దేవినేని వర్సెస్ కేశినేని కోల్డ్‌వార్
ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్న కేడర్
ఎవరికి వారు బలం పెంచేందుకు ప్రయత్నం
పార్టీ కార్యక్రమాలు నామమాత్రమే
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని) మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. పార్టీలో కీలకమైన ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న యుద్ధంలో మిగిలిన నేతలు నలిగిపోతున్నారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలైనప్పటికీ, పార్టీలో ఎవరికి వారు తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లా, అర్బన్ పార్టీలు రెండుగా చీలిపోయాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
వీరిద్దరూ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేవినేని ఉమా జిల్లా పార్టీ కార్యాలయాన్ని కేంద్రం చేసుకుని తమ వర్గ కార్యకలాపాలను నిర్వహిస్తుండగా, కేశినేని భవన్‌ను కేంద్రంగా నాని పావులు కదుపుతున్నారు. అత్యవసర సమయాల్లో తప్పితే ఇద్దరు నేతలు కలుస్తున్న దాఖాలాలు లేవు. ఇటీవల ఎంపీ సుజనా చౌదరి వచ్చినప్పుడు ఉమా కేశినేని భవన్‌కు వచ్చారు. కీలక సమయంలోనే నాని జిల్లా పార్టీ కార్యాలయానికి వస్తారు.
నిన్న వంశీకి...నేడు కేశినేనికి ..
దేవినేని ఉమా పార్టీలో ఎదుగుతున్నవారికి తొక్కేస్తారనే ఆరోపణ మొదటి నుంచి ఉంది. యూత్ ఐకాన్‌గానూ, నగరంలో తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు తెచ్చిన వంశీని పొమ్మనకుండా పొగపెట్టారు. ఇప్పుడు నానికి అదే తరహా పరాభవం జరుగుతోందని కేశినేని వర్గం ఆరోపిస్తోంది. తన చేతి చమరు వదుల్చుకుని ఉత్తరాఖండ్ బాధితుల్ని స్వస్థలాలకు నాని తీసుకువస్తే, మీడియా ముందు ఉమా మాట్లాడి ఆ క్రెడిట్ ఆయన కొట్టేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. తనకు ప్రత్యర్థిగా మారుతున్న నానికి పార్లమెంట్ సీటు ఇవ్వబోరని ఉమా వర్గం ప్రచారం చేస్తోంది. టీడీపీ, బీజేపీల మధ్య తప్పనిసరిగా అలయెన్స్ ఉంటుందని, అందులో భాగంగా విజయవాడ సెంట్రల్ సీటు బీజేపీకి కేటాయిస్తే, బొండా ఉమాకు తూర్పు నియోజకవర్గం సీటు ఇస్తారంటున్నారు.
అందువల్ల గద్దె రామ్మోహన్‌ను ఎంపీ సీటు కోసం ప్రయత్నించుకోవాలని దేవినేని ఉమా సూచిస్తున్నట్టు తెలిసింది. మొన్నటి వరకు గద్దె రామ్మోహన్ ఎంపీ సీటుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు దేవినేని ఉమా నుంచి ప్రోత్సాహం రావడంతో ఆయన ఎంపీ సీటుపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నారు. తన అనుమతి లేకుండా జిల్లాలో ఏ సమావేశాలు నిర్వహించవద్దని దేవినేని ఉమా హుకుం జారీ చేసినట్టు కేశినేని వర్గం చెబుతోంది. దీంతో నాని విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏదైనా కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించినా అక్కడ నియోజకవర్గ స్థాయి నేతలు అంత ఆసక్తి చూపడం లేదని తెలిసింది.
ఉమాకు నాని చెక్ .. ఉమాకు చెక్ పెట్టేందుకు నాని కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే ఉమా సోదరుడి కుమారుడు దేవినేని చంద్ర శేఖర్‌ను తెరపైకి తీసుకువచ్చి ఆయనకు అర్బన్ తెలుగు యువత అధ్యక్షపదవి ఇప్పించారు. ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా తెలుగు యువతతో కార్యక్రమాలు చేయించి చంద్రశేఖర్ పార్టీలో పట్టు సాధించేందుకు కేశినేని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉమా తనకు వ్యతిరేకంగా ఉన్నందున అర్బన్ అధ్యక్షుడు నాగుల్‌మీరాను కేశినేని తన వ ర్గంలో కలుపుకొన్నారు.
రాబోయే రోజుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు బుద్దా వెంకన్నతో పాటు నాగుల్‌మీరా ఆశిస్తుండటంతో ఆయన నానితో కలిసి పనిచేస్తున్నారు. ఇక జిల్లాలో దేవినేని ఉమాకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఒకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం కూడా అంతర్గతంగా చేస్తున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో తన డబ్బు ఖర్చు చేసే ఏ కార్యక్రమంపైనా ఉమా మార్కు పడకుండా జాగ్రత్త తీసుకోవాలని నాని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ప్రజలకు దూరమైన టీడీపీ
చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, జిల్లా నేతల మధ్య ఐక్యత లేకపోవడంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ పూర్తిగా వెనుకబడిపోయిందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. చంద్రబాబు జిల్లాలో పాదయాత్ర, బస్సుయాత్ర, ఇప్పుడు వరదబాధితుల్ని పరామర్శించినా ఆ ప్రభావం నామమాత్రమేనంటున్నారు.