ఓటు వేయకపోతే చంపేస్తారా
ఏలూరు : జిల్లాలో బీజేపీని బలోపేతం చేసి.. వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా తలపడేవిధంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయూలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.హరిబాబు పిలుపునిచ్చారు. ఏలూరు పేరయ్య కోనేరు ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. పార్టీలో ఎంత పనిచేస్తే అంత గౌరవం ఉంటుందని, సిద్ధాం తాల ప్రకారం నడిచే పార్టీ బీజేపీ
ఒక్కటేనని పేర్కొన్నారు. సామాన్య కార్యకర్తను సైతం గౌరవించే పార్టీ తమదేనని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి నిట్, ఐఐటీ, ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయూలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు మంజూరు చేశామని చెప్పారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఘనత మోడీదేనన్నారు. రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోని 148 సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్రానికి ఏ ఒక్కటీ దక్కకపోవడంతో నానా కష్టాలు పడుతున్నామన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ సమాజంలో లంచగొండితనం వేనూళ్లకోవడానికి కాంగ్రెస్ పాలనే కారణమన్నారు.
బీజేపీ బలపడటం అంటే మిత్రపక్షమైన టీడీపీని ఇబ్బంది పెట్టడం కాకుండా రాబోయే రోజుల్లో పార్టీ మరింత విస్తరించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల వైద్య ఆరోగ్య శాఖ తీవ్రంగా నష్టపోయిందన్నారు. సౌకర్యాలు, మందులు లేక ప్రభుత్వ వైద్యరంగం దిగజారిందన్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని చూస్తుంటే కడుపు రగిలిపోతోందన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు యూవీ కృష్ణంరాజు మాట్లాడుతూ 100 రోజుల బీజేపీ పాలనలో ఒరిగిందేమీ లేదంటూ కాంగ్రెస్ బూటకపు ప్రకటనలు చేస్తోందని, మోడీ నాయకత్వంలో ప్రజలకు ఏం జరిగిందో ప్రపంచ దేశాలకు సైతం అర్థమైందని అన్నారు. మోడీకి వీసా నిరాకరించిన అమెరికా సైతం ఆయనిను సగౌరవంగా ఆ దేశానికి ఆహ్వానించడం మోడీ నిబద్ధతకు తార్కాణమని పేర్కొన్నారు.
ఓటు వేయకపోతే చంపేస్తారా : టీడీపీ తీరుపై కావూరి ఫైర్
తమ పార్టీకి ఓటు వేయని వారిని చంపేస్తామని, పొలాల్లో వ్యవసాయం చేయనిచ్చేది లేదంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు ప్రజలను హింసించడాన్ని చూస్తూ ఊరుకునేది లేదని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొలానికి పాస్ పుస్తకం ఇప్పించేందుకు రూ.10 వేలు, రూ.10 లక్షల పొలానికి నష్టపరిహారం ఇప్పించేందుకు రూ.2 లక్షలు లంచం తీసుకోవడం రాజకీయూ అవుతుందా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ‘ఈ మాత్రం దానికి రాజకీయాల్లోకి రావడం ఎందుకని, ఏదైనా మంచి వ్యాపారం చేసుకుని బతకొచ్చుకదా’ అని వ్యాఖ్యానించారు. అధికార దర్పంతో ప్రజలను హింసించడమనే నీతిమాలిన బతుకు మరొకటి ఉండదన్నారు. టీడీపీ అఘాయిత్యాల నుంచి ప్రజలను పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా రక్షించే స్థితి లేకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి అకృత్యాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ చేగొండి హరరామజోగయ్య, మాజీ ఎమ్మెల్యే చావా రామకృష్ణ, చేగొండి ప్రకాష్‌బాబు, నగర సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి రాము, కాంగ్రెస్ నాయకుడు పులి శ్రీరాములు, తపన ఫౌండేషన్ అధ్యక్షుడు గారపాటి చౌదరి, బొజ్జా నరేంద్ర, మాజీ కౌన్సిలర్ కొంపల్లి తాయారు, మేరీపాల్ పద్మావతి బీజేపీలో చేరారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సోము వీర్రాజు, పార్టీ అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ, మహిళా మోర్చా అధ్యక్షులు కె.మాలతీరాణి, పార్టీ ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పి.విష్ణుకుమార్‌రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, నాయకులు పీవీఎస్ వర్మ, జమ్ముల కిషోర్, పి.వీరరాఘవులు, పొట్లూరి రామ్మోహన్‌రావు, పీవీ సుబ్రహ్మణ్యవర్మ, కోడూరి లక్ష్మీనారాయణ, కురెళ్ల సుధాకర్‌కృష్ణ, ముద్దాని దుర్గారావు, సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత కోనేరు సురేష్‌బాబు పాల్గొన్నారు.