ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇతర జిల్లాల నుంచి తాత్కాలిక బదిలీపై వచ్చిన తహశీల్దార్లలో 41 మందిని వారి సొంత జిల్లాలకు బదిలీ చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఆదివారం తెలిపారు.
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇతర జిల్లాల నుంచి తాత్కాలిక బదిలీపై వచ్చిన తహశీల్దార్లలో 41 మందిని వారి సొంత జిల్లాలకు బదిలీ చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఆదివారం తెలిపారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మూడేళ్లు ఒకే ప్రాంతంలో విధుల్లో ఉన్న తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.
ఈ ప్రక్రియలో భాగంగా జిల్లా నుంచి 38 మంది తహశీల్దార్లు ఇతర జిల్లాలకు, ఇతర జిల్లాల నుంచి 42 మంది ఇక్కడికి బదిలీ అయ్యారు. ఇక్కడికి వచ్చినవారిలో ఒక తహశీల్దారు తన బదిలీ ఆగస్టులో ఉండటంతో ఇక్కడే ఉంటానని కలెక్టర్‌ను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఆయన మినహా 41 మంది తహశీల్దార్లు తిరిగి తమ జిల్లాలకు వెళ్లిపోనున్నారు. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు రెండు రోజుల్లో జిల్లాలో విధుల్లో చేరే అవకాశముంది. ఎంపీడీవోల బదిలీల అంశంపై ఆదేశాలు రావాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు.