= సమైక్య సెగతో ముఖం చాటేసిన మంత్రులు
= కానరాని ద్వితీయశ్రేణి నేతలు
సాక్షి, విజయవాడ : రాజకీయ నేతలకు సమైక్య సెగ తలగడంతో వారంతా దుర్గమ్మ దర్శనానికి దూరంగా ఉన్నారు. నేతలు ఏటా దసరా ఉత్సవాల్లో కొండపైన హల్‌చల్ చేసేవారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ అనుచరగణంతో దుర్గమ్మ దర్శనానికి వచ్చి వీఐపీ దర్శనాలు చేసుకునేవారు. వారికి ఆలయమర్యాదలతో స్వాగతం.. వేదపండితులతో ఆశ్వీరాదం.. అమ్మవారి కుండువాలు.. ప్రసాదాలు ఒకటేమిటి ఆ హడావుడే వేరుగా ఉండేది.
ఇక ఉత్సవాల ఏర్పాటులో కూడా నేతలు తమదైన పాత్ర పోషించేవారు. దేవాదాయశాఖ మంత్రి నుంచి కిందిస్థాయిలో ఉత్సవ కమిటీ సభ్యుల వరకు ఎవరికివారు అధికారులకు ఉచిత సలహాలిచ్చి వాటిని పాటించాలంటూ హడావుడి చేసేవారు. ఇందకీలాద్రిపై పండగ పది రోజులూ రాజకీయ నాయకుల హడావుడే ఎక్కువగా కనపడేది.
ఈ ఏడాది కనబడితే ఒట్టు..
ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఆ పరిస్థితి ఎక్కడా కానరావడం లేదు. దసరా ఉత్సవాలు సగం రోజులు అయిపోయాయి. ఇప్పటికే పలుమార్లు ఉత్సవాల నిర్వహణపై అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించినా, వాటికి ప్రజాప్రతినిధులు దూరంగానే ఉన్నారు. కనీసం ఒక్క సలహా కాని, సూచన కాని చేయడం లేదు. ఇక దుర్గగుడిపై రాజకీయ నాయకులు కనపడితే ఒట్టు.
ఒకరిద్దరు నాయకులు అమ్మవారిపై భక్తితో వచ్చినా దర్శనం చేసుకుని వెళ్లిపోతున్నారు తప్ప.. అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏమాత్రం సాహసించడం లేదు. ప్రస్తుత పరిస్థితులు బాగోనందున ఉత్సవాల్లో జోక్యం చేసుకుని విమర్శలుపాలు కావడం ఎందుకని దూరంగా ఉన్నామంటూ విజయవాడ నగరానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ‘సాక్షి ’ వద్ద వ్యాఖ్యానించారు.
ఉద్యమ సెగే కారణం...
నాయకులు ఉత్సవాలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం సమైక్య ఉద్యమమేనని భక్తులు నమ్ముతున్నారు. గత ఏడాది దసరా ఉత్సవాల్లో మూలానక్షత్రం రోజున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య విచ్చేసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి తోట నరసింహంతో పాటు రాష్ట్ర మంత్రులు ప్రసాద్‌కుమార్, విశ్వరూప్, కన్నా లక్ష్మీనారాయణ, కేపీ సారథి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు గత ఏడాది దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు.
ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి కృష్ణంరాజు తదితర నాయకులంతా అమ్మవారిని దర్శించుృున్నవారే. ఈ ఏడాది వారిలో చాలామంది ముఖం చాటేశారు. ఎంపీ లగడపాటి, కొనగళ్ల నారాయణరావులు ప్రజలకు అందుబాటులోనే లేరు. టీడీపీ, బీజేపీ నాయకులు కూడా ఇంద్రకీలాద్రి ఎక్కేందుకు సాహసించడం లేదు. దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య మాత్రం గురువారం సాయంత్రం దుర్గగుడి వస్తారనే ప్రచారం జరుగుతోంది.
జిల్లా మంత్రి కేపీ సారథి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని సమాచారం. వీరుగాక మిగిలిన మంత్రులు దుర్గగుడి వైపు చూసేందుకు కూడా సాహసించడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం ముమ్మరంగా సాగుతున్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ఈ ఏడాది దుర్గగుడికి రాకపోవచ్చని తెలిసింది. ఈసారి ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, చిన్నం రామకోటయ్య మాత్రమే దుర్గగుడికి వచ్చారు. సమైక్యానికి మద్దతు ప్రకటించి అమ్మవారి దర్శనం చేసుకుని చల్లగా జారుకున్నారు.
ఉత్సవ కమిటీ ఊసే లేదు...
గత ఏడాది ఉత్సవాలు ప్రారంభమైన రెండోరోజే 51 మందితో ఉత్సవ కమిటీ వేశారు. ఈ ఏడాది ముఖ్యమంత్రి సమైక్య ఉద్యమంలో తలమునకలై ఉన్నందున ఉత్సవ కమిటీ గురించి పట్టించుకోలేదని చెబుతున్నారు. భక్తులకు సౌకర్యాలకు మాత్రం ఏమాత్రం లోటు రాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.