- ప్రజావాణిలో జేసీ జె.మురళి
చిలకలపూడి (మచిలీపట్నం) : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారం కోసం నూతన వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళి తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీతోపాటు డీఆర్వో ఎ.ప్రభావతి, జెడ్పీ సీఈవో టి.సుదర్శనం, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్‌లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
అనంతరం జేసీ మాట్లాడుతూ prajavani.ap.gov.inవెబ్‌సైట్‌లో ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సంబంధించి వివరాలను పొందుపరచాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారం విషయంలో శాఖల వారీగా అధికారుల పని తీరును గమనిస్తూ ఉంటారని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు సమస్యల పరిష్కారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి.మధుసూదనరావు, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, డీఎస్‌వో పీబీ సంధ్యారాణి, డీసీవో రమేష్‌బాబు, డీఆర్డీఏ ఏపీడీ జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు ఇవే..
అధికారులు లంచం తీసుకుని కైకలూరు కిరాణా మర్చంట్స్ వీధిలో ఉన్న తమ భూమిని వేరొకరికి చల్లపల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారని, ఈ ఘటనపై విచారించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, తన భూమిని అప్పగించాలని ఎండీ షీమాబేగం వినతిపత్రం ఇచ్చారు.
మదర్ థెరిస్సా వికలాంగుల సేవా సంక్షేమ సంఘంలోని 250 మంది సభ్యులకు ఇళ్లస్థలాలు కేటాయించాలని, పింఛను పెంచాలని ఆ సంఘ కార్యదర్శి ఎన్.అరుణ తదితరులు అర్జీ అందజేశారు.
గుడివాడ లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా 2000వ సంవత్సరం నుంచి 220 మంది కార్మికులు కాంట్రాక్టు ప్రాతిపదికన ఎఫ్‌సీఐ గోడౌన్‌లో పనిచేస్తున్నారని, వారిలో 150 మందికి మాత్రమే డీపీఎస్ ఆర్డర్లు ఇచ్చారని, మిగిలిన 70 మందికి ఇవ్వకపోవటంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, వెంటనే వారికి కూడా డీపీఎస్ ఆర్డర్లు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ మారుమూడి విక్టర్‌ప్రసాద్ వినతిపత్రం అందజేశారు.
రైతుల రుణమాఫీ ఫిర్యాదులపై రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో రైతు రుణమాఫీలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లీడ్ బ్యాంక్ మేనేజరు కన్వీనరుగా కమిటీని నియమించి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు.