బాబు వద్ద మంత్రికే పట్టు?
బీజేపీ, టీడీపీ మధ్య తారస్థాయికి చేరిన వర్గపోరు
విభేదాలతో బజారున పడుతున్న మంత్రి, జెడ్పీ చైర్మన్
పట్టించుకోని అధిష్టానాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :జిల్లాలో బీజేపీ, టీడీపీ ప్రజాప్రతినిధుల వర్గపోరు పరాకాష్టకు చేరి పరువు బజారున పడుతోంది. బీజేపీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, టీడీపీకి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పట్టణ ప్రజలకే కాదు ఇరు పార్టీల శ్రేణులకు ఏవగింపు కలిగించేలా నేతలు బహిరంగంగా రగడకు దిగుతున్నా ఆ పార్టీల అధిష్టానాలు పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.
ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థ నిట్ ఏ ముహూర్తాన ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం తరలిందో అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా మంత్రి మాణిక్యాలరావుపై టీడీపీ నాయకులు ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. మంత్రికి ప్రాధాన్యత తగ్గించే క్రమంలో టీడీపీ నేతలు చివరకు పార్టీ శ్రేణులను కూడా వినియోగిస్తున్నారన్న విషయాన్ని వరుస ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల పెంటపాడు మండలం ప్రత్తిపాడులో రవాణా శాఖ మంత్రి సిద్దా రాఘవరావు సమక్షంలోనే బాపిరాజు, బొలిశెట్టి శ్రీనివాస్ మంత్రి మాణిక్యాలరావుపై తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగారు.
తాజాగా శనివారం తాడేపల్లిగూడెంలో ఎన్టీఆర్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పీతల సుజాత సమక్షంలో మళ్లీ అదే వాగ్వాదం పునరావృతమైంది. తాడేపల్లిగూడెం పట్టణాభివృద్ధికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో తాను నిధులు మంజూరు చేయించినా.. టీడీపీ నేతలకు రుచించడం లేదంటూ మంత్రి మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి. అదే అదనుగా మంత్రిపై బొలిశెట్టి, ముళ్లపూడి విమర్శలకు దిగారు. మరో మంత్రి సుజాత వారిస్తున్నా లెక్కచేయకుండా ఇరువర్గాలూ వాదులాడుకుని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
మంత్రి కార్యక్రమాలకు టీడీపీ సర్పంచ్‌లూ దూరం తాడేపల్లిగూడెం మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి మాణిక్యాలరావు వెళితే టీడీపీ సర్పంచ్‌లు వాటికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల జగ్గన్నపేటలో రోడ్డు పనులకు మంత్రి పైడికొండల శంకుస్థాపన చేయగా, టీడీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులెవరూ హాజరు కాలేదు. దీంతో మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గూడెం మండలంలో ప్రైవేటు సామ్రాజ్యం నడుస్తోందని, మంత్రి హాజరైనా.. సర్పంచ్ కూడా రాని పరిస్థితి ఉందని ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా మరోమారు మాణిక్యాలరావును లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు నేరుగా విమర్శల దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది.
మంత్రికే పట్టు?
వాస్తవానికి చంద్రబాబునాయుడు వద్ద మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాటే ఒకింత చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. నిట్ విషయం మొదలుకుని జిల్లా పర్యటనల్లో పైడికొండలకు చంద్రబాబు తగిన ప్రాధాన్యతే ఇస్తారు. ఇటీవల ఏలూరులో జరిగిన కాపు రుణ మేళాలో టీడీపీకి చెందిన మంత్రి పీతల సుజాతకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా పైడికొండలకు అవకాశం కల్పించారు. సామాజిక వర్గ కోణంలో పైడికొండలకు మాట్లాడే అవకాశం ఇచ్చారని అనుకున్నా..
అదే సామాజిక వర్గానికి చెందిన జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి ఛాన్స్ దక్కలేదు. ఈ నేపథ్యంలో బాబు వద్ద టీడీపీ నేతలు పైడికొండలపై పంచాయితీ పెట్టినా పెద్దగా ఫలితం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇరుపార్టీల అధిష్టానాలు పట్టించుకోకుండా అలా వదిలేస్తే మాత్రం ఇప్పటికే బజారున పడిన విభేదాలతో అంటకాగుతున్న నేతలు రేపోమాపో భౌతిక దాడులకు దిగినా ఆశ్చర్యం లేదన్న వ్యాఖ్యలు ఇప్పుడు గూడెంలో వినవస్తున్నాయి.