవకాశముండేది. పింఛన్లు, కాలనీల్లో నెలకొన్న సమస్యలు మొదలైన వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేవారు. కార్యక్రమం రెండు నెలలుగా వాయిదా పడడంతో భూవివాదాలు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, బ్యాంకు రుణాలు తదితర సమస్యలు పరిష్కారం కాక ప్రజలు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎన్నికలు ముగిసి కొత్త పాలకవర్గాలు కొలువుదీరనుండడంతో సమస్యలు పరిష్కారమవుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. -డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు నిర్వహించనున్నారు. 0878-2262301కు ఫోన్ చేసి కలెక్టర్‌కు సమస్యలు చెప్పుకోవచ్చు. - ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు.