కదలిక లేని బందరు పోర్టు
మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణంపై ప్రభుత్వం దోబూచులాడుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి మూడున్నర నెలలైనా పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారం చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఆరునెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే మూడున్నర నెలల సమయం గడిచింది.
పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థతో ఇప్పటి వరకు ప్రభుత్వం సంప్రదింపులే జరపలేదు. పోర్టు నిర్మాణానికి కీలకమైన భూసేకరణ ఉత్తర్వులు జారీ చేయలేదు. పోర్టు నిర్మాణం కోసం 5324 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. గతంలోనే కలెక్టర్ ప్రభుత్వభూమి, అసైన్డ్, పట్టాభూమి ఎక్కడెక్కడ ఉందోనన్న వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. నివేదికలన్నీ సిద్ధంగానే ఉన్నా పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం గమనార్హం.
పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తే కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుందని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత బందరు పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని పోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ సమాచార హక్కు చట్టం ద్వారా రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడులశాఖను వివరాలు కోరారు.
పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు ఇంకా ప్రభుత్వం చేపట్టలేదని మౌలిక సదుపాయాలు, పెట్టుబడులశాఖ అసిస్టెంట్ సెక్రటరీ సమాధానమిచ్చారు. మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ 2013 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి అందజేసిన రివైజ్డ్ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (ఆర్డీపీఆర్) మాస్టర్ ప్లాన్ లేఅవుట్‌ను ప్రభుత్వం ఆమోదించిందా, లేదా, తీసుకున్న చర్యలేమిటి? ఆమోదిస్తే ఏ తేదీన ఆమోదించారన్న ప్రశ్నకు ఆర్డీపీఆర్, మాస్టర్ ప్లాన్ లేఅవుట్ ప్రభుత్వ ఆమోదం పొందలేదని, పరిశీలనలో ఉందని సమాధానమిచ్చారు.
కలెక్టర్ ఎం రఘునందన్‌రావు 2014 ఫిబ్రవరి 21వ తేదీన ప్రభుత్వానికి అందజేసిన ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్స్‌కు సంబంధించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించిందా, లేదా ప్రభుత్వ పరిశీలనలో ఉందా, భూసేకరణకు అవసరమైన రూ. 495.07 కోట్ల నిధులను మంజూరు చేశారా లేదా అన్న ప్రశ్నకు కలెక్టర్ పంపిన నివేదికపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కాకినాడకు చెందిన పోర్ట్ డెరైక్టర్‌ను కోరిందని సమాచారమిచ్చారు.
భూసేకరణకు సంబంధించి ఇంకా నిధులు విడుదల చేయలేదని తెలిపారు. బందరు డీప్ వాటర్ పోర్ట్ నిర్మాణం కోసం కలెక్టర్‌కు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసిందా అన్న ప్రశ్నకు బందరు పోర్టు నిర్మాణం కోసం ప్రైవేటు భూముల గుర్తింపు కోసం రెవెన్యూ అధికారులతో సంప్రదించాల్సిందిగా కాకినాడ పోర్ట్ డెరైక్టర్‌కు సూచించామని సమాధానమిచ్చారు.
పాలకుల వైఫల్యమే :
బందరు పోర్టును నిర్మించాలని గతంలో ప్రస్తుత బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఉద్యమాలు చేపట్టారని, వారు అధికారంలోకి వచ్చినా పోర్టు నిర్మాణ పనుల ప్రారంభింపజేయడంలో విఫలమయ్యారని పోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ విమర్శించారు. ఆరు నెలల్లో పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని, వాగ్దానాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.