కాషాయం కట్టడమేనా?
ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాజకీయాల్లో 'దూకు'డు ఆట రసపట్టు మీదుంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబకడంతో సీనియర్ కాంగ్రెస్ నేతలు రాజకీయంగా సురక్షిత పార్టీలకు చేరుకుంటున్నారు. సమైక్యాంధ్ర వీరుడి ముసుగులో కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్న కావూరి సాంబశివరావు కాంగ్రెస్‌లో లాభం లేదనుకుని కొద్దికాలం నుంచి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. చేతులు కాలాక...ఆకులు పట్టున్నట్లుగా ఆయన రాష్ట్ర విభజనకు నిరసనగా రాజీనామా చేసినట్లు చెప్పకు రావటం విశేషం. ఈ మేరకు కావూరి గురువారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించుకున్నారు.
కాగా రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో ప్రజలు రాజీమానా చేయమని డిమాండ్ చేసినా కావూరి ఏ మాత్రం పట్టించుకోలేదు. పలుమార్లు ఆయన్ను సమైక్యవాదులు అడ్డగించినా లెక్కచేయలేదు. రాష్ట్ర విభజన జరిగిపోతున్న సమయంలోనూ విభజన జరగదని, పార్లమెంటులో తన సత్తా చూపిస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలతో అందరినీ గందరగోళంలో పడేశారు. చివరికి కేంద్ర కేబినెట్ సమావేశంలో విభజనకు అంగీకరించి రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకువచ్చి మరింత చులకనయ్యారు.
పార్లమెంటులోనూ రకరకాల డ్రామాలు ఆడారు. చివరికి విభజన జరిగిన తర్వాత కూడా ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్ పరాజయం ఖాయమని సర్వేల్లో వెల్లడి కావడంతో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో జనాన్ని ఎలాగోలా మభ్యపెట్టేందుకు రంగంలోకి దిగారు. రాజీనామా అస్త్రాన్ని తెరమీదకు తెచ్చి ఇందు కోసం తమ నియోజకవర్గ కార్యకర్తలతో మంతనాలు జరిపి నేనేం చేయాలో మీరే చెప్పండంటూ లేఖలు సంధించారు. అయితే రాజీనామా చేశాక ఏ పార్టీలో చేరాలన్నది తేల్చుకోకపోవడంతో ఆయన ఇప్పటి వరకు ఆగారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఏ పార్టీలోకి మారాలో తెలియక కొద్దిరోజులు డైలమాలో పడ్డారు.
తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నా ఏలూరు సీటు కేటాయించేందుకు ఆ పార్టీ హామీ ఇవ్వకపోవడంతో కావూరి వెనుకడుగు వేశారు. ఇక సైకిల్ ఎక్కాలనుకున్నా....స్థానిక నాయకుల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల చంద్రబాబు కావూరిని తమ పార్టీలోకి ఆహ్వానించలేకపోయారు. దీంతో కావూరి ఇక దారేదీ లేక కాషాయం వైపు మొగ్గినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిజెపి అగ్రనేతలతో మాటామంతి జరిపినట్లు మాత్రం మీడియాలో కథనలు వెలువడ్డాయి. చివరికి బీజేపీతో లింకు కుదరడంతో అందులోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.