సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీలో సిట్టింగ్‌లకే సీట్లు అని చంద్రబాబు ఏ ముహూర్తాన ప్రకటించారో కానీ.. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఆయన చుక్కలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జనసేనతో పొత్తు టీడీపీలో మరింత అగ్గి రాజేస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆ పారీ్టలోని చంద్రబాబు సొంత సామాజికవర్గ నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాటి ప్రకటనలతో సంబంధం లేకుండా ఆరు నూరైనా సరే ఉమ్మడి జిల్లాలో మూడు సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని ఆయన సొంత సామాజికవర్గం తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. ఇది చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.
మూడు సీట్ల ఆనవాయితీపై సిగపట్లు
ఉమ్మడి జిల్లాలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొదటి నుంచి పెద్దాపురం, మండపేట, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్‌లో టీడీపీ తమకే ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు సామాజికవర్గ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈసారి పొత్తులో రాజానగరాన్ని జనసేనకు వదిలేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిగిలిన మూడింటికి సంబంధించి మండపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును మరోసారి గెలిపించాలని ‘రా.. కదలి రా’ సభలో చంద్రబాబు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
రాజమహేంద్రవరం రూరల్‌పై ఇరు పార్టీల మధ్య ఇంకా స్పష్టత రాలేదు. ఇక మిగిలిన పెద్దాపురం సీటు టీడీపీ ఆవిర్భావం నుంచీ చంద్రబాబు సామాజికవర్గానికే దక్కుతోంది. దివంగత మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు చివరి రోజుల్లో ఆ స్థానం కోసం విఫల యత్నం చేశారు కూడా. అయితే, గడచిన రెండు సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ సీటును కోనసీమ నుంచి తీసుకువచ్చిన కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకు ఇస్తూ వస్తున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఈ సీటు చినరాజప్పకేనని చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. అప్పటి నుంచీ పెద్దాపురం టీడీపీలో రెండు సామాజికవర్గాలూ ఈ సీటు కోసం నువ్వా, నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి. దీని ప్రభావం ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాలపై పడుతోంది.
పెద్దాపురంపై గుణ్ణం కన్ను
మొదటి నుంచీ ఆనవాయితీగా ఇస్తున్న పెద్దాపురం సీటు కోసం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన గుణ్ణం చంద్రమౌళి పావులు కదుపుతున్నారు. రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించిన తరువాత మౌళి పెద్దాపురంపై గట్టి పట్టే పడుతున్నారు. ఆర్థికంగా స్థితిమంతుడైన ఆయనకు లోకేష్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. కొంత కాలం నుంచి ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు జరిపిన పర్యటనలకు మౌళి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో తమకు పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ వంటి వారి ఆశీస్సులున్నాయని మౌళి వర్గం ప్రచారం చేసుకుంటోంది.
రాజప్పకు వ్యతిరేకంగా.. ఇద్దరూ ఒక్కటై..
చినరాజప్పకు ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని వైరి వర్గం చెబుతోంది. ఈ విషయాన్ని రా.. కదలి రా కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ కాతేరు వచ్చిన చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాజప్పకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న చంద్రమౌళికి దివంగత బొడ్డు భాస్కర రామారావు తనయుడు, టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకట రమణ చౌదరి వర్గం పరోక్షంగా మద్దతు ఇస్తోంది. అయితే, ఆవిర్భావం నుంచీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉమ్మడి జిల్లాలో పార్టీకి సుదీర్ఘ కాలం సారథ్యం వహించిన రాజప్ప సీటుకు ఢోకా లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
మౌళి వర్గాన్ని దీటుగా ఎదుర్కొనే సత్తా తమకు లేకపోలేదని అంటున్నారు. రాజానగరం సీటుపై వెంకట రమణ చౌదరి పెట్టుకున్న ఆశలపై జనసేన నీళ్లు చల్లడంతో.. ఆయన, మౌళి కలసి ఉమ్మడి కార్యాచరణతో చినరాజప్పకు పొగ పెడుతున్నారనే చర్చ టీడీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికా అన్నట్టు వెంకట రమణ చౌదరికి రాజమహేంద్రవరం ఎంపీ స్థానాన్ని చూపించి బుజ్జగించేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ టీడీపీలో వర్గ విభేదాలు మరింత ముదురు పాకాన పడేలా కనిపిస్తున్నాయి.
ఖర్చు మాది.. సీటు ఆయనదా!
పెద్దాపురం వరుసగా రెండుసార్లు రాజప్పకు కట్టబెట్టారని, ఇప్పుడు మూడోసారి కూడా ఆయనకే ఇస్తామంటే సహించేది లేదంటూ చంద్రబాబుపై ఆయన సామాజికవర్గ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. చినరాజప్పకు వ్యతిరేకంగా మౌళి పలు వర్గాలను ఏకం చేసే పనిలో ఉండటంతో పెద్దాపురంలో పార్టీ రెండు వర్గాలుగా విడిచిపోయింది. ఈ సీటుపై ఆశతో ఏడాది కాలం నుంచి పార్టీ కోసం లక్షల రూపాయలు తగలేసుకుంటుంటే.. ఇప్పుడు సిట్టింగ్‌కే ఇస్తామంటే ఎలా సహకరిస్తామంటూ.. పెద్దాపురం నియోజకవర్గంలోని చంద్రబాబు సామాజికవర్గ నేతలు చినరాజప్పను బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చినరాజప్పకు అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని, ఈసారి తమ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వకుంటే తాడోపేడో తేలుస్తామని స్పష్టం చేస్తున్నారు. 2014లో స్థానికేతరుడైన చినరాజప్పకు సీటు ప్రకటించినప్పుడు ఆయన వాహనాలను ధ్వంసం చేసి నామినేషన్ వేయకుండా అడ్డుకున్న నాటి పరిస్థితులను వారు గుర్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment