ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు
- జెడ్పీ సమావేశ తీరుపై వైఎస్సార్ సీపీ నాయకుల ఆగ్రహం
- 15 మంది సభ్యులు ఉన్నా ప్రాధాన్యత లేని కమిటీల్లో నియామకంపై అభ్యంతరం
మచిలీపట్నం : జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీల నియామకంలో అధికారపక్షం తన చిత్తానుసారం వ్యవహరించిందని వైఎస్సార్ సీపీ నాయకుడు సామినేని ఉదయభాను, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌అప్పారావు తదితరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా పరిషత్ వద్దకు వచ్చిన వారు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఉదయభాను మాట్లాడుతూ జిల్లా పరిషత్‌లో పనుల స్టాండింగ్ కమిటీలో వైఎస్సార్ సీపీకి చెందిన ఒక్కరికే సభ్యులుగా అవకాశం ఇవ్వడం అన్యాయమన్నారు. తమ పార్టీ నుంచి ఇద్దరు ఎస్సీ నియోజకవర్గాల నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలు ఉన్నా వారికి సాంఘిక సంక్షేమ స్టాండింగ్ కమిటీలో స్థానం కల్పించకపోవడం అధికార పార్టీ దురుద్దేశాన్ని చాటిచెబుతోందన్నారు.
వైఎస్సార్ సీపీకి 15 మంది జెడ్పీటీసీ సభ్యులు, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కేవలం రెండు స్టాండింగ్ కమిటీల్లోనే స్థానం కల్పించారని, ప్రాధాన్యత ఉన్న ఆర్థిక, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం కమిటీల్లో స్థానం కల్పించకపోవటం దారుణమన్నారు. స్టాండింగ్ కమిటీల నియామకంలో అవకతవకలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం మాట్లాడకుండా అధికార పక్షం కుట్ర చేస్తోందని, అదే ఆనవాయితీని జిల్లా పరిషత్ సమావేశంలోనూ, స్టాండింగ్ కమిటీల నియామకంలోనూ పాటిస్తూ ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
తాతినేని పద్మావతి మాట్లాడుతూ జిల్లా పరిషత్ సమావేశంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, అధికార పక్షం అవకతవకలకు పాల్పడితే కచ్చితంగా నిలదీస్తామన్నారు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన జిల్లా పరిషత్ సమావేశాన్ని ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఏర్పాటు చేసి మాట్లాడకుండా చేశారని అన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు.