సగం డబ్బు బకాయిలకే!
అనంతపురం అగ్రికల్చర్ : రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.28 వేల కోట్లు అవసర మవుతాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్‌లో రూ.8,200 కోట్లు కేటాయించామని, ఇందులో రూ.4,500 కోట్లు పాత బకాయిలు, వడ్డీలకే సరిపోతుందని వివరించారు. అనంతపురంలోని డ్వామా హాలులో ప్రజాప్రతినిధులు, అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించిన తర్వాత హంద్రీ-నీవా మొదటి దశ కింద ఉన్న జీడిపల్లి రిజర్వాయర్, రాగులపాడు ఎత్తిపోతల పథకం, పీఏబీఆర్ జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడాదిలోగా హంద్రీ-నీవా రెండవ దశను పూర్తి చేసి 4.20 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామన్నారు. ఇందుకోసం ప్రతి నెలా జిల్లాకు వచ్చి సమీక్ష సమావేశం నిర్వహిస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే నైతిక అర్హత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి లేదన్నారు. మేఘమథనం పేరుతో రఘువీరారెడ్డి రూ.40 కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో జగన్ నోరు మెదపలేదన్నారు.
‘హంద్రీ-నీవా’పై ప్రత్యేక దృష్టి.. హంద్రీ-నీవా కాలువ గట్లు బలహీనంగా ఉన్నందున అనుకున్న రీతిలో కృష్ణా నీటిని తీసుకురాలేకపోతున్నామని మంత్రి దేవినేని అన్నారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం రెండవ దశను ఏడాదిలోగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. హంద్రీ-నీవా ఫేజ్-1, 2 పనులతో పాటు హెచ్‌ఎల్‌సీ ఆధునికీకరణ పనులను వేగవంతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. శ్రీశైలంలో పుష్కలంగా నీరున్నా హంద్రీ-నీవా ద్వారా కేవలం మూడు పంపుల నుంచి మాత్రమే నీరు తీసుకుంటున్నామన్నారు. కాలువ గట్ల బలహీనతే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారని, అయినా నాలుగో పంప్‌ను ప్రారంభించామన్నారు. కాలువ గట్లు బలహీనంగా ఉన్నచోట ఫేజ్-2 కింద ఉన్న ఇంజనీర్లను నియమించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హంద్రీ-నీవా కోసం రూ.6700 కోట్లు ఖర్చు చేసినా 13 ఎకరాలకు కూడా సాగునీరివ్వలేని దుస్థితిలో కాలువ ఉందన్నారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కాలువపై పాదయాత్ర నిర్వహించి ఆర్భాటం చేశారని, సొంత జిల్లాపైనే ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో నంబర్ 2గా ఉన్న రఘువీరా హంద్రీ-నీవాను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల ప్రాంతాలను శాటిలైట్ ద్వారా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు, చెరువుల అభివృద్ధి తదితర పనులను ఈ ఏడాది నవంబర్ నుంచి చేపడతామన్నారు. జిల్లాలో ఏ రోజుకారోజు ఎన్ని క్యూసెక్కుల నీరు వస్తుందో తెలుసుకునేందుకు మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని మంత్రి పల్లె తెలిపారు. హంద్రీ-నీవాకు ప్రస్తుతం 1000 క్యూసెక్కుల నీరు వస్తోందని, అంతకన్నా ఎక్కువ వచ్చేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. హంద్రీ-నీవా, హెచ్‌ఎల్‌సీ ద్వారా జిల్లాకు 100 టీఎంసీల నీటిని తీసుకొచ్చి సాగునీటి గ్రిడ్ ఏర్పాటు చేస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి దేవినేనిని చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు కోరారు. హంద్రీ-నీవా ఫేజ్-2 కింద కుందుర్పి బ్రాంచ్ కెనాల్ నిర్మాణం చేపట్టి భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీటినందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విప్ యామిని బాల, ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ.. శింగనమల నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ నీటితో నింపి తాగు నీటి సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బీ.కే పార్థసారథి, వరదాపురం సూరి, ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్, మేయర్ స్వరూప, జేసీ సత్యనారాయణ, నీటిపారుదల శాఖ సీఈ మనోహర్, హెచ్చెల్సీ ఎస్‌ఈ మురళీనాథ్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
రిజర్వాయర్ల పరిశీలన .. బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్, కూడేరు వుండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయుర్ (పీఎబీఆర్), ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామ సమీపంలోని హంద్రీనీవా, హెచ్చెల్సీ నీరు వెళ్లే అక్విడెక్ట్, వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద ఉన్న హంద్రీ నీవా లిఫ్ట్‌ను మాజీ ఎమ్మెల్యే కేశవ్‌తో కలిసి మంత్రి దేవినేని పరిశీలించారు. ఈ సందర్భంగా తమకు పునరావాసం కల్పించి ఆదుకోవాలని జీడిపల్లి గ్రామానికి చెందిన నిర్వాసితులు మంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. ఆర్‌ఆర్ యాక్ట్ ద్వారా పునరావాసం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అవసరమైతే కృష్ణా జలాలను పీఏబీఆర్‌కు మళ్లించి తద్వారా జిల్లాలోని 49 చెరువులకు నీరందించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకు ముందు ఆయన జీడిపల్లి గ్రామంలో ఉబికి వస్తున్న ఊటనీటిని పరిశీలించారు. గ్రామంలోని కుటుంబాలన్నింటికీ పునరావాసం కల్పించడానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. జీడిపల్లి రిజర్వాయర్‌కు ఎన్‌టీరామారావు పేరు పెడుతామని తెలిపారు. త్వరలో జీడిపల్లి రిజర్వాయర్ నింపి పీఏబీఆర్‌కు నీటిని విడుదల చేస్తామన్నారు.