తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపు చెక్కతో నే రెండిస్తా.. అన్నట్టు మిత్రపక్షాలుకయ్యాలాడుకుంటున్నాయి. ఎన్నికల ముందు ఉప్పలగుప్పాలాడిన బీజేపీ, టీడీపీ ఇప్పుడు నిప్పులు చెరుక్కుంటున్నాయి. మాటలే తూటాలుగా దాడులకు తెగబడుతున్నాయి. మీ చంద్రబాబు జనానికి ఇచ్చిన టోకరాలతో మేం జిల్లాలో తలెత్తుకోలేకపోతున్నామని కమలనాథులంటుంటే.. మీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే, సాధారణ బడ్జెట్లు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని తమ్ముళ్లు ఎదురుదాడికి దిగుతున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :రాజకీయాల్లో మిత్రత్వం, శత్రుత్వం ఏదీ శాశ్వతం కాదు. ఒకప్పుడు తెగిడిన నోళ్లే తరువాత పొగుడుతాయి. భుజాల మీద మోసేవారే తేడా వస్తే అమాంతం కిందకు పడేస్తారు. ఇవన్నీ ప్రజలకు కొత్తకాదు. జిల్లాలో జాతీయ పార్టీ బీజేపీ, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం క్రమంగా ప్రత్యక్షంగా పరిణమిస్తోంది. ఎన్నికల ప్రయోజనాల కోసం గత వైరాన్ని పక్కన పెట్టి బంధాన్ని కలుపుకున్న ఆ పార్టీలు ఎన్నికల అనంతరం అనుసరించిన విధానాలు స్థానిక నేతల మధ్య చిచ్చు రేపాయి.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటినా ప్రజలను ఆకట్టుకోవడంలో విఫలం కాగా, ఆయా ప్రభుత్వాల వైఫల్యాలను ఒకరిపై ఒకరు నెట్టుకోవడానికి, ప్రజల్లో మంచి మార్కులు కొట్టేయడానికి జిల్లా నాయకులు పడుతున్న పాట్లు ఇరు పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఎన్నికలకు ముందు నరేంద్రమోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణను సొమ్ము చేసుకుని రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడానికే టీడీపీ తమతో జత కట్టిందని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తుండగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్లో పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకుని, దాని నుంచి బయట పడడానికి, ఇక్కడ పార్టీని బలపరుచుకోవడానికి తమతో బంధమొక్కటే పరిష్కారం అని ఆలోచించుకుని బీజేపీ తమతో స్నేహ ఒప్పందం చేసుకుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
బాబు టోకరాతో గాబరా
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఎన్నికల వాగ్దానాలైన రైతు, డ్వాక్రా రుణమాఫీల అమలుకు సాధ్యంకాని నిబంధనలు పెట్టి అటు రైతులకు, ఇటు మహిళలకు బాబు ఇచ్చిన టోకరాపై మిత్రపక్షమైన బీజేపీ నాయకులు స్పందిస్తూ ‘జిల్లాలో తలెత్తుకోలేని పరిస్థితి దాపురించింద’ని వ్యాఖ్యానిస్తున్నారు. అప్పటి వరకూ తమ నాయకుడు మోదీపై ప్రజల్లో ఉన్న అభిమానం కాస్తా చంద్రబాబు టోకరాతో మంటగలిసిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వృద్ధాప్య, వితంతు పింఛన్లు సైతం అర్హులకు ఇవ్వకుండా కోత విధించడం కూడా తమ నాయకుడు మోదీపై ప్రతికూల ప్రభావాన్ని ఏర్పరిచిందని, టీడీపీ నాయకుని విధానాలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడంతోపాటు తమపై కూడా అదే వ్యతిరేకతకు దారి తీశాయని చెప్పుకొస్తున్నారు.
బడ్జెట్‌ల సాకుగా టీడీపీ దాడి
ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రైల్వే, సాధారణ బడ్జెట్లు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని, నిధుల కేటాయింపులో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని టీడీపీ నాయకులు బాహాటంగానే ప్రకటనలు గుప్పించడం బీజేపీ నాయకులకు కంటగింపుగా మారింది. బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించి ఇప్పుడు మాట మార్చడం, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినప్పటికీ బడ్జెట్‌లో కేవలం రూ. 100 కోట్లు మాత్రమే విదల్చడం కూడా టీడీపీ నాయకులకు అవకాశంగా దొరికింది. మిత్రపక్షమైనప్పటికీ బడ్జెట్‌లో అన్యాయం చేసిందని ప్రకటనలు గుప్పిస్తూ తమను ఎన్నుకున్న ప్రజల్లో మంచితనాన్ని మూటగట్టుకోవడానికి, సానుభూతి సంపాదించుకోవడానికి టీడీపీ నేతలు వినియోగించుకున్నారు.
కాగా జిల్లాలోని బీజేపీ నాయకుల్లో కొందరు బడ్జెట్‌పై పెదవి విరవడం, నో కామెంట్ అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించడం వారికి మరింత ఊతమిచ్చింది. ఐతే టీడీపీ నాయకుల ప్రకటనల దాడిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాస వర్మ తిప్పి కొట్టారు. తమ పార్టీని గాని, తమ నాయకుడిని గానీ విమర్శించే నైతిక అర్హత టీడీపీ నాయకులకు లేదని ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానన్న బాబు కనీసం రాజధాని నిర్మాణం విషయంలో ఇప్పటికీ భూసేకరణ చేయలేకపోవడం వైఫల్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నాయకులు గురువింద గింజ చందంగా వారి నాయకుడు బాబు కింద ఉన్న మచ్చను చూడకుండా మోదీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
మిత్రభేదం
Published Mon, Mar 2 2015 12:28 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement