‘పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారు’
అమరావతి: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి లేదని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఉద్యమాలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకవేళ ముద్రగడ తన పాదయాత్రకు అనుమతి కోరితే పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారని చినరాజప్ప అన్నారు.
మరోవైపు డీజీపీ సాంబశివరావు ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి లేదని తెలిపారు. అనుమతి లేని కార్యక్రమాలకు అందరూ దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ నెల 20 వరకూ పశ్చిమ గోదావరి జిల్లాలో సెక్షన్ 143,30 అమల్లో ఉంటుందన్నారు. అలాగే పాలకోడేరు మండలం గరగపర్రులో శాంతయుత వాతావరణం కోసం కృషి చేస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు.