
మంత్రైనా కింద కూర్చోవలసిందే: లోకేశ్
గుంటూరు: తనకు మంత్రి అవ్వాలన్న కోరిక లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పార్టీలో తాను కీలకపాత్ర పోషిస్తున్నానని చెప్పారు. బుధవారం ఆయన తమ కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... తానేప్పుడు కేబినెట్ సమావేశంలో కూర్చోలేదని, రుజువులుంటే చూపాలని అన్నారు.
సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైన హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఫొటో చూసి తనకు బాధ కలిగిందన్నారు. ఈ ఫొటోపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. మంత్రైనా, ఎంపీ అయినా పార్టీ కార్యక్రమంలో కింద కూచోవలసిందేనన్నారు. పార్టీ పొలిట్ బ్యూరో లో తాను సభ్యుడినని, ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగా కూడా ఉన్నానని ఆయన తెలిపారు. చాలా చిన్న వయసులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని కావడం తన అదృష్టమన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వాఫుడ్ పార్క్ ను వ్యతిరేకంగా సరికాదన్నారు. అన్నిటికీ అడ్డుపడితే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. పార్టీలోకి ఎవరూ వచ్చి చేరినా ఆహ్వానిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.