సమన్వయంతో పనిచేద్దాం | Lets work is co-ordinated | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేద్దాం

Published Mon, Sep 1 2014 1:41 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

Lets work is co-ordinated

  • వాడీవేడిగా జెడ్పీ తొలి సమావేశం
  •  జిల్లా అభివృద్ధికి కలిసి ముందుకు సాగుదాం
  •  ప్రజాప్రతినిధుల పిలుపు
  •  స్టాండింగ్ కమిటీల ఏర్పాటుపై దుమారం
  •  పిన్నమనేని, కేఎన్నార్, తంగిరాలలకు నివాళి
  • మచిలీపట్నం : రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని, నూతన రాష్ట్రంలో కృష్ణా జిల్లా కీలకంగా మారనుందని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అభిప్రాయపడ్డారు. జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సమన్వయంతో కృషిచేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య ఆదివారం జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన జరిగింది.
    జెడ్పీ హాలులో జరిగిన ఈ సమావేశం సాదాసీదాగానే ప్రారంభమైనప్పటికీ స్టాండింగ్ కమిటీల ప్రకటన అనంతరం వేడెక్కింది. నందిగామ ఉప ఎన్నిక కారణంగా కోడ్ అమల్లో ఉండటంతో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, అధికారుల పరిచయ కార్యక్రమం, స్టాండింగ్ కమిటీల ఏర్పాటుతోనే ఈ సమావేశం ముగిసింది. ఉదయం 11గంటలకు ప్రారంభమైన సమావేశంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని రాష్ట్ర విభజన అనంతరం జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి పలు సూచనలు, సలహాలు అందజేశారు.

    అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ ఏడు స్టాండింగ్ కమిటీల జాబితాలను ప్రకటించారు. స్టాండింగ్ కమిటీల ఎంపిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, పార్టీ పరంగా ఏర్పాటు చేశారని వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. స్టాండింగ్ కమిటీల నియామకాన్ని పునఃసమీక్షించాలని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కోరడంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యుల మధ్య స్టాండింగ్ కమిటీల నియామకంపై కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
     
    రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగింది

    రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జెడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని కృషి చేస్తున్నారని చెప్పారు.

    రాష్ట్ర అభివృద్ధి కోసం పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, బడి పిలుస్తోంది, ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు తదితర పథకాలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అక్టోబరు రెండో తేదీ నుంచి నిరంతరాయంగా గృహ అవసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలను వేగంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు.

    శ్రీశైలం ప్రాజెక్టు నిండటంతో సాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. పులిచింతల, పోలవరం పూర్తి చేస్తామని, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తామని ప్రకటించారు. బందరు పోర్టు అభివృద్ధితోపాటు జిల్లాలో జరిగే పారిశ్రామిక అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చించి తమకు నివేదిక అందజేస్తే ప్రధానమంత్రితో మాట్లాడి నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) హామీ ఇచ్చారు.
     
    జెడ్పీ ఆదాయం వృద్ధికి కృషి : అనూరాధ

    జిల్లా పరిషత్ ఆదాయాన్ని పెంచి, ఆస్తులను పరిరక్షించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడదామని జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా సమావేశంలో ప్రజాసమస్యలపై సమీక్ష నిర్వహించలేకపోతున్నామని, మరో నెల రోజుల్లో పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జెడ్పీకి ఆస్తులు ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులపై ఉందన్నారు. జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేక కమిటీని నియమిస్తామని తెలిపారు.

    ఇసుక సీనరేజ్, జెడ్పీ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లా పరిషత్‌కు చెందిన దుకాణ సముదాయాల అద్దెలు పెంచి పది సంవత్సరాలు గడిచిందని, వీటి పెంపునకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాలనలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జిల్లా పరిషత్ పాఠశాలల్లో నైట్‌వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేస్తామని ఆమె తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు.
     
    అనంతరం నూతనంగా ఎంపికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు జిల్లా స్థాయి అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా చేపట్టే పనులు, ఆదాయ వనరులు తదితర అంశాలపై అధికారులు వివరించారు. ఈ సమావేశంలో పెడన, నూజివీడు, తిరువూరు ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు, మేకా ప్రతాప్ అప్పారావు, కె.రక్షణనిధి, ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కంచి రామారావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు.
     
    మంత్రులు ఉమ, కామినేని గైర్హాజరు

    జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. మంత్రి కొల్లు రవీంద్ర ఒక్కరే హాజరయ్యారు. తొలుత ఇటీవల మరణించిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు పిన్నమనేని కోటేశ్వరరావు, కుక్కల నాగేశ్వరరావుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు విడతలుగా మౌనం పాటించారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement