టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి
టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి
Published Sat, Jul 22 2017 12:45 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
రోడ్డున పడుతున్న తెలుగుతమ్ముళ్లు
నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు
మొన్న గోపాలపురం, నిన్న తాడేపల్లిగూడెం, నేడు చింతలపూడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికార తెలుగుదేశం పార్టీలో అసమ్మతులు, అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. తమ్ముళ్లు పదవుల కోసం గ్రూపులుగా విడిపోయి రోడ్డెక్కుతున్నారు. నాలుగురోజుల క్రితం గోపాలపురం నియోజకవర్గంలో మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైతే.. మొన్న తాడేపల్లిగూడెంలో నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. నిన్న చింతలపూడిలో ఎంపీ వర్గం నేతలు అసమ్మతి సమావేశం ఏర్పాటు చేశారు. అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. శనివారం భీమడోలులో జిల్లా సమన్వయ కమిటీలో ఈ విబేధాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి అసమ్మతి నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇవే నిదర్శనాలు..
గోపాలపురంలో గ్రూపు రాజకీయాలు నడుపుతున్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తమ ప్రత్యర్థి వర్గం వారికి మరోసారి పదవిని కట్టబెట్టి, తమకు మొండిచెయ్యి చూపారని ద్వారకాతిరుమల ఎంపీపీ వడ్లపూడి ఈశ్వర భానువరప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అధిష్టానం తమకు పదిరోజుల్లోగా న్యాయం చేయకుంటే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని ఎంపీపీ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. మండల అధ్యక్ష పదవి విషయంలో ఇరు వర్గాల మధ్య విబేధాలు తలెత్తాయి. మండల అధ్యక్ష పదవిని సుంకవల్లి బ్రహ్మయ్యకే ఎమ్మెల్యే ముప్పిడి కట్టబెట్టడంతో లంకా సత్తిపండు వర్గం తిరుగుబాటు చేసింది. ఎంపీపీతో పాటు 12 మంది ఎంపీటీసీ సభ్యులు, 10 మంది సర్పంచ్‌లు, 15 మంది పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, 13 మంది నీటిసంఘం అధ్యక్షులు, 14 మంది పాలకేంద్రం అధ్యక్షులు, ఇద్దరు సొసైటీ అధ్యక్షులు, ఒక ఏఎంసీ వైస్ చైర్మన్, నలుగురు డైరెక్టర్లు రాజీనామా చేస్తామంటూ అల్టిమేటం ఇచ్చారు.
తాడేపల్లిగూడెంలోనూ రెండురోజుల క్రితం జరిగిన సమావేశంలో శ్రేణులు ఎవరూ తనతో కలిసి రావడంలేదని, మునిసిపల్ కౌన్సిలర్లను కులాలవారీగా విడగొట్టే కుట్రలు జరుగుతున్నాయని, పార్టీలోని వ్యక్తులు కలిసిరాకపోవడం వల్ల ఇంక పార్టీ కార్యక్రమాలకు హాజరుకాబోనని, ఇదే చివరి సమావేశమంటూ మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ సమావేశం నుంచి బయటకు వెళ్లే యత్నం చేశారు. ఆరుగొలను చెరువు పనులను భాగాలుగా చేసి , మట్టి పనులు చేసుకున్న నాయకులు కూడా మట్టిమాఫియా అంటూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వ్యాఖ్యలు చేయడంతో దీనికి ప్రతిగా మునిసిపల్ కాంట్రాక్టర్, టీడీపీ నాయకుడు మేడపాటి చెల్లారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. నియోజకవర్గ సమన్వయకర్త ఈలి నాని తనకు సమావేశాలలో ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లారనే విషయం సమావేశంలో దుమారం రేపింది. ఈ విషయంలో మునిసిపల్ చైర్మన్ , ఈలినానికి మధ్య మాటల యుద్ధం సాగింది. ఇలా అందరూ వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు.
తాజాగా చింతలపూడి మండలంలో ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రగడవరం సమీపంలో శుక్రవారం బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి మాట్లాడుతూ నేను చెప్పిందే వేదం, మీరంతా నేను చెప్పినట్టు వినాలన్న చందంగా ప్రవర్తించే నాయకులకు పార్టీలో మనుగడ ఉండదని పరోక్షంగా ఎమ్మెల్యే సుజాతను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. సమావేశం ప్రారంభం కావడానికి ముందే జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ముఖ్య నాయకులకు ఫోన్ చేసి పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించే వరకు ఆగాలని కోరడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. ప్రతి నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్లు రోడ్డుకెక్కడం పార్టీకి తలనొప్పిగా మారింది. శనివారం జరిగే జిల్లా సమావేశం వాడిగా వేడిగా జరిగే అవకాశం కనపడుతోంది..
Advertisement