chinarajappa
-
చినరాజప్పకు ఆరోగ్యం సహకరించడం లేదు.. ఈ సారి టికెట్ నాకే ఇవ్వండి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీలో సిట్టింగ్‌లకే సీట్లు అని చంద్రబాబు ఏ ముహూర్తాన ప్రకటించారో కానీ.. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఆయన చుక్కలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జనసేనతో పొత్తు టీడీపీలో మరింత అగ్గి రాజేస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆ పారీ్టలోని చంద్రబాబు సొంత సామాజికవర్గ నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాటి ప్రకటనలతో సంబంధం లేకుండా ఆరు నూరైనా సరే ఉమ్మడి జిల్లాలో మూడు సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని ఆయన సొంత సామాజికవర్గం తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. ఇది చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. మూడు సీట్ల ఆనవాయితీపై సిగపట్లు ఉమ్మడి జిల్లాలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొదటి నుంచి పెద్దాపురం, మండపేట, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్‌లో టీడీపీ తమకే ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు సామాజికవర్గ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈసారి పొత్తులో రాజానగరాన్ని జనసేనకు వదిలేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిగిలిన మూడింటికి సంబంధించి మండపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును మరోసారి గెలిపించాలని ‘రా.. కదలి రా’ సభలో చంద్రబాబు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరం రూరల్‌పై ఇరు పార్టీల మధ్య ఇంకా స్పష్టత రాలేదు. ఇక మిగిలిన పెద్దాపురం సీటు టీడీపీ ఆవిర్భావం నుంచీ చంద్రబాబు సామాజికవర్గానికే దక్కుతోంది. దివంగత మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు చివరి రోజుల్లో ఆ స్థానం కోసం విఫల యత్నం చేశారు కూడా. అయితే, గడచిన రెండు సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ సీటును కోనసీమ నుంచి తీసుకువచ్చిన కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకు ఇస్తూ వస్తున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఈ సీటు చినరాజప్పకేనని చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. అప్పటి నుంచీ పెద్దాపురం టీడీపీలో రెండు సామాజికవర్గాలూ ఈ సీటు కోసం నువ్వా, నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి. దీని ప్రభావం ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాలపై పడుతోంది. పెద్దాపురంపై గుణ్ణం కన్ను మొదటి నుంచీ ఆనవాయితీగా ఇస్తున్న పెద్దాపురం సీటు కోసం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన గుణ్ణం చంద్రమౌళి పావులు కదుపుతున్నారు. రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించిన తరువాత మౌళి పెద్దాపురంపై గట్టి పట్టే పడుతున్నారు. ఆర్థికంగా స్థితిమంతుడైన ఆయనకు లోకేష్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. కొంత కాలం నుంచి ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు జరిపిన పర్యటనలకు మౌళి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో తమకు పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ వంటి వారి ఆశీస్సులున్నాయని మౌళి వర్గం ప్రచారం చేసుకుంటోంది. రాజప్పకు వ్యతిరేకంగా.. ఇద్దరూ ఒక్కటై.. చినరాజప్పకు ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని వైరి వర్గం చెబుతోంది. ఈ విషయాన్ని రా.. కదలి రా కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ కాతేరు వచ్చిన చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాజప్పకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న చంద్రమౌళికి దివంగత బొడ్డు భాస్కర రామారావు తనయుడు, టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి వెంకట రమణ చౌదరి వర్గం పరోక్షంగా మద్దతు ఇస్తోంది. అయితే, ఆవిర్భావం నుంచీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉమ్మడి జిల్లాలో పార్టీకి సుదీర్ఘ కాలం సారథ్యం వహించిన రాజప్ప సీటుకు ఢోకా లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మౌళి వర్గాన్ని దీటుగా ఎదుర్కొనే సత్తా తమకు లేకపోలేదని అంటున్నారు. రాజానగరం సీటుపై వెంకట రమణ చౌదరి పెట్టుకున్న ఆశలపై జనసేన నీళ్లు చల్లడంతో.. ఆయన, మౌళి కలసి ఉమ్మడి కార్యాచరణతో చినరాజప్పకు పొగ పెడుతున్నారనే చర్చ టీడీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికా అన్నట్టు వెంకట రమణ చౌదరికి రాజమహేంద్రవరం ఎంపీ స్థానాన్ని చూపించి బుజ్జగించేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ టీడీపీలో వర్గ విభేదాలు మరింత ముదురు పాకాన పడేలా కనిపిస్తున్నాయి. ఖర్చు మాది.. సీటు ఆయనదా! పెద్దాపురం వరుసగా రెండుసార్లు రాజప్పకు కట్టబెట్టారని, ఇప్పుడు మూడోసారి కూడా ఆయనకే ఇస్తామంటే సహించేది లేదంటూ చంద్రబాబుపై ఆయన సామాజికవర్గ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. చినరాజప్పకు వ్యతిరేకంగా మౌళి పలు వర్గాలను ఏకం చేసే పనిలో ఉండటంతో పెద్దాపురంలో పార్టీ రెండు వర్గాలుగా విడిచిపోయింది. ఈ సీటుపై ఆశతో ఏడాది కాలం నుంచి పార్టీ కోసం లక్షల రూపాయలు తగలేసుకుంటుంటే.. ఇప్పుడు సిట్టింగ్‌కే ఇస్తామంటే ఎలా సహకరిస్తామంటూ.. పెద్దాపురం నియోజకవర్గంలోని చంద్రబాబు సామాజికవర్గ నేతలు చినరాజప్పను బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చినరాజప్పకు అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని, ఈసారి తమ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వకుంటే తాడోపేడో తేలుస్తామని స్పష్టం చేస్తున్నారు. 2014లో స్థానికేతరుడైన చినరాజప్పకు సీటు ప్రకటించినప్పుడు ఆయన వాహనాలను ధ్వంసం చేసి నామినేషన్ వేయకుండా అడ్డుకున్న నాటి పరిస్థితులను వారు గుర్తు చేస్తున్నారు. -
అంటే బయటకన్నా ఆయనకు జైలే బాగుందంటా?!
అంటే బయటకన్నా.. ఆయనకు జైలే బాగుందంటా?! -
ప్రెస్‌మీట్ పేరుతో సభ.. టీడీపీ నేతల అరెస్ట్
రౌతులపూడి: నిబంధనలను ఉల్లంఘించి ప్రెస్‌మీట్ పేరిట సభ నిర్వహించేందుకు యత్నించిన టీడీపీ నాయకులను తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం, సుందరకోట శివారు బమిడికలొద్దులో చేపట్టిన బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాలంటూ మాజీ మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు తదితరులు గిరిజన ప్రాంతాలైన జల్దాం, చల్లూరు, దబ్బాదిలో పర్యటించారు. తర్వాత వీరు రౌతులపూడి చేరుకున్నారు. ప్రెస్‌మీట్ పేరుతో సభ నిర్వహించేందుకు ప్రయత్నించారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వీరిని పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం వరకు టీడీపీ నేతలతో పోలీసులు చర్చించినా వినలేదు. దీంతో చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాడు టీడీపీ ఇన్చార్జ్ వరుపుల రాజా, ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, వంగలపూడి అనిత, వంతల రాజేశ్వరి, బి.రామానాయడు, శ్రావణ్‌కుమార్, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్, తదితరులను పోలీసులు అరెస్టు చేసి కోటనందూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన అనంతరం విడుదల చేశారు. -
టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు మహానాడు వేదికగా మాటల యుద్దానికి దిగారు. చంద్రబాబు ముందే టీడీపీ నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ఒకరినొకరు విమర్శించున్నారు. ఈ క్రమంలో చినరాజప్ప మాట్లాడుతూ.. కొంత మంది నేతలు అధికారం పోగానే పార్టీని వీడిపోయారని అన్నారు. తిరిగి వెళ్లిపోయిన వారిని పార్టీలోకి తీసుకోమని తెలిపారు. మాజీ మంత్రలు, ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో లేకుంటే పార్టీని పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఎవరు ఏ విధంగా వ్వవహారిస్తున్నారో చంద్రబాబు గమనించాలని చినరాజప్ప అన్నారు. (‘రెండు కుటుంబాల గొడవను రాజకీయం చేస్తున్నారు’) చినరాజప్ప వ్యాఖ్యలను టీడీపీ నేత జ్యోతులు నెహ్రూ తీవ్రంగా విబేధించారు. మైకులు పట్టుకొని మాట్లాడితే సరిపోదని విమర్శించారు. ముందు పార్టీ కేడర్‌కు నమ్మకం కలిగించాలన్నారు. నాయకుని చుట్టు ప్రదక్షణ చేస్తే నాయకత్వం రాదని ఎద్దేవా చేశారు. పార్టీ కేడర్ చూట్టు ప్రదక్షణలు చేయాలన్నారు. చినరాజప్ప మరింత బాద్యతగా వ్యవహరించాలన్నారు. పదవులు రావడమనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు. జిల్లాలో తనకు తెలియకుండానే పలు కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాకు రాష్ట్ర కమిటీ నాయకులు వస్తే కనీసం సమాచారం ఇవ్వడం లేదని జ్యోతుల నెహ్రూ అన్నారు. (నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు) -
టీడీపీ నేతలకు చుక్కెదురు
కాకినాడ: పేదలకు పంచేందుకు సిద్ధం చేసిన భూములను మడ అడవులుగా చూపే ప్రయత్నంలో ఏర్పాటైన టీడీపీ నిజ నిర్థారణ కమిటీకి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని దుమ్ములపేటలో చుక్కెదురైంది. ప్రభుత్వం సేకరించిన భూమి వద్దకు శుక్రవారం వచ్చిన టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణ, జవహర్‌లతో కూడిన కమిటీతో పాటు స్థానిక టీడీపీ నేతలను లబ్ధిదారులు నిలువరించారు. కాకినాడ దుమ్ములపేట స్థలం వద్దకు చేరుకున్న టీడీపీ నేతలను నిరసిస్తున్న లబ్ధిదారులు టీడీపీ హయాంలోనే ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని, వేరొక కంపెనీకి 75 ఎకరాల స్థలాన్ని కేటాయించగా లేని అభ్యంతరాలు ఇప్పుడేమిటని నిలదీయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన పోలీసులు కమిటీకి నచ్చచెప్పి పంపేయడంతో లబ్ధిదారులు కూడా వెళ్లిపోయారు. దీంతో వివాదం సద్దుమణిగి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : దొరబాబు
సాక్షి, కాకినాడ : టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్పపై వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ దవులురి దొరబాబు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి చినరాజప్పకు లేదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. స్క్రిప్ట్ చదివి ప్రెస్మీట్లు పెట్టడం కాదు.. దమ్ముంటే చినరాజప్ప స్వతంత్రంగా మాట్లాడాలని సవాల్ విసిరారు. ఇసుక పాలసీలో టీడీపీ నేతలు చేసిన అక్రమాలు మళ్లీ చేయకూదనే సీఎం జగన్ నూతన ఇసుక పాలసీ తీసుకువచ్చారని తెలిపారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని దొరబాబు అన్నారు. -
రాజధానిలో తవ్వేకొద్దీ ‘ఇన్సైడర్’ బాగోతాలు
సాక్షి, అమరావతి: రాజధానిలో తవ్వే కొద్దీ టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ బాగోతాలు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం నూతన రాజధాని గురించి అధికారికంగా ప్రకటించకముందే చంద్రబాబు తన టీమ్‌కు లీకులు ఇవ్వడంతో పచ్చ కోటరీ అమరావతి ప్రాంతంలో భారీగా భూకొనుగోళ్లు జరిపినట్లు తెలుస్తోంది. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌కుమార్ జూన్ 6, 2014న తాడికొండలో 7 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 31, 2014న నేలపాడులోని సర్వే నంబర్ 59లో టీడీపీ నేత నిమ్మకాయల చిన్నరాజప్ప తన కుమారుడు రంగనాథ్ పేరుతో రెండు ఎకరాలు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఎకరం 7 లక్షలకు కొని కోటి రూపాయలకు చినరాజప్ప అమ్మినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మరో మూడు గ్రామాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూకొనుగోళ్లు బయటపడ్డాయి. కొండంరాజుపాలెంలో సర్వే నెంబర్ 23/బీ1లో అక్టోబర్10, 2014న ఎకరం భూమి, కొండంరాజుపాలెంలో సర్వే నెంబర్ 51/డీలో అక్టోబర్ 10, 2014న ఎకరం 4సెంట్లు, కొండంరాజుపాలెంలో సర్వే నెంబర్ 63/ఏలో అక్టోబర్ 10, 2014న 67సెంట్లు, కురగల్లులో సర్వే నెంబర్ 8/2 అక్టోబర్ 14, 2014న ఎకరం 29సెంట్లు కూతురు గోనుగుంట్ల లక్ష్మీసౌజన్య పేరుతో కొనుగోలు చేసినట్లు తెలిసింది. 2014 నవంబర్ 27న లింగాయపాలెంలో సర్వే నెంబర్ 149లో ఎకరం 25సెంట్లు తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ పేరుతో ఆంజనేయులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
హోంమంత్రి చినరాజప్పకు చేదు అనుభవం
-
ఉప ముఖ్యమంత్రి స్థానానికి ఎసరు?
సాక్షి, అమరావతి: ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో అధికార టీడీపీలో సీట్ల కుమ్ములాటలు రోజురోజూకి పెరుగుతున్నాయి. ఓవైపు పార్టీకి చెందిన కీలక నేతలు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరుతుంటే.. మరోవైపు చంద్రబాబు నాయుడు సీనియర్ నేతల స్థానాలకే ఎసరుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ జిల్లా భీమిలి స్థానంలో ఐటీ మంత్రి లోకేష్‌ను పోటీ చేయించేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతుండడంతో ఆయన పార్టీ నేతలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప సీటు చర్చనీయాంశమైంది. అందుబాటులో లేకుండా పోయిన ఏపీ మంత్రి..! ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దాపురం స్థానాన్ని బొడ్డు భాస్కర రామారావుకు కేటాయిస్తారని విస్రృతంగా ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో బొడ్డు భాస్కర్‌ను వెంటనే అమరావతి రావల్సిందిగా చంద్రబాబు కబురు పంపడం.. చిన్న రాజప్ప వర్గాన్ని తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఉప ముఖ్యమంత్రికి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారంటూ అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై సీరియస్‌గా స్పందించిన చిన్నరాజప్ప సీటుపై చర్చించేందుకు చంద్రబాబుతో భేటీకి ప్రయత్నం చేస్తున్నారు. ‘పెద్దాపురం నుంచే పోటీ చేస్తా’ -
గెస్ట్‌హౌజ్‌కి వెళ్లి ఉద్యోగం ఎలా చేయాలి?
సాక్షి, కాకినాడ/తూర్పు గోదావరి : ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఇలాఖాలో ఆర్ అండ్ బీ ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పెద్దాపురం గెస్ట్‌హౌజ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్ అండ్ బీ డివిజన్ ఉద్యోగులు సరైన సదుపాయాలు లేకపోవడంతో మంచాలు, సోఫాలపై కాలక్షేపం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మౌలిక సదుపాయాల లేమితో మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది సెలవులో వెళ్లిపోగా.. గెస్ట్‌హౌజ్‌లో ఎలా ఉద్యోగం చేయాలంటూ విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పెద్దాపురంలో ఆర్ అండ్ బీ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ గతేడాది డిసెంబరు 20న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అక్కడి గెస్ట్‌హౌజ్‌లోనే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ 30 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. బదిలీ కోసం ఎదురుచూస్తున్న ఈఈ సత్యనారాయణ వల్లే గెస్ట్‌హౌజ్‌లో పనిచేయాల్సి వచ్చిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. -
ఐదు, పదిరూపాయలకు కక్కుర్తిపడితే విలువ పోతుంది
-
‘5 - 10కి కక్కుర్తిపడితే విలువ పోతుంది’
సాక్షి, కాకినాడ : కానిస్టేబుళ్లు ఐదు, పదిరూపాయలకు కక్కుర్తిపడితే విలువ పోతుందని పోలీస్ సిబ్బందికి ఏపీ హోంమంత్రి చినరాజప్ప క్లాస్ తీసుకున్నారు. పోలీసుల సంఘం అభినందన సభకు హాజరైన చినరాజప్ప.. భూతగాదాల్లో పోలీసులు తలదూరిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అనేక ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయన్నారు. రౌడీయిజం, భూతగాదాలు, మైనింగ్, ఇసుక వివాదాల్లో తప్పు జరిగితే ఊరుకోవద్దని దిశా నిర్దేశం చేశారు. రౌడీయిజాన్ని ఇంకా అణిచివేయాలని సూచించారు. పోలీసులకు ప్రభుత్వం మంచి జీతం ఇస్తుందని చినరాజప్ప అన్నారు. పోలీసులంటే గౌరవం ఉండాలని, ఇప్పటీకే పోలీసు స్టేషన్లలో మంచి కుర్చీలు, టేబుళ్లు, ఏసీలు కూడా వేస్తున్నామని తెలిపారు. -
‘అందుకే పవన్ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు’
కాకినాడ: జనసేన సభలకు జనం రావడం లేదని, అందుకే పవన్ కల్యాణ్ రెచ్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారని ఏపీ హోం మంత్రి, టీడీపీ నేత చినరాజప్ప ఎద్దేవా చేశారు. కాకినాడలో చినరాజప్ప విలేకరులతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కావాలన్న తపనతో పవన్ జనంలోకి వెళ్లి చప్పట్లు కొట్టించుకుంటున్నాడని వ్యంగ్యంగా మాట్లాడారు. రాజకీయాలలోకి రావాలనుకున్నప్పుడు మంచి విషయాలు చెప్పి రావాలి కానీ ఒకరిని బ్యాడ్ చేసి రావడం కరెక్టు కాదన్నారు. లోకేష్‌ను టార్గెట్ చేస్తూ పవన్ మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబాలకు సినిమాపై ఆసక్తి ఉన్నట్లే.. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వారికి కూడా రాజకీయాలపై ఆసక్తి ఉంటుందని వ్యాఖ్యానించారు. లోకేష్‌ను చంద్రబాబు వారసత్వం అని విమర్శిస్తున్న పవన్ తన అన్న చిరంజీవి ద్వారా నటుడయ్యాడన్న సంగతి మర్చిపోకూడదని హితవు పలికారు. చిరంజీవి కుమారుడు, తమ్ముళ్లు, తమ్ముళ్ల కుమారులు, మేనళ్లుల్లు నటులు అయిన సంగతి మర్చిపోయినట్లున్నారని గుర్తు చేశారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభం ఉన్న చంద్రబాబుకు, అసలేం అనుభవం లేని పవన్ కల్యాణ్‌కు పోలికేంటన్నారు. -
ఖాకీల పక్షపాతం..
అమలాపురం: రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీ పెద్దలకు తొత్తులుగా మారారనే విమర్శలకు పలు ఉదాహరణలున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడి భార్య తన పెంపుడు కుక్కను ఉసిగొల్పడం కారణంగానే దళిత కుటుంబానికి చెందిన బాలుడు మృతి చెందాడనే ఆరోపణలపై ఫిర్యాదు అందినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న నెల్లి వరుణ్ (14)పై సెప్టెంబరు 28వ తేదీన పంట కాలువలో పడి మృతి చెందాడు. ఉప ముఖ్యమంత్రి సోదరుడు జగ్గయ్యనాయుడు భార్య వాళ్ల పెంపుడు కుక్కను ఉసిగొల్పడం వల్లే తన కుమారుడు మృతిచెందాడని వరుణ్ తండ్రి తిరుపతిరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగి 40 రోజులైనా ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాములు అమలాపురం వచ్చినప్పుడు 24 గంటల్లో బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమలాపురం పోలీసులు ఈ ఘటనపై స్పందించిన తీరు తొలి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. వరుణ్ కుటుంబ సభ్యులు ఎంతగా వేడుకున్నా కేసు నమోదు చేయలేదు సరికదా... వారికి మద్దతుగా నిలిచిన ప్రజా సంఘాలు, దళిత సంఘాల నిరసనను అడ్డుకునేందుకు మాత్రం శక్తియుక్తులను దారపోశారు. ఉదయం ఆరు గంటలకు మృతదేహం లభ్యమైన వెంటనే కుటుంబీకుల వద్దకు తీసుకుని వెళ్లకుండా.. పోస్టుమార్టం నిమిత్తం నేరుగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించడంపై అప్పట్లోనే వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలోనే బాలుడి తండ్రితోపాటు దళిత సంఘాల నాయకులు జగ్గయ్యనాయుడుకు చెందిన పెంపుడు కుక్క వల్లే వరుణ్‌కుమార్ మృతి చెందినట్టు స్టేట్మెంట్ ఇవ్వగా అధికారులు నమోదు చేసుకున్నారు. పరిహారం ఇచ్చి పక్కదారి పట్టించారు.. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ న్యాయం చేస్తామని మృతుని కుటుంబానికి రూ.5 లక్షలు, ఇళ్ల స్థలం ఇప్పించారు. ఘటనకు కారణమైన హోంమంత్రి సోదరుడి భార్యపై కేసు నమోదు చేయకుండా ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించి కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గళమెత్తిన వారిపై పోలీసులు ఉక్కుపాదం.. వరుణ్‌కుమార్ తండ్రి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు సరికదా... వారికి మద్దతుగా నిలిచిన ప్రజాసంఘాలు, దళిత సంఘాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కేసు నమోదు చేయనందుకు నిరసనగా అమలాపురం మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ అక్టోబర్ 28న ‘ఛలో అమలాపురం’ పిలుపునిచ్చారు. వరుణ్‌కుమార్ ఘటనలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు భార్యపై 304 (2) సెక్షన్ కింద కేసు నమోదు చేసి..ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురంలో సెక్షన్ 30 అమలులో ఉందంటూ హర్షకుమార్‌ను అమలాపురం ఎర్రవంతెన వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు దళిత సంఘాలు నాయకులను గృహ నిర్బంధం చేసి పోలీసు జులుం ప్రదర్శించారు. కాగా బాధితులకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
‘పెద్దాపురం నుంచే పోటీ చేస్తా’
సాక్షి, అమరావతి: తిట్లీ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెలాఖరు కల్లా సాధారణ పరిస్థితులు తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తుపాన్ వల్ల పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని, రూ. 4,372 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. తిట్లీ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. అక్టోబర్ 26 నుంచి 30 వరకు తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మరోసారి పర్యటించి నష్టపరిహారం అందజేస్తారని చినరాజప్ప పేర్కొన్నారు. తుపాన్ బాధితులకు సాయంగా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గవర్నర్ నరసింహన్‌ను కలిస్తే ఆయన ఏమి చేస్తారని ప్రశ్నించారు. తను వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. -
పోలీసులపై జేసీ వ్యాఖ్యలు అనుచితం : హోంమంత్రి
సాక్షి, తూర్పుగోదావరి (పిఠాపురం) : పోలీసులపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రెచ్చిపోవడం.. పోలీసు అధికారుల సంఘం అదేస్థాయిలో వార్నింగ్ ఇవ్వడం.. తిరిగి జేసీ తనదైనశైలిలో బదులివ్వడంపై హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. జేసీ తీరు ఆయన విజ్ఞతకే వదులుతున్నానని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో చినరాజప్ప పేర్కొన్నారు. టీడీపీ ఎంపీగా ఉండి ప్రభుత్వ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చినరాజప్ప అన్నారు. పోలీసు సంఘం ప్రతినిధులు కూడా నాలుకలు కోస్తామని అనడం సమర్థనీయం కాదని హితవుపలికారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారన్నారు. పోలీసులు సంయమనంతో పరిస్థితులను బట్టి స్పందించాలని సూచించారు. చదవండి : ఖాకీ డ్రస్ తీసేసి రా..! నాలుగో సింహం జోలికొస్తే నాలుక కోస్తాం స్వామి.. జేసీ.. ఓ పోలీసు! -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
హోంమంత్రి కాన్వాయ్‌లో మంటలు
సాక్షి, విశాఖ: ఏపీ హోంమంత్రి చినరాజప్ప కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఎస్కార్ట్ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది త్రుటిలో తప్పించుకున్నారు. విశాఖ జిల్లాలోని కొండల అగ్రహారం వద్ద ఈ ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారంణంగా మంటలు చెలరేగినట్టు సిబ్బంది చెప్పారు. ప్రమాద సమయంలో చినరాజప్ప కాన్వాయ్‌లో లేరని తెలుస్తోంది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం: ఏపీ హోంమంత్రి
సాక్షి, విజయవాడ : క్రికెట్ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో బుధవారం ఆయన నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా, కుల,వర్గ విభేదాలను అదుపు చేయగలిగామన్నారు. అలాగే గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కళాశాలల యాజమాన్యాలతో చర్చిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. మహిళలపై దాడులకు పాల్పడేతే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చినరాజప్ప హెచ్చరించారు. ఎవరైనా సరే రౌడీయిజం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్రంలో సరిపడనంత మంది పోలీసులు లేకపోయినా నేరాలను నియంత్రించడంలో వారు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. -
పోలీస్ అమరవీరులకు ఘన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరవీరులకు హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్ శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని పోలీస్ మెమోరియల్ గ్రౌండ్‌లోని స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాలను దేశం మరిచిపోదని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్నాటక సహా ఇతర రాష్ట్రాల్లోనూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా జరిగింది. ఆయా ముఖ్యమంత్రులు పరేడ్‌లో పాల్గొన్ని అమర పోలీసులకు అంజలి ఘటించారు. పోలీస్ కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: కేసీఆర్ హైదరాబాద్ : విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. అమరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధులకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పోలీస్ కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసులు నెంబర్‌వన్ స్థానంలో ఉన్నారన్నారు. రూ.వెయ్యికోట్లతో పోలీస్ డిపార్ట్మెంట్ను బలోపేతం చేస్తామని తెలిపారు. మహిళా భద్రత కోసం షీ టీమ్స్, కల్తీని నివారించేందుకు స్పెషల్ టీంలతో తనిఖీలు చేపట్టనున్నట్లు నాయిని పేర్కొన్నారు. గోషామహల్ లో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండ: చినరాజప్ప విజయవాడ: పోలీస్ అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శనివారం విజయవాడలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మాట్లాడుతూ... సంఘ విద్రోహ శక్తులనుంచి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారన్నారు. అలాగే పోలీస్‌శాఖలో సాంకేతికత వినియోగించి మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. పోలీసులను కుటుంబ సభ్యుడిగా ప్రజలు భావించాలని, సమాజ క్షేమం కోసం పోలీసుల త్యాగం వెల కట్టలేనిదని చినరాజప్ప పేర్కొన్నారు. -
ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు షాక్
కాకినాడ ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించిన చంద్రబాబు కాకినాడ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతల నుంచి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను సీఎం చంద్రబాబు తప్పించినట్లు సమాచారం. ఆ బాధ్యతలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అప్పగించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 48 డివిజన్ల నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బాబు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులెవరూ బరిలో లేరు. సీట్ల కేటాయింపులో మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కిమిడి కళావెంకట్రావు ముఖ్య భూమిక వహించారు. కాకినాడలో చంద్రబాబు సామాజిక వర్గం ఓటర్లు తక్కువగా ఉండటంతో ఆ వర్గానికి సీటు ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రులు ఐక్యంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో సీఎం సామాజిక వర్గానికి చెందిన పెద్దలంతా మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత జరిగిన చర్చల్లో చినరాజప్ప సీఎం సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కాకినాడ ఎన్నికల బాధ్యతలను అప్పగించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. -
కాపు కార్పొరేషన్ చైర్మన్‌కు అవమానం
అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయులుకు అవమానం జరిగింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కాపు నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామానుజయులు మాట్లాడుతుండగా... హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హఠాత్తుగా లేచి, ఆయన వద్ద నుంచి దురుసుగా మైక్ లాక్కున్నారు. ఒక్కసారిగా చినరాజప్ప ఇలా వ్యవహరించడంతో రామానుజయులు ఖంగుతున్నారు. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. గతంలోనూ కాపుల విషయంలో చంద్రబాబుతో ఆయన విభేదించిన విషయం తెలిసిందే. గంటా గైర్హాజరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
అనుమతి లేకుండా పాదయాత్ర కుదరదు
అమరావతి: అనుమతి లేకుండా ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్ర చేయడం కుదరదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినప్పుడు ఆయన అనుమతులు తీసుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. తునిలో విధ్వంసం జరిగింది కాబట్టే ముందు జాగ్రత్త చర్యగా అన్ని జిల్లాల్లో పోలీసులను మోహరించామని చినరాజప్ప తెలిపారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా ముద్రగడ వ్యవహరించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తన మాట నెగ్గించుకోవడం కోసమే ముద్రగడ పాదయాత్రకు అనుమతి తీసుకోలేదని అన్నారు. బీసీలలో కాపులను చేర్చే అంశంపై ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ త్వరలో తన నివేదికను ఇవ్వనుందని చినరాజప్ప తెలిపారు. రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదని, విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో రిజర్వేషన్లు కావాలని కాపు నేతలుగా తామూ కోరుతున్నామని ఆయన అన్నారు. కాగా కాపు రిజర్వేషన్లపై ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ముద్రగడ నేటి నుంచి చలో అమరావతి పాదయాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన యాత్రను పోలీసులు అడ్డుకుని 24 గంటల పాటు గృహనిర్బంధం చేశారు. -
‘పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారు’
అమరావతి: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి లేదని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఉద్యమాలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకవేళ ముద్రగడ తన పాదయాత్రకు అనుమతి కోరితే పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారని చినరాజప్ప అన్నారు. మరోవైపు డీజీపీ సాంబశివరావు ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి లేదని తెలిపారు. అనుమతి లేని కార్యక్రమాలకు అందరూ దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ నెల 20 వరకూ పశ్చిమ గోదావరి జిల్లాలో సెక్షన్ 143,30 అమల్లో ఉంటుందన్నారు. అలాగే పాలకోడేరు మండలం గరగపర్రులో శాంతయుత వాతావరణం కోసం కృషి చేస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. -
ముక్తాపురంలో హోం మంత్రి పర్యటన
కనగానపల్లి (రాప్తాడు) : రాష్ట్ర హోం మంత్రి చిన్నరాజప్ప గురువారం కనగానపల్లి మండలంలోని ముక్తాపురంలో పర్యటించారు. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఆయన ముక్తాపురం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన కొత్తగా ఏర్పాటు చేస్తున్న హౌసింగ్ కాలనీని సందర్శించారు. కొత్తగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను మంత్రి పరిటాల సునీతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి నిర్మాణాల నాణ్యత, లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులపై అధికారులతో మాట్లాడారు. మోడల్ కాలనీలో 36 గృహాలనూ ఒకే విధంగా నిర్మించడంతోపాటు, ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులనూ కల్పిస్తున్నామని మంత్రి సునీత హోంమంత్రికి తెలిపారు. ఈ వారం లోపల కాలనీలో సిమెంట్ రోడ్లు, వీధి కొళాయిలు ఏర్పాటు చేయించి ఈ నెల 5వ తేదీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం సీఎం పర్యటన ఏర్పాట్లపై హోం మంత్రి అధికారులతో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శిల్పారామం సందర్శన అనంతపురం రూరల్ : నగర పరిధిలోని శిల్పారామాన్ని చిన్నరాజప్ప సందర్శించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే శిల్పారామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, స్థానిక సర్పంచ్ పెదయ్యతోపాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
విశాఖలో భూకుంభకోణం వాస్తవం
హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప తిరుపతి (అలిపిరి): విశాఖలో 300 ఎకరాలకు సంబంధించి భారీ భూ కుంభకోణం జరిగిందని వాస్తవాలు కూడా వెలుగులోకి తెచ్చింది కూడా రాష్ట్రప్రభుత్వమేనని రాష్ట్ర హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. తిరుపతి నగరం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుందన్నారు. టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేయాల్సి వుందని, ఈసారి పాలకవర్గంలో నాన్ పొలిటీషియన్‌కు స్థానం కల్పించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారని తెలిపారు. ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సేవలందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని,అ ందుకు తగ్గట్టుగా టీటీడీ ఏర్పాట్లు చేస్తూ ముందుకు పోవడం అభినందనీయమన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని శుక్రవారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వచ్చిన ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మండపం వద్ద వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. కొనసాగుతున్న భక్తుల రద్దీ కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) 82,128 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, శ్రీవారి హుండీకి రూ. 3.53 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
సోషల్ మీడియాకు సెన్సార్ ఉండాల్సిందే..!
-
సోషల్ మీడియాకు సెన్సార్ ఉండాల్సిందే
కాకినాడ: సోషల్ మీడియాకు సెన్సార్ ఉండాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ మహిళలను కించపరిచేలా పోస్టులు పెడితే కచ్చితంగా చర్యలుంటాయని స్పష్టం చేశారు. వడ్డీ మహేశ్ హవాలా కేసును సీఐడీకి అప్పగించినట్లు చినరాజప్ప తెలిపారు. మహేశ్ వెనుక ఎవరున్ననేది విచారణలో తేలుతుందని ఆయన పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదాలపై చినరాజప్ప దిగ్ర్బాంతి
విజయవాడ: రంగారెడ్డి జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల పట్ల ఉప ముఖ్యమంత్రి, ఏపీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన అయిదుగురు వ్యక్తులు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ జిల్లా పోలీసు అధికారులను సంప్రదించి మృతదేహాలను వారి స్వస్ధలాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీని ఆదేశించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో పెళ్ళి బృందం బస్సు చెట్టును ఢీకొట్టిన ఘటనపై కూడా ఆయన వివరాలు తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీతో చినరాజప్ప ఫోనులో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. -
సాక్షి కథనాలతో ప్రభుత్వంలో చలనం
అమరావతి: కృష్ణానదిలో 100 ఎకరాలను కబ్జా చేసిన టీడీపీ నేతల ఇసుక మాఫియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి మంత్రులు చినరాజప్ప, సుజయకృష్ణ రంగారావు, రెవెన్యూ, హోం, మైనింగ్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం మంత్రి సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ... సామాన్యుడికి ఉచితంగా ఇసుక అందించేందుకు ప్రయత్నిస్తామని, అక్రమ రవాణా నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కఠినమైన చట్టాలైతే ఉన్నాయని, అయితే అవి సమర్థవంతంగా అమలు జరగడం లేదన్నారు. కేసుల నమోదు బాగానే ఉందని, ఆ తర్వాతే ఏం జరగడం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. యంత్రాల ద్వారా ఇసుక తవ్వడానికి అనుమతిచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. 44 చెక్‌పోస్టులున్నాయని, ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇసుక ర్యాంప్‌లను ఉపాధి హామీ కూలీల ద్వారా నిర్వహించేందుకు యోచన చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక రవాణా నియంత్రణ బాధ్యతను ఆర్డీవో, డీఎస్పీలకు అప్పగిస్తామని చినరాజప్ప తెలిపారు. -
క్రమశిక్షణతోనే ఉన్నత స్థానం
సత్సంకల్పంతో ముందుకు సాగాలి బ్రహ్మకుమారీల ‘బట్టి’ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నవరం : సత్సంకల్పంతో ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుందనే బ్రహ్మకుమారీల సిద్ధాంతం తనను ఎంతగానే ప్రభావితం చేసిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. బ్రహ్మకుమారీలు ప్రతిపాదించే ఈశ్వరతత్వం, యోగాభ్యాసం వంటి వాటిని ఆచరించడం వల్లే తనలో క్రమశిక్షణ అలవడిందన్నారు. తాను ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అది కారణమైందని చెప్పారు. అన్నవరం దేవస్థానంలోని సీతారామ సత్రంలో బుధవారం బ్రహ్మకుమారీలు నిర్వహించిన ‘సిద్ధి స్వరూప సాధన బట్టి’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తాను బ్రహ్మకుమారీ సమాజంలో సభ్యుడనని చెప్పారు. రాజస్థాన్‌లోని మౌంటు అబూలోని బ్రహ్మకుమారీల విశ్వవిద్యాలయ కేంద్ర కార్యాలయాన్ని పలుమార్లు సందర్శించినట్టు తెలిపారు. ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ శాంతి, ప్రేమ, సత్సంకల్పం ద్వారా దేన్నయినా సాధించవచ్చనే బ్రహ్మకుమారీల సిద్ధాంతం ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణీయమన్నారు. విశిష్ట అతిథిగా రాజయోగిని, ఢిల్లీ ఓం శాంతి రిట్రీట్ సెంటర్ ఇన్చార్జి బ్రహ్మకుమారి ఆశా దీదీ మాట్లాడుతూ శ్రద్ధ, మనస్సులో దృఢత్వం, ఏకాగ్రతతో ఏ పని చేసినా సత్ఫలితాలను ఇస్తుందని తెలిపారు. అనంతరం వేదిక మీద ప్రముఖులంతా ‘బట్టి’ కేకును కట్ చేశారు. బ్రహ్మకుమారీల కాకినాడ యూనిట్ ఇన్చార్జి బీకే రజనీ బెహన్ మాట్లాడుతూ 13 ఏళ్లుగా అన్నవరం దేవస్థానంలో బట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బుధవారం నుంచి శనివారం వరకూ తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి వరకూ వివిధ ఆధ్మాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, అన్నవరం దేవస్థానం చైర్మన్ రాజా ఐ.వి.రోహిత్, పలు ప్రాంతాల నుంచి వచ్చిన బ్రహ్మకుమారి, బ్రహ్మకుమార్లు పాల్గొన్నారు. -
‘కాపు సత్యాగ్రహ యాత్రకు అనుమతి లేదు’
కాకినాడ : కాపు సత్యగ్రహ యాత్రకు అనుమతి లేదని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తని సభ కూడా ప్రశాంతంగా నిర్వహించుకుంటామని అన్నారని, ఆ తర్వాత రైలు, పోలీస్ స్టేషన్, వాహనాలు తగులబెట్టారని చినరాజప్ప సోమవారమిక్కడ అన్నారు. కాపులను బీసీల్లోకి చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. దీనికి సమయం పడుతుందని, కొద్దికాలం వేచి ఉండాల్సిందేనని చినరాజప్ప వ్యాఖ్యానించారు. స్మార్ట్ పల్స్ సర్వే పూర్తయిన వెంటనే మంజునాథ కమిషన్ నివేదిక మేరకు న్యాయం చేస్తామని చినరాజప్ప తెలిపారు. మరోవైపు కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కోనసీమలో చేపట్టనున్న సత్యాగ్రహ పాదయాత్ర తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదంటూ ఓ పక్క చెబుతూనే.. మరో పక్క భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా యాత్రను అడ్డుకోవాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో యాత్ర పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 16 నుంచి 21 వరకూ ముద్రగడ ఆధ్వర్యంలో కాపు ఉద్యమకారులు సత్యాగ్రహ పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. -
చినరాజప్పకు త్రుటిలో తప్పిన ప్రమాదం
కాకినాడ ప్రైవేటు ఆస్పత్రిలో కూలిన లిఫ్ట్ కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు మంగళవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. లిఫ్ట్ కూలడంతో మంత్రి చినరాజప్పతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నెక్కింటి సీఫుడ్సలో విషవాయువు లీకై అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు మంగళవారం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చినరాజప్ప వచ్చారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన తిరిగి వెళ్తూ ఆస్పత్రి లిఫ్ట్ ఎక్కారు. ఇంతలో తీగలు తెగిపోవడంతో లిఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో చినరాజప్ప నడుముకు స్వల్వగాయమైంది. ఆయనతో పాటు లిఫ్ట్ ఎక్కిన ఒక కానిస్టేబుల్ కాలు విరగ్గా, మరో ఫొటోగ్రాఫర్‌కు కాలి ఎముక చిట్లిందని వైద్యులు తెలిపారు. కాగా, తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని చినరాజప్ప తెలిపారు. -
హోంమంత్రి చినరాజప్పకు గాయాలు
-
అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్
డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడి తిరుపతి గాంధీ రోడ్డు: ఆంధ్రప్రదేశ్ రాజ ధాని అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. తిరుపతిలో ఆదివారం డిప్ (డిసీజ్ ఎరాడికేషన్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్) సంస్థ.. తిరుపతి కార్పొరేషన్, సుధారాణి పౌండేషన్, టీటీడీ సహకారంతో నిర్వహించిన సెవెన్ హిల్స్ మారథాన్ 21కె, 10కె, 5కె, 3కె రన్ ముగింపు సభలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ప్రతిరోజు సైకిల్ తొక్కడాన్ని, వాకింగ్‌ను ప్రోత్సహించేందుకు అమరావతి, తిరుపతిలో వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రులు నారాయణ, దేవినేని మాట్లాడుతూ రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో కూడా మారథాన్ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, మంత్రులందరూ తమ ఆస్తుల వివరాలను స్పీకర్‌కు అందజేస్తామని డిప్యూటీ సీఎం చిన రాజప్ప ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానంగా మీడియాకు తెలిపారు. -
మంత్రైనా కింద కూర్చోవలసిందే: లోకేశ్
గుంటూరు: తనకు మంత్రి అవ్వాలన్న కోరిక లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పార్టీలో తాను కీలకపాత్ర పోషిస్తున్నానని చెప్పారు. బుధవారం ఆయన తమ కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... తానేప్పుడు కేబినెట్ సమావేశంలో కూర్చోలేదని, రుజువులుంటే చూపాలని అన్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైన హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఫొటో చూసి తనకు బాధ కలిగిందన్నారు. ఈ ఫొటోపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. మంత్రైనా, ఎంపీ అయినా పార్టీ కార్యక్రమంలో కింద కూచోవలసిందేనన్నారు. పార్టీ పొలిట్ బ్యూరో లో తాను సభ్యుడినని, ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగా కూడా ఉన్నానని ఆయన తెలిపారు. చాలా చిన్న వయసులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని కావడం తన అదృష్టమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వాఫుడ్ పార్క్ ను వ్యతిరేకంగా సరికాదన్నారు. అన్నిటికీ అడ్డుపడితే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. పార్టీలోకి ఎవరూ వచ్చి చేరినా ఆహ్వానిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
'పవన్ చెప్పిన విషయాలను పరిశీలిస్తున్నాం'
విజయవాడ: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన పాదయాత్రతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ముద్రగడ పాదయాత్రపై శనివారం విజయవాడలో హోంమంత్రి, ఎమ్మెల్యే బోండా మీడియాతో మాట్లాడారు. ముద్రగడ ఉద్యమంలో పాల్గొంటే కేసుల్లో ఇరుక్కుని జైలుకు కెళ్తారని అన్నారు. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పిన విషయాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. 144 సెక్షన్‌పై విచారించి నిర్ణయం తీసుకుంటామని చినరాజప్ప, బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు చేసిన ద్రోహానికి నిరసనగా నవంబర్ 16 నుంచి ఐదు రోజుల పాటు సత్యాగ్రహ పాదయాత్ర చేయనున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఫొటో ఎందుకు తీసేశారో మరి!
-
నాపై చేస్తున్నదంతా అసత్య ప్రచారమే
ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సాక్షి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల శిక్షణా కార్యక్రమంలో తనను పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మందలించాడని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం సాగుతోందని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 46వ జాతీయ జూనియర్ ఓపెన్ చెస్, 31వ జాతీయ జూనియర్ బాలికల చెస్ టోర్నమెంట్ ప్రారంభించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తన ప్రతిష్టను దెబ్బతీసేలా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. -
'లోకేశ్, చినరాజప్ప ఫొటోపై చర్చ'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో పాలన అస్తవ్యస్తంగా తయారైందని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్విస్ చాలెంజ్ పై కోర్టు ప్రశ్నిస్తే చంద్రబాబు ఏకంగా చట్టాలను మారుస్తున్నారని ఆరోపించారు. చట్టాలను మార్చుకుని ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నారా అని ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏ చట్టమైనా లోబడి ఉండాలని తెలియదా అని అడిగారు. విదేశీ కంపెనీల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో డబ్బు సంచులు పంచిన వారికి ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని శాఖలను అవినీతిలో ముంచేశారని దుయ్యబట్టారు. ఇంత అవినీతి చేసినా ధనదాహం తీరలేదా అని సూటిగా ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో ఒక ఇల్లు కూడా కట్టలేదని అన్నారు. భారీ వర్షాలు వస్తే మంత్రులు కనీసం పర్యటించలేదని విమర్శించారు. సీఎం తనయుడు నారా లోకేశ్ ప్రభుత్వాన్ని శాసిస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోకేశ్ ముందు డిప్యూటీ సీఎం చినరాజప్ప వణికిపోతూ మాట్లాడుతున్నారని, ఇక ఆయన మాటలు పోలీసులు ఏం వింటారని అన్నారు. లోకేశ్, చినరాజప్ప ఫొటోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పాలన ఎటుపోతోందని బొత్స సత్యనారాయణ పశ్నించారు. -
'లోకేశ్, చినరాజప్ప ఫొటోపై చర్చ'
-
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన హోంమంత్రి
కాకినాడ : ఉప ముఖ్యమంత్రి, హోం శాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. లోడ్ అధికంగా ఉండటంతో ఆయన ఎక్కిన లిఫ్ట్ మొరాయించింది. దీంతో చినరాజప్ప దాదాపు పావుగంట పాటు లిఫ్ట్‌లో ఉండిపోయారు. వివరాల్లోకి వెళితే... కాకినాడలో ఇవాళ ఉదయం కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాన్ని చినరాజప్ప ప్రారంభించారు. అనంతరం కార్యాలయం పైభాగంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభించేందుకు ఆయన లిఫ్ట్ ఎక్కారు. అయితే చినరాజప్పతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు అందరూ ఒకేసారి లిఫ్ట్ ఎక్కేయడంతో లిఫ్ట్ తలుపులు మూసుకుపోయి అక్కడే ఆగిపోయింది. ఎంతసేపటికీ లిఫ్ట్ కదలకపోవడంతో కిందికీ, పైకీ అధికారులు పరుగులు తీశారు. లిఫ్ట్ తలుపులు తెరిచేందుకు కొద్దిసేపు రకరకాల ప్రయత్నాలు చేశారు. దీంతో బయట ఉన్న పోలీసు అధికారులు, ఇతర శాఖలకు చెందిన అధికారులు భయాందోళనకు గురయ్యూరు. చివరకు లిఫ్ట్ ఒకేసారి కిందికి దిగింది. దీంతో అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు లిఫ్ట్‌లోకి అంతమందిని ఎలా అనుమతించారని అక్కడున్న పోలీసు అధికారులపై చినరాజప్ప చిందులు తొక్కారు. -
బాబును సంతృప్తిపరచడమే పోలీస్ లక్ష్యం
డీజీపీ కార్యాలయ శంకుస్థాపనలో హోంమంత్రి మంగళగిరి: కృష్ణా పుష్కరాల్లో పోలీసులు విధులు సక్రమంగా నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబును తృప్తిపరిచారని, అంతకంటే ఎక్కువగా చంద్రబాబును సంతృప్తిపరచడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తోందని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ఆవరణలో రూ.3 కోట్లతో నిర్మించనున్న డీజీపీ కార్యాలయానికి శుక్రవారం శంకుస్థాపన చే శారు. మరోవైపు వెలగపూడి లోని తాత్కాలిక సచివాలయంలోని నాలుగో భవనాన్ని శుక్రవారం అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ సచివాలయం నుంచి అధికారులు రాకపోయినా.. అటవీశాఖ సిబ్బంది మాత్రం పాల్గొన్నారు. ఐదో భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ తన చాంబర్‌న ప్రారంభించారు. -
శశికుమార్ మృతిపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి
పాడేరు ఏఎస్పీ శశికుమార్ ఆకస్మిక మృతికి ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాడేరులో గురువారం ఉదయం ఏఎస్పీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. ఏఎస్పీ మరణ వార్త విన్న వెంటనే ఉపముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని విశాఖ బయలుదేరారు. కేజీహెచ్‌లో ఉంచిన శశికుమార్మృతదేహాన్ని సందర్శించనున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నన్నపనేని
గుంటూరు: టీడీపీ సీనియర్ నాయకురాలు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. హోంమంత్రి చినరాజప్ప మంగళవారం ఆమెను పరామర్శించారు. ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నన్నపనేని త్వరగా కోలుకోవాలని చినరాజప్ప ఆకాంక్షించారు. కాగా శ్వాసకు సంబంధించిన సమస్యతో నన్నపనేని బాధపడుతున్నారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది. -
రంగా విగ్రహ ధ్వంసం దురదృష్టకరం
హోంమంత్రి చినరాజప్ప విగ్రహం తాము ఏర్పాటు చేస్తామని వెల్లడి మంత్రి వ్యాఖ్యలపై కాపు సంఘ నేతల ఆగ్రహం మచిలీపట్నం టౌన్ : రాష్ట్రంలో శాంతియుత వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహం ధ్వంసం ఘటన జరగటం దురదృష్టకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సోమవారం మచిలీపట్నం విచ్చేసిన ఆయన నిజాంపేటలోని సంఘటనా స్థలాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ఈ ఘటన జరగటంపై ముఖ్యమత్రి చంద్రబాబునాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు. ఆయన సూచన మేరకు తాను ఇక్కడికి వచ్చానన్నారు. పూర్తిస్థాయిలో విచారణ... ఈ ఘటనపై పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిందని హోంమంత్రి చెప్పారు. దుండగులు తెల్లవారుజామున ఈ ఘటనకు పాల్పడటంతో వాకింగ్‌కు వెళ్లేవారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తులను పట్టుకుని తీరతామన్నారు. కులాలను రెచ్చగొట్టే పరిస్థితి రాకూడదన్నారు. ఈ ఘటన చూస్తుంటే కుట్ర పూరితంగానే జరిగినట్లుందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీతో మాట్లాడి ఈ ప్రాంతంలో మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన వెల్లడించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కొన్ని దుష్ట శక్తులు ఈ ఘటనకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పర్యటనలో చినరాజప్ప వెంట రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్ తదితరులు ఉన్నారు. హోంమంత్రి వ్యాఖ్యలపై కాపు నేతల ఆగ్రహం రంగా నూతన విగ్రహాన్ని కమిటీతో మాట్లాడి పెట్టిద్దామని చంద్రబాబునాయుడు చెప్పారని హోం శాఖ మంత్రి చినరాజప్ప పేర్కొనటంతో ఆ ప్రాంత విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులతో పాటు కాపు సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చినరాజప్పను చుట్టుముట్టిన కాపు నాయకులు, రంగా అభిమానులు విగ్రహాన్ని తమకు ఎవరూ ఇవ్వనవసరం లేదని, తామే రూపాయి.. రూపాయి పోగేసి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని స్పష్టం చేశారు. ఎవ్వరి రూపాయీ తాము తీసుకోబోమన్నారు. ఈ విగ్రహ ధ్వంసం ఘటనకు పాల్పడిన దుండగులను పట్టుకుని శిక్షించటంలో తాత్సారం చేయొద్దని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా ‘విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి’, ‘జోహార్.. వీఎం రంగా..’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. -
'ఆయన అంత పెద్ద నాయకుడు కాదు'
హైదరాబాద్: కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం ఫోన్ ట్యాప్ చేసేంత పెద్దనాయకుడు కాదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప ఎద్దేవా చేశారు. ముద్రగడ దీక్షను ప్రభుత్వం పట్టించుకోదని ఆయన తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చట్ట ప్రకారం చర్యతీసుకుంటారని చినరాజప్ప అన్నారు. మంత్రి రావెల కిషోర్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై చినరాజప్ప మాట్లాడుతూ.. తప్పుచేసినట్లు తేలితే తెలంగాణ ప్రభుత్వం ఆయనపై చట్టప్రకారం చర్య తీసుకుంటుందన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని మంత్రి స్పష్టం చేశారు. -
గొల్లపూడికి ‘జీవన సాఫల్యం’
ఈ నెల 12 నుంచి జాతీయ స్థాయి తెలుగు నాటకోత్సవాలు సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి తెలుగు నాటకోత్సవాలు పాలకొల్లులో ఈ నెల 12 నుంచి ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రతి నిధులు మేడికొండ శ్రీనివాస్ చౌదరి, మానాపురం సత్యనారాయణలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాటకోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావును జీవన సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించనున్నట్లు చెప్పారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, గజల్ శ్రీనివాస్,ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వీసీ ముర్రు ముత్యాల నాయుడు, సినీ పరిశ్రమ నుంచి కోడి రామకృష్ణ, ఆర్పీ పట్నాయక్, హీరో నిఖిల్, భాస్కరభట్ల, అనితా చౌదరి పాల్గొననున్నారని పేర్కొన్నారు. -
దయచేసి మమ్మల్ని నమ్మండి
ఎస్ఎంఎస్లతో మంత్రుల వేడుకోలు అమలాపురం: ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల హామీని నెరవేర్చి కాపులను బీసీల్లో చేరుస్తాం. ఎన్నో ఏళ్లుగా తెగని సమస్యకు చిత్తశుద్ధితో పరిష్కారం చెబుతాం. మాకు కాపుల మద్దతు ఎప్పుడూ ఉంది. రిజర్వేషన్లు కల్పించి కాపుల రుణం తీర్చుకోవడమే మా విద్యుక్తధర్మం. విపక్ష నేత కుట్రలో భాగం కావద్దు. ఆలోచించండి’ అంటూ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న కాపు మంత్రులు ఎస్ఎంఎస్లతో వేడుకుంటున్నారు. మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు పేర్లతో శుక్రవారం ఉదయం నుంచి ఎస్ఎంఎస్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. మరోవైపు బీసీల సంక్షేమానికి పాటుపడతామని, కాపుల రిజర్వేషన్లతో బీసీలకు ఎటువంటి ఇబ్బందీ లేదని ఆ సామాజికవర్గానికి చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు వంటివారి పేరిట ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. రిజర్వేషన్లు ఇస్తారా, ఇస్తే ఎప్పుడు ఇస్తారనేది చెప్పకుండా ఈ ప్రచారం గోలేమిటని ఆయా వర్గాలు మండిపడుతున్నాయి. -
టీడీపీలో మిర్చి చిచ్చు
⇔జిల్లా ఇన్చార్జి మంత్రి ఎదుటే మాటల యుద్ధం ⇔గుంటూరు ఏఎంసీ చైర్మన్ విషయంలో గరంగరం ⇔ఎమ్మెల్యే మోదుగుల, బోనబోయిన మధ్య వాగ్వాదం ⇔వెన్నాకే ఇవ్వాలని కోరిన వేణుగోపాల్‌రెడ్డి ⇔అభ్యంతరం చెప్పిన బోనబోయిన కొరిటెపాడు(గుంటూరు): టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చిచ్చురేపింది. గుంటూరు మిర్చిఘాటును జిల్లా ఇన్చార్జి మంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు జిల్లా నాయకులు రుచి చూపించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఎమ్మెల్యే మోదుగుల, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, నక్కా ఆనందబాబు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు, పార్టీ నాయకులు బోనబోయిన ఇతర నాయకులతో శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో చినరాజప్ప సమావేశం నిర్వహించారు. పార్టీని నమ్ముకున్న వారికి పదవులు ఇవ్వాలి: మోదుగుల ప్రధానంగా గుంటూరు మిర్చియార్డు చైర్మన్ పదవిని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చినరాజప్ప నాయకులకు తెలిపారు. దీనికి గాను పేరును సూచించాలని ఆయన నాయకులను కోరారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఏఎంసీ ఛైర్మన్ పోస్టుకు వెన్నా సాంబశివారెడ్డి పేరును ప్రతిపాదించారు. దీంతో టీడీపీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పోస్టు నాలుగు నియోజకవర్గాల నేతలకు సంబంధించిందని, ఒక్క పేరే ఎలా సూచిస్తారని ప్రశ్నించారు. దీనికి మోదుగుల సమాధానం చెబుతూ పార్టీ కష్టకాలంలో సైతం అండగా నిలబడటమే కాకుండా, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై రెండుసార్లు పోటీచేసి ఆర్థికంగా వెన్నా సాంబశివారెడ్డి చితికిపోయారని తెలిపారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీ మారకుండా చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేశారన్నారు. అదే సమయంలో ప్రత్తిపాడుకు ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ ఉందని, ఏఎంసీ పశ్చిమ నియోజకవర్గంలో పరిధిలో ఉన్నందున నా అభిప్రాయం తీసుకోవాల్సిందే అన్నారు. నలుగురి పేర్లు పరిగణలోకి తీసుకోవాలి: బోనబోయిన దీంతో మరింత రెచ్చిపోయిన బోనబోయిన పార్టీలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారని, యార్డు పదవులకు నాలుగురి పేర్లు పరిగణలోనికి తీసుకోవాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో మోదుగుల, బోనబోయినల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. పార్టీని నమ్ముకున్న వారికి పదవులు ఇవ్వకుంటే అన్యాయం చేసినట్లే అని మోదుగుల తీవ్రంగా స్పందించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కలుగజేసుకొని వారి ఇద్దరికీ సర్దిచెప్పారు. చివరికి వెన్నా సాంబశివారెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు ఎవరి పేరైనా సూచిస్తే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఇదేసమయంలో వెన్నాకు మద్దతుగా పార్టీలోని నాయకులు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బోనబోయిన వ్యవహరశైలిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయానికి వచ్చారు. రెండు, మూడు రోజుల్లో పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి జిల్లాలో భర్తీచేసే నామినేటెడ్ పోస్టులకు పేర్లను ఇవ్వాలని మోదుగుల, ఇతర నాయకులు నిర్ణయించారు. ఏది ఏమైనా చలికాలంలో టీడీపీలో మిర్చియార్డు చైర్మన్ పదవి కాక రేపుతోంది. -
ఖైదీల పరారీపై హోంమంత్రి సీరియస్..
-
ఖైదీల పరారీపై హోంమంత్రి సీరియస్
-
ఖైదీల పరారీపై హోంమంత్రి సీరియస్
కడప: కడప కేంద్ర కారాగారం నుంచి ఖైదీల పరారీ ఘటనపై ఏపీ హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరో వైపు పరారైన ఖైదీల కోసం ప్రత్యేక బృందాల గాలింపు కొనసాగుతోంది. కాగా నలుగురు జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు సోమవారం సాయంత్రం అధికారుల కళ్లుగప్పి తప్పించుకు పోయారు. సాయంత్రం సమయంలో కారాగారం వెనుక వైపు ఉన్న టవర్ వద్ద నిచ్చెన వేసుకుని పైకి ఎక్కారు. గోడపై ఉన్న విద్యుత్ తీగలపై గోనె సంచి పట్టలు వేసుకుని అవతలి వైపు దూకి పరారయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన రవి, దేవ, అనంతపురం జిల్లాకు చెందిన రామచంద్ర, కర్నూలు జిల్లాకు హనుమంతు అనే జీవిత ఖైదీలు పరారైనట్టు గుర్తించారు. -
పేదలకు ఇబ్బంది కలిగితే కష్టం
♦ రైతులు నిరాశా నిస్పృహల్లో ఉన్నారు ♦ వ్యవసాయ రంగంలో మైనస్‌లో ఉన్నాం ♦ ఉపాధి నిధులు ఖర్చు చేస్తున్నా ఫలితాలు రావడంలేదు ♦ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందాలని, వారిలో అసంతృప్తి పెరగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు పిలుపునిచ్చారు. పేదలను ఇబ్బంది పెడితే అనుకున్న వృద్ధిని సాధించలేమని, వారు ఇబ్బంది పడేలా సంస్కరణలు అమలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. స్థానిక హోటల్లో రెండురోజులపాటు జరిగే జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికానికి 9.72 శాతం, రెండో త్రైమాసికానికి 13.94 శాతం కలిపి మొత్తం 11.77 శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపారు. ఇదే సమయంలో జాతీయ స్థాయి వృద్ధి రేటు 7.2 శాతంగా ఉందన్నారు. పరిశ్రమల రంగంలో 6.25 శాతం, సేవా రంగంలో 8.81 శాతం వృద్ధి సాధించామన్నారు. ప్రాథమిక రంగం బాగా పనిచేస్తున్నా, వ్యవసాయ రంగంలో మైనస్‌లో ఉన్నామని, ఈ రంగంలో అనుకున్నంతగా చేయలేకపోయామని చెప్పారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, నిరాశా నిస్పృహలతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. పోలీసు, రెవెన్యూ బాగా పనిచేయాలి పోలీసు, రెవెన్యూ వంటి రెగ్యులేటరీ శాఖలు బాగా పనిచేయాలని, ఆరోగ్య, విద్యా రంగాల పనితీరు మెరుగుపడితేనే ఫలితాలు వస్తాయని సీఎం చెప్పారు. ఉపాధి హామీ నిధులు ఖర్చు పెడుతున్నా ఫలితాలు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే నెలలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు బిడ్స్ పిలుస్తామని, దగదర్తి, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భూములను అప్పగిస్తామని తెలిపారు. ఏటా భారీగా వేడుకలు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్, సింగపూర్ ఫెస్టివల్ తరహాలో ఏటా భారీగా వేడుకలు నిర్వహించాలని చంద్రబాబు పర్యాటక శాఖాధికారులకు సూచించారు. విశాఖ పెస్టివల్కు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. స్మార్ట్ గ్రామ, స్మార్ట్ వార్డుల్లో అధికారులు ఇంకా భాగస్వాములు కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రతన్ టాటా వంటి వ్యక్తులతో త్వరలో స్మార్ట్ ఆంధ్ర ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి త్వరలో సీఈఓను నియమిస్తామన్నారు. గ్రామాల్లో పనిచేస్తూ పట్టణాల్లో ఉండే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సూచించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి బాగానే ఉన్నా సంతృప్తికరంగా లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. తొలుత ద్వితీయ త్రైమాసిక (మూడు నెలలు) ఫలితాలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. సీసీఎల్ఏ అనిల్‌చంద్ర పునీత స్వాగతోపన్యాసం చేయగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సదస్సు ఉద్దేశాలను వివరించారు. ఉపముఖ్యమంత్రులు కేవీ కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు, కలెక్టర్లు పాల్గొన్నారు. -
ఏపీలో మావోయిస్టు స్ధావరాలు లేవు- చినరాజప్ప
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా మావోయిస్టుల స్థావరాలు లేవని డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ త్వరలో 4,300 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు కు ప్రతిపాదనలు పంపామన్నారు. -
6 జిల్లాల్లో కరువు- హోంమంత్రి
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో 6 జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తోందని ఆ రాష్ట్ర హోంమంత్రి చిన్నరాజప్ప తెలిపారు. కరువు నివారణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 2.98 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా ఈసారి 98 వేల హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారన్నారు. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు ఎండిపోయి పరిస్థితి జటిలంగా మారిందన్నారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఎం. జానకి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చినరాజప్ప వ్యాఖ్యలు దారుణం..
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం కరవును ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటుందనిఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్‌బాషా మండిపడ్డారు. శుక్రవారమిక్కడ వారిక్కడ మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ కూలీల వలసలు చంద్రబాబుకు పట్టవా అని సూటిగా ప్రశ్నించారు. అనంత కరవును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విలాసాల కోసమే రైతులు, కూలీలు వలస వెళుతున్నారని డిప్యూటీ సీఎం చినరాజప్ప వ్యాఖ్యానించడం దారుణమన్నారు. కరవు రైతులపై స్పందిచకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్‌బాషా హెచ్చరించారు. -
చంద్రబాబుతో చినరాజప్ప భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం చినరాజప్ప సమావేశమయ్యారు. మంగళవారం చినరాజప్ప హుటాహుటిన విమానంలో హైదరాబాద్ వచ్చి చంద్రబాబును కలిశారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ తనకు సమన్లు జారీ చేసే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. చంద్రబాబు ఉన్నతాధికారులతోనూ సమావేశమై తాజా పరిణామాల గురించి చర్చిస్తున్నారు. -
ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం: చిన రాజప్ప
-
'ఫోన్లను ట్యాపింగ్ చేయించడం కేసీఆర్ కు భావ్యం కాదు'
అమలాపురం టౌన్: చీటికీ మాటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో జోక్యం చేసుకుంటూ వివాదాలు సృష్టిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మీద కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అమలాపురంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లో నుంచి పాలన సాగిస్తుంటే కేసీఆర్ తమ ఫోన్లను ట్యాపింగ్ చేయించడం భావ్యం కాదన్నారు. రేవంత్‌రెడ్డి కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధం ఉందని రుజువు చేసే టేపులున్నాయంటున్న తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌ను ఎరగా వాడుకుని, రేవంత్‌రెడ్డి వలలో పడేలా చేసింది ఆ ప్రభుత్వమేనని ఆరోపించారు. కేసీఆరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20 మంది వేరే పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకున్నారని, సీబీఐ విచారణ జరిపిస్తే ఆ బండారం బయట పడుతుందన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. రేవంత్‌రెడ్డిపై ఏసీబీ చేసిన స్టింగ్ ఆపరేషన్ కోర్టులో నిలబడదని అభిప్రాయపడ్డారు. మంత్రి పీతల సుజాత ఇంటి వద్ద రూ.10 లక్షల నగదు పట్టుబడిన సంఘటనపై విచారణ జరుగుతోందని, ఎవరు దోషులని తేలినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. -
ఏపీలో వడదెబ్బకు 551మంది మృతి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ వడదెబ్బకు 551మంది మృతి చెందినట్లు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం అందచేస్తామన్నారు. మండల అధికారులతో కమిటీ వేసి మృతుల వివరాలు నమోదుకు జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు చినరాజప్ప తెలిపారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయమని ఎన్నికల కమిషన్‌ను కాంగ్రెస్ పార్టీ కోరటం హాస్యాస్పదమని చినరాజప్ప అన్నారు. రాష్ట్రంలో డిపాజిట్లు లేకుండా పోయిన పార్టీ...కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీ గుర్తింపును ఎప్పుడో రద్దు చేయాల్సిందని చినరాజప్ప ఎదురు దాడి చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, రాజధానికి అడ్డంకులు సృష్టించాలని చూసి ఇలాగే విఫలమయ్యారన్నారు. -
ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం చినరాజప్ప
హైదరాబాద్: రాష్ట్ర హోం శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోమవారం ఢిల్లీ వెళ్లారు. ఆయన మంగళవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర పోలీసు విభాగానికి సంబంధించిన కీలక ప్రతిపాదనల ఆమోదం కోసం చినరాజప్ప ఈ పర్యటనలో ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళులకు వ్యతిరేకం కాదు
అమలాపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు యంత్రాంగం తమిళ ప్రజలకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. పరిస్థితుల ప్రభావంతోనే శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లర్లపై ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా అల్లవరంలో బుధవారం పోలీసు స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఎర్ర’ స్మగ్లర్లు అడవుల్లోకి చొరబడ్డారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ చేస్తున్న పోలీసులు, అటవీ సిబ్బందిపై వందలాదిగా ఉన్న స్మగ్లర్లు ఎదురుదాడికి దిగారని చెప్పారు. గత్యంతరం లేక పోలీసులు కాల్పులకు దిగారన్నారు. -
‘ఎర్ర’ స్మగ్లర్లపై ఉక్కుపాదం
ఎన్కౌంటర్లో 20 మంది మృతిపై సమగ్ర దర్యాప్తు: చినరాజప్ప అమలాపురం: జాతీయ సంపద అయిన ఎర్రచందనాన్ని పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తిరుపతి వద్ద శేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స, అటవీ శాఖ అధికారులు ఉమ్మడిగా జరిపిన ఎన్కౌంటర్లో 20 మంది స్మగ్లర్లు మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్లు కూడా ఉన్నట్టు అనుమానంగా ఉందన్నారు. సమగ్ర దర్యాప్తులో ఈ విషయం బయటపడుతుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్రచందనంపై పూర్తిగా నిర్లక్ష్యం వహించడంవల్లే స్మగ్లర్లు చెలరేగిపోయారని అన్నారు. దీనివల్ల గంగిరెడ్డి వంటి గజ స్మగ్లర్ పుట్టుకువచ్చాడని చెప్పారు. ఎర్రచందనాన్ని పరిరక్షించేందుకు, స్మగ్లర్లను పూర్తిగా అణచివేసేందుకు ఇతర రాష్ట్రాల సహకారం తీసుకుంటామని చెప్పారు. -
గోకులపాడు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
విశాఖ : విశాఖ జిల్లా గోకులపాడు బాణాసంచా పేలుడు సంభవించిన సంఘటనా స్థలాన్ని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పన పరిహారం అందచేశారు. అలాగే అనధికారికంగా ఉన్న బాణాసంచా గోడౌన్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాఖల సమన్వయంతో బాణాసంచా గోడౌన్లపై నిఘా తీవ్రతరం చేస్తామని చినరాజప్ప హెచ్చరించారు. కాగా విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఏపీ హోమ్‌గారి హ్యాపీ హోమ్
‘మా వారు మంత్రి అయ్యారని మా జీవనశైలి మారలేదు’ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సతీమణి అనూరాధ. పొదుపును పాటిస్తూ, ఖర్చులను పరిమితం చేసుకుంటే ఎంత పెద్ద కుటుంబ నిర్వహణ అయినా సాఫీగా సాగుతుందని అమె అంటారు. ఈ విషయంలో ఆమె పాలసీని పూర్తిగా సమర్థిస్తారు రాజప్ప. ‘‘మా ఆవిడ మంచి హోమ్ మేకర్... అందుకే నేను హాయిగా రాజకీయాల్లో నిమగ్నం కాగలుగుతున్నాను’’ అంటారాయన. అతి పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని చక్కగా నిర్వహిస్తూ బంధువుల మధ్య బాంధవ్యాలను పరిరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న గృహిణిగా... అనురాధ అనుభవాలు... ఆమె మాటల్లోనే... - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ‘‘మా పుట్టిల్లు తూర్పు గోదావరి జిల్లా కాట్రేనిపాడు. మా నాన్న ఉద్యోగరీత్యా నా బాల్యం పోర్ట్బ్లెయిర్లో గడిచింది. హైస్కూల్‌కి వచ్చేటప్పటికి అమలాపురం దగ్గర కూనవరంలో మా పెద్దమ్మగారి దగ్గర పెరిగాను. 1981లో నేను ఇంటర్లో ఉండగానే పెళ్లయింది. అప్పటికి ఆయన డిగ్రీ పూర్తి చేశారు. పెళ్లి అయిన తర్వాత ఆయన ఎం.ఎ చదివారు. కానీ నా చదువు మాత్రం ఇంటర్ దగ్గరే ఆగిపోయింది. అత్తగారిల్లు ఓ కొత్త ప్రపంచం మా అత్తగారిల్లు పెద్ద ఉమ్మడి కుటుంబం. మా మామగారు, ఆయన అన్నయ్య, తమ్ముడు కుటుంబాలు కలిపి మొత్తం 35 మంది ఉండేవారు. మా మామగారు రెండవ వారే అయినప్పటికీ తర్వాతి తరంలో మా వారు పెద్దవారు కావడంతో పెద్ద కొడుకు హోదా వచ్చింది. నాకేమో పెద్ద కోడలు బాధ్యతలు వచ్చాయి. మా అత్తతోపాటు పెద్దత్త, చిన్నత్త ఎలా చేస్తున్నారో చూస్తూ ఇంటి నిర్వహణ, వంట నేర్చుకున్నాను. అంతపెద్ద కుటుంబంలో నేర్చుకోవడంతో ఇప్పుడు ఒక్కసారిగా యాభై మంది భోజనానికి వస్తున్నారని కబురు వచ్చినా బెంబేలు పడను. వంట దినుసులు ఎంత తెప్పించాలి, ఏయే మోతాదుల్లో వేయాలనే ఉజ్జాయింపు వచ్చేస్తుంది. పిల్లల బాధ్యత మా అమ్మాయి శివకల్యాణిని మా దగ్గరే, అమలాపురంలో ఉంచుకుని చదివించాం. అబ్బాయి రంగనాగ్ని మాత్రం రాజకీయ నేపథ్యానికి దూరంగా ఉంచి కాకినాడ, హైదరాబాద్‌లలో చదివించాను. మా అమ్మాయిని ఇంగ్లిష్ మీడియంలో చదివించనందుకు ఇప్పటికీ నిష్టూర పడుతుంటుంది. తనకు ఎం. కామ్ పూర్తయిన తర్వాత పెళ్లి చేశాం. అబ్బాయి బీటెక్ చేసి ఛత్తీస్‌ఘడ్‌లో భవన నిర్మాణ రంగం కాంట్రాక్టులు చేస్తున్నాడు. కుటుంబ బంధాలు ఇంటి పెద్ద కోడలిగా మరుదులు, ఆడపడుచుల పెళ్లిళ్లు, సీమంతాలు, పురుళ్లు, బారసాలలు, వాళ్ల పిల్లల వేడుకలు... అన్నింటినీ బాధ్యతగా నిర్వహించాను. బంధుత్వాలను సంరక్షించుకుంటూ వచ్చాను. నా మాట తీరుతో కానీ, వ్యవహార ధోరణితో కానీ నొచ్చుకుని దూరమైన వాళ్లు లేరు. పైగా ఆడపడుచులు, తోడికోడళ్లు నాకు పెద్దరికం ఇవ్వడంతో నా బాధ్యత రెట్టింపయింది. ఇప్పటికీ అమలాపురం వెళ్లొచ్చాక అందరి క్షేమ సమాచారాల కబుర్లు ఆయనకు చెప్పేది నేనే. వారంలో రెండు రోజులు హైదరాబాద్‌లో ఉంటే మిగిలిన రోజులన్నీ అమలాపురంలోనే ఉంటాం. ఊరెళ్లి వచ్చిన తర్వాత ‘అమ్మెలా ఉంది? అంటూ మొదలు తమ్ముళ్ల ఇంటికి వెళ్లి వచ్చావా? అంటూ అందరి బాగోగులు తెలుసుకుంటారు. ఎవరి పిల్లలు ఏం చదువుతున్నారు, ఎందులో ఉద్యోగాలు తెచ్చుకున్నారు... వంటి వివరాలను ఎప్పటికప్పుడు ఆయనకు చెప్తూ ఉండాలి. నేరుగా మెచ్చుకోరు ఆయనకు పూల మొక్కలు ఇష్టం. ఎక్కడికెళ్లినా కొత్తగా కనిపించిన మొక్కలు తెప్పించి ఎక్కడ నాటాలో కూడా పురమాయిస్తుంటారు. అంతకు మించి ఇంటి గురించి పట్టించుకోవడం ఉండదు. నేను ఇంటి బాధ్యతలు చూసుకుంటూ తనను టెన్షన్ ఫ్రీగా ఉంచుతానని ఆయనకు గట్టి నమ్మకం. ఆ మాట మరెవరితోనైనా అంటున్నప్పుడు నా చెవిన పడాల్సిందే తప్ప నాతో ఎప్పుడూ అనరు. ఏ విషయంలోనూ ఒకరికొకరం సలహాలిచ్చుకోం. ఆయనెప్పుడైనా బాగా డిస్టర్బ్ అయినట్లు అనిపిస్తే ‘సమస్యను కాలానికి వదిలేసి మీరు చేయాల్సింది చేసుకువెళ్లండి’ అని మాత్రం చెప్తాను. ఒక్కోసారి ఆయన మీద కోపం వచ్చినప్పుడు మాట్లాడను. ఆయనకు తెలిసిపోతుంది. ఆ కాసేపూ తనూ మాట్లాడకుండా ఉండిపోతారు తప్ప, సంజాయిషీ ఇవ్వరు. నా వంటకు మాత్రం కాంప్లిమెంట్స్ ఇస్తారు. చేపలు, చిక్కుడుకాయ, బీరకాయలో పాలు పోసి చేసిన కూర ఆయనకు ఇష్టం. నేను వంట మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. ఆమె తన కొడుక్కి నచ్చేటట్లు నాకు వంట నేర్పించారు’’. ఫొటోలు: ఎస్ఎస్ ఠాకూర్ ఆమె సహకారమే బలం! రాజకీయరంగంలో రాణించాలంటే ముందు భార్య సహకారం చాలా ఉండాలి. నేను ఉదయం ఎనిమిదింటికి బయట పడితే రాత్రి తొమ్మిదింటికి ఇల్లు చేరుతాను. కొన్నిసార్లు ఇంకా ఆలస్యం అవుతుంది కూడా. నేనెక్కడ ఉన్నా ఇంటి గురించి చింత అక్కర్లేనంత హాయిగా ఉంచుతోంది మా హోమ్ మినిస్టర్. - నిమ్మకాయల చినరాజప్ప,ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,హోమ్ మంత్రి పాతిక శాతం పొదుపు! మాది వ్యవసాయ కుటుంబం. ఉమ్మడి కుటుంబం. ఆర్థిక లావాదేవీలు, ఇంటి నిర్వహణ చాలాకాలం పాటు అత్తగార్లే చూసుకున్నారు. మామయ్యలు వేరు పడిన తర్వాత మా మామగారు చూసుకునే వారు. దాదాపు పదేళ్లనుంచి ఆ బాధ్యతలు నేను చూసుకుంటున్నాను. వరి పంటలు, రొయ్యలసాగులో మా వారి వాటాకు వచ్చిన డబ్బును మా మరిది నాకే ఇచ్చేస్తారు. వచ్చిన ఆదాయంలో పాతిక శాతం సేవింగ్స్ కోసం పక్కన పెట్టి, మిగిలిన డబ్బులోనే ఖర్చులను పరిమితం చేసుకోవాలనేది నా పాలసీ. అలాగే చేస్తూ వచ్చాను. మాది నిరాడంబరమైన జీవనశైలి. ఖర్చు... రాబడిని మించే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడేదాన్ని. అలాంటిది ఓ సారి మా అబ్బాయి ఫీజు కట్టడానికి డబ్బు తక్కువ పడడంతో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌ను బ్రేక్ చేశాను. అంతేతప్ప ఎప్పుడూ దేనికీ అప్పు చేయలేదు. - అనూరాధ, ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి సతీమణి -
అవినాష్ కు 14 రోజుల రిమాండ్
-
అవినాష్ కు 14 రోజుల రిమాండ్
కాకినాడ: ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నపేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్రకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం అవినాష్ ను పోలీసులు కోర్టుకు ముందు హాజరు పరిచారు. గురువారం డీజీపీ జేవీ రాముడు ముందు అవినాష్ లొంగిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం అతణ్ని నార్త్ కోస్టల్ ఐజీ అతుల్ సింగ్ ప్రత్యేక ఎస్కార్ట్‌తో తూర్పు గోదావరి జిల్లాకు పంపించారు. చినరాజప్ప బంధువునంటూ పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన బాధితులపై దాడికి పాల్పడినట్లు అవినాష్ పై పలు ఆరోపణలు వెలుగుచూశాయి. -
అవినాష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సుమోటోగా కేసు నమోదు చేసిన మానవ హక్కుల కమిషన్ కాకినాడ: ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన బాధితులపై దాడికి పాల్పడి, చిత్రహింసలకు గురి చేసిన పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్ర చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇతని వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు. గతంలో అవినాష్‌ను పట్టుకుని వదిలేసిన వ్యవహారంలో పెద్దాపురం సీఐ శ్రీధర్‌బాబు, ఎస్సై శివకృష్ణలకు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మంగళవారం చార్జి మెమోలు ఇచ్చారు. విచారణ అనంతరం వీరి పాత్ర ఉన్నట్టు తేలితే సస్పెండ్ చేస్తామని చెప్పారు. ఈ వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. అవినాష్ దురాగతాలపై ఏప్రిల్ 6 నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో అవినాష్?:ఇతడిని పట్టుకునేందుకు ఎస్పీ రవిప్రకాష్ ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని అవినాష్ నివాసానికి ఓ బృందం వెళ్లింది. పెద్దాపురానికి చెందిన లూథరన్ హైస్కూల్ కరస్పాండెంట్ ఇజ్రాయిల్ ఫిర్యాదు మేరకు అవినాష్‌పై కేసు నమోదు చేశారు. మరోపక్క బాధితులను చిత్రహింసలు గురి చేసిన వీడియో దృశ్యాల అధారంగా సుమోటోగా మరో కేసు నమోదైంది. కాకినాడకు చెందిన ఒక మహిళకు మానవ హక్కుల కమిషన్ రాష్ర్ట మహిళా విభాగం చైర్పర్సన్ పదవి ఇప్పిస్తానంటూ అవినాష్ రూ. 14 లక్షలు కాజేశాడన్న ఆరోపణలున్నాయి. దీనిపై కాకినాడ టూ టౌన్ పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. మరోవైపు మంగళవారం ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇటువంటి వ్యక్తికి గతంలో గన్‌మెన్‌ను ఎందుకు కేటాయించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నాడు స్మగ్లర్...నేడు చీటర్: అవినాష్ స్మగ్లింగ్‌కు కూడా పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నాలుగేళ్ల కిందట భద్రాచలం సమీపాన కారులో పులి చర్మాలను తరలిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో అవినాష్‌పై కేసు కూడా నమోదైంది. -
రామలింగేశ్వర స్వామి సేవలో చినరాజప్ప
తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికొర్రు గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో త్రికతు హోమాలు, పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వీటిలో పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. ఆలయంలో శనివారం ప్రారంభమైన విశేష పూజలు సోమవారం వరకు జరగనున్నాయి. (అంబాజీపేట) -
మహిళల భద్రతకు.. ఐ క్లిక్!
-
కోర్టు పరిధిలో ఉన్నందున స్పందించలేదు
కాకినాడ: కోడిపందేల అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ వివాదంపై స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. 2015 సంవత్సరం పోలీస్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
హోంగార్డు అభ్యర్థులు ఆందోళన చెందొద్దు
కాకినాడ: హోంగార్డు అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అభ్యర్థుల దరఖాస్తులు పెరగటం వల్లే ఇంటర్వ్యూ తేదీలను వాయిదా వేసినట్లు ఆయన శనివారమిక్కడ తెలిపారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఇంటర్వ్యూ తేదీలను ప్రకటిస్తామని చినరాజప్ప పేర్కొన్నారు. కాగా విజయవాడలో శని,ఆదివారాల్లో జరగాల్సిన సీఐడీ హోంగార్డు ఇంటర్వ్యూలు చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో అభ్యర్థులు ఆందోళనకు దిగి నిరసన తెలిపారు. -
కోల్డ్ వార్
* అమాత్యుల మధ్య అగాధం! * ఆర్డీఓల బదిలీలపై ఆధిపత్య పోరు * చినరాజప్ప, యనమల వైఖరిపై విస్తుపోతున్న టీడీపీ వర్గాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : బదిలీల జాతర అమాత్యుల మధ్య కోల్డ్ వార్‌కు తెరలేపింది. అధికారులందరినీ సాగనంపి, నచ్చిన వారిని తెచ్చుకోవాలనుకోవడంతో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. ప్రధానంగా రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారుల బదిలీల కోసం ఇస్తున్న సిఫారసు లేఖలు వీరి మధ్య దూరాన్ని మరింత పెంచుతున్నాయి. పనితీరు ప్రామాణికంగా బదిలీలని పైకి చెబుతున్నా.. నచ్చని వారిని సాగనంపే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బది లీల్లో పట్టు కోసం ఎవరిమట్టుకు వారు ఎత్తులకు పైఎత్తు లు వేస్తున్నారు. ఆ పరిణామాలతో అధికారుల పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’లా తయారైంది. ప్రధానంగా కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓ పోస్టింగ్‌లు ఆధిపత్య పోరులో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు చేస్తున్న సిఫారసులు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నచ్చినోళ్లను తెచ్చుకోవాలనుకోవడమే ఈ అగాధానికి కారణంగా నేతలు విశ్లేషిస్తున్నారు. కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలుగా ప్రస్తుతం అంబేద్కర్, కూర్మనాథ్ పనిచేస్తున్నారు. వీరి స్థానే కొత్తవారిని తెచ్చుకోవాలని ప్రయత్నాలు ఊపందుకున్నాయి. పెద్దాపురం ఆర్డీఓ పోస్టింగ్ కోసం నువ్వా, నేనా అనే స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూర్మనాథ్‌ను సాగనంపి, అతని స్థానంలో విశాఖపట్నం హెచ్పీసీఎల్లో పనిచేస్తున్న మల్లిబాబును తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి రాజప్ప గట్టి ప్రయత్నం చేశారు. కాకినాడ కలెక్టరేట్‌తో పాటు పెదపూడి సహా పలు మండలాల్లో పనిచేసిన మల్లిబాబుకు వివాదరహితుడనే పేరుంది. ఈ కారణంగానే పెద్దాపురం నియోజకవర్గ నేతల సూచన మేరకు రాజప్ప.. మల్లిబాబుకు సిఫారసు చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో మల్లిబాబుకు పెద్దాపురం ఆర్డీఓగా పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. ఈ మేరకు జీఓ కూడా విడుదలైంది. జాయిన్ అవ్వడంలో ఒక్క రోజు ఆలస్యం కావడాన్ని ఆసరాగా చేసుకుని ప్రత్యర్థి వర్గం పావులు కదిపి మల్లిబాబు పోస్టింగ్ ఆర్డర్‌ను నిలుపుదల చేయించారని రాజప్ప వర్గం కారాలుమిరియాలు నూరుతోంది. మల్లిబాబును కాకుండా విశాఖపట్నంలో పనిచేస్తున్న విశ్వేశ్వరరావును పెద్దాపురానికి తీసుకురావాలని యనమల వర్గం పట్టుదలతో పావులు కదుపుతోంది. ఈ విషయంలో పెద్దఎత్తున సొమ్ములు కూడా చేతులుమారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన సోదరుడి పేరుతో బదిలీల దందా నిర్వహిస్తోన్న తెలుగు తమ్ముడు ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో వేలు పెట్టేస్తున్నారని అక్కడి నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ బేరసారాల్లో కూడా సంబంధిత నాయకుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తీరుపై రాజప్ప వర్గీయులు రుసరుసలాడుతున్నారు. ఆ ముఖ్యనేతకు తెలిసే ఈ వ్యవహారమంతా నడుస్తుందా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. అనవసరంగా పెద్దాపురం ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో మితిమీరిన జోక్యాన్ని రాజప్ప వర్గం ప్రశ్నిస్తోంది. పెద్దాపురం డీఎస్పీ ఓలేటి అరవిందబాబును కొనసాగించాలని యనమల వర్గం ప్రయత్నాలు చేయడాన్ని రాజప్ప తప్పుపట్టారని అతని అనుచర వర్గం చెబుతోంది. గతంలో జిల్లాలో పలు చోట్ల పనిచేసిన ప్రసన్నకుమార్‌ను తెచ్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అయిన రాజప్ప ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ విషయం తెలిసి కూడా డీఎస్పీ బదిలీలో పావులు కదపడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని రాజప్ప సన్నిహితుల వద్ద చర్చించారని చెబుతున్నారు. హోం మంత్రి హోదాలో, తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పెద్దాపురంలో డీఎస్పీ, ఆర్డీఓల బదిలీల్లో సైతం తన ఆధిపత్యాన్ని లేకుండా చేస్తారా అని రాజప్ప ఒకింత ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. దీనిపై తాడోపేడో తేల్చాల్సిందేనని రాజప్ప వర్గం పట్టుబడుతోందని సమాచారం. కాకినాడ ఆర్డీఓ పరిస్థితి ఇంతే.. దాదాపు ఇదే పరిస్థితి కాకినాడ ఆర్డీఓ పోస్టింగ్‌లో కూడా ప్రస్ఫుటమవుతోంది. కాకినాడ ఆర్డీఓగా ప్రస్తుతం అంబేద్కర్ పనిచేస్తున్నారు. పనిచేస్తున్న అధికారులందరినీ బదిలీ చేయాలనే సర్కార్ విధానపరమైన నిర్ణయంతో ఆయనను బదిలీ చేయాలని నిర్ణయం జరిగింది. ఈ పోస్టు కోసం ఇద్దరు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాకినాడ కలెక్టరేట్ ఏఓ, కాకినాడ అర్బన్, రూరల్ తహశీల్దార్‌గా పనిచేసి పదోన్నతిపై డిప్యుటీ కలెక్టర్‌గా ప్రస్తుతం నెల్లూరులో పనిచేస్తున్న మల్లికార్జునను ఆర్డీఓగా తీసుకురావాలని కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం ఎమ్మెల్యేలు కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, ఎస్వీఎస్ఎన్ వర్మ లేఖ ఇచ్చారు. వీరంతా కలిసి ఏకాభిప్రాయంతో ఒకే లేఖ ఇవ్వడంతో మంత్రి రాజప్ప గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పోస్టింగ్ ఇవ్వడమే మిగిలి ఉందనుకుంటున్న తరుణంలో మెట్ట ప్రాంతానికి చెందిన ముఖ్యనేత సోదరుడి జోక్యంతో వివాదం ముదురు పాకానపడింది. ఆ ముఖ్యనేత సోదరుడు, కాకినాడ సిటీలో ఓ టీడీపీ నేత మధ్య కుదిరిన లోపాయికారి ఒప్పందంతో ఆర్డీఓ పోస్టింగ్‌లో సీన్ మారిపోయింది. ఈ విషయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, ఆమె భర్త పార్టీ కార్యదర్శి పిల్లి సత్తిబాబు వారితో వ్యతిరేకిస్తున్నారని తెలియవచ్చింది. ముందుగా అంతా అనుకుని లేఖ ఇచ్చి ఇప్పుడు ఏ కారణంతోనైనా సరే ఇలా మాట మార్చి ప్రస్తుత ఆర్డీఓ అంబేద్కర్ కొనసాగింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఈ పోస్టింగ్‌ను గతంలో అంబేద్కర్ కంటే ముందుగానే ఆశించి భంగపడ్డ పౌర సరఫరాల కార్పొరేషన్ డీఎం గంగాధర్‌కుమార్ మరోసారి తెరపైకి రావడంతో బదిలీల వ్యవహారం రసకందాయంలో పడింది. -
నేను.. డిప్యూటీ సీఎం పీఏని...
పెద్దాపురం :రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పీఏనంటూ డెరైక్టర్‌గా డీఎస్పీకే మస్కా కొట్టిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, కటకటాల వెనక్కి పంపారు. స్థానిక పోలీసు స్టేషన్లో సోమవారం మధ్యాహ్నం డీఎస్పీ ఓలేటి అరవిందబాబు ఆ నిందితుడిని విలేకరుల ముందు హాజరుపరిచారు. డీఎస్పీ కథనం ప్రకారం... గత నెల 27న డిప్యూటీ సీఎం పీఏని మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి పెద్దాపురం డీఎస్పీ సెల్‌కు ఫోన్ చేశాడు. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో డిప్యూటీ సీఎం ఫలానా వ్యక్తికి న్యాయం చేయాలని సెల్ : 9440156511 నుంచి కాల్ వచ్చింది. దీనిపై అనుమానం వచ్చిన డీఎస్పీ పెద్దాపురం పోలీసులను విచారణ జరపాలని అదే రోజు ఆదేశించారు. దీంతో సీఐ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్సై శివకృష్ణ కేసు విచారణ చేపట్టారు. పెద్దాపురం పట్టణానికి చెందిన చిట్టూరి రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి నుంచి ఈ ఫోన్‌కాల్ వచ్చినట్టు నిర్ధారించుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. చిట్టూరి రాజేంద్రప్రసాద్ స్వగ్రామం ప్రత్తిపాడు కాగా, రెండేళ్ల నుంచి పెద్దాపురంలో ఉంటున్నాడన్నారు. నిందితుడుని కోర్టులో హాజరుపరుస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇలాంటి తప్పుడు ఫోన్‌కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నవారిపై నిఘా ఉంచినట్టు ఆయన తెలిపారు. -
చినరాజప్ప సమక్షంలో తమ్ముళ్ల బాహాబాహీ
-
చినరాజప్ప సమక్షంలో తమ్ముళ్ల బాహాబాహీ
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లాలో జెడ్పీ పదవి ....తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణకు దారితీసింది. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. పరస్పర దూషణలతో హోరెత్తించారు. జెడ్పీ చెర్మన్ పదవికి పేరాబత్తుల రాజశేఖర్ పేరు కాకుండా నామన రాంబాబు పేరు ఖరారు చేయటంతో తమ్ముళ్లు మండిపడ్డారు. జిల్లాలో 57 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా 43 చోట్ల టీడీపీ, 14 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించాయి. అయితే పూర్తిస్థాయి మెజారిటీ దక్కినా చైర్మన్ అభ్యర్థి ఎంపికపై టీడీపీ తొలి నుంచీ పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. తొలుత పి.గన్నవరం జెడ్పీటీసీ అభ్యర్థి నామన రాంబాబు పేరు ప్రచారంలోకి వచ్చింది. ఎన్నికల వ్యయం మూడు కోట్ల వరకు నామన భరించేలా ముఖ్యనేతలు ఒప్పందం కుదిర్చారని పార్టీలో చర్చ నడిచింది. అయితే నామన పేరు తెరపైకి వచ్చేసరికి ఐ.పోలవరం జెడ్పీటీసీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వైపు పార్టీలో మెజార్టీ నేతలు మొగ్గుచూపారు. అయితే అనూహ్యంగా శనివారం నామన పేరును ప్రకటించటంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గెయిల్ పైప్‌లైన్ మార్చడం కుదరదు
కోనసీమ ప్రాంతంలో ఇప్పుడున్న గెయిల్ పైప్‌లైన్ వ్యవస్థను మార్చడం కుదరదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అయితే కొత్తగా వేసే పైప్లైన్లను మాత్రం జనావాసాలకు దూరంగా వేయాలని సూచించామన్నారు. బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని గెయిల్‌కు తెలిపామని.. అలాగే, మృతుల కుటుంబాల్లో అర్హులకు గెయిల్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు. గెయిల్ ప్రమాద ఘటనలో ఊహించని ప్రాణనష్టం జరిగిందని చినరాజప్ప చెప్పారు. పరిసర గ్రామాల్లో పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గెయిల్‌ను ఆదేశించామన్నారు. ఇప్పుడున్న పైప్‌లైన్ కాలపరిమితి ముగిసిందని తాము భావిస్తున్నామని, ఈ విషయాన్ని తేల్చేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించామని, కమిటీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
మండిపడ్డ బాధితులు.. మంత్రి, కలెక్టర్ ఘెరావ్
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్లను ఘెరావ్ చేశారు. పదే పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా.. పైపులైన్లు మాత్రం మార్చకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే తాజా ప్రమాదం జరిగిందని అన్నారు. ఇక్కడ కొన్ని పైపులైన్లు గ్రామాల మధ్య నుంచి, మరికొన్ని పంటపొలాల మధ్య నుంచి ఉన్నాయి. దశాబ్దాల నాటి పైపులైన్లు కావడంతో పాటు, వాటి నిర్వహణను కూడా పట్టించుకోకపోవడమే తరచు ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం అవుతోందని ఆరోపించారు. దీంతో.. బాధితులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇవ్వడంతో పాటు గెయిల్ నుంచి కూడా పరిహారం ఇప్పిస్తామని కలెక్టర్ నీతూప్రసాద్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. ఢిల్లీనుంచి ఉన్నతాధికారులు వస్తున్నారన్నారు. క్షతగాత్రులను రాజోలు, అమలాపురం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమించిన 8 మందిని మాత్రం అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున అంతా నిద్రమత్తులో ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అధికారికంగా 13 మంది మరణించినట్లు చెబుతున్నా, మృతులసంఖ్య ఇప్పటికే 18కి చేరినట్లు సమాచారం. మరో 25 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు వచ్చి, పరిసరాలు తీవ్రంగా వేడెక్కాయి.