బీజేపీలోకి కావూరి జంప్!
ఏలూరు : దీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో చక్రం తిప్పిన మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు బీజేపీలోకి జంప్ కానున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్పై అసంతృప్తిగా ఉన్న ఆయన కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధంకాని అయోమయావస్థలో కావూరి చిక్కుకున్నారు. టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే ఆ పార్టీ నేతలు అడ్డు తగలటంతోగే బీజేపీ వైపు చూసినట్టు వార్తలొచ్చాయి. అప్పట్లో బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినా... టీడీపీతో పొత్తు కారణంగా అది సాధ్యం కాలేదని సమాచారం. దాంతో ఆయన చాలారోజులుగా సైలెంట్‌గా వున్నారు.
తాజాగా కావూరి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మే 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగే బహిరంగ సభలో ఆయన నరేంద్రమోడీ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కావూరి ఏలూరు నుంచి భారీ ర్యాలీగా వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. కాగా ఈసారి ఎన్నికలకు కావూరి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో కావూరి బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరిపారు కూడా. ఇప్పటికే మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆమె రాజంపేట నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.