Tatineni Padmavati
-
టీడీపీకి కలెక్టర్ వెన్నుదన్ను : తాతినేని
పెనమలూరులో రోడ్ల నిర్మాణానికి కమిటీ వేశారని, ఆ కమిటీ కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేశారని, ఖాతాలో ఉన్న డబ్బును పంచాయతీ, మండలం, జెడ్పీకి జమ చేయకుండానే పనులు ఎలా చేశారని తాతినేని నిలదీశారు. యనమలకుదురు క్వారీ నుంచి రోడ్ల నిర్మాణం పేరుతో ఇసుకను తవ్వి అనేక లారీలను బయటకు పంపారని, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న పెనమలూరు నియోజకవర్గంలో ప్రభుత్వం అనుమతి లేకుండా రోడ్ల నిర్మాణం ఎలా చేస్తారని అడిగారు. యనమలకుదురు క్వారీ నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా, ఆన్లైన్లో ఫిర్యాదు పంపినా ఎందుకు స్పందించలేదని కలెక్టర్‌ను ఆమె ప్రశ్నించారు. టీడీపీకి అనుకూలంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. యనమలకుదురు క్వారీకి అనుమతులు ఉన్నాయో, లేదో చెప్పాలని కలెక్టర్‌ను ఆమె కోరారు. పరిశీలించి చెబుతానని కలెక్టర్ చెప్పడం గమనార్హం. క్వారీల నుంచి ఇసుకను తరలించే లారీలకు జీపీఎస్ పద్ధతి అమలుచేయడం లేదని, జీపీఎస్ స్టిక్కర్లు లేని లారీల ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ పద్మావతి ఓ వీడియోను పోడియం వద్దకు వెళ్లి కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్‌కు చూపారు. 90 శాతం వాహనాలకు జీపీఎస్ పద్ధతిని అమలు చేస్తున్నామని, మిగిలిన 10 శాతం త్వరలో పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. దీనిపై పద్మావతిని ఉద్దేశించి గద్దె అనురాధ స్పందిస్తూ.. మీకు అభివృద్ధి జరగడమంటే ఇష్టం లేదు.. అందుకే కలెక్టర్‌పైనా వ్యాఖ్యలు చేస్తున్నారు.. మీరలా మాట్లాడకూడదు.. ఈ ఒక్క కారణంతో మిమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేయవచ్చు..’ అని పేర్కొన్నారు. -
ఇసుక దుమారం
అక్రమ తరలింపుపై నిలదీసిన వైఎస్సార్ సీపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ క్షమాపణలు చెప్పాలంటూ పోడియం వద్ద విపక్షం బైఠాయింపు వాడీవేడిగా జెడ్పీ సమావేశం ‘సిగ్గు లేకుండా గాలి మాటలు మాట్లాడుతున్నారు.. ఆ ఊరికి వెళ్లండి.. జనం మిమ్మల్ని రాళ్లతో కొడతారు. మీకు ప్రజల సమస్యలతో పనిలేదు. మిమ్మల్ని జైలులో పెట్టాల్సిందే.. పదేళ్లుగా దోచుకున్నారు..’ అంటూ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జెడ్పీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. యనమలకుదురు రీచ్ నుంచి ఇసుక అక్రమ తరలింపుపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకురాలు తాతినేని పద్మావతి నిలదీసినప్పుడు సమావేశంలో గందరగోళం నెలకొంది. అప్పడు బోడే ప్రసాద్ చేసిన పై వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. మచిలీపట్నం : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన మంగళవారం జరిగింది. గ్రామీణాభివృద్ధి శాఖపై చర్చ జరిగినప్పుడు జెడ్పీలో ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి మాట్లాడుతూ యనమలకుదురు ఇసుకరేవు నుంచి ఇసుకను అక్రమంగా తొలగించి పెనమలూరులో 50 రోడ్లు నిర్మించారన్నారు. దీనిపై కథనం ఓ పత్రికలో వచ్చిందంటూ ఆ పత్రికను చూపారు. యనమలకుదురు ఇసుక రేవుకు అనుమతి ఉందో, లేదో చెప్పాలని కలెక్టర్‌ను నిలదీశారు. ప్రభుత్వంతో పనిలేకుండా కమిటీ పేరుతో రోడ్ల నిర్మాణానికంటూ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించారన్నారు. ఆ సమయంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళాసభ్యులపై దూషణకు దిగిన ఎమ్మెల్యే క్షమాపణ చెప్పే వరకు సభను జరగనివ్వబోమంటూ ఆమెపాటు పలువురు మహిళా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు పోడియం వద్ద బైఠాయించారు. దీనికి బోడే ప్రసాద్.. తాను మహిళా సభ్యులను సిగ్గు లేదని అనలేదని, అన్నట్లు భావిస్తే సారీ.. అని చెప్పారు. దీంతో సభ్యులు పోడియం వద్ద నుంచి నిష్ర్కమించారు. ఆ తర్వాత బోడే ప్రసాద్ పత్రికలో వచ్చిన కథనాన్ని సమావేశంలో చదివి వినిపించారు. అనంతరం ఆయన కాల్‌మనీ వ్యవహారంపై మాట్లాడతానని కోరారు. దానికి మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ కంచి రామారావు జిల్లా పరిషత్‌లో ప్రజాసమస్యలపై చర్చించాలని, ఒక్కొక్కసారి సభ జరుగుతున్న తీరు చూస్తుంటే తాము ఇలాంటి సంఘటనలు చూడటానికే బతికున్నామా అనే బాధ కలుగుతోందన్నారు. అవినీతి రుజువు చేయండి: మంత్రి రవీంద్ర పింఛన్లు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, ఎక్కడైనా అవినీతి జరిగితే ఆధారాలతో రుజువు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇసుక క్వారీలను డ్వాక్రా సంఘాలకు అప్పగించడంతో కొంతమంది పనికట్టుకుని నిర్వీర్యం చేసిన మాట వాస్తవమన్నారు. ఎవరేం మాట్లాడారు.. ఠపింఛన్లు, నూతన గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల మంజూరులో జన్మభూమి కమిటీ సభ్యులను పక్కనపెట్టి ఎంపీడీవోలు, తహశీల్దార్లకు బాధ్యతలు అప్పగించాలని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు సంబంధించి కనీస సమాచారాన్ని అధికారులు ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులకు ఇవ్వటం లేదని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌అప్పారావు మాట్లాడుతూ పశ్చిమకృష్ణాలోని మండలాలకు నాగార్జునసాగర్ నీటిని ఎప్పటికి విడుదల చేస్తారని ప్రశ్నించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా మొక్కలు పంపిణీ చేస్తామని చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్ త్వరితగతిన మొక్కలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పారు.పుష్కరాల ఏర్పాట్లు, విద్యాశాఖపై సమీక్ష జరిగిన సమయంలో ఎమ్మెల్సీ ఎ.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వేతన బడ్జెట్‌ను తీసుకురావడంలో డీఈవో కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. డీఈవో కార్యాలయ ఉద్యోగులు 20 సంవత్సరాలుగా ఒకే సీటులో పనిచేస్తున్నారని, డీఈవో కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇసుక రీచ్‌ల వ్యవహారంపై కలెక్టర్ దృష్టిసారించి అక్రమాలను అరికట్టాలన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవచూపాలన్నారు. -
సమన్వయంతో పనిచేద్దాం
వాడీవేడిగా జెడ్పీ తొలి సమావేశం జిల్లా అభివృద్ధికి కలిసి ముందుకు సాగుదాం ప్రజాప్రతినిధుల పిలుపు స్టాండింగ్ కమిటీల ఏర్పాటుపై దుమారం పిన్నమనేని, కేఎన్నార్, తంగిరాలలకు నివాళి మచిలీపట్నం : రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని, నూతన రాష్ట్రంలో కృష్ణా జిల్లా కీలకంగా మారనుందని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అభిప్రాయపడ్డారు. జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సమన్వయంతో కృషిచేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య ఆదివారం జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన జరిగింది. జెడ్పీ హాలులో జరిగిన ఈ సమావేశం సాదాసీదాగానే ప్రారంభమైనప్పటికీ స్టాండింగ్ కమిటీల ప్రకటన అనంతరం వేడెక్కింది. నందిగామ ఉప ఎన్నిక కారణంగా కోడ్ అమల్లో ఉండటంతో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, అధికారుల పరిచయ కార్యక్రమం, స్టాండింగ్ కమిటీల ఏర్పాటుతోనే ఈ సమావేశం ముగిసింది. ఉదయం 11గంటలకు ప్రారంభమైన సమావేశంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని రాష్ట్ర విభజన అనంతరం జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ ఏడు స్టాండింగ్ కమిటీల జాబితాలను ప్రకటించారు. స్టాండింగ్ కమిటీల ఎంపిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, పార్టీ పరంగా ఏర్పాటు చేశారని వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. స్టాండింగ్ కమిటీల నియామకాన్ని పునఃసమీక్షించాలని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కోరడంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యుల మధ్య స్టాండింగ్ కమిటీల నియామకంపై కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగింది రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జెడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, బడి పిలుస్తోంది, ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు తదితర పథకాలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అక్టోబరు రెండో తేదీ నుంచి నిరంతరాయంగా గృహ అవసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలను వేగంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండటంతో సాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. పులిచింతల, పోలవరం పూర్తి చేస్తామని, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తామని ప్రకటించారు. బందరు పోర్టు అభివృద్ధితోపాటు జిల్లాలో జరిగే పారిశ్రామిక అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చించి తమకు నివేదిక అందజేస్తే ప్రధానమంత్రితో మాట్లాడి నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) హామీ ఇచ్చారు. జెడ్పీ ఆదాయం వృద్ధికి కృషి : అనూరాధ జిల్లా పరిషత్ ఆదాయాన్ని పెంచి, ఆస్తులను పరిరక్షించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడదామని జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా సమావేశంలో ప్రజాసమస్యలపై సమీక్ష నిర్వహించలేకపోతున్నామని, మరో నెల రోజుల్లో పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జెడ్పీకి ఆస్తులు ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులపై ఉందన్నారు. జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేక కమిటీని నియమిస్తామని తెలిపారు. ఇసుక సీనరేజ్, జెడ్పీ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లా పరిషత్‌కు చెందిన దుకాణ సముదాయాల అద్దెలు పెంచి పది సంవత్సరాలు గడిచిందని, వీటి పెంపునకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాలనలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జిల్లా పరిషత్ పాఠశాలల్లో నైట్‌వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేస్తామని ఆమె తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు. అనంతరం నూతనంగా ఎంపికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు జిల్లా స్థాయి అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా చేపట్టే పనులు, ఆదాయ వనరులు తదితర అంశాలపై అధికారులు వివరించారు. ఈ సమావేశంలో పెడన, నూజివీడు, తిరువూరు ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు, మేకా ప్రతాప్ అప్పారావు, కె.రక్షణనిధి, ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కంచి రామారావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. మంత్రులు ఉమ, కామినేని గైర్హాజరు జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. మంత్రి కొల్లు రవీంద్ర ఒక్కరే హాజరయ్యారు. తొలుత ఇటీవల మరణించిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు పిన్నమనేని కోటేశ్వరరావు, కుక్కల నాగేశ్వరరావుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు విడతలుగా మౌనం పాటించారు. -
పోలీసుల వైఖరిలో మార్పు తీసుకురండి
కూచిపూడి ఘటనపై దర్యాప్తు చేయించండి ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు టీడీపీ నేత వర్ల రామయ్య ఆగడాలకు అడ్డుకట్ట వేయండి ఎస్పీకి పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, పేర్ని నాని వినతి మచిలీపట్నం : జిల్లాలో టీడీపీ నాయకుల ఆగడాలకు హద్దులేకుండా పోతోందని, వారిని అదుపులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పామర్రు ఎమ్మెల్యే , అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన, వైఎస్సార్ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని నాని, జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తదితరులు ఎస్పీ జి.విజయకుమార్‌ను కోరారు. బుధవారం ఎస్పీని కలిసిన వైఎస్సార్ సీపీ నాయకులు టీడీపీ నేతల అగడాలపై ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీని కచ్చితంగా అమలుచేయాలని కోరుతూ ఆరు రోజుల క్రితం కూచిపూడిలోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన శాంతియుతంగా ధర్నా చేస్తుండగా, టీడీపీ నాయకులు పోటీగా ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారని తెలిపారు. తనను, వైఎస్సార్ సీపీ నాయకులను పరుషపదజాలంతో దూషించారని చెప్పారు. తాము కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి పోలీసులు తమ వద్దే ఉన్నారని ఆమె తెలిపారు. తమను అకారణంగా దూషించిన టీడీపీ కార్యకర్తలపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లే సమయంలోనూ పోలీసులు వెంట వచ్చారని వివరించారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ నేత వర్ల రామయ్యతో కలసి వచ్చి తాము టీడీపీ కార్యకర్తలను కులం పేరుతో దూషించామని, చెప్పుతో కొట్టినట్లు తప్పుడు ఫిర్యాదు చేశారని ఆమె వివరించారు. ఆద్యంతం పోలీసులు తమ వెంటే ఉన్నారని, తాము ఏం చేసిందీ పోలీసులు మొత్తం చూశారని, ఈ విషయంపై సమగ్ర విచారణ చేయించాలని కోరారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన టీడీపీ నేత వర్ల రామయ్య డీఎస్పీ, సీఐలను తనదైన శైలిలో బెదిరించారని చెప్పారు. ‘ప్రభుత్వం మాదే ఉంది. మా మాటే వినాలి..’ అంటూ పోలీసు అధికారులపై విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో టీడీపీ నాయకులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పేర్ని నాని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. బందరు నియోజకవర్గం శివగంగలోనూ పేదలు నివసిస్తున్న గుడిసెలు ఖాళీ చేయించేందుకు ఇనగుదురుపేట పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని, ఈ విషయంపైనా దర్యాప్తు చేయించాలని కోరారు. తాతినేని పద్మావతి మాట్లాడుతూ రైతుల పక్షాన కూచిపూడిలో తాము ధర్నా చేస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకోవటమే కాకుండా తమపై తప్పుడు ఫిర్యాదుచేశారని పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఆయా సంఘటనలపై విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కూచిపూడి సంఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లను ల్యాప్‌టాప్‌లో చూపించారు. సీడీని ఎస్పీకి అందజేశారు. ఏఎస్పీ బీడీవీ సాగర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రుణమాఫీ జాప్యం చేస్తున్నారు ఎస్పీని కలిసిన అనంతరం ఉప్పులేటి కల్పన, పేర్ని నాని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు వివిధ బ్యాంకుల ద్వారా రూ.87వేల కోట్లను పంట రుణాలుగా తీసుకున్నారని, టీడీపీ ప్రభుత్వం మాత్రం డ్వాక్రా సంఘాల రుణాలతో కలిపి రూ.35 వేల కోట్లను మాఫీ చేస్తామని చెబుతోందని విమర్శించారు. పంట రుణాలను రీషెడ్యూలు చేస్తామని ఒకసారి, మాఫీ చేస్తామని మరోసారి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, బ్యాంకుల్లో రైతులకు అప్పులు ఇవ్వటం లేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ సీపీ నాయకులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లెం వెంకటేశ్వరరెడ్డి, పెదపారుపూడి జెడ్పీటీసీ సభ్యురాలు మూల్పూరి హరీష, వైఎస్సార్ సీపీ నాయకుడు మారుమూడి విక్టర్‌ప్రసాద్, పెడన 9వ వార్డు కౌన్సిలర్ చంద్రబాబు పాల్గొన్నారు. -
రుణాలన్నీ రద్దు చేయండి
చిలకలపూడి (మచిలీపట్నం) : ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి షరతులు లేకుండా రైతులు, డ్వాక్రా సభ్యుల రుణాలన్నీ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి కలెక్టర్ రఘునందన్‌రావును కోరారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు సోమవారం జెడ్పీ సీఈవో సుదర్శనం, కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి డ్వాక్రా సభ్యులు రుణాలు చెల్లించడం లేదని, వారంతా భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఉన్న మండలాల్లో ప్రొటోకాల్‌ను పాటించడంలేదని పద్మావతి వివరించారు. మండలంలో అధికారిక కార్యక్రమాలపై సమాచారం కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రొటోకాల్ విషయంపై ఎంపీడీవోలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కలెక్టర్, జెడ్పీ సీఈవోను కలిసిన వారిలో జెడ్పీటీసీ సభ్యులు బాణావతు రాజు (నూజివీడు), మీగడ ప్రతాప్‌కుమార్ (నందివాడ), డీఎన్ఎన్ శ్రీనుబాబు (పెడన), మూల్పూరి హరీష (పెదపారుపూడి), చిమటా విజయశాంతి (మొవ్వ), ఆ పార్టీ నాయకులు రాజులపాటి మురళీ, తాతా శేషుబాబు, మూల్పూరి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ సరికాదు రైతు కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ చేస్తామని, అది కూడా రూ.1.50లక్షలలోపు మాత్రమే అని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం దారుణమని తాతినేని పద్మావతి విమర్శంచారు. కలెక్టర్ జెడ్పీ సీఈవోను కలిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రాష్ట్ర అర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం.. ఇప్పుడు డబ్బుల్లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు ప్రస్తావించిన కొన్ని సమస్యలు తోట్లవల్లూరులోని జెడ్పీ హైస్కూల్లో తాగునీటి సదుపాయం కల్పించాలి. నందివాడ మండలం కోలుకొండ గ్రామంలో 165 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలాన్ని మెరక చేసేందుకు సమీపంలోని చేపల చెరువుల మట్టిని సరఫరా చేయాలి. వీరులపాడు మండలం జుజ్జూరులో బీసీ సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేలా చొరవచూపాలని, వెల్లంకి గ్రామంలో వైరా, కట్టలేరుల్లో ఇసుక ర్యాంపులను ప్రారంభించాలని జెడ్పీటీసీ సభ్యురాలు షేక్ ఆహనాజ్బేగం కోరారు. పెదపారుపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో కూర్చునేందుకు బెంచీలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కోసం వంట షెడ్డు నిర్మించాలని విజ్ఞప్తిచేశారు. జెడ్పీటీసీ సభ్యులు వివరించిన అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఏమైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్‌గా తాతినేని
మచిలీపట్నం : జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేతగా తోట్లవల్లూరు జెడ్పీటీసీ సభ్యురాలు తాతినేని పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీల సమావేశం శనివారం స్థానిక ఆర్కే ప్యారడైజ్‌లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేతగా పద్మావతి పేరును పెదపారుపూడి జెడ్పీటీసీ సభ్యురాలు మూల్పూరి హరీష ప్రతిపాదించగా జి.కొండూరు జెడ్పీటీసీ సభ్యుడు కాజ బ్రహ్మయ్య బలపరిచారు. దీంతో ఆమె జెడ్పీ ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ప్రకటించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష పాత్రను విజయవంతంగా పోషిస్తామని, జెడ్పీ పాలకులు ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే నిలదీస్తామని తెలిపారు.