రుణాలన్నీ రద్దు చేయండి | Cancel loans | Sakshi
Sakshi News home page

రుణాలన్నీ రద్దు చేయండి

Published Tue, Jul 22 2014 1:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రుణాలన్నీ రద్దు చేయండి - Sakshi

రుణాలన్నీ రద్దు చేయండి

చిలకలపూడి (మచిలీపట్నం) : ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి షరతులు లేకుండా రైతులు, డ్వాక్రా సభ్యుల రుణాలన్నీ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి కలెక్టర్ రఘునందన్‌రావును కోరారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు సోమవారం జెడ్పీ సీఈవో సుదర్శనం, కలెక్టర్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి డ్వాక్రా సభ్యులు రుణాలు చెల్లించడం లేదని, వారంతా భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఉన్న మండలాల్లో ప్రొటోకాల్‌ను పాటించడంలేదని పద్మావతి వివరించారు.

మండలంలో అధికారిక కార్యక్రమాలపై సమాచారం కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రొటోకాల్ విషయంపై ఎంపీడీవోలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కలెక్టర్, జెడ్పీ సీఈవోను కలిసిన వారిలో జెడ్పీటీసీ సభ్యులు బాణావతు రాజు (నూజివీడు), మీగడ ప్రతాప్‌కుమార్ (నందివాడ), డీఎన్‌ఎన్ శ్రీనుబాబు (పెడన), మూల్పూరి హరీష (పెదపారుపూడి), చిమటా విజయశాంతి (మొవ్వ), ఆ పార్టీ నాయకులు రాజులపాటి మురళీ, తాతా శేషుబాబు, మూల్పూరి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
 
కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ సరికాదు


రైతు కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ చేస్తామని, అది కూడా రూ.1.50లక్షలలోపు మాత్రమే అని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం దారుణమని తాతినేని పద్మావతి విమర్శంచారు. కలెక్టర్ జెడ్పీ సీఈవోను కలిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రాష్ట్ర అర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం.. ఇప్పుడు డబ్బుల్లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  
 
 వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు ప్రస్తావించిన కొన్ని సమస్యలు
 తోట్లవల్లూరులోని జెడ్పీ హైస్కూల్లో తాగునీటి సదుపాయం కల్పించాలి.
 
 నందివాడ మండలం కోలుకొండ గ్రామంలో 165 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలాన్ని మెరక చేసేందుకు సమీపంలోని చేపల చెరువుల మట్టిని సరఫరా చేయాలి.
 
 వీరులపాడు మండలం జుజ్జూరులో బీసీ సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేలా చొరవచూపాలని, వెల్లంకి గ్రామంలో వైరా, కట్టలేరుల్లో ఇసుక ర్యాంపులను ప్రారంభించాలని జెడ్పీటీసీ సభ్యురాలు షేక్ ఆహనాజ్‌బేగం కోరారు.  
 
 పెదపారుపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో కూర్చునేందుకు బెంచీలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కోసం వంట షెడ్డు నిర్మించాలని విజ్ఞప్తిచేశారు.
 
 జెడ్పీటీసీ సభ్యులు వివరించిన అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఏమైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement