Raghunandanravu
-
నేడు విజయవాడకు అన్ని శాఖల అధికారులు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు ఒకేసారి విజయవాడకు రానున్నారు. గురువారం నగరంలోని గేట్‌వే హోటల్లో జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తరలివస్తున్నారు. సీఎం చంద్రబాబుతోపాటు 20 మంది మంత్రులు పాల్గొనే ఈ సదస్సును విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, మంత్రులు, ఆయా శాఖల ముఖ్య అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, ఉన్నతాధికారులు హాజరవుతారు. జిల్లాల వారీగా సీఎం సమీక్షలు జరుపుతారు. శాఖల వారీగా సమీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం భోజనం అనంతరం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు తిరిగి సదస్సు నిర్వహిస్తారు. ఈ సదస్సులో ఏడు ప్రాధాన్యతా రంగాలను గుర్తించి వాటికి అనుగుణంగా మిషన్లు ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి ఏడు మిషన్లకు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఈ సదస్సు నేపథ్యంలో బుధవారం నుంచే విజయవాడలో సందడి నెలకొంది. మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, అడిషినల్ డీజీ ఎన్వీ సురేంద్రబాబు తదితరలు గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. డెప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, వ్యవసాయశాఖా మంత్రి పి.పుల్లారావు, రాత్రికి నగరానికి చేరకున్నారు. నగరంలోనూ, గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. -
ధనం కన్నా విద్య మిన్న
కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు కురుమద్దాలి(పామర్రు) : అడ్మిషన్ రిజిష్టర్‌లో విద్యార్థి పేరుమాత్రమే న మోదు చేస్తే చదువు వచ్చినట్లు కాదని, అతని చదువు విషయమై అధికారులు ఉపాధ్యాయులు తగిన శ్రద్ధ తీసుకున్నప్పుడే విద్యావంతులవుతారని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు చెప్పారు. శనివారం మండల పరిధిలోని కురుమద్దాలి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ‘బడిపిలుస్తోంది‘ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు బడి ఉత్సవమ్ నిర్వహించి గ్రామసభ ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిబయట ఉన్న చిన్నారులను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. గతంలో ధనం అధికంగా ఉన్న కుటుంబాలను గౌరవించేవారని ప్రస్తుతం విద్యావంతులను అంతకన్నా ఎక్కువగా గౌరవిస్తున్నారన్న విషయాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు వారి తల్లితండ్రులకు వివరించాలన్నారు. పెరుగుతున్న విద్యాప్రమాణాలకు అనుగుణంగా పాఠశాలలో విద్యాబోధన జరపాలన్నారు. గ్రామస్థాయిలోని అధికారులు, రాజకీయవేత్తలు పాఠశాలలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ మురళీ మాట్లాడుతూ ఇంగ్లిష్ మోజులో తల్లితండ్రులు తమ చిన్నారులను కాన్వెంట్లకు పంపాలని చూస్తున్నారని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాల ల్లోనూ 1 వ తరగతి నుంచి ఇంగ్లిష్ బోధించే విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పక్కా భవనాల్లో నిర్వహిస్తూ, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం తదితరాలను ఉచితంగా అందజేస్తున్నామిన తెలిపారు. అలాగే నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తున్నామని చెప్పారు. పాఠశాల పరిధిలోని ఇద్దరు డ్రాప్ అవుట్ విద్యార్థులు సాదాపు భవాని, బెజవాడ గోపాలకృష్ణను గుర్తించి పాఠశాలలో చేర్పించారు. తల్లితండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత మూలంగా 8 వ తరగతిలో పాఠ్యాంశాలు సక్రమంగా జరగడంలేదని, అదే విధంగా పాఠశాలలో తాగునీటి వసతి సక్రమంగా లేదని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ విషయమై చర్యలు తీసుకుంటానని తెలిపారు. డీవైఈవో వెంకటేశ్వరరావు, గ్రామసర్పంచి కొసరాజు స్వప్న, జెడ్పీటీసీ పొట్లూరి శశి, ఎంపీపీ దగ్గుపాటి ఉష, ఎంపీటీసీ కొలుసు ఆదిలక్ష్మీ, తహసీల్దార్ మూర్తి, ఎంఈవో భవిరి శంకర్నాథ్, ఎంపీడీవో జె.రామనాథం, పాఠశాల హెచ్ఎం అంబటి ఉషాకుమారి, ఏఎంసీ చైర్మన్ లక్ష్ష్మణరావు, సీఆర్పీలు పాల్గొన్నారు. -
రుణాలన్నీ రద్దు చేయండి
చిలకలపూడి (మచిలీపట్నం) : ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి షరతులు లేకుండా రైతులు, డ్వాక్రా సభ్యుల రుణాలన్నీ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి కలెక్టర్ రఘునందన్‌రావును కోరారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు సోమవారం జెడ్పీ సీఈవో సుదర్శనం, కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి డ్వాక్రా సభ్యులు రుణాలు చెల్లించడం లేదని, వారంతా భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఉన్న మండలాల్లో ప్రొటోకాల్‌ను పాటించడంలేదని పద్మావతి వివరించారు. మండలంలో అధికారిక కార్యక్రమాలపై సమాచారం కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రొటోకాల్ విషయంపై ఎంపీడీవోలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కలెక్టర్, జెడ్పీ సీఈవోను కలిసిన వారిలో జెడ్పీటీసీ సభ్యులు బాణావతు రాజు (నూజివీడు), మీగడ ప్రతాప్‌కుమార్ (నందివాడ), డీఎన్ఎన్ శ్రీనుబాబు (పెడన), మూల్పూరి హరీష (పెదపారుపూడి), చిమటా విజయశాంతి (మొవ్వ), ఆ పార్టీ నాయకులు రాజులపాటి మురళీ, తాతా శేషుబాబు, మూల్పూరి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ సరికాదు రైతు కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ చేస్తామని, అది కూడా రూ.1.50లక్షలలోపు మాత్రమే అని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం దారుణమని తాతినేని పద్మావతి విమర్శంచారు. కలెక్టర్ జెడ్పీ సీఈవోను కలిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రాష్ట్ర అర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం.. ఇప్పుడు డబ్బుల్లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు ప్రస్తావించిన కొన్ని సమస్యలు తోట్లవల్లూరులోని జెడ్పీ హైస్కూల్లో తాగునీటి సదుపాయం కల్పించాలి. నందివాడ మండలం కోలుకొండ గ్రామంలో 165 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలాన్ని మెరక చేసేందుకు సమీపంలోని చేపల చెరువుల మట్టిని సరఫరా చేయాలి. వీరులపాడు మండలం జుజ్జూరులో బీసీ సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేలా చొరవచూపాలని, వెల్లంకి గ్రామంలో వైరా, కట్టలేరుల్లో ఇసుక ర్యాంపులను ప్రారంభించాలని జెడ్పీటీసీ సభ్యురాలు షేక్ ఆహనాజ్బేగం కోరారు. పెదపారుపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో కూర్చునేందుకు బెంచీలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కోసం వంట షెడ్డు నిర్మించాలని విజ్ఞప్తిచేశారు. జెడ్పీటీసీ సభ్యులు వివరించిన అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఏమైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
ఆధార్ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు
నెలాఖరు వరకు గడువు కలెక్టర్ రఘునందన్‌రావు తిరువూరు : సామాజిక పెన్షనుదారులు, ఉపాధిహామీపథకం జాబ్‌కార్డుదారులు నెలాఖరులోగా ఆధార్ వివరాలు నమోదు చేయించుకోవాలని కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు. శుక్రవారం తిరువూరు వచ్చిన ఆయన తహ సీల్దారు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పలు పథకాల్లో ఆధార్‌నంబరును తప్పనిసరిగా ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినందున జిల్లాలో ఆధార్‌కార్డుల జారీకి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మీసేవా కేంద్రాల్లో కూడా శాశ్వత ఆధార్ కేంద్రాలను నిర్వహిస్తున్నందున పెన్షన్లు, ఎన్ఆర్ఈజీఎస్, పట్టాదారు పాసుపుస్తకాలు, రేషన్‌కార్డుదారులు విధిగా తమ డేటా ఎంట్రీ చేయించుకుని కార్డులు పొందాలని కోరారు. ఈ నెలాఖరులోపు వివరాలు నమోదు చేయని పెన్షనర్లు, ఉపాధిహామీపథకం కూలీలకు చెల్లింపులు నిలిచిపోతాయని స్పష్టం చేశారు. జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు 36శాతం, రేషన్‌కార్డులు 56శాతం, ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డులు 76శాతం, పెన్షన్లు 50శాతం మాత్రమే ఆధార్‌కు అనుసంధానం చేశారని, మిగిలినవి త్వరలో అనుసంధానిస్తామని తెలిపారు. ఇసుక తవ్వకాల నిరోధానికి టాస్క్‌ఫోర్స్... జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఇసుక తవ్వకాలపై తమకు సమాచారం ఇస్తే టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు జరపడం నేరమని తెలిపారు. అధికారులతో సమావేశం... పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్స్ ఆన్లైన్ పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్ని పట్టాదారు పాసుపుస్తకాలను ఆన్లైన్ చేశారు, ఆధార్ నంబర్ల నమోదు తదితర వివరాలను వీఆర్వోలనడిగి తెలుసుకున్నారు. మల్లేల, రామన్నపాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలో అన్యాక్రాంతమైన అసైన్డ్భూములు, అటవీ, రెవెన్యూ భూములపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తహసీల్దారును ఆదేశించారు. నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రథర్‌బాబు, ఎంపీడీవో సుమమాలిని, సీడీపీవో అంకమాంబ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ షకీల్‌అహ్మద్ పాల్గొన్నారు. కౌలు రైతుల గుర్తింపునకు గ్రామసభలు విస్సన్నపేట : కౌలురైతులను గురిచేందుకు గ్రామసభలు నిర్వహిస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. తహసీత్దారు కార్యాలయాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ రుణాలు మంజూరైన వారి దరఖాస్తులను పరిశీలించి మరళా రెన్యూవల్ చేయ్యాలా లేదా అనేది నిర్ణయిస్తామన్నారు.డీఎస్సీ ద్వారా త్వరలోనే అవసరమైన చోట ఉపాధ్యాయులను నియమిస్తామని తెలిపారు. తహసీల్దార్ సాయిగోపాల్,ఎంపీడీవో జాన్సీరాణి,ఎంఈవో రేణుకానందరావు పాల్గొన్నారు. -
తాగునీటి చెరువులు పూర్తిగా నిండవు
సాక్షితో కలెక్టర్ రఘునందన్‌రావు సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాలో తాగునీటి అవసరాలకు సాగర్ నుంచి వారం రోజుల పాటు నీరు వదిలినా చెరువులు పూర్తిస్థాయిలో నిండే అవకాశం లేదని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. బుధవారం ఆయనను కలిసిన ‘సాక్షి ప్రతినిధి’తో పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం చెరువులు నింపే కార్యక్రమం కొనసాగుతుందని, వారం రోజుల్లో అన్ని చెరువులకు తాగునీరు పూర్తిగా అందే అవకాశం మాత్రం లేదని కలెక్టర్ చెప్పారు. తాగునీటిని ఇతర అవసరాలకు ఎవరు ఉపయోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నీటి బొట్టూ ఎంతో విలువైనదన్నారు. వర్షాలు వచ్చి నీటిమట్టం పెరిగితే తాగునీటి కొరత పూర్తిస్థాయిలో తీరుతుందన్నారు. రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాల్సిన విషయాన్ని ప్రస్తావించగా ప్రభుత్వం ఈ విషయంలో కసరత్తు చేస్తున్న విషయం గురించి చెప్పారు. సీఎం బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించినందున త్వరలోనే వారి నుంచి గైడ్‌లైన్స్ వస్తాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. వర్షాలు బాగా పడితే కృష్ణానదిలో పూర్తిస్థాయిలో నీరు వస్తే ఎటువంటి ఇబ్బందులుండవని, వ్యవసాయానికీ పూర్తిస్థాయిలో నీళ్లు అందుతాయన్నారు. వర్ష సూచన ఉన్నందున నదుల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందన్నారు. రాజధాని విషయం ప్రభుత్వానిదే... రాజధాని విజయవాడలోనే ఉంటుందనే ప్రచారం గురించి ప్రస్తావించగా అదంతా ప్రభుత్వం చూసుకునే వ్యవహారమన్నారు. ఏదైనా ఆగస్టు తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే రాజధాని ఎక్కడైతే బాగుంటుందనే అంశంపై తగిన నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఆగస్టులో నివేదిక ఇస్తుందని, అప్పటి వరకు వేసి చూడాల్సిందేనన్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఎంత మొత్తం ఉన్నాయి. అదే విధంగా ప్రైవేట్ భూముల వివరాలూ సేకరించినట్లు చెప్పారు. ఈ వివరాలు ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. భూ సేకరణ కొత్త చట్టం ప్రకారం జరుగుతుందని గత సంవత్సరం రూపొందించిన చట్టంలో పేర్కొన గైడ్‌లైన్స్ ప్రకారం పరిహారం ఉంటుందన్నారు. జిల్లాలో కొత్తగా 11 ప్రభుత్వ శాఖల ఏర్పాటుకు అవసరమైన భూమి వివరాలు ప్రభుత్వం అడిగి తీసుకుందని చెప్పారు. ‘మెట్రో’ అవకాశం ఉంది... ఇక మెట్రోరైల్ విషయం ప్రస్తావించగా ఉన్నత స్థాయి కమిటీ వచ్చి పరిశీలించి వెళ్లినందున తప్పకుండా ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆరు నెలల్లో ఫీజుబులిటీ రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉందన్నారు. మెట్రోరైల్ రావడం వల్ల నగరంలో రవాణా సులువవుతుందని చెప్పారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ తప్పకుండా కృష్ణా జిల్లాలోనే ఏర్పాటుచేసే అవకాశం ఉన్నట్లు వస్తున్న వార్తలను ప్రస్తావించగా ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడినందున ప్రయారిటీలు అనేవి పాలకులు నిర్ణయించేవే తప్ప తమ వద్ద ఏమి ఉండదన్నారు. వారు చెప్పినవి అమలు చేసేందుకు మాత్రమే తాము పనిచేయాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. -
టీమ్ వర్క్ చేద్దాం
రాబోయే రోజులు కీలకం అధికారులు తమ శాఖపై పట్టు సాధించాలి ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన తప్పనిసరి ప్రజావాణిలో అధికారులతో కలెక్టర్ కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : రాబోయే రోజులు కీలకంగా మారతాయని, జిల్లా అభివృద్ధి కోసం అధికారులందరూ టీమ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు చెప్పారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ జె.మురళి, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, డీఆర్డీఏ పీడీ రజనీకాంతారావు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాబోయే ఐదు వారాల్లో ఎక్కువ అర్జీలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆయా శాఖల జిల్లా అధికారులు వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గత ఏడాది జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం, తుపానులు, వరదలు, వరుస ఎన్నికలతో ప్రజల సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారని చెప్పారు. గతేడాది, రాబోయే ఏడాది ఒకటిగా ఉండబోవని, అధికారులు తేలికగా తీసుకోవద్దని స్పష్టం చేశారు. రాబోయే రోజులు చాలా కీలకంగా ఉంటాయని ఆయన అధికారులకు గుర్తుచేశారు. అన్ని వివరాలూ తెలిసుండాలి... ప్రతి జిల్లా స్థాయి అధికారికీ తన శాఖకు సం బంధించి అన్ని వివరాలూ క్షుణ్ణంగా తెలిసి ఉండాలని కలెక్టర్ చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలు నియోజకవర్గ, మండల స్థాయిగా విడగొట్టి వాటిపై నివేదిక తయారు చేయాలన్నారు. ఏ సమస్యపై సంబంధిత అధికారిని అడిగినా సిబ్బందిని అడిగి చెబుతానన్న సమాధానం రాకూడదన్నారు. ఈ సమాధానమే పలుమార్లు జిల్లా అధికారులు చెబితే ఆ శాఖపై సంబంధిత అధికారికి పట్టు లేదనే భావన కలుగుతుందని తెలిపారు. జిల్లా అధికారులందరూ ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు అధికారుల పనితనాన్ని కూడా బేరీజు వేసుకుంటున్నారని, కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి సంక్షేమ శాఖాధికారులకు నిధులు విడుదలయ్యాయో లేదో కలెక్టర్ ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన హామీలకు ఇప్పటి వరకు ఉన్న నిధులు సరిపోతాయా, ఇంకా ఎంత నిధులు అవసరమవుతాయన్న సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమశాఖ డీడీ చినబాబు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, రాజీవ్ విద్యామిషన్ పీవో బి.పద్మావతి, డీసీవో రమేష్‌బాబు, స్థానిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు, మత్స్యశాఖ డీడీ టి.కల్యాణం, డీఈవో దేవానందరెడ్డి, బందరు ఆర్డీవో పి.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. హాజరైంది 19 మందే... ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది. మొత్తం 56 శాఖల జిల్లా అధికారులు హాజరుకావాల్సి ఉండగా, 19 మందే వచ్చారు. మిగిలిన శాఖలకు సంబంధించి జిల్లా అధికారుల స్థానంలో కొంతమంది కిందిస్థాయి సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం, అటవీ శాఖ, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, డ్రెయినేజీ, ఆర్డబ్ల్యూఎస్, జిల్లా రిజిస్ట్రార్, డీసీహెచ్ఎస్, విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం తదితర అధికారులు గైర్హాజరయ్యారు. ప్రజావాణికి వచ్చిన అర్జీల వివరాలివీ... సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 119 మంది ప్రజలు తమ అర్జీలను ప్రజావాణిలో కలెక్టర్‌కు సమర్పించారు. వాటిలో కొన్ని... మొవ్వ మండలం నిడుమోలులో ఎన్‌హెచ్-9 పనుల్లో భాగంగా రోడ్డుకిరువైపులా 200 అడుగుల మేర విస్తరిస్తున్నారని దీనివల్ల ఎక్కువమంది స్థలాలు, గృహాలు కోల్పోవాల్సి వస్తోందని ఆ గ్రామానికి చెందిన బాధితులు కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. విస్తరణ పరిధి తగ్గించాలని, లేదంటే తాము జీవనోపాధి కోల్పోతామని పేర్కొన్నారు. మండవల్లి మండలం పసలపూడి పరిధిలోని కొమ్మాలమూడికి చెందిన సంగా ఆరోగ్యం గ్రామంలో అనుమతులు లేకుండా సుమారు 85 ఎకరాల్లో అక్రమంగా చేపల చెరువులు తవ్వుతున్నారని, వాటిని నిలుపుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో కాటూరు రోడ్డులోని శ్మశానవాటిక పక్కనున్న చెరువును రజకులు దోబీఖానాగా వాడుకునేందుకు 2012-15 వరకు లీజు ఉత్తర్వులు ఇచ్చారు. లీజు మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవటం వల్ల ఆ చెరువును ఉయ్యూరు రోటరీ సంస్థ వారు శ్మశాన అభివృద్ధి నిమిత్తం గ్రామస్తుల సహకారంతో చెరువులోని మట్టిని తరలించేందుకు పంచాయతీ అంగీకరించింది. ఆ చెరువు లీజును తిరిగి తమకే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అర్జీ అందజేశారు. మండవల్లి మండలం భైరవపట్నానికి చెందిన జోసఫ్.. తన తండ్రి గతంలో మిలటరీలో పనిచేసినప్పుడు ప్రభుత్వం సర్వే నంబరు 271/1లో 55 సెంట్ల భూమిని మంజూరు చేసిందని, తన తల్లిదండ్రుల మరణానంతరం ఈ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడని తెలిపారు. ఈ భూమిని తనకు ఇప్పించాలని అర్జీ ఇచ్చారు. గుడివాడలో వెటర్నరీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిందని, ఆ భవన నిర్మాణానికి ఇంతవరకు స్థలం కేటాయించలేదని యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు వేమారెడ్డి రంగారావు తెలిపారు. వెంటనే స్థలం కేటాయించి భవన నిర్మాణానికి సహకరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ అందజేశారు. అవనిగడ్డలో ఆర్ఎస్ నంబరు 502/2లో 28 సెంట్ల మెరక భూమి 1982 నుంచి తన స్వాధీనంలో ఉందని, దానికి సర్వే చేసి, హద్దులతో కూడిన తన భూమిని అప్పగించాలని కోరుతూ సర్వే అధికారులకు దరఖాస్తు చేశానని, సంబంధిత రుసుము కూడా చెల్లించి ఉన్నా తాత్సారం జరుగుతోందని సింహాద్రి సాయిమహేంద్రబాబు అనే వ్యక్తి అర్జీ అందజేశారు. వెంటనే తన భూమికి సర్వే నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న దృష్ట్యా తక్షణమే జిల్లాలో వ్యవసాయ పనుల నిమిత్తం 6 లక్షల 37 వేల 500 ఎకరాలకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. తనకు పక్షవాతం సోకడం వల్ల ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నానని, ఆ ఉద్యోగాన్ని తన కుమారుడికి ఇప్పించాలని పెడన మండలం కొప్పల్లి వీఆర్ఏ పొంగులేటి జయరాజు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. -
41 మంది తహశీల్దార్ల బదిలీ
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇతర జిల్లాల నుంచి తాత్కాలిక బదిలీపై వచ్చిన తహశీల్దార్లలో 41 మందిని వారి సొంత జిల్లాలకు బదిలీ చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఆదివారం తెలిపారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మూడేళ్లు ఒకే ప్రాంతంలో విధుల్లో ఉన్న తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా జిల్లా నుంచి 38 మంది తహశీల్దార్లు ఇతర జిల్లాలకు, ఇతర జిల్లాల నుంచి 42 మంది ఇక్కడికి బదిలీ అయ్యారు. ఇక్కడికి వచ్చినవారిలో ఒక తహశీల్దారు తన బదిలీ ఆగస్టులో ఉండటంతో ఇక్కడే ఉంటానని కలెక్టర్‌ను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఆయన మినహా 41 మంది తహశీల్దార్లు తిరిగి తమ జిల్లాలకు వెళ్లిపోనున్నారు. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు రెండు రోజుల్లో జిల్లాలో విధుల్లో చేరే అవకాశముంది. ఎంపీడీవోల బదిలీల అంశంపై ఆదేశాలు రావాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు. -
ఓటరు దరఖాస్తులు 75 వేలు
కలెక్టర్ వెల్లడి 19 లోపు పరిశీలన పూర్తి 23న అభ్యర్థులకు జాబితాల పంపిణీ తిరువూరు, న్యూస్‌లైన్ : కొత్తగా ఓటుహక్కు కోరుతూ జిల్లాలో 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. గురువారం తిరువూరు వచ్చిన ఆయన స్థానిక తహశీల్దారు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత జనవరి 31 నాటికి ప్రకటించిన ఓటర్ల జాబితాకు అదనంగా కొత్త ఓటర్ల పేర్లు చేరుస్తామని చెప్పారు. ఈ నెల 19 లోపు దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందన్నారు. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ తాజా ఓటర్ల జాబితాలు అందజేస్తామన్నారు. ఓటర్ల జాబి తాలో ఫొటోలు తారుమారైనా, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటుహక్కున్నా నిర్దిష్ట నమూనాలో ఫిర్యాదు చేస్తేనే చర్య తీసుకోవడం సాధ్యపడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో మోడల్ పోలింగ్ కేంద్రం... జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పాటు చేస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ఈ మోడల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు వరుసలో నిలబడే అవసరం లేకుండా సీటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. త్వరగా ఓటు వేసేందుకు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఎంపిక చేస్తారన్నారు. తిరువూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంకటసుబ్బయ్య, సహాయ రిటర్నింగ్ అధికారి రియాజ్హుస్సేన్లతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన తిరువూరు టౌన్ : అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాటుచేసిన తిరువూరులోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి సరఫరా చేసేందుకు అవసరమైన రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్సులు పాఠశాల ఆవరణలోకి వచ్చి వెళ్లేందుకు వీలుగా ప్రధాన గేటు వెడల్పు చేయాలని, ఇందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని కలెక్టరు వెల్లడించారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంకటసుబ్బయ్య, సహాయ రిటర్నింగ్ అధికారి రియాజ్‌హుస్సేన్ పాల్గొన్నారు. -
9 మంది విద్యార్థుల అస్వస్థత
ఉయ్యూరు/ పమిడిముక్కల, న్యూస్‌లైన్ : కలుషితాహారం తిని తొమ్మిది మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపునొప్పి.. వాంతులతో విలవిలలాడిపోతూ ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాఠశాల ఉపాధ్యాయుల బాధ్యతారాహిత్యానికి నిలువుటద్దంగా మారిన ఈ ఘటన పమిడిముక్కల మండలం హనుమంతపురం (గడ్డిపాడు)లో శనివారం జరిగింది. తమ పిల్లల ఆక్రందనలు చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పేద విద్యార్థులంటే అంత చులకనా అంటూ ఉపాధ్యాయులపై మండిపడ్డారు. మధ్యాహ్నం ఘటన జరిగితే తమకు చెప్పకుండా దాస్తారా.. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కలుషిత ఆహార ఘటన తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు వెంటనే స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలుషితాహారం పెట్టిన మధ్యాహ్న భోజనం ఏజెన్సీని రద్దు చేస్తూ ఘటనపై విచారణ జరపాల్సిందిగా డీఈఓ దేవానందరెడ్డిని ఆదేశించారు. ఘటన జరిగిందిలా... హనుమంతపురం జెడ్పీ పాఠశాలలో మొత్తం 126 మంది విద్యార్థులుండగా శనివారం మధ్యాహ్నం 78 మంది మధ్యాహ్న భోజనం తిన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు అన్నం, పప్పు, చారు విద్యార్థులకు వడ్డించారు. భోజనం చేస్తున్న క్రమంలో పప్పులో బల్లి ఉండటాన్ని గమనించిన విద్యార్థులు వెంటనే సమాచారాన్ని నిర్వాహకులకు, పాఠశాల హెచ్ఎం సీతామహాలక్ష్మికి తెలియజేశారు. అప్పటికే చాలామంది విద్యార్థులు ఆహారం తీసుకోవడం పూర్తయింది. ఉన్న భోజన పదార్థాలను పారబోయించి వెంటనే అక్కడి వైద్య సిబ్బందికి హెచ్ఎం సమాచారం అందించారు. పాఠశాలకు వచ్చిన ఏఎన్ఎం లిల్లీరాణి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. పాఠశాల ముగిసేవరకు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీలేదని నిర్ధారించుకుని సాయంత్రం ఐదు గంటల తరువాత ఇళ్లకు పంపారు. కడుపునొప్పితో విలవిల... ఇంటికి చేరుకున్న విద్యార్థులు గ్రామంలో ట్యూషన్‌కు వెళ్లారు. వెళ్లిన కొద్దిసేపటికే తొమ్మిది మందికి కడుపునొప్పి వచ్చింది. దీంతో వారంతా ట్యూషన్ మాస్టర్ శ్రీనివాసరాజుకు విషయం తెలియజేశారు. కడుపునొప్పితో పాటు ఒకరి తర్వాత ఒకరికి వాంతులై కళ్లు తిరుగుతుండటంతో ట్యూషన్ మాస్టర్ విద్యార్థుల తల్లిదండ్రులు, 108కు సమాచారం అందించారు. 108 వచ్చేసరికి విద్యార్థుల పరిస్థితి విషమిస్తుందనే ఆందోళనతో వారిని వెంటనే ఆటోలో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్లస్టర్ అధికారి బాలకృష్ణప్రసాద్, వైద్యులు రవిపాల్, మధుసూదనరావు, కపిలేశ్వరపురం పీహెచ్సీ వైద్యాధికారి బీ లలిత విద్యార్థులకు చికిత్స అందించారు. వైద్యసేవలు అందటంతో విద్యార్థుల పరిస్థితి మెరుగుపడింది. ఆహారం కలుషిత కావటం వల్లే వారు అస్వస్థతకు గురయ్యారని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ రవిపాల్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అపాయం లేదని కపిలేశ్వరపురం వైద్యాధికారి లలిత చెప్పారు. తహశీల్దార్ బీ ఆశియ్య, టౌన్ ఎస్ఐ జానకీరామయ్య ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. నో ప్రాబ్లమ్.. బీ కూల్.. విద్యార్థులు తీవ్ర అస్వస్థతతో విలవిలలాడుతుంటే పాఠశాల ఉపాధ్యాయుడు టేకిట్ ఈజీ అన్నట్లు వ్యవహరించటంపై ఒక్కసారిగా వారి తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి బెడ్డుపై తమ పిల్లలు వామ్మో.. నాయినో.. అంటూ బాధపడుతుంటే నో ప్రాబ్లమ్.. బీ కూల్.. అంటావా అంటూ ఒక్కసారిగా ఉపాధ్యాయుడి పైకి దూసుకువెళ్లారు. మధ్యాహ్నం కలుషిత ఆహారం తింటే తమకెందుకు చెప్పలేదంటూ నిలదీశారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు. అస్వస్థతకు గురైన విద్యార్థులు వీరే.. 10వ తరగతికి చెందిన జువ్వనపూడి దివ్యభారతి, గురివిందపల్లి సంధ్యారాణి, ఇంటూరి దివ్య, కొడమంచిలి లావణ్య, తంగిరాల సిరివెన్నెల, గురివిందపల్లి వినయకుమారి, కొక్కిలిగడ్డ కిన్నెర, కొడాలి శ్రావణి, 7వ తరగతికి చెందిన కలపాల మధుప్రియలు అస్వస్థతకు గురైనవారిలో ఉన్నారు. అస్వస్థతకు గురైన తొమ్మిది మంది విద్యార్థినులే. విద్యార్థుల అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరరావులు విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను కోరారు. -
నేడు కలెక్టర్‌గా రఘునందన్‌రావు బాధ్యతల స్వీకారం
నేడు కలెక్టర్‌గా రఘునందన్‌రావు బాధ్యతల స్వీకారం కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : విజయదశమి ఘడియల్లో సోమ వారం బాధ్యతలు చేపడుతున్న కొత్త కలెక్టర్ ఎం.రఘునందన్‌రావుకు జిల్లా లోని పాత సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ యంత్రాం గాన్ని ప్రజలకు అనుకూలంగా నడిపిం చాల్సిన ఆయనకు సమస్యలు సవాళ్లు విసరనున్నాయి. ఇంతకుముందు కలెక్టర్లుగా పనిచేసిన ఎంతోమంది జిల్లా ప్రజల మన్ననలు అందుకుంటే, మరి కొంతమంది ప్రజలకు దూరంగానే మొక్కుబడిగా విధులు నిర్వర్తించారు. వారంతా పాలనాయంత్రాంగంపై పట్టు లేకపోవడం, ప్రధాన సమస్యలపై దృష్టిపెట్టకపోవడం, కీలక అభివృద్ధి సాధించలేకపోవడం వంటి విషయాల్లో జనాదరణ పొందలేకపోయారు. ఇంకొంతమంది జిల్లాలో పనిచేసి ఇతర ప్రాంతాలకు బదిలీఅయినప్పటికీ ప్రజలు వారి ని మరవలేకపోతున్నారు. కలెక్టర్‌గా పనిచేసిన ఎస్.ఎ.ఎం.రిజ్వీ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరుతెచ్చుకున్న బుద్ధప్రకాష్ పనితీరు జిల్లాలోని ప్రజాప్రతినిధులకు నచ్చకపోవడంతో వచ్చిన 15 నెలల్లోనే సాగనంపారు. సమస్యలు ఇవీ.. జిల్లాలో రాజకీయ, అధికార వర్గాలను శాసించే స్థాయిలో ఉన్న ఇసుక మాఫియా ఇబ్బందికరంగా మారింది. కోస్తాతీరంలోను, కొల్లేరు నడిబొడ్డున ఇబ్బడిముబ్బడిగా తవ్వుతున్న చెరువులు అధికార యంత్రాంగానికి సవాళ్లుగా మారాయి. అక్రమ చెరువుల క్రమబద్ధీకరణ కూడా అధికారులకు తలనొప్పిగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని రోడ్లు ధ్వంసమయ్యాయి. గ్రామాభివృద్ధి కోసం ఇటీవల ఎన్నికైన పంచాయతీ పాలకవర్గాలు నిధులు ఇస్తాయని ఎదురుచూస్తున్నారు. మున్సిపాలిటీల్లో దాదాపు రెండేళ్లుగా పాలకవర్గాలు లేక అభివృద్ధి కుంటుపడింది. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన శాఖలకు పూర్తిస్థాయి బాధ్యులు లేక ఇన్‌చార్జులతోనే పాలన మొక్కుబడిగా సాగుతోంది. జిల్లాలో శోభిల్లుతున్న మంగినపూడి బీచ్, హంసలదీవి సాగరసంగమం, కొల్లేరుతీరం, వేదాద్రి, కూచిపూడి తదితర ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న బందరులడ్డు, రోల్డుగోల్డు పరిశ్రమ, కలంకారీ, కొండపల్లి బొమ్మలు వంటి వాటికి మరింత తోడ్పాటునందించాల్సిఉంది. గరికపాడు వద్ద స్వాగతం.. జగ్గయ్యపేట : జిల్లాకు వస్తున్న రఘునందన్‌రావుకు ఆదివారం జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద అధికారులు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించేందుకు హైదరాబాదు నుంచి విజ యవాడ వస్తుండగా జిల్లా సరిహద్దులో ఆయన్ను అధికారులు కలిశారు. స్వాగ తం పలికినవారిలో ఎంపీడీవో జయచంద్ర, తహశీల్దార్ బాలకృష్ణారెడ్డి, చిల్లకల్లు ఎస్.ఐ. అబ్దుల్నబీ, వీఆర్వోలు రాటకొండ శ్రీనివాసరావు, నారాయణరావు, వెంకటరత్నం తదితరులున్నారు.