టీమ్ వర్క్ చేద్దాం | Team work out | Sakshi
Sakshi News home page

టీమ్ వర్క్ చేద్దాం

Published Tue, Jun 3 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

Team work out

  • రాబోయే రోజులు కీలకం
  •   అధికారులు తమ శాఖపై పట్టు సాధించాలి
  •   ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన తప్పనిసరి
  •   ప్రజావాణిలో అధికారులతో కలెక్టర్
  •  కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : రాబోయే రోజులు కీలకంగా మారతాయని, జిల్లా అభివృద్ధి కోసం అధికారులందరూ టీమ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు చెప్పారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ జె.మురళి, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, డీఆర్డీఏ పీడీ రజనీకాంతారావు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

    ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాబోయే ఐదు వారాల్లో ఎక్కువ అర్జీలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆయా శాఖల జిల్లా అధికారులు వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గత ఏడాది జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం, తుపానులు, వరదలు, వరుస ఎన్నికలతో ప్రజల సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారని చెప్పారు. గతేడాది, రాబోయే ఏడాది ఒకటిగా ఉండబోవని, అధికారులు తేలికగా తీసుకోవద్దని స్పష్టం చేశారు. రాబోయే రోజులు చాలా కీలకంగా ఉంటాయని ఆయన అధికారులకు గుర్తుచేశారు.
     
    అన్ని వివరాలూ తెలిసుండాలి...

    ప్రతి జిల్లా స్థాయి అధికారికీ తన శాఖకు సం బంధించి అన్ని వివరాలూ క్షుణ్ణంగా తెలిసి ఉండాలని కలెక్టర్ చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలు నియోజకవర్గ, మండల స్థాయిగా విడగొట్టి వాటిపై నివేదిక తయారు చేయాలన్నారు. ఏ సమస్యపై సంబంధిత అధికారిని అడిగినా సిబ్బందిని అడిగి చెబుతానన్న సమాధానం రాకూడదన్నారు.

    ఈ సమాధానమే పలుమార్లు జిల్లా అధికారులు చెబితే ఆ శాఖపై సంబంధిత అధికారికి పట్టు లేదనే భావన కలుగుతుందని తెలిపారు. జిల్లా అధికారులందరూ ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు అధికారుల పనితనాన్ని కూడా బేరీజు వేసుకుంటున్నారని, కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి సంక్షేమ శాఖాధికారులకు నిధులు విడుదలయ్యాయో లేదో కలెక్టర్ ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు.

    కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన హామీలకు ఇప్పటి వరకు ఉన్న నిధులు సరిపోతాయా, ఇంకా ఎంత నిధులు అవసరమవుతాయన్న సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమశాఖ డీడీ చినబాబు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, రాజీవ్ విద్యామిషన్ పీవో బి.పద్మావతి, డీసీవో రమేష్‌బాబు, స్థానిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు, మత్స్యశాఖ డీడీ టి.కల్యాణం, డీఈవో దేవానందరెడ్డి, బందరు ఆర్డీవో పి.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
     
    హాజరైంది 19 మందే...
     
    ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది. మొత్తం 56 శాఖల జిల్లా అధికారులు హాజరుకావాల్సి ఉండగా, 19 మందే వచ్చారు. మిగిలిన శాఖలకు సంబంధించి జిల్లా అధికారుల స్థానంలో కొంతమంది కిందిస్థాయి సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం, అటవీ శాఖ, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, డ్రెయినేజీ, ఆర్‌డబ్ల్యూఎస్, జిల్లా రిజిస్ట్రార్, డీసీహెచ్‌ఎస్, విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం తదితర అధికారులు గైర్హాజరయ్యారు.
     
     ప్రజావాణికి వచ్చిన అర్జీల వివరాలివీ...

     సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 119 మంది ప్రజలు తమ అర్జీలను ప్రజావాణిలో కలెక్టర్‌కు సమర్పించారు. వాటిలో కొన్ని...
     
     మొవ్వ మండలం నిడుమోలులో ఎన్‌హెచ్-9 పనుల్లో భాగంగా రోడ్డుకిరువైపులా 200 అడుగుల మేర విస్తరిస్తున్నారని దీనివల్ల ఎక్కువమంది స్థలాలు, గృహాలు కోల్పోవాల్సి వస్తోందని ఆ గ్రామానికి చెందిన బాధితులు కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. విస్తరణ పరిధి తగ్గించాలని, లేదంటే తాము జీవనోపాధి కోల్పోతామని పేర్కొన్నారు.
     
     మండవల్లి మండలం పసలపూడి పరిధిలోని కొమ్మాలమూడికి చెందిన సంగా ఆరోగ్యం గ్రామంలో అనుమతులు లేకుండా సుమారు 85 ఎకరాల్లో అక్రమంగా చేపల చెరువులు తవ్వుతున్నారని, వాటిని నిలుపుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.
     
     ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో కాటూరు రోడ్డులోని శ్మశానవాటిక పక్కనున్న చెరువును రజకులు దోబీఖానాగా వాడుకునేందుకు 2012-15 వరకు లీజు ఉత్తర్వులు ఇచ్చారు. లీజు మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవటం వల్ల ఆ చెరువును ఉయ్యూరు రోటరీ సంస్థ వారు శ్మశాన అభివృద్ధి నిమిత్తం గ్రామస్తుల సహకారంతో చెరువులోని మట్టిని తరలించేందుకు పంచాయతీ అంగీకరించింది. ఆ చెరువు లీజును తిరిగి తమకే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అర్జీ అందజేశారు.
     
    మండవల్లి మండలం భైరవపట్నానికి చెందిన జోసఫ్.. తన తండ్రి గతంలో మిలటరీలో పనిచేసినప్పుడు ప్రభుత్వం సర్వే నంబరు 271/1లో 55 సెంట్ల భూమిని మంజూరు చేసిందని, తన తల్లిదండ్రుల మరణానంతరం ఈ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడని తెలిపారు. ఈ భూమిని తనకు ఇప్పించాలని అర్జీ ఇచ్చారు.
     
    గుడివాడలో వెటర్నరీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిందని, ఆ భవన నిర్మాణానికి ఇంతవరకు స్థలం కేటాయించలేదని యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు వేమారెడ్డి రంగారావు తెలిపారు. వెంటనే స్థలం కేటాయించి భవన నిర్మాణానికి సహకరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ అందజేశారు.
     
    అవనిగడ్డలో ఆర్‌ఎస్ నంబరు 502/2లో 28 సెంట్ల మెరక భూమి 1982 నుంచి తన స్వాధీనంలో ఉందని, దానికి సర్వే చేసి, హద్దులతో కూడిన తన భూమిని అప్పగించాలని కోరుతూ సర్వే అధికారులకు దరఖాస్తు చేశానని, సంబంధిత రుసుము కూడా చెల్లించి ఉన్నా తాత్సారం జరుగుతోందని సింహాద్రి సాయిమహేంద్రబాబు అనే వ్యక్తి అర్జీ అందజేశారు. వెంటనే తన భూమికి సర్వే నిర్వహించి న్యాయం చేయాలని కోరారు.
     
    కృష్ణా డెల్టాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న దృష్ట్యా తక్షణమే జిల్లాలో వ్యవసాయ పనుల నిమిత్తం 6 లక్షల 37 వేల 500 ఎకరాలకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు.
     
     తనకు పక్షవాతం సోకడం వల్ల ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నానని, ఆ ఉద్యోగాన్ని తన కుమారుడికి ఇప్పించాలని పెడన మండలం కొప్పల్లి వీఆర్‌ఏ పొంగులేటి జయరాజు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.  
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement