భాస్కరరావు(ఫైల్)
మాజీమంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే అతడి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న భాస్కరరావు కుటుంబ సభ్యులు భాస్కరరావు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైన మంత్రి పేర్ని నాని
సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర రావు (57) దారుణ హత్యకు గురయ్యారు. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ప్రశాంతంగా ఉండే బందరు నడిబొడ్డున అందరూ చూస్తుండగా పట్టపగలు ఈ హత్య జరగడం జిల్లాలోనే సంచలనం రేపుతోంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే ఆయన అనుచరుడు చింతా చిన్ని పక్కా పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్టుగా భాస్కరరావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర రవాణా సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అనుచరునిగా ఉన్న మోకా భాస్కరరావును అతని రాజకీయ ప్రత్యర్థులు సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో చేపల మార్కెట్‌లో అత్యంత పాశవికంగా హత మార్చారు. నిత్యం రద్దీగా ఉండే కోనేరు సెంటర్‌కు కూతవేటు దూరంలో ఉన్న చేపల మార్కెట్‌లో జరుగుతున్న పనులను మంత్రి ఆదేశాల మేరకు పర్యవేక్షించి తిరిగి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్న సమయంలో అక్కడే మాటు వేసిన ప్రత్యర్థులు భాస్కరరావుపైకి దూసుకొచ్చి ఒక్క ఉదుటన తోసేసారు. దీంతో కిందపడిపోయిన భాస్కరరావు గుండెల్లో రెండు చోట్ల, పొట్టపై మరొక చోట కత్తితో పొడిచారు. ఆ సమయంలో జేబులో ఉన్న సెల్‌ఫోన్‌కు కత్తిపోటు తగలడంతో బ్యాటరీ పేలిపోయింది. దీంతో చొక్కాతో పాటు వంటిపైనా కాలిన గాయాలయ్యాయి. నేరుగా గుండెల్లో గురిచేసి పొడవడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిన భాస్కరరావును ఆటోలో హుటాహుటిన స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే అతను మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు.
భాస్కరరావు మృతదేహం వద్ద రోదిస్తున్న మంత్రి పేర్ని నాని, కుటుంబ సభ్యులు
కన్నీటి పర్యంతమైన పేర్ని నాని దంపతులు
తమ నాయకుడ్ని అత్యంత పాశవికంగా హతమార్చారని తెలుసుకున్న మార్కెట్‌యార్డు చైర్మన్ అచ్చాబా, పట్టణాధ్యక్షుడు షేక్ సలార్ దాదా, మండల కన్వీనర్ లంకే వెంకటేశ్వరరావులతో పాటు పెద్దఎత్తున పార్టీ శ్రేణులు ఆస్పత్రికి తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ఆస్పత్రికి చేరుకుని భాస్కరరావు మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య వెంకటేశ్వరమ్మ, కుమార్తె శిరీషలను ఓదార్చారు. హైదరాబాద్ ప్రయాణంలో ఉన్న మంత్రి పేర్ని నాని విషయం తెలియగానే హుటాహుటిన మచిలీపట్నం వచ్చి నేరుగా ఆస్పత్రికి చేరుకున్నారు. భాస్కరరావు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
ఎదుగుదలను చూసి ఓర్వలేకనే...
భాస్కరరావు తండ్రి ఒకసారి, భార్య వెంకటేశ్వరమ్మ రెండుసార్లు, ఆయన ఓసారి మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. మచిలీపట్నం మార్కెట్‌యార్డు చైర్మన్‌గా రెండు పర్యాయాలు సేవలందించారు. ప్రస్తుతం జరగబోతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా మరోసారి బరిలో నిలిచారు. భాస్కరరావు గెలుపును అడ్డుకోలేమని తెలియడంతో ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే టీడీపీకి చెందిన ప్రత్యర్థి పథకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టారు.తమ చుట్టూ నేర చరిత్ర కలిగిన వారిని పెంచి పోషిస్తే ఇలాంటి రాజకీయ హత్యలు జరిగే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఆయన (కొల్లు రవీంద్ర) విజ్ఞతకే వదిలేస్తున్నా
– పేర్ని నాని, రాష్ట్ర మంత్రి
పక్కా పథకం ప్రకారమే...
ఈ హత్యోదంతంలో ఇద్దరు కంటే ఎక్కువ మందే పాల్గొన్నట్టుగా అనుమానిస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి భాస్కరరావు కదలికలపై రెక్కీ నిర్వహించే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నాం. ప్రత్యక్ష సాకు‡్ష్యలు, సీసీ పుటేజ్ ఆధారంగా కేసు విచారణ చేపట్టాం. విచారణ కోసం మూడు బృందాలు, నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి. ఏఎస్పీ వకుల్ జిందాల్ సారథ్యంలో డీఎస్పీ మహ్మద్ బాషా కేసు విచారణ చేస్తున్నారు.
– ఎం.రవీంద్రనాథ్ బాబు, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment