కోల్డ్ వార్
* అమాత్యుల మధ్య అగాధం!
* ఆర్‌డీఓల బదిలీలపై ఆధిపత్య పోరు
* చినరాజప్ప, యనమల వైఖరిపై విస్తుపోతున్న టీడీపీ వర్గాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : బదిలీల జాతర అమాత్యుల మధ్య కోల్డ్ వార్‌కు తెరలేపింది. అధికారులందరినీ సాగనంపి, నచ్చిన వారిని తెచ్చుకోవాలనుకోవడంతో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. ప్రధానంగా రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారుల బదిలీల కోసం ఇస్తున్న సిఫారసు లేఖలు వీరి మధ్య దూరాన్ని మరింత పెంచుతున్నాయి. పనితీరు ప్రామాణికంగా బదిలీలని పైకి చెబుతున్నా.. నచ్చని వారిని సాగనంపే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బది లీల్లో పట్టు కోసం ఎవరిమట్టుకు వారు ఎత్తులకు పైఎత్తు లు వేస్తున్నారు. ఆ పరిణామాలతో అధికారుల పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’లా తయారైంది.
ప్రధానంగా కాకినాడ, పెద్దాపురం ఆర్‌డీఓ పోస్టింగ్‌లు ఆధిపత్య పోరులో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు చేస్తున్న సిఫారసులు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నచ్చినోళ్లను తెచ్చుకోవాలనుకోవడమే ఈ అగాధానికి కారణంగా నేతలు విశ్లేషిస్తున్నారు. కాకినాడ, పెద్దాపురం ఆర్‌డీఓలుగా ప్రస్తుతం అంబేద్కర్, కూర్మనాథ్ పనిచేస్తున్నారు. వీరి స్థానే కొత్తవారిని తెచ్చుకోవాలని ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
పెద్దాపురం ఆర్‌డీఓ పోస్టింగ్ కోసం నువ్వా, నేనా అనే స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూర్మనాథ్‌ను సాగనంపి, అతని స్థానంలో విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో పనిచేస్తున్న మల్లిబాబును తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి రాజప్ప గట్టి ప్రయత్నం చేశారు. కాకినాడ కలెక్టరేట్‌తో పాటు పెదపూడి సహా పలు మండలాల్లో పనిచేసిన మల్లిబాబుకు వివాదరహితుడనే పేరుంది. ఈ కారణంగానే పెద్దాపురం నియోజకవర్గ నేతల సూచన మేరకు రాజప్ప.. మల్లిబాబుకు సిఫారసు చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో మల్లిబాబుకు పెద్దాపురం ఆర్‌డీఓగా పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. ఈ మేరకు జీఓ కూడా విడుదలైంది.
జాయిన్ అవ్వడంలో ఒక్క రోజు ఆలస్యం కావడాన్ని ఆసరాగా చేసుకుని ప్రత్యర్థి వర్గం పావులు కదిపి మల్లిబాబు పోస్టింగ్ ఆర్డర్‌ను నిలుపుదల చేయించారని రాజప్ప వర్గం కారాలుమిరియాలు నూరుతోంది. మల్లిబాబును కాకుండా విశాఖపట్నంలో పనిచేస్తున్న విశ్వేశ్వరరావును పెద్దాపురానికి తీసుకురావాలని యనమల వర్గం పట్టుదలతో పావులు కదుపుతోంది. ఈ విషయంలో పెద్దఎత్తున సొమ్ములు కూడా చేతులుమారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన సోదరుడి పేరుతో బదిలీల దందా నిర్వహిస్తోన్న తెలుగు తమ్ముడు ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో వేలు పెట్టేస్తున్నారని అక్కడి నేతలు మండిపడుతున్నారు.
ఇప్పుడు ఈ బేరసారాల్లో కూడా సంబంధిత నాయకుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తీరుపై రాజప్ప వర్గీయులు రుసరుసలాడుతున్నారు. ఆ ముఖ్యనేతకు తెలిసే ఈ వ్యవహారమంతా నడుస్తుందా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. అనవసరంగా పెద్దాపురం ఆర్‌డీఓ బదిలీ వ్యవహారంలో మితిమీరిన జోక్యాన్ని రాజప్ప వర్గం ప్రశ్నిస్తోంది. పెద్దాపురం డీఎస్పీ ఓలేటి అరవిందబాబును కొనసాగించాలని యనమల వర్గం ప్రయత్నాలు చేయడాన్ని రాజప్ప తప్పుపట్టారని అతని అనుచర వర్గం చెబుతోంది.
గతంలో జిల్లాలో పలు చోట్ల పనిచేసిన ప్రసన్నకుమార్‌ను తెచ్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అయిన రాజప్ప ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ విషయం తెలిసి కూడా డీఎస్పీ బదిలీలో పావులు కదపడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని రాజప్ప సన్నిహితుల వద్ద చర్చించారని చెబుతున్నారు. హోం మంత్రి హోదాలో, తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పెద్దాపురంలో డీఎస్పీ, ఆర్‌డీఓల బదిలీల్లో సైతం తన ఆధిపత్యాన్ని లేకుండా చేస్తారా అని రాజప్ప ఒకింత ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. దీనిపై తాడోపేడో తేల్చాల్సిందేనని రాజప్ప వర్గం పట్టుబడుతోందని సమాచారం.
కాకినాడ ఆర్‌డీఓ పరిస్థితి ఇంతే..
దాదాపు ఇదే పరిస్థితి కాకినాడ ఆర్‌డీఓ పోస్టింగ్‌లో కూడా ప్రస్ఫుటమవుతోంది. కాకినాడ ఆర్‌డీఓగా ప్రస్తుతం అంబేద్కర్ పనిచేస్తున్నారు. పనిచేస్తున్న అధికారులందరినీ బదిలీ చేయాలనే సర్కార్ విధానపరమైన నిర్ణయంతో ఆయనను బదిలీ చేయాలని నిర్ణయం జరిగింది. ఈ పోస్టు కోసం ఇద్దరు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాకినాడ కలెక్టరేట్ ఏఓ, కాకినాడ అర్బన్, రూరల్ తహశీల్దార్‌గా పనిచేసి పదోన్నతిపై డిప్యుటీ కలెక్టర్‌గా ప్రస్తుతం నెల్లూరులో పనిచేస్తున్న మల్లికార్జునను ఆర్‌డీఓగా తీసుకురావాలని కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం ఎమ్మెల్యేలు కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ లేఖ ఇచ్చారు.
వీరంతా కలిసి ఏకాభిప్రాయంతో ఒకే లేఖ ఇవ్వడంతో మంత్రి రాజప్ప గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పోస్టింగ్ ఇవ్వడమే మిగిలి ఉందనుకుంటున్న తరుణంలో మెట్ట ప్రాంతానికి చెందిన ముఖ్యనేత సోదరుడి జోక్యంతో వివాదం ముదురు పాకానపడింది. ఆ ముఖ్యనేత సోదరుడు, కాకినాడ సిటీలో ఓ టీడీపీ నేత మధ్య కుదిరిన లోపాయికారి ఒప్పందంతో ఆర్‌డీఓ పోస్టింగ్‌లో సీన్ మారిపోయింది. ఈ విషయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, ఆమె భర్త పార్టీ కార్యదర్శి పిల్లి సత్తిబాబు వారితో వ్యతిరేకిస్తున్నారని తెలియవచ్చింది. ముందుగా అంతా అనుకుని లేఖ ఇచ్చి ఇప్పుడు ఏ కారణంతోనైనా సరే ఇలా మాట మార్చి ప్రస్తుత ఆర్‌డీఓ అంబేద్కర్ కొనసాగింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఈ పోస్టింగ్‌ను గతంలో అంబేద్కర్ కంటే ముందుగానే ఆశించి భంగపడ్డ పౌర సరఫరాల కార్పొరేషన్ డీఎం గంగాధర్‌కుమార్ మరోసారి తెరపైకి రావడంతో బదిలీల వ్యవహారం రసకందాయంలో పడింది.