DEVINENI umamahesvararavu
-
ఉమా.. నోరు అదుపులో పెట్టుకో
విజయవాడ :‘ఉన్న మాట చెబితే ఉలుకెందుకు.. నోరు అదుపులో పెట్టుకో.. లేకుంటే మీకంటే ఎక్కువగా బండబూతులు తిట్టగలం..’ అంటూ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హెచ్చరించారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మంత్రి ఉమా దుర్భాషలాడడాన్ని ఖండించారు. గత ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని నమ్మబలికి గద్దెనెక్కి ఆరు మాసాలైనా అమలు చేయకపోవడంతో వచ్చిన ప్రజాగ్రహాన్ని తమ పార్టీ అధినేత బయటకు చెప్పారని కొడాలి నాని వివరించారు. హామీలు అమలుచేయాలని ప్రజల తరఫున కోరుతుంటే ఉమా సంస్కారహీనంగా మాట్లాడడం శోచనీయమన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే రాబో యే రోజుల్లో చంద్రబాబును కూడా తిట్టేందుకు తాము వెనుకాడేది లేదని నాని హెచ్చరించారు. మానసిక రోగం తమ పార్టీ నేతకు లేదని, 66 ఏళ్లు దాటిన మీ నాయకుడు చంద్రబాబుకే ఉందన్నారు. అధికారం కోసం చంద్ర బాబు మామను చంపారని, ఎమ్మెల్యే పదవి కోసం దేవినేని ఉమా ఇంట్లో మనుషులను చంపారని దుయ్యబట్టారు. చంద్రబాబును ప్రజలు క్షమించరు : కె.పార్థసారథి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కె.పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలుచేయకపోతే భవిష్యత్తులో రాళ్లతో కొడతారని తమ పార్టీ అధినేత అన్న మాటల్లో ఎటువంటి తప్పు లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబును ప్రజలు క్షమించరన్నారు. మంత్రి ఉమా పిచ్చివాగుడు వాగుతూ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రుణమాఫీపై ఎన్ని మాటలు మార్చారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పింఛన్లకు రూ. 3,700 కోట్ల బడ్జెట్ కేటాయించి నిరుపేదలకు ఎగనామం పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ సమస్యలపై నిలదీస్తున్న తమ పార్టీ అధినేతపై దుర్భాషలాడడం తగదన్నారు. జిల్లాలో మంజూరైన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని గుంటూరుకు తరలించినా మంత్రి ఉమా దద్దమ్మలా నోరు మెదపకుండా కూర్చున్నారని విమర్శించారు. సంస్కారహీనంగా ప్రవర్తించవద్దని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రి ఉమాకు సారథి హితవు పలికారు. -
వాడీవేడిగా జెడ్పీ సమావేశం
ఎజెండా పత్రాలు ఇవ్వకపోవడంపై సభ్యుల ఆగ్రహం మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రులు ప్రొటోకాల్‌పై నిలదీసిన వైఎస్సార్ సీపీ ప్రతినిధులు మచిలీపట్నం : జిల్లా పరిషత్ అత్యవసర సర్వసభ్య సమావేశం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ రఘునందన్‌రావు పాల్గొన్నారు. కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో పాల్గొనాలని మంత్రి దేవినేని ఉమా సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సమావేశంలో కొద్దిసేపు ప్రసంగించి వెళ్లిపోయారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తమను మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు ఏ హక్కుతో హాజరవుతున్నారంటూ కొన్ని మండలాల్లో ప్రశ్నిస్తున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రభుత్వ నిధుల వినియోగం, అభివృద్ధి కార్యక్రమాలు, ఎంపీలు, మంత్రుల పర్యటనల వివరాలు తమకు తెలియజేయకుండానే ముగిస్తున్నారని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీ చేసినట్లు చెబుతున్నారని, ఎంతమందికి చేశారు.. ఎంత మొత్తం చేశారు.. నియోజకవర్గాల వారీగా జాబితాలు ఉన్నాయా.. లేవా.. ఈ విషయంపై కలెక్టర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌చేశారు. జిల్లాలో బెల్టుషాపులు యథావిధిగా కొనసాగుతున్నాయని, మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఇస్తున్నారని, వీటిని రద్దు చేస్తారా, లేదా.. అని కల్పన నిలదీశారు. అనంతరం గూడూరు మండల పరిషత్ సమావేశంలో వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచిలు, ఎంపీటీసీ సభ్యులను మాట్లాడొద్దని అధికారులే హుకుం జారీ చేస్తున్నారని, ఈ పద్ధతిలో మార్పు రావాలని ఆ పార్టీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అజెండా కాపీలు అందలేదు.. జిల్లా పరిషత్ సమావేశం జరుగుతున్నా ఇంతవరకు సభ్యులకు ఎజెండా కాపీలను ఇవ్వలేదని, తాము ఏ అంశాలపై చర్చించాలని సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించకూడదనే ఈ తరహాగా వ్యవహరిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. సామాజిక పింఛన్ల పంపిణీలోనూ ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో రుణాలు మంజూరు చేసేందుకు అన్ని అనుమతులు ఇచ్చిన లబ్ధిదారులకు కాకుండా వేరే జాబితాలను తయారు చేసి రుణాలు ఇప్పించేందుకు గ్రామకమిటీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక వ్యవహారంపై రగడ భూగర్భ గనుల శాఖపై జరిగిన సమీక్షలో ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు అప్పగించటం, స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయాన్ని గండికొట్టడం తదితర అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. గతంలో ఇసుక సీనరేజీ ద్వారా వచ్చే ఆదాయం నేరుగా జిల్లా పరిషత్‌కు జమ అయ్యేదని, ప్రస్తుతం ప్రభుత్వం నిబంధనలు సడలించి నిధులను తన ఖాతాలో వేసుకుంటోందని, మొక్కుబడిగా క్యూబిక్ మీటరుకు రూ.40లు మాత్రమే ఇస్తోందని తోట్లవల్లూరు ఎంపీపీ కె.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఇసుక రేవులు ఉన్న గ్రామాల పరిధిలో గృహనిర్మాణం కోసం ఎడ్లబండి, ట్రాక్టర్లపై ఇసుక తీసుకువెళుతున్నా పోలీసులు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు వాటిని సీజ్ చేసి రూ. 15వేలు జరిమానా విధిస్తున్నారని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుతో పాటు పలువురు సభ్యులు పేర్కొన్నారు. అయితే పెద్ద లారీల ద్వారా హైదరాబాదుకు తరలివెళుతున్న ఇసుకను అదుపు చేయటంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. జిల్లా పరిషత్ సమావేశం జరిగే సమయంలో సభ్యులకు సరైన సమాచారం ఇవ్వటం లేదని, గత సమావేశంలో అడిగిన సమాచారాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదని జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ్యత పెరిగింది : బుద్ధప్రసాద్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం జిల్లా ప్రజలపై బాధ్యత పెరిగిందన్నారు. జిల్లా సరిహద్దులోనే రాజధాని ఏర్పడనున్న సమయంలో మనపై గురుతర బాధ్యత ఉందన్నారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ముందడుగు వేయాలన్నారు. ఇటీవల తాను అమెరికాలో పర్యటించానని, కృష్ణాజిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యానని చెప్పారు. తమ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చారని తెలిపారు. కలెక్టర్ ఈ విషయంపై స్పందించి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయటంతోపాటు ఎన్ఆర్ఐలు నగదు పంపేందుకు ప్రభుత్వం ద్వారానే ఒక బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేయాలని కోరారు. తొలుత హుదూద్ తుపాను ప్రభావంతో మరణించిన వారు, ఇటీవల షిర్డీ యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, ఆయా మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. నూతనంగా 41,814 మందికి పింఛన్లు : ఉమా సమావేశంలో పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో జిల్లాలో 1.18 లక్షల మందికి రూ. 12.31 కోట్లను పింఛన్లుగా అందజేశామన్నారు. తొలుత జిల్లాలో 14వేల మంది పింఛన్లు పొందేందుకు అనర్హులుగా గుర్తించగా, వీటిని పునఃపరిశీలించి 7,936 మందికి పునరుద్ధరించినట్లు తెలిపారు. జిల్లాలో 33,878 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. నవంబరులో జరిగే జన్మభూమిలో నూతన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. మండలాల్లో, జిల్లావ్యాప్తంగా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని, అలా చేయని పక్షంలో సంబంధిత శాఖల అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో రెండో పంటకు సాగునీరు విడుదల చేసే విషయమై నవంబరులో సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతిపక్షం నిర్ణయాత్మక పాత్ర పోషించాలి : కొల్లు రవీంద్ర జిల్లా పరిషత్ సమావేశం జరిగే సమయంలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ సీపీ సభ్యులు నిర్ణయాత్మక పాత్రను పోషించాలని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రైతుసాధికార సంస్థను ఏర్పాటు చేసిందని, మొదటి విడతగా రూ. 5వేల కోట్లను విడుదల చేయటం జరిగిందన్నారు. జిల్లాలో వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో నందమూరి తారకరామారావు విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వసతి గృహాలు, ఆస్పత్రులపై ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ అవసరమన్నారు. బెల్టు షాపులు అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోంటుందని చెప్పారు. -
సమగ్ర సోమశిలే లక్ష్యం
సోమశిల: సోమశిల జలాశయం నుంచి రాష్ట్రమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పొంగూరు నారాయణ డెల్టాకు శనివారం నీటిని విడుదల చేశారు. తొలుత జలాశయం వద్ద మంత్రితో కలిసి జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్‌రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు అధికారులు క్రస్ట్‌గేట్ల వద్ద సంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అనంతరం పెన్నార్‌డెల్టాకు వాయునాలు చెల్లించి నీటి విడుదల ప్రక్రియను ప్రారంభించారు. డెల్టాకు వెయ్యి క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 50 క్యూసెక్కులను లాంఛనంగా విడుదల చేశారు. డ్యామ్‌సైట్ ఆఫీస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు,కలెక్టర్‌తో కలిసి దేవినేని ఉమ విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ కృష్ణ, గోదావరి, పెన్నార్డెల్టాలలో పరిస్థితులను సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వారు నవంబర్‌లో పరిశీలిస్తారన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే జిల్లాకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. అనంతపురం జిల్లాకు సాగు,తాగునీరు అందించేందుకు పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నామన్నారు. జలాశయం పరిధిలోని ఆయకట్టు రైతులు తమకు ఎక్కడ ఏ పని కావాలో అధికారులకు విన్నవిస్తే వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. నిధులు విడుదల చేసే బాధ్యత తమదేనన్నారు. సమగ్ర సోమశిలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న అటవీ అనుమతులపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. హైలెవల్ కాలువకు కూడా మొదటి దశ పనులను త్వరలో ప్రారంభిస్తారన్నారు. దీంతో ఈ జిల్లాలో మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈలు సాబ్జాన్,కోటేశ్వరరావు, ఆర్డీఓ ఎంవీ రమణ పాల్గొన్నారు. రైతు ప్రయోజనాలే ముఖ్యం : మంత్రి దేవినేని ఉమా ఆత్మకూరు/సోమశిల: రాష్ట్రంలో రైతు ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మం త్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం సోమశిల జలాలను విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. గోదావరి,కృష్ణ, పెన్నా డెల్టా ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు చెరుకూరి వీరయ్య, రోశయ్య, సుబ్బారావులతో కూడిన ట్రిబ్యునల్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఏఎస్‌పేట మండలంలోని గుడిపాడు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. హుదూద్ తుపాను బాధితులకు జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ నారాయణ అమోఘమైన సేవలు అందించారని కొనియాడారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ ఐఏబీ సమావేశంలో నిర్ణయించిన మేరకు సాగునీటిని విడుదల చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్, నీటిపారుదల శాఖలకు సంబంధించి ప్రతి రోజు అరగంట సేపు సమీక్ష సమావేశాలు నిర్వహించడం పరిపాటిగా చేస్తున్నారన్నారు. ఆ కృషి ఫలితంగానే ప్రస్తుతం జలాశయంలో 45 టీఎంసీల నీరు చేరిందన్నారు. భవిష్యత్‌లో జిల్లాలో సాగు,తాగునీటి సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామన్నారు. ఈ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెల్టాకు, నాన్‌డెల్టాకు ఒకే పర్యాయం నీటి విడుదల చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట్లాడుతూ ఈ జిల్లాలో కేవలం మూడు స్థానాల్లోనే టీడీపీ గెలవడంతో చంద్రబాబు దగ్గర పనులు చేయించుకునే సమయంలో డిమాండ్ చేయలేకపోతున్నామన్నారు. సమావేశంలో ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గూటూరు మురళీ కన్నబాబు, తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు రాపూరు సుందరరామిరెడ్డి, జెడ్పీ టీడీపీ ఫ్లోర్మెంబర్ వేనాటి రామచంద్రారెడ్డి, టీడీపీ గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జ్యోత్స్న, టీడీపీ నేతలు సడ్డా రవీంద్రారెడ్డి, ఇందూరు వెంకటరమణారెడ్డి, ఆరి కట్ల జనార్దన్‌నాయుడు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండండి : ఉమా
కోడూరు/(చిలకలపూడి)మచిలీపట్నం : హుదూద్ తుపాను ప్రభావం నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సహకరించాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. శుక్రవారం రాత్రి కోడూరు మండలం పాలకాయతిప్ప సమీపంలోని సముద్ర తీరాన్ని జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుపాను వీడే వరకు అధికారులకు సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. తీరంలో పరిస్థితిని బందరు ఆర్డీవో సాయిబాబు, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసుదనరావు వివరించారు. మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరి ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు బండే శ్రీనివాసరావు, ఎంపీపీ మాచర్ల భీమయ్య, మచిలీపట్నం మాజీ మున్సిపాల్ చైర్మన్ బచ్చుల అర్జునుడు, డ్రైనేజీ డీఈ మారుతీ ప్రసాద్, తహశీల్దార్ ఎంవీ సత్యనారాయణ, ఎంపీడీవో కె.జ్యోతి పాల్గొన్నారు. బందరులో సమీక్ష తుపానుపై మంత్రి దేవినేని ఉమా శుక్రవారం రాత్రి మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ మురళి, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు పాల్గొన్నారు. పులిచింతల నుంచి వచ్చే ఖరీఫ్‌కు 42 టీఎంసీల సాగునీరు కోడూరు : వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పులిచింతల ప్రాజెక్టు ద్వారా 42 టీఎంసీల నీటిని నిలువ చేసి, కృష్ణా డెల్టాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. కోడూరు మండలంలోని మాచవరం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో మంత్రి ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం రూ.30 కోట్లు పింఛన్లు ఇచ్చి పేదలకు భరోసా కల్పించినట్లు తెలిపారు. -
కదలిక లేని బందరు పోర్టు
మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణంపై ప్రభుత్వం దోబూచులాడుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి మూడున్నర నెలలైనా పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారం చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఆరునెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే మూడున్నర నెలల సమయం గడిచింది. పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థతో ఇప్పటి వరకు ప్రభుత్వం సంప్రదింపులే జరపలేదు. పోర్టు నిర్మాణానికి కీలకమైన భూసేకరణ ఉత్తర్వులు జారీ చేయలేదు. పోర్టు నిర్మాణం కోసం 5324 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. గతంలోనే కలెక్టర్ ప్రభుత్వభూమి, అసైన్డ్, పట్టాభూమి ఎక్కడెక్కడ ఉందోనన్న వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. నివేదికలన్నీ సిద్ధంగానే ఉన్నా పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం గమనార్హం. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తే కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుందని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత బందరు పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని పోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ సమాచార హక్కు చట్టం ద్వారా రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడులశాఖను వివరాలు కోరారు. పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు ఇంకా ప్రభుత్వం చేపట్టలేదని మౌలిక సదుపాయాలు, పెట్టుబడులశాఖ అసిస్టెంట్ సెక్రటరీ సమాధానమిచ్చారు. మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ 2013 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి అందజేసిన రివైజ్డ్ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (ఆర్డీపీఆర్) మాస్టర్ ప్లాన్ లేఅవుట్‌ను ప్రభుత్వం ఆమోదించిందా, లేదా, తీసుకున్న చర్యలేమిటి? ఆమోదిస్తే ఏ తేదీన ఆమోదించారన్న ప్రశ్నకు ఆర్డీపీఆర్, మాస్టర్ ప్లాన్ లేఅవుట్ ప్రభుత్వ ఆమోదం పొందలేదని, పరిశీలనలో ఉందని సమాధానమిచ్చారు. కలెక్టర్ ఎం రఘునందన్‌రావు 2014 ఫిబ్రవరి 21వ తేదీన ప్రభుత్వానికి అందజేసిన ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్స్‌కు సంబంధించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించిందా, లేదా ప్రభుత్వ పరిశీలనలో ఉందా, భూసేకరణకు అవసరమైన రూ. 495.07 కోట్ల నిధులను మంజూరు చేశారా లేదా అన్న ప్రశ్నకు కలెక్టర్ పంపిన నివేదికపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కాకినాడకు చెందిన పోర్ట్ డెరైక్టర్‌ను కోరిందని సమాచారమిచ్చారు. భూసేకరణకు సంబంధించి ఇంకా నిధులు విడుదల చేయలేదని తెలిపారు. బందరు డీప్ వాటర్ పోర్ట్ నిర్మాణం కోసం కలెక్టర్‌కు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసిందా అన్న ప్రశ్నకు బందరు పోర్టు నిర్మాణం కోసం ప్రైవేటు భూముల గుర్తింపు కోసం రెవెన్యూ అధికారులతో సంప్రదించాల్సిందిగా కాకినాడ పోర్ట్ డెరైక్టర్‌కు సూచించామని సమాధానమిచ్చారు. పాలకుల వైఫల్యమే : బందరు పోర్టును నిర్మించాలని గతంలో ప్రస్తుత బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఉద్యమాలు చేపట్టారని, వారు అధికారంలోకి వచ్చినా పోర్టు నిర్మాణ పనుల ప్రారంభింపజేయడంలో విఫలమయ్యారని పోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ విమర్శించారు. ఆరు నెలల్లో పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని, వాగ్దానాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. -
సగం డబ్బు బకాయిలకే!
అనంతపురం అగ్రికల్చర్ : రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.28 వేల కోట్లు అవసర మవుతాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్లో రూ.8,200 కోట్లు కేటాయించామని, ఇందులో రూ.4,500 కోట్లు పాత బకాయిలు, వడ్డీలకే సరిపోతుందని వివరించారు. అనంతపురంలోని డ్వామా హాలులో ప్రజాప్రతినిధులు, అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించిన తర్వాత హంద్రీ-నీవా మొదటి దశ కింద ఉన్న జీడిపల్లి రిజర్వాయర్, రాగులపాడు ఎత్తిపోతల పథకం, పీఏబీఆర్ జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడాదిలోగా హంద్రీ-నీవా రెండవ దశను పూర్తి చేసి 4.20 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామన్నారు. ఇందుకోసం ప్రతి నెలా జిల్లాకు వచ్చి సమీక్ష సమావేశం నిర్వహిస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే నైతిక అర్హత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి లేదన్నారు. మేఘమథనం పేరుతో రఘువీరారెడ్డి రూ.40 కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో జగన్ నోరు మెదపలేదన్నారు. ‘హంద్రీ-నీవా’పై ప్రత్యేక దృష్టి.. హంద్రీ-నీవా కాలువ గట్లు బలహీనంగా ఉన్నందున అనుకున్న రీతిలో కృష్ణా నీటిని తీసుకురాలేకపోతున్నామని మంత్రి దేవినేని అన్నారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం రెండవ దశను ఏడాదిలోగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. హంద్రీ-నీవా ఫేజ్-1, 2 పనులతో పాటు హెచ్ఎల్సీ ఆధునికీకరణ పనులను వేగవంతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. శ్రీశైలంలో పుష్కలంగా నీరున్నా హంద్రీ-నీవా ద్వారా కేవలం మూడు పంపుల నుంచి మాత్రమే నీరు తీసుకుంటున్నామన్నారు. కాలువ గట్ల బలహీనతే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారని, అయినా నాలుగో పంప్‌ను ప్రారంభించామన్నారు. కాలువ గట్లు బలహీనంగా ఉన్నచోట ఫేజ్-2 కింద ఉన్న ఇంజనీర్లను నియమించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హంద్రీ-నీవా కోసం రూ.6700 కోట్లు ఖర్చు చేసినా 13 ఎకరాలకు కూడా సాగునీరివ్వలేని దుస్థితిలో కాలువ ఉందన్నారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కాలువపై పాదయాత్ర నిర్వహించి ఆర్భాటం చేశారని, సొంత జిల్లాపైనే ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో నంబర్ 2గా ఉన్న రఘువీరా హంద్రీ-నీవాను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల ప్రాంతాలను శాటిలైట్ ద్వారా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు, చెరువుల అభివృద్ధి తదితర పనులను ఈ ఏడాది నవంబర్ నుంచి చేపడతామన్నారు. జిల్లాలో ఏ రోజుకారోజు ఎన్ని క్యూసెక్కుల నీరు వస్తుందో తెలుసుకునేందుకు మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని మంత్రి పల్లె తెలిపారు. హంద్రీ-నీవాకు ప్రస్తుతం 1000 క్యూసెక్కుల నీరు వస్తోందని, అంతకన్నా ఎక్కువ వచ్చేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. హంద్రీ-నీవా, హెచ్ఎల్సీ ద్వారా జిల్లాకు 100 టీఎంసీల నీటిని తీసుకొచ్చి సాగునీటి గ్రిడ్ ఏర్పాటు చేస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి దేవినేనిని చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు కోరారు. హంద్రీ-నీవా ఫేజ్-2 కింద కుందుర్పి బ్రాంచ్ కెనాల్ నిర్మాణం చేపట్టి భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీటినందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విప్ యామిని బాల, ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ.. శింగనమల నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ నీటితో నింపి తాగు నీటి సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బీ.కే పార్థసారథి, వరదాపురం సూరి, ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్, మేయర్ స్వరూప, జేసీ సత్యనారాయణ, నీటిపారుదల శాఖ సీఈ మనోహర్, హెచ్చెల్సీ ఎస్ఈ మురళీనాథ్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు. రిజర్వాయర్ల పరిశీలన .. బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్, కూడేరు వుండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయుర్ (పీఎబీఆర్), ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామ సమీపంలోని హంద్రీనీవా, హెచ్చెల్సీ నీరు వెళ్లే అక్విడెక్ట్, వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద ఉన్న హంద్రీ నీవా లిఫ్ట్‌ను మాజీ ఎమ్మెల్యే కేశవ్‌తో కలిసి మంత్రి దేవినేని పరిశీలించారు. ఈ సందర్భంగా తమకు పునరావాసం కల్పించి ఆదుకోవాలని జీడిపల్లి గ్రామానికి చెందిన నిర్వాసితులు మంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. ఆర్ఆర్ యాక్ట్ ద్వారా పునరావాసం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అవసరమైతే కృష్ణా జలాలను పీఏబీఆర్‌కు మళ్లించి తద్వారా జిల్లాలోని 49 చెరువులకు నీరందించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకు ముందు ఆయన జీడిపల్లి గ్రామంలో ఉబికి వస్తున్న ఊటనీటిని పరిశీలించారు. గ్రామంలోని కుటుంబాలన్నింటికీ పునరావాసం కల్పించడానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. జీడిపల్లి రిజర్వాయర్‌కు ఎన్టీరామారావు పేరు పెడుతామని తెలిపారు. త్వరలో జీడిపల్లి రిజర్వాయర్ నింపి పీఏబీఆర్‌కు నీటిని విడుదల చేస్తామన్నారు. -
ఉమా..నీ తీరు మార్చుకో
జిల్లాలో టీడీపీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి వైఎస్సార్ సీపీ నాయకుడి హత్య వెనుక ఉమా హస్తం ఉంది... సీబీసీఐడీ ద్వారా విచారణ చేయించాలి వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ నందిగామ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మాజీ మంత్రి, బందరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండదండలతో టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి ఉమా తీరు మార్చుకోవాలని, లేకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం సారథి, ఉదయభాను, ఎమ్మెల్యే రక్షణనిధి గొట్టుముక్కల వెళ్లి హత్యకు గురైన వైఎస్సార్ సీపీ నాయకుడు ఆలోకం కృష్ణారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నందిగామలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న నాయకుడిని రోడ్డుపైకి తీసుకొచ్చి హత్య చేయడంతో హేయమైన చర్య అని అన్నారు. టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందన్నారు. మంత్రి ఉమ హత్యారాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు. ఈ హత్య వెనుక ఉమా పాత్ర ఉందని, ఈ ఘటనపై సీబీసీఐడీ ద్వారా విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే కృష్ణారావు మరణించారని పేర్కొన్నారు. పోలీసులు టీడీపీ నేతలకు కొమ్ముకాయడంతో వైఎస్సార్ సీపీ ఓ మంచి నాయకుడిని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. జగ్గయ్యపేట మండలం పెద్ద మోదుగుపల్లి గ్రామ మాజీ సర్పంచి మధుసుదనరావును కూడా ఇటీవల టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారని, ఇప్పటి వరకు నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. కృష్ణారావు హత్య కేసులో దోషులను వెంటనే అరెస్టు చేయాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశామని చెప్పారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతి చెందినప్పటి నుంచి ఆ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న మంత్రి ఉమా ఈ ప్రాంతాన్ని వివాదాలకు కేంద్రంగా మార్చారని విమర్శించారు. కృష్ణారావు హత్యపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే రక్షణ నిధి చెప్పారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు తమ తీరు మార్చుకోకపోతే ఉద్యమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పినట్లుగా పనిచేయాలని ఆదేశించడంతో అధికారులు కార్యకర్తలకు కూడా భయపడే పరిస్థితి నెలకొందన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు బొగ్గవరపు శ్రీశైలవాసు, వైఎస్సార్ సీపీ నందిగామ కార్యాలయ ఇన్చార్జి మొండితోక అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. -
టీ ప్రాజెక్టుల్ని మేమెందుకు అడ్డుకుంటాం?
హరీశ్‌రావుపై దేవినేని ధ్వజం విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన విధంగానే గోదావరి, కృష్ణా నదులపై నూతన ప్రాజెక్టులకు ఆమోదం, నిర్మాణ పనులు నదీ నిర్వహణ మండళ్లు, కేంద్ర జల సంఘం సిఫార్సుల మేరకే జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంత్రి హరీశ్‌రావు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రూపంలో కుట్రలు పన్నుతున్నారని హరీశ్‌రావు ఆరోపించడం బాధ్యతా రాహిత్యమేనని దేవినేని ధ్వజమెత్తారు. -
దేవినేని వర్సెస్ కేశినేని కోల్డ్‌వార్
ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్న కేడర్ ఎవరికి వారు బలం పెంచేందుకు ప్రయత్నం పార్టీ కార్యక్రమాలు నామమాత్రమే సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని) మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. పార్టీలో కీలకమైన ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న యుద్ధంలో మిగిలిన నేతలు నలిగిపోతున్నారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలైనప్పటికీ, పార్టీలో ఎవరికి వారు తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లా, అర్బన్ పార్టీలు రెండుగా చీలిపోయాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. వీరిద్దరూ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేవినేని ఉమా జిల్లా పార్టీ కార్యాలయాన్ని కేంద్రం చేసుకుని తమ వర్గ కార్యకలాపాలను నిర్వహిస్తుండగా, కేశినేని భవన్‌ను కేంద్రంగా నాని పావులు కదుపుతున్నారు. అత్యవసర సమయాల్లో తప్పితే ఇద్దరు నేతలు కలుస్తున్న దాఖాలాలు లేవు. ఇటీవల ఎంపీ సుజనా చౌదరి వచ్చినప్పుడు ఉమా కేశినేని భవన్‌కు వచ్చారు. కీలక సమయంలోనే నాని జిల్లా పార్టీ కార్యాలయానికి వస్తారు. నిన్న వంశీకి...నేడు కేశినేనికి .. దేవినేని ఉమా పార్టీలో ఎదుగుతున్నవారికి తొక్కేస్తారనే ఆరోపణ మొదటి నుంచి ఉంది. యూత్ ఐకాన్‌గానూ, నగరంలో తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు తెచ్చిన వంశీని పొమ్మనకుండా పొగపెట్టారు. ఇప్పుడు నానికి అదే తరహా పరాభవం జరుగుతోందని కేశినేని వర్గం ఆరోపిస్తోంది. తన చేతి చమరు వదుల్చుకుని ఉత్తరాఖండ్ బాధితుల్ని స్వస్థలాలకు నాని తీసుకువస్తే, మీడియా ముందు ఉమా మాట్లాడి ఆ క్రెడిట్ ఆయన కొట్టేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. తనకు ప్రత్యర్థిగా మారుతున్న నానికి పార్లమెంట్ సీటు ఇవ్వబోరని ఉమా వర్గం ప్రచారం చేస్తోంది. టీడీపీ, బీజేపీల మధ్య తప్పనిసరిగా అలయెన్స్ ఉంటుందని, అందులో భాగంగా విజయవాడ సెంట్రల్ సీటు బీజేపీకి కేటాయిస్తే, బొండా ఉమాకు తూర్పు నియోజకవర్గం సీటు ఇస్తారంటున్నారు. అందువల్ల గద్దె రామ్మోహన్‌ను ఎంపీ సీటు కోసం ప్రయత్నించుకోవాలని దేవినేని ఉమా సూచిస్తున్నట్టు తెలిసింది. మొన్నటి వరకు గద్దె రామ్మోహన్ ఎంపీ సీటుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు దేవినేని ఉమా నుంచి ప్రోత్సాహం రావడంతో ఆయన ఎంపీ సీటుపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నారు. తన అనుమతి లేకుండా జిల్లాలో ఏ సమావేశాలు నిర్వహించవద్దని దేవినేని ఉమా హుకుం జారీ చేసినట్టు కేశినేని వర్గం చెబుతోంది. దీంతో నాని విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏదైనా కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించినా అక్కడ నియోజకవర్గ స్థాయి నేతలు అంత ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఉమాకు నాని చెక్ .. ఉమాకు చెక్ పెట్టేందుకు నాని కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే ఉమా సోదరుడి కుమారుడు దేవినేని చంద్ర శేఖర్‌ను తెరపైకి తీసుకువచ్చి ఆయనకు అర్బన్ తెలుగు యువత అధ్యక్షపదవి ఇప్పించారు. ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా తెలుగు యువతతో కార్యక్రమాలు చేయించి చంద్రశేఖర్ పార్టీలో పట్టు సాధించేందుకు కేశినేని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉమా తనకు వ్యతిరేకంగా ఉన్నందున అర్బన్ అధ్యక్షుడు నాగుల్‌మీరాను కేశినేని తన వ ర్గంలో కలుపుకొన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు బుద్దా వెంకన్నతో పాటు నాగుల్‌మీరా ఆశిస్తుండటంతో ఆయన నానితో కలిసి పనిచేస్తున్నారు. ఇక జిల్లాలో దేవినేని ఉమాకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఒకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం కూడా అంతర్గతంగా చేస్తున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో తన డబ్బు ఖర్చు చేసే ఏ కార్యక్రమంపైనా ఉమా మార్కు పడకుండా జాగ్రత్త తీసుకోవాలని నాని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రజలకు దూరమైన టీడీపీ చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, జిల్లా నేతల మధ్య ఐక్యత లేకపోవడంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ పూర్తిగా వెనుకబడిపోయిందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. చంద్రబాబు జిల్లాలో పాదయాత్ర, బస్సుయాత్ర, ఇప్పుడు వరదబాధితుల్ని పరామర్శించినా ఆ ప్రభావం నామమాత్రమేనంటున్నారు. -
దుర్గమ్మ దర్శనానికి నేతలు దూరం
= సమైక్య సెగతో ముఖం చాటేసిన మంత్రులు = కానరాని ద్వితీయశ్రేణి నేతలు సాక్షి, విజయవాడ : రాజకీయ నేతలకు సమైక్య సెగ తలగడంతో వారంతా దుర్గమ్మ దర్శనానికి దూరంగా ఉన్నారు. నేతలు ఏటా దసరా ఉత్సవాల్లో కొండపైన హల్చల్ చేసేవారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ అనుచరగణంతో దుర్గమ్మ దర్శనానికి వచ్చి వీఐపీ దర్శనాలు చేసుకునేవారు. వారికి ఆలయమర్యాదలతో స్వాగతం.. వేదపండితులతో ఆశ్వీరాదం.. అమ్మవారి కుండువాలు.. ప్రసాదాలు ఒకటేమిటి ఆ హడావుడే వేరుగా ఉండేది. ఇక ఉత్సవాల ఏర్పాటులో కూడా నేతలు తమదైన పాత్ర పోషించేవారు. దేవాదాయశాఖ మంత్రి నుంచి కిందిస్థాయిలో ఉత్సవ కమిటీ సభ్యుల వరకు ఎవరికివారు అధికారులకు ఉచిత సలహాలిచ్చి వాటిని పాటించాలంటూ హడావుడి చేసేవారు. ఇందకీలాద్రిపై పండగ పది రోజులూ రాజకీయ నాయకుల హడావుడే ఎక్కువగా కనపడేది. ఈ ఏడాది కనబడితే ఒట్టు.. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఆ పరిస్థితి ఎక్కడా కానరావడం లేదు. దసరా ఉత్సవాలు సగం రోజులు అయిపోయాయి. ఇప్పటికే పలుమార్లు ఉత్సవాల నిర్వహణపై అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించినా, వాటికి ప్రజాప్రతినిధులు దూరంగానే ఉన్నారు. కనీసం ఒక్క సలహా కాని, సూచన కాని చేయడం లేదు. ఇక దుర్గగుడిపై రాజకీయ నాయకులు కనపడితే ఒట్టు. ఒకరిద్దరు నాయకులు అమ్మవారిపై భక్తితో వచ్చినా దర్శనం చేసుకుని వెళ్లిపోతున్నారు తప్ప.. అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏమాత్రం సాహసించడం లేదు. ప్రస్తుత పరిస్థితులు బాగోనందున ఉత్సవాల్లో జోక్యం చేసుకుని విమర్శలుపాలు కావడం ఎందుకని దూరంగా ఉన్నామంటూ విజయవాడ నగరానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ‘సాక్షి ’ వద్ద వ్యాఖ్యానించారు. ఉద్యమ సెగే కారణం... నాయకులు ఉత్సవాలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం సమైక్య ఉద్యమమేనని భక్తులు నమ్ముతున్నారు. గత ఏడాది దసరా ఉత్సవాల్లో మూలానక్షత్రం రోజున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య విచ్చేసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి తోట నరసింహంతో పాటు రాష్ట్ర మంత్రులు ప్రసాద్‌కుమార్, విశ్వరూప్, కన్నా లక్ష్మీనారాయణ, కేపీ సారథి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు గత ఏడాది దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి కృష్ణంరాజు తదితర నాయకులంతా అమ్మవారిని దర్శించుృున్నవారే. ఈ ఏడాది వారిలో చాలామంది ముఖం చాటేశారు. ఎంపీ లగడపాటి, కొనగళ్ల నారాయణరావులు ప్రజలకు అందుబాటులోనే లేరు. టీడీపీ, బీజేపీ నాయకులు కూడా ఇంద్రకీలాద్రి ఎక్కేందుకు సాహసించడం లేదు. దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య మాత్రం గురువారం సాయంత్రం దుర్గగుడి వస్తారనే ప్రచారం జరుగుతోంది. జిల్లా మంత్రి కేపీ సారథి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని సమాచారం. వీరుగాక మిగిలిన మంత్రులు దుర్గగుడి వైపు చూసేందుకు కూడా సాహసించడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం ముమ్మరంగా సాగుతున్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ఈ ఏడాది దుర్గగుడికి రాకపోవచ్చని తెలిసింది. ఈసారి ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, చిన్నం రామకోటయ్య మాత్రమే దుర్గగుడికి వచ్చారు. సమైక్యానికి మద్దతు ప్రకటించి అమ్మవారి దర్శనం చేసుకుని చల్లగా జారుకున్నారు. ఉత్సవ కమిటీ ఊసే లేదు... గత ఏడాది ఉత్సవాలు ప్రారంభమైన రెండోరోజే 51 మందితో ఉత్సవ కమిటీ వేశారు. ఈ ఏడాది ముఖ్యమంత్రి సమైక్య ఉద్యమంలో తలమునకలై ఉన్నందున ఉత్సవ కమిటీ గురించి పట్టించుకోలేదని చెబుతున్నారు. భక్తులకు సౌకర్యాలకు మాత్రం ఏమాత్రం లోటు రాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
ఉమా..ఇదేమి డ్రామా!
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావులు తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు సృష్టించింది. శనివారం ఉదయం వీరిద్దరూ చేపట్టబోయిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వారి వారి ఇళ్ల వద్ద ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నా కొద్దిసేపటికే సర్దుకున్నాయి. దేవినేని ఉమాతోపాటు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని), అర్బన్ అధ్యక్షుడు నాగుల్‌మీరాలను పోలీసులు అరెస్టుచేసి మాచవరం పోలీసుస్టేషన్‌కు తరలించగా, బొండా ఉమాను పటమట పీఎస్‌కు తరలించారు. దీక్ష కొనసాగింపులో భిన్నాభిప్రాయాలు.. మాచవరం పోలీసుస్టేషన్‌కు చేరుకున్న నేతలకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. స్టేషన్ ఎదుట కొద్దిసేపు నిరసన ప్రదర్శనలు నిర్వహించిన తరువాత స్టేషన్ బెయిల్ తీసుకుని వెళ్లిపోయేందుకు నేతలు సమాయత్తమయ్యారు. దీనికి దేవినేని ఉమా అంగీకరించలేదు. తాను పోలీసుస్టేషన్లోనే దీక్ష కొనసాగిస్తానంటూ పట్టుబట్టారు. దీనిపై కేశినేని నాని, నాగుల్‌మీరా, బుద్దా వెంకన్న తదితరులు చర్చలు జరిపారు. ప్రస్తుతం అవనిగడ్డ ఉపఎన్నిక కోడ్ అమలులో ఉన్నందునే పోలీసులు అరెస్టు చేశారని, ఇప్పుడు స్టేషన్లోనే ఆమరణదీక్షకు దిగితే కోడ్ ఉల్లంఘన అవుతుందని, అందువల్ల స్టేషన్ బెయిల్ తీసుకుని వెళ్లిపోవడం మం చిదని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు వారంతా బెయిల్ తీసుకుని వెళ్లిపోయారు. వారితో విభేదించిన ఉమా మాత్రం రాత్రి వరకు స్టేషన్లోనే బైఠాయించి హైడ్రామా సృష్టించారు. పటమట పోలీసుస్టేషన్లో ఉన్న బొండా ఉమా కూడా ఎన్నికల నిబంధనలకు లోబడే మధ్యాహ్నమే స్టేషన్ బెయిల్ తీసుకుని వెళ్లిపోయారు. దేవినేని ఉమా వైఖరితో విసుగు చెందిన పోలీసులు ఆయన్ను బలవంతంగా ఇంటి వద్దకు తీసుకువెళ్లి వదిలివేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన ఆమరణదీక్ష హైడ్రామాపై ఆ పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఉదయం నుంచీ హడావుడే! ఆమరణ నిరహారదీక్షకు సిద్ధమైన దేవినేని ఉమా ను గృహ నిర్బంధం, గొల్లపూడిలోనే అరెస్టు చేస్తారంటూ శుక్రవారం అర్ధరాత్రి నుంచే జోరుగా ప్రచారం జరిగింది. శనివారం ఉదయం గొల్లపూడిలోని ఆయన ఇంటికి చేరిన మీడియాతో ఆయన గదిలోనే కటకటాల వెనుక నిలబడి మాట్లాడారు. అయితే ఆయన్ను గొల్లపూడిలో అరెస్టు చేయబోరని పోలీసులు స్పష్టం చేయడంతో చివరకు బయటకు వచ్చి విజయవాడకు పాదయాత్రగా బయలుదేరారు. మధ్యలో ఏదైనా కారు ఎక్కి మాయమై దీక్షాస్థలి వద్దకు చేరుకుంటారేమో అనుమానించిన పోలీసులు గొల్లపూడి నుంచి విజయవాడ వైపు వచ్చే ప్రతి వాహనాన్ని సోదా చేశారు. ఉమా పక్కన కూడా మఫ్టీలో పోలీసుల్ని ఉంచారు. ఆయన విజయవాడ సరిహద్దులోకి రాగానే అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. గంటసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. -
దేవినేని ఉమ కొత్త ఎత్తుగడ!
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండు నాలుకల ధోరణి వల్ల సీమాంధ్రలో ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. జిల్లాలో పార్టీని కాపాడుకునేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు కొత్త ఎత్తుగడ వేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి గురువారం ఉదయం 10 గంటలకు హోటల్ డీవీ మేనర్ సమీపంలో నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమవుతున్నారు. 2009 డిసెంబర్లో రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన చేయగానే తెలుగుదేశం పార్టీ తరుఫున ఈ ఇద్దరు నేతలు నగరంలో నిరవధిక దీక్ష చేశారు. ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన 14 రోజులు తరువాత స్పందించడంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. చంద్రబాబుపై వత్తిడి పెంచి ఉంటే.... గుంటూరు జిల్లా పొన్నూరులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, విజయవాడలో దేవినేని ఉమ నిరవధిక దీక్ష చేయడానికి ప్రాధాన్యం ఇచ్చే కంటే, చంద్రబాబుతో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన చేయించడానికి వత్తిడి పెంచే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదని పార్టీలో సీనియర్ నేతలు వ్యాఖానిస్తున్నారు. ఎపీఎన్జీవోల సంఘ నాయకులు వెళ్లి కోరినా, తెలంగాణకు అనుకూలంగా తాను ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోనని చంద్రబాబునాయుడు తేల్చి చెప్పడాన్ని వారు తప్పు పడుతున్నారు. జిల్లా నేతలు నిరవధిక దీక్షకు సిద్ధమైనా చంద్రబాబును తెలంగాణావాదిగానే ప్రజలు చూస్తారే తప్ప సమైక్యవాదిగా గుర్తించరని అంటున్నారు. ఆయన అనుసరిస్తున్న రెండు కళ్ల సిద్ధాంతం వల్లనే జిల్లాలో పార్టీ దెబ్బతింటోందనేది వారి భావన. పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారు ఆమరణదీక్ష చేస్తుంటే కనీసం చంద్రబాబు వచ్చి వారిని పరామర్శించి, దీక్షకు తమ మద్దతు ప్రకటిస్తారా? లేదా? అన్న అంశం పార్టీలో చర్చనీ యాశంగా మారింది. చంద్రబాబు పట్టించుకోని ఈ దీక్షల వల్ల పార్టీకి ఎంత మేరకు ప్రయోజనం ఉంటుందనేది మరో ప్రశ్న. మహాధర్నాను పట్టించుకోని చంద్రబాబు గతంలో కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయకూడదంటూ తెలంగాణకు చెందిన ఒక ఇంజినీర్ కోర్టులో కేసుదాఖలు చేశారు. దీంతో కృష్ణాడెల్టాకు సకాలంలో సాగునీరు అందక రైతులు విలవిలలాడారు. ఆ సమయంలో దేవి నేని ఉమ కృష్ణానది ఇసుక తిన్నెల్లో మహా ధర్నా నిర్వహించారు. ఈ దీక్షకు కోస్తాంధ్రా ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులంతా వచ్చినా చంద్రబాబు మాత్రం హాజరుకాలేదు. తెలంగాణ ప్రాంత నేతల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందనే భయంతోనే ఆయన అప్పట్లో మహాధర్నాకు దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ తరువాత ఇంద్రకీల్రాది వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలన్న స్థానిక సమస్యపై ఆందోళన చేస్తే మాత్రం చంద్రబాబు వచ్చి తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తెలంగాణప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప సమైక్యాంధ్ర ప్రయోజనాలను పట్టించుకోవడంలేదని ప్రజలు నుంచి విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సీమాంధ్రపై ప్రత్యేక శ్రద్ధ చూపనంత వరకు దేవినేని ఉమామహేశ్వరరావు వంటి వారు చేసే నిరసన కార్యక్రమాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. -
సమైక్య పోరుకు ‘దేశం’ దూరం
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పోరాటానికి తెలుగుదేశం పార్టీ తిలోదకాలు ఇచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా చంద్రబాబు నాయుడు పెదవి విప్పకపోవడం, ఏపీ ఎన్జీవో సంఘం నేతలు ఆయన్ను కలిసినా సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన బాటలోనే జిల్లా నేతలు నడిచేందుకు సిద్ధమౌతున్నారు. నిన్నటి వరకు మొక్కుబడిగా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిన జిల్లా దేశం నాయకులు ప్రస్తుతం పోరాటాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు పోరాటాలు చేయాల్సిన నేతలు నేడు సీమాంధ్ర హక్కుల పేరుతో ఉద్యమం చేసి తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవినేని ఉమా పలాయనం! శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పలువురు విలేకరులు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావును సమైక్యాంధ్ర ఉద్యమంపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమైక్యాంధ్ర కోసం ఆనాడు చేసిన నిరాహారాదీక్షలు ఇప్పుడు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. చంద్రబాబునాయుడుపై వత్తిడి పెంచి సమైక్యాంధ్రకు మద్దతుగా ఎందుకు ప్రకటన చేయించలేకపోతున్నారంటూ ప్రశ్నించారు? ప్రజలు, ఉద్యోగ, కార్మిక,వ్యాపార సంఘాలు రోడ్లపైకి వచ్చి సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తుంటే తెలుగుదేశం నేతలు ఎందుకు స్పందించడం లేదని, ప్రస్తుతం తెలుగుదేశం సమైక్యపోరాటాన్ని పక్కన పెట్టి సీమాంధ్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని గుచ్చిగుచ్చి అడిగారు. దీనిపై దేవినేని ఉమాతో పాటు ఇతర నాయకుల నుంచి సరియైన స్పందన రాలేదు. తాను మాత్రం సమైక్యవాదినేనంటూ... సీమాంధ్ర హక్కుల కోసం పోరాడాతనంటూ చెప్పి అర్ధంతరంగా విలేకరుల సమావేశం ముగించి వెళ్లిపోవడం చర్చనీయాశంగా మారింది. దీంతో చంద్రబాబు నాయుడు తరహాలో దేవినేని ఉమా కూడా రెండు కళ్లు సిద్దాంతం అవలంభిస్తున్నారని విమర్శలు వినవచ్చాయి. ఇక సీమాంధ్ర హక్కుల కోసం పోరాటం? సీమాంధ్ర హక్కుల కోసం పోరాటం చేస్తామంటూ దేవినేని ఉమా కొత్త నినాదంతో తెరపైకి వస్తున్నారు. ఆయన బాటలోనే తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని చంద్రశేఖర్ శనివారం పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సీమాంధ్ర హక్కుల కోసం ప్రదర్శన నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో జిల్లా, అర్బన్ దేశం పార్టీలు సమైక్యాంధ్రను మఓచిపోయి సీమాంధ్ర హక్కుల కోసమే పోరాటం చేస్తారని తెలిసింది. అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలు రైతుల గురించి ఏనాడు పట్టించుకోని తెలుగుదేశం పార్టీ నేతలు ఆ తరువాత రైతుల పై అపార ప్రేమ కురిపించసాగారు. అలాగే సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు దీన్ని వదిలివేసి సీమాంధ్రులపై కపట ప్రేమకు సిఈఏఛీమౌతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. నేల వదిలి సాము చేసే దేశం నేతల్ని ప్రజలు ఏ మేరకు గౌరవిస్తారో వేచి చూడాలి.